రవ్వ ఉప్మా బాల్స్‌.. రుచే వేరయా!

6 Oct, 2019 11:18 IST|Sakshi
రవ్వ ఉప్మా బాల్స్‌

స్నాక్‌ సెంటర్‌

రవ్వ ఉప్మా బాల్స్‌
కావలసినవి:  రవ్వ – 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్, నూనె – సరిపడా,
అల్లం తురుము – కొద్దిగా, నీళ్లు – రెండున్నర కప్పులు, కొబ్బరి కోరు – పావు కప్పు,  జీడిపప్పు – 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు – 1 టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, మినపగుళ్లు – 1 టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, ఎండుమిర్చి – 2, 
పసుపు – అర టీ స్పూన్, కారం – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత, 
కొత్తిమీర తురుము – 1 టీ స్పూన్, నిమ్మరసం – 1 టీ స్పూన్‌

తయారీ: ముందుగా రవ్వను దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పానలో మూడు టీ స్పూన్ల నూనె వేసుకుని, అందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు నీళ్లు వేసుకుని గరిటెతో తిప్పుతూ మరగనివ్వాలి. తర్వాత కొబ్బరి కోరు వేసుకుని తిప్పుతూ బాయిల్‌ చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. 3 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గనిచ్చి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. ఆ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న సైజ్‌ బాల్స్‌ చేసుకుని.. పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పెద్ద పాన్‌ తీసుకుని కొద్దిగా నూనె వేసుకుని, అందులో జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపగుళ్లు, కరివేపాకు, ఎంచుమిర్చి వంటివి (అభిరుచి బట్టి కావాల్సినవి) వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకుని బాగా కలిపి.. ఉడికిన బాల్స్‌ని అందులో వేసుకుని కాసేపు వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర తురుము, నిమ్మరసం వేసుకుని బాగా కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసుకుంటే టేస్టీ రవ్వ ఉప్మా బాల్స్‌ సిద్ధమై పోతాయి.


ప్రాన్‌ వడ
కావలసినవి: పెద్ద రొయ్యలు – 15 (శుభ్రం చేసుకుని కుక్కర్‌లో ఉడికించుకోవాలి)
పచ్చి శనగపప్పు – ఒకటిన్నర కప్పులు(నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి)
పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 1
ఉల్లిపాయలు – 2
అల్లం – చిన్న ముక్క
జీలకర్ర – అర టీ స్పూన్‌
కొత్తిమీర తురుము – 1 టేబుల్‌ స్పూన్‌
కరివేపాకు – 2 రెమ్మలు
ఉప్పు – తగినంత
నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా
నిమ్మరసం – అర టేబుల్‌ స్పూన్‌

తయారీ: ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, అల్లం అన్నీ చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. తర్వాత వాటిని మిక్సీ బౌల్‌లో వేసుకుని.. ఒక సారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పచ్చి శనగపప్పు, అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని మెత్తగా చేసుకుని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో  ఉప్పు, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని రొయ్యలకు ఆ మిశ్రమాన్ని దట్టంగా పట్టించి నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుంటే అదిరే రుచి మీ సొంతమవుతుంది.

కార్న్‌ కబాబ్స్‌
కావలసినవి:  స్వీట్‌ కార్న్‌ – ఒకటిన్నర కప్పులు+ 3 టేబుల్‌ స్పూన్లు
బంగాళదుంపలు – 2, పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్‌
ఉల్లిపాయ ముక్కలు – 3 టేబుల్‌ స్పూన్లు(చిన్న చిన్న ముక్కలుగా తరగాలి), 
క్యాప్సికం ముక్కలు – 1 టేబుల్‌ స్పూన్, శనగ పిండి – 2 టేబుల్‌ స్పూన్లు
బ్రెడ్‌ పౌడర్‌ – పావు కప్పు, పసుపు – 1 టీ స్పూన్, కారం – అర టీ స్పూన్‌
గరం మసాలా – అర టీ స్పూన్, కొత్తిమీర తురుము – 1 టేబుల్‌ స్పూన్‌
అల్లం పేస్ట్‌ – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ: ముందుగా స్వీట్‌ కార్న్, బంగాళదుంపల ముక్కలు వేరువేరుగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్‌ తీసుకుని.. అందులో ఒకటిన్నర కప్పుల స్వీట్‌ కార్న్, బంగాళదుంప ముక్కలను వేసుకుని మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, క్యాప్సికం ముక్కలు, శనగపిండి, పసుపు, కారం, గరం మసాలా, కొత్తిమీర తురుము, అల్లం పేస్ట్‌  ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని చిన్ని చిన్ని పరిమాణంలో నచ్చిన షేప్‌ కబాబ్స్‌ సిద్ధం చేసుకుని నూనెలో డీప్‌ ఫ్రై చెయ్యాలి.

మరిన్ని వార్తలు