లండన్‌ నగరానికి ఉపద్రవం

7 May, 2017 12:24 IST|Sakshi
లండన్‌ నగరానికి ఉపద్రవం

దుర్గంధంతో లండన్‌ ఉక్కిరిబిక్కిరి
మన దేశంలో మురుగు కాలువల పక్క నుంచి వెళుతుంటే వ్యాపించే దుర్గంధానికి ముక్కుమూసుకుని వీలైనంత త్వరగా ఆ పరిసరాలను దాటుకుని ముందుకు సాగిపోవడానికి ప్రయత్నిస్తాం. ముక్కు మూసుకునేలా చేసిన ఆ కాస్త అసౌకర్యానికి కూడా మునిసిపాలిటీ నిర్వాహకులను మనసులోనే ముక్కచీవాట్లు తిట్టుకుంటాం. మన నగరాలు, పట్టణాల్లో ఇలాంటి పరిస్థితులు చాలా మామూలే. అయితే నగరానికి నగరమే లేదా పట్టణానికి పట్టణమే రోజుల తరబడి దుర్గంధభూయిష్టంగా మారిన ఉదంతాలైతే మన దేశ చరిత్రలో లేవు. అలాంటి ఘన చరిత్ర రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్య రాజధాని లండన్‌ నగరానికే దక్కింది.

విక్టోరియా మహారాణివారి ఏలుబడి కొనసాగుతున్న కాలంలో 1858వ సంవత్సరం నడివేసవి కాలంలో లండన్‌ నగరానికి ఆ ఉపద్రవం తటస్థించింది. మురుగు కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో నగరానికి నగరమే దుర్గంధభూయిష్టంగా మారింది. మురుగు నీరంతా థేమ్స్‌ నదిలోకి చేరడంతో థేమ్స్‌ కాస్తా వైతరణి నదిలా మారింది. పిల్లా పీచూ ముసలీ ముతకా ఊపిరి పీల్చుకోలేక రోజుల తరబడి ఉక్కిరిబిక్కిరయ్యారు. చివరకు రాణిగారు కూడా ముక్కుకు క్లిప్పు పెట్టుకునే పరిస్థితి వాటిల్లింది.

దుర్గంధాన్ని అరికట్టడానికి పార్లమెంటు భవనానికి వేసిన కర్టెన్లను సున్నపు క్లోరైడ్‌తో తడిపేవారు. ఇలాంటి చర్యలు ఎన్ని చేసినా ఫలితం లేకపోవడంతో లండన్‌లోని చాలా దుకాణాలను రోజుల తరబడి మూసివేశారు. లండన్‌ పారిశుద్ధ్య యంత్రాంగం పద్దెనిమిది రోజుల పాటు నానా తంటాలు పడిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చి జనాలు కాస్త ధైర్యంగా ఊపిరి పీల్చుకోగలిగారు.

>
మరిన్ని వార్తలు