ఆ నలుగురు... ఒక ఆకాశం!

10 Dec, 2017 00:41 IST|Sakshi

ఈవారం కథ

దఢేల్‌మని పెద్ద చప్పుడు.గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కారు.. రెప్పపాటులో అదుపు తప్పి.. ఏటవాలుగా రెండొందల మీటర్లు జారుకుంటూ వెళ్లి.. ముప్ఫయ్‌ అడుగుల దిగువన.. నీళ్లు తక్కువగా ఉన్న కాలువలోకి పడిపోయింది.పది నిమిషాల తర్వాత..ఆగి ఆగి, కీచురాళ్ల రొద. కాలువలోకి దొర్లి, సగం నుజ్జయినా... ఇంకా ఆగని ఇంజిను చప్పుడు. చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు, చీకటి మాత్రమే కలిగించగల ఒక రకమైన భయం.కాలువకట్ట మీద కారు అదుపు తప్పి, ఏటవాలుగా జారేటప్పుడే ఊడిపోయిన డోరులోంచి బయటపడ్డ ఒక ప్రాణి. పేరు అమర్‌. కాస్త ఇహంలోకి రాగానే...‘‘రేయ్‌! ఉన్నారా... ఉన్నారా పోయారా... పలకండ్రా...’’కాలువలోని చీకట్లోకి చూపులు గుచ్చుతూ... ‘‘అందరూ చచ్చారా? ఒక్కరైనా పలకండ్రా...’’ గాద్గదికంగా మారుతోన్న అసహాయత.

అమాయకంగా ముడుచుకు పడుకున్న చీకటిని దౌర్జన్యంగా చీల్చుకుంటూ దూసుకుపోతోంది కారు. గుంతమయమైన రహదారి కారణంగా అది భారంగా అరుస్తోంది.‘‘అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్లు... ఈ నైట్‌డ్యూటీలు నాకు నచ్చలేదురా’’ కారు నడుపుతున్న అమర్‌ అన్నాడు, దృష్టిని రోడ్డు మీదే కేంద్రీకరించి.‘‘మనం చేసేవి దానధర్మాలు కాదు; దందాలు. వీటిని రాత్రుళ్లే చేస్తారు’’ తాపీగా చెప్పాడు, అతని పక్కనే కూచున్న సత్య. బ్యాక్‌ సీట్లో కూచున్న రాకేశ్, శ్రీను పెద్దగా నవ్వారు.‘‘ఏమైనా చెప్పురా, మనం అంత దుర్మార్గంగా వ్యవహరించి ఉండాల్సింది కాదు’’.‘‘ఎపిసోడ్‌ సమస్తమూ దుర్మార్గమేరా. మళ్లీ అందులో అంత స్పెషల్‌ సీన్లేమిటి?’’ సత్య ప్రశ్నించాడు.‘‘అదేరా, బాబును బావిలో వేస్తామని బెదిరించటం’’ అమర్‌లో ఏదో బాధ.‘‘మనోడింకా రాటు తేలలేదురా!’’ శ్రీను హేళన.‘‘ఎలా రాటుదేల్తాడు? నెలకో రెణ్నెల్లకో ఓ సెటిల్మెంటుకొస్తాడు. రెగ్యులర్‌గా మనతో ఉంటే, ఇవన్నీ అలవాటవుతాయి’’ రాకేశ్‌ మాట తడబడుతోంది, మందు ప్రభావంతో.‘‘మనం ఇష్టపూర్వకంగా ఇందులో దిగాం. వాడు మినిస్టర్‌కు స్వయానా బావమరిది కావడంతో తప్పనిసరి తద్దినంలా వస్తున్నాడంతే’’ సత్య సత్యవాక్కు.
‘‘నిజం రా. నాకు మంచి ఉద్యోగం వచ్చి ఉంటే, మా బావ ఛాయలక్కూడా వచ్చేవాణ్ని కాదు’’ అమర్‌.అర్ధరాత్రి దాటింది.‘‘అరే అమర్, కారాపు రా’’ అరిచాడు రాకేశ్‌.అమర్‌ కారు పక్కకు ఆపి, ‘‘ఏమైంది రాకేశ్‌’’ అన్నాడు.బ్యాక్‌సీట్లో కూచున్న రాకేశ్‌ ముందుకొచ్చి ‘‘అరే, నువ్వు దిగరా. ఇంకా నందికొట్కూరు కూడా రాలేదు. ఇట్టా స్లోగా నడిపితే తెల్లారిపోద్దిగానీ విజయవాడ మాత్రం రాదు’’ అంటూ బలవంతంగా అమర్‌ను దించి, తను డ్రైవింగ్‌ సీటులో కూచున్నాడు. బ్యాక్‌ సీటులోకి మారాడు అమర్‌.కారు వేగంగా ముందుకు కదిలింది.సత్య, శ్రీను మెల్లగా నిద్రలోకి జారుకున్నారు.

రెండు గంటల క్రితం జరిగిన సంఘటన అమర్‌ కళ్ల మీద ముళ్లు గుచ్చుతోంది.గొడవంతా ఆరెకరాల గురించి. నిజానికా భూమికి యజమాని రాజ్‌కుమార్‌. ఎనిమిదేళ్లపాటు బ్యాంకు ఉద్యోగిగా కూడబెట్టుకున్న సొమ్ముకు తోడు, ఊళ్లో తన భాగంలో వచ్చిన రెండెకరాలు అమ్మి, ఏడేళ్ల క్రితం మంగళగిరికి దగ్గర్లో ఆరెకరాల భూమి కొన్నాడు. అప్పట్లో అతను గుంటూరులో పని చేసేవాడు. ఆ పొలం కొన్న సంవత్సరానికే అతనికి మేనేజరుగా ప్రమోషన్‌ వచ్చింది.బదిలీపై కర్నూలు వెళ్తూ ఆ భూమిని అమ్మకానికి పెట్టాడు. రాజకీయ బాల్యదశ దాటి యవ్వనంలోకి అడుగిడుతున్న ఓ స్థానిక నాయకుడు ఎకరం పన్నెండు లక్షల చొప్పున బేరం కుదుర్చుకున్నాడు. అయిదు లక్షలు అడ్వాన్సుగా ఇచ్చి, అగ్రిమెంటు మీద సంతకాలు చేసుకున్నారు.
ఆ తర్వాత రాజ్‌కుమార్‌ ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ‘‘ఇదిగో అదిగో’’ అనేవాడు తప్ప రిజిస్ట్రేషన్‌ మాట ఎత్తేవాడు కాదు. అదేమంటే ‘‘అదో పనికిమాలిన భూమి. తెలియక కొన్నా’’నంటూ ఇంకేవో కబుర్లు చెప్పేవాడు.ఓరోజు రాజ్‌కుమార్‌ ఫోన్‌చేసి ‘‘సార్, మూణ్నెల్లలో రిజిస్ట్రేషన్‌ అని అగ్రిమెంటు రాసుకున్నాం. రెండేళ్లు గడిచాయి. ఇక మీకు దీనిమీద ఎలాంటి హక్కూ లేదు’’ అని సూటిగా చెప్పేశాడు.‘‘అయితే, నా అడ్వాన్స్‌ తిరిగిచ్చెయ్‌’’ అన్నాడా నాయకుడు.

‘‘అదెలా సార్‌! లీగల్‌గానూ మీకు రైట్‌ లేదు’’ గట్టిగానే చెప్పాడు రాజ్‌కుమార్‌.‘‘అరే పోరా నాయనా. అయిదు లక్షల్తో పోతది, లేకుంటే డెబ్భై కట్టాల’’ అంటూ ఫోన్‌ పెట్టేశాడు.రాష్ట్రం విడిపోయి అమరావతి రాజధాని అయ్యాక, ఆ భూమి బంగారుగని అయ్యింది. నాయకుడికి అనేక రాత్రులు నిద్ర కరవైంది. అప్పుడెప్పుడో రాసుకున్న అగ్రిమెంటు కాపీని వెయ్యిన్నొక్కసార్లు చూసుకున్నాడు. చివరికి తనకు రాజకీయ గురువైన మంత్రిగారిని శరణు కోరాడు. ఆయన అభయమిచ్చాడు.కర్నూలు నుంచి రాజ్‌కుమార్‌ను నాలుగుసార్లు పిలిపించి, మంత్రిగారు రాయ‘బేరాలు’ సాగించాడు.రాజ్‌కుమార్‌ అత్యంత వినయపూర్వకంగా ‘‘సార్, నేనాయన్ని బతిమాలాను. ఇప్పుడు దాని విలువ విపరీతంగా పెరిగింది. నా పిల్లలకూ అదే భరోసా. ఎలా వదులుకోగలను?’’ అని ఎదురు ప్రశ్నించాడు.‘‘పోనీ! పన్నెండు కాదుగానీ, ఎకరానికి పాతిక లక్షల చొప్పున ఇప్పిస్తా’’ మంత్రి ఆశజూపాడు.‘‘అన్యాయం సార్‌. రెండు కోట్లు విలువచేసే భూమికి పాతిక లక్షలా?’’‘‘పోనీ... నలభై? యాభై? ఆఖరికి అరవై?’’ మంత్రిగారి దయాపూరిత వేలంపాట!‘‘ఏందన్నా, ఈణ్ని బతిమాలేది..’’ అంటూ నాయకమ్మన్యుడు ఆవేశపడిపోయాడు. మంత్రి వారించాడు.

‘‘క్షమించండి సార్‌’’ అంటూ రాజ్‌కుమార్‌ మారు మాట్లాడకుండా నిష్క్రమించాడు.మరికొన్ని నెలలు ఆ విషయాన్ని వదిలేయమని శిష్యుడికి హితబోధ చేశాడు.ఆ తర్వాత ఓ కుట్రపూరిత ఉదయాన తన గణాన్ని సమావేశపరిచాడు. ఆయన చేతిలో ఏవో కాగితాలు.‘‘ఇవాళ్టి తేదీతో తయారు చేసిన అగ్రిమెంటు ఇది. ఈ స్టాంపు పేపర్ల మీద వాడు సంతకం చేస్తే చాలు. ఆ తర్వాత లీగల్‌గా మన బలంతో పొలం మొత్తం స్వాధీనం చేసుకోవచ్చు!’’మంత్రిగారి గీతోపదేశం కల్గించిన ఉత్తేజంతో ఆ నలుగురూ సాయంత్రం ఆరింటికే కర్నూలు చేరుకున్నారు. రాజ్‌కుమార్‌ ఇల్లు ఎక్కడుంది, ద్వారాలు ఎటున్నాయి, అతను ఎన్ని గంటలకు ఇంటికొస్తాడు, ఇంట్లో ఎవరెవరు ఉంటారు వంటి విషయాలపై రెక్కీ నిర్వహించారు.రాత్రి తొమ్మిదిన్నర దాటాక ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి, లోపల గడియ పెట్టారు.రాజ్‌కుమార్‌ను, భార్యాపిల్లల్ని ఇంటి వెనకవైపున్న ఖాళీస్థలంలోకి తీసుకెళ్లారు.సంతకం పెట్టమని సామదానభేద మార్గాల్లో ప్రయత్నించారు. రాజ్‌కుమార్‌ లొంగలేదు. పోలీసులకు సమాచారమివ్వబోతే... ఆయన చేతుల్లోంచి ఫోన్‌ లాక్కుని, నేలకేసి కొట్టారు.అయినా అతను దారికి రాలేదు. కావాలంటే, అడ్వాన్సుగా తీసుకున్న అయిదు లక్షలూ ఇచ్చేస్తానన్నాడు. వాళ్లు ఒప్పుకోలేదు.చివరికి అయిదో తరగతి చదువుతున్న అతని కొడుకును రాకేశ్‌ ఒకచేత్తో ఎత్తి పట్టుకుని, బావిలోకి విసిరేస్తానంటూ బెదిరించాడు.
రాజ్‌కుమార్‌ చేతులు జోడించి లొంగిపోయాడు. అడిగిన చోటల్లా సంతకాలు పెట్టాడు.

నలుగురూ విజయగర్వంతో బయటికి నడిచారు.రాత్రి పదకొండు గంటలవేళ... ఓ దాబాలో బిర్యానీ తిని, మద్యం తాగి, కారులో విజయవాడ బయల్దేరారు.కారు పాములపాడు దాటింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న తెలుగుగంగ కాల్వ మీద బ్రిడ్జి మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అక్కడ పెట్టిన డైవర్షన్‌ బోర్డును చివరి క్షణంలో అమర్‌ గమనించి, పెద్ద కేకతో రాకేశ్‌ను అప్రమత్తం చేశాడు. రాకేశ్‌ కారును ఎడమవైపుకు బదులు హఠాత్తుగా కుడివైపు తిప్పాడు. దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కారు కాలువకట్ట మీద రెండొందల మీటర్లకుపైగా దూసుకెళ్లి, అదుపు తప్పి, పెద్ద చెట్టుకు ఢీకొని అమాంతం కాల్వలోకి పడిపోయింది.దఢేల్‌మని పెద్ద చప్పుడు.‘‘రేయ్‌! ఉన్నారా... పలకండ్రా...’’ అమర్‌ అరుపులకు ప్రతిస్పందన లేదు.దాదాపు ముప్ఫై అడుగుల లోతులో లీలగా కారు ఆకారం కనబడుతోంది. మిత్రుల జాడ లేదు. ఫోను కోసం జేబు వెతుక్కున్నాడు. కనిపించలేదు. వెతికాడు. ఫలితం లేదు. చేతివాచిని కళ్లకు దగ్గరగా పెట్టుకుని చూశాడు. రెండు గంటలు దాటింది.మెల్లగా ధైర్యం కూడగట్టుకుని రోడ్డు దాకా వచ్చాడు. పావుగంట వ్యవధిలో మూడు వాహనాలు వచ్చాయి. చెయ్యెత్తి ఆపడానికి ప్రయత్నించాడు. అవి కొద్దిగా స్లో అయి, వెంటనే పారిపోయాయి.మళ్లీ కారు పడిపోయిన ప్రదేశానికే వచ్చి, మిత్రుల్ని పేర్లు పెట్టి పిలిచాడు. అయిదారు సార్లు పిలిచాక, సన్నగా మూలుగులు వినిపించాయి. వాళ్లు బతికే ఉన్నారని నిర్ధారణ కాగానే కొంత ధైర్యం వచ్చింది. చుట్టూ చూశాడు. కుడివైపు కొద్ది దూరంలోని పొలంలో లాంతరు దీపం వెలుగుతోంది. ఓ మనిషి కనిపించాడు. గబగబా పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నాడు.

‘‘ఎవురదీ?’’ తోటకు నీళ్లు పెడుతున్న ఆ రైతు ప్రశ్నించాడు.‘‘పెద్దాయనా, నా పేరు అమర్‌. ఫ్రెండ్స్‌తో కలిసి విజయవాడ వెళ్తున్నాం. కారు అదుపు తప్పి, కాల్వలో పడిపోయింది. నేను బయటపడ్డాను. ముగ్గురు ఫ్రెండ్స్‌ కాల్వలో పడిపోయారు. ప్లీజ్‌ కాస్త నాతో వస్తారా...’’‘‘ఒరొరే! సూద్దాం పా’’ మోటారు స్విచ్‌ ఆఫ్‌ చేసి, లాంతరు తీసుకుని బయల్దేరాడు.లాంతరు వెలుగులో ఆయన్ని పరిశీలనగా చూశాడు అమర్‌. డెబ్భై లోపు ఉండొచ్చు. పంచె కట్టి, చేతుల బనీను ధరించాడు. బక్కపలచగా ఉన్నప్పటికీ, సంపూర్ణ ఆరోగ్యవంతుడిలా కనిపించాడు. అలవాటయిన దారి కావడం వల్లనేమో, చకచకా నడుస్తున్నాడు.‘‘పెద్దాయనా, మీ పేరు?’’‘‘భానుముక్కల లింగన్న’’.‘‘ఈ టైములో...’’‘‘కరెంటు సమస్య. ఇప్పుడే వచ్చిన, తోటకు నీళ్లు పెట్టనీకి...’’ఇద్దరూ కట్ట మీదికి చేరుకున్నారు.‘‘ఇదిగో... ఇక్కడే కారు పడిపోయింది’’ చూపించాడు అమర్, కాలువలోకి తొంగిచూస్తూ.లింగన్న మోకాళ్ల మీద కూచొని, కాల్వలోకి ఒంగి, లాంతరునువీలైనంత కిందికి పెట్టి చూశాడు.మనుషులు కనిపించడం లేదుగానీ, మూలుగులు వినిపిస్తున్నాయి.కొద్దిగా ఆలోచించాడు లింగన్న. గబగబా పొలంలోకి వెళ్లి, పెద్ద మోకుతో తిరిగొచ్చాడు. దాన్ని కాలులోకి జారవిడిచాడు. ‘‘రేయ్‌ రాకేశ్‌... సత్యా... శీనూ... తాడును పట్టుకోండి రా...’’ పెద్దగా అరుస్తున్నాడు అమర్‌.చీకటి కారణంగా వాళ్లు మోకును పట్టుకున్నారో లేదో తెలియడం లేదు. లింగన్న నిమిషానికోసారి పైకి లాగి చూస్తున్నాడు, అది బరువుగా తగుల్తుందేమోనని. అమర్‌ అరుస్తూనే ఉన్నాడు.పావుగంట తర్వాత మోకు బరువుగా తగిలింది.‘‘బాబూ... రా రా... పట్టుకున్నాడు పట్టుకున్నాడు...’’ లింగన్న ఆదుర్దాగా అన్నాడు.

అమర్‌ పరుగున వచ్చి, తను కూడా మోకు పట్టుకుని, ‘‘రేయ్‌... మేం మోకును పట్టుకున్నాం. మెల్లగా ఎక్కు... ఎక్కు...’’ అని అరుస్తూనే ఉన్నాడు.కాలువలోంచి ఓ మనిషి మెల్లగా పైకి పాకుతున్నాడు. మోకు క్రమంగా బరువెక్కుతోంది. కట్ట మీది దుమ్మునేల కారణంగా లింగన్న, అమర్‌ల కాళ్లకు పట్టు చిక్కడం లేదు. అతగాడు అయిదారు అడుగుల ఎత్తుకు వచ్చాడో లేడో... ఇద్దరి చేతుల్లోంచి మోకు జర్రున జారిపోయింది. అదిగానీ వదిలెయ్యకపోతే, ఇద్దరూ కాలువలోకి పడిపోయేవాళ్లు.‘‘రేయ్‌... ఆ మోకును పైకెయ్‌. ఈసారి గట్టిగా పట్టుకుంటాం...’’ పెద్ద గొంతుతో చెప్పాడు అమర్‌.కాలువలోంచి స్పందన లేదు. లింగన్న కాసేపు చూసి ‘‘ముప్ఫై అడుగుల పైనే లోతుంటది. ఎట్టా ఇనబడుద్ది! అది రాదులే. ఇంకోటి తెస్తా’’నంటూ పొలంలోకి వెళ్లి, మరో మోకుతో వచ్చాడు. ఈసారి మోకును కాల్వ పక్కనే పొలంలో ఉన్న జమ్మిచెట్టు మొదలుకు కట్టి, మరోవైపు కాల్వలోకి వదిలాడు.‘‘రేయ్‌... ఈసారి చెట్టుకు కట్టాం. ఎక్కరా... ఎక్కు...’’ ఆత్రంగా అరిచాడు అమర్‌.పది నిమిషాల తర్వాత మళ్లీ అతగాడు పైకి ఎక్కడం మొదలుపెట్టాడు. శక్తినంతా కూడదీసుకుని... మోకును గుప్పిళ్లతో మింగేస్తూ... ఒక్కో అడుగూ పైకి చేరుకుంటూ...‘‘కమాన్‌... వచ్చేశావ్‌... ఇంకొంచెం... ఇంకొంచెం...’’ ఉత్సాహపరుస్తూ అరుస్తున్నాడు అమర్‌.అతికష్టం మీద ఎట్టకేలకు ఒడ్డుకు దగ్గరయ్యాడు.లింగన్న, అమర్‌ కట్ట మీద బోర్లా పడుకుని, చేతుల్ని కాల్వలోకి బారజాపి అతన్ని అందుకున్నారు.

అమర్‌ పట్టు బిగించేలోపే... లింగన్న ఒక్క ఊపుతో అతగాణ్ని పైకి లాగేశాడు.అమర్‌ గబగబా పైకిలేచి, కట్టమీద వెల్లకిలా పడుకుని ఉన్న మిత్రుడి దగ్గరకు చేరుకున్నాడు.‘‘రేయ్‌ సత్యా... లేరా... లే...’’ అయిదు నిమిషాల తర్వాత సత్య లేచి కూచున్నాడు. బట్టలు తడిసిపోయాయి. నుదుటి మీద గాయం నుంచి రక్తం కారుతోంది.లింగన్న పొలంలోకి వెళ్లి మంచినీళ్ల సీసా తీసుకొచ్చి, సత్య నోటికందించాడు.‘‘బాబూ... ఆళ్లిద్దరూ ఎట్లా ఉన్నరు?’’ ఆరా తీశాడు లింగన్న.మంచినీళ్లు తాగి, తల గట్టిగా విదిలించాడు సత్య.‘‘మొత్తానికి ప్రాణాలతో ఉన్నారు. ఒకడు బురదలో కూరుకుపోయాడు. ఇంకోడు కారులోనే ఇరుక్కుపోయాడు. వాడు మాట్లాడుతున్నాడుగానీ ఏమంటున్నాడో అర్థం కావడం లేదు...’’‘‘పెద్దాయనా... ఎలాగైనా మీరే కాపాడాలి. ప్లీజ్‌...’’ అమర్‌ చేతులు జోడించి, లింగన్నను వేడుకున్నాడు.‘‘సూద్దాం. కానీ, వాళ్లు మోకు పట్టుకునే పరిస్థితిలో లేరు. ఎట్టాగ...’’ కాసేపు ఆలోచించి, ‘‘మనిద్దరం కిందకి దిగుదాం. వస్తావా?’’ అన్నాడు అమర్‌తో.‘‘వస్తా పెద్దాయనా’’.అమర్‌ వాచీవంక చూశాడు. నాలుగు కావస్తోంది. వెన్నెల సాంద్రత పెరిగింది.మోకు సాయంతో లింగన్న కిందికి దిగగానే, అమర్‌ అనుసరించాడు.ఇద్దరూ కారు బాయ్‌నెట్‌ మీంచి మెల్లగా అవతలికి చేరుకున్నారు. కారుకు పక్కనే బురదలో బోర్లా పడి ఉన్న మనిషిని వెల్లకిలా తిప్పారు. మొహం మీది బురదను హడావుడిగా చేతుల్తో తుడిచాడు అమర్‌.శీను! అతన్ని పట్టి కుదిపాడు లింగన్న. స్పృహలో లేడు. ప్రాణం ఉంది.అమర్‌ బుర్ర పని చేయడం మానేసింది.‘శ్రీనును పైకి చేర్చడం ఎలా?’ లింగన్నే ఆలోచిస్తున్నాడు.‘‘నేను పట్ట తీసుకొస్తా, నువ్విక్కడే ఉండు’’ లింగన్న మోకు సాయంతో చకచకా పైకెక్కి, పొలంలోకి వెళ్లి, పరదాపట్ట తెచ్చాడు. దాన్ని కారు బాయ్‌నెట్‌ మీద పరిచి, శ్రీనును దాని మీద పడుకోబెట్టారు.

మబ్బులు తొలగిపోయి, వెన్నెల నేలను ముద్దాడుతోంది.‘‘బాబూ, నువ్వు పైకెళ్లి రెండో మోకు కూడా కిందికెయ్‌’’ అమర్‌కు సూచించాడు.అమర్‌ పైకిళ్లి, అలాగే చేశాడు.లింగన్న ఆ చివర, ఈ చివర పట్ట చెంగుల్ని మోకులతో కట్టి, ఓ మోకు సాయంతో పైకి చేరుకున్నాడు.లింగన్న ఓ మోకును అమర్, సత్య మరో మోకును పట్టుకుని పైకి లాగడం మొదలు పెట్టారు. అలా లాగడం ఎంత కష్టమో తెలిసొచ్చింది అమర్‌కు. ఆఫ్టరాల్‌ ఒక్క మనిషి ఇంత బరువుంటాడా అనుకున్నాడు.పది నిమిషాల ప్రయాస అనంతరం శ్రీను శరీరాన్ని ఒడ్డుకు చేర్చారు. సత్య గబగబా దగ్గరగా వచ్చి, ‘‘రేయ్‌ శీను... శీనూ...’’ అంటూ ఏడుపు గొంతుతో అరిచాడు.‘‘పెద్దాయనా... వీడి ప్రాణాలకేమీ ప్రమాదం లేదు. పాపం రాకేశ్‌ గాడు కారులో ఇరుక్కుపోయాడు. ఆణ్ని కూడా బతికించరూ. ప్లీజ్‌...’’ చేతులు జోడించాడు అమర్‌.‘‘అరె, అంత హైరానా పడతావేంది బాబూ. దా... మళ్లా దిగుదాం...’’ అంటూ శ్రీను బాధ్యతను సత్యకు అప్పగించి, ఇద్దరూ కాలువలోకి దిగారు.సగం పగిలిన అద్దంలోంచి రాకేశ్‌ తల, చేతులు బయటికి వేలాడుతున్నాయి. మాట ముద్దగా వస్తోంది. ఏం చెబుతున్నాడో అర్థం కావడం లేదు. ఎంత లాగినా బయటికి తియ్యలేకపోయారు.లింగన్న గబగబా పైకెక్కి, పెద్ద రాయితో మళ్లీ కారు దగ్గరకొచ్చాడు. అద్దాలు పగలగొట్టి, డోర్‌ను ఒకవైపుకు అణగ్గొట్టి... మొత్తానికి మెల్లగా రాకేశ్‌ను బయటికి లాగారు.అతని శరీరం రక్తసిక్తమైంది. ఎక్కడ పట్టుకున్నా బాధతో విలవిల్లాడుతున్నాడు.అతన్ని కూడా బాయ్‌నెట్‌ మీద పరదాలో పడుకోబెట్టి, అంతకుముందులాగే రెండు మోకులతో పైకి లాగారు. రాకేశ్‌ను జాగ్రత్తగా కట్ట మీదకు చేర్చి, సపర్యలు చేశారు. ఉన్నట్టుండి పెద్దగా వెక్కిళ్లు పెడుతూ స్పృహలోకి వచ్చాడు రాకేశ్‌. మంచినీళ్లు తాగించారు. వెక్కిళ్లు ఇంకా ఎక్కువయ్యాయి.ముగ్గురు మిత్రులతోపాటు లింగన్నలోనూ భయం మొదలైంది.

ఒక్క క్షణం ఆలోచించి, పక్కనున్న పొదలవైపు పరుగు తీశాడు.కొన్ని ఆకులు తుంచి, రెండు అరచేతుల మధ్య నలిపి, ఆ రసాన్ని రాకేశ్‌ నోట్లో పిండాడు.రెండు నిమిషాల్లో వెక్కిళ్లు ఆగిపోయాయి.‘‘బాబూ, నాతో రా’’ అంటూ అమర్‌ను మెయిన్‌ రోడ్డు దాకా తీసుకెళ్లాడు.‘‘ఎట్టనో మీ నేస్తుల్ని ఎర్రగూడూరు దాకా తోల్కపోతే, ఆడ నాటువైద్యుడు దొర్కుతాడు...’’ చెబుతూనే, కర్నూలు వైపు నుంచి వచ్చే ప్రతి వాహనాన్నీ ఆపడానికి ప్రయత్నించాడు. ఒక్కరూ ఆపలేదు. పది నిమిషాల తర్వాత ఎర్రగూడూరు వైపునుంచే ఓ ట్రాక్టరు వచ్చింది.‘‘ఆరే, నాయక్‌... నాయక్‌... ఆపరా...’’ లింగన్న వెంటబడటంతో ఆపాడు.నాయక్‌ను ఒప్పించి, రాకేశ్‌ను ట్రక్కులోకి చేర్చారు. సత్య, శ్రీను, అమర్‌ కూడా అందులో ఎక్కారు.‘‘నేను నా బండి మీద వస్తా, మీరు పోండి’’ అంటూ లింగన్న పొలం వైపు వెళ్లాడు.ట్రాక్టరు ఎర్రగూడూరులో వైద్యుడి ఇంటికి చేరుకునేసరికి, లింగన్న కూడా వచ్చాడు.అయిదు కావస్తోంది. చీకటి పల్చబడుతోంది. డెబ్భై ఏళ్ల వృద్ధుడు ముగ్గురు మిత్రులకూ వైద్యం చేశాడు. ముగ్గురి బట్టలూ నీటితోనూ రక్తంతోనూ తడిసిపోయి, శరీరాలకు అంటుకుపోయాయి. ప్రాథమిక చికిత్స తర్వాత రాకేశ్‌ కూడా కోలుకున్నాడు.అమర్‌ బయటకు నడిచి నాయక్‌ దగ్గర ఫోను తీసుకుని మంత్రికి ఫోన్‌ చేశాడు.నాలుగోసారి ఫోనెత్తి, ‘‘ఏంట్రా ఈ టైవ్‌ులో?’’ అన్నాడు విసుగ్గా.జరిగిందంతా వివరించాడు అమర్‌.‘‘అవునా! మీరక్కడ ఎక్కువ సేపు ఉండొద్దు. మీ వివరాలు కూడా ఎవ్వరికీ చెప్పొద్దు. ఆత్మకూరులో నా ఫ్రెండొకడున్నాడు. మీ దగ్గరకు కారొస్తుంది. వెంటనే విజయవాడ వచ్చెయ్యండి’’ ఆదేశించాడు మంత్రి.అరగంటలో కారొచ్చింది.వాళ్లు లింగన్నకు మరీ మరీ కృతజ్ఞతలు చెప్పి, కారెక్కారు.

ఆ నలుగురూ పశ్చాత్తాపంతో దహించుకుపోయేవారా?దౌర్జన్యకాండ గురించి తెలిసుంటే ఆ పెద్దాయన వాళ్లను రక్షించేవాడా?రాజ్‌కుమార్‌ సంతకం చేసిన అగ్రిమెంటుకు... అవేమీ తెలియవు.అగ్రిమెంటులోని కొన్ని కాగితాలు ఊడిపోయి, తెలుగుగంగ కాలువ బురదలో కూరుకుపోయాయి.మొదటి పేజీ మాత్రం కారుసీటులోనే మిగిలిపోయింది.ఆ పేజీలో రాజ్‌కుమార్‌ చిరునామా ప్రస్తావించిన చోట సన్నాఫ్‌ భానుముక్కల లింగన్న, ఎర్ర గూడూరు, కర్నూలు జిల్లా అని రాసి ఉంది.
ఎమ్వీ రామిరెడ్డి

మరిన్ని వార్తలు