దేహయంత్ర నియంత్రణ

8 Mar, 2015 01:01 IST|Sakshi
దేహయంత్ర నియంత్రణ

యోగా
‘అంగమర్దన’ అనేది నేడు పూర్తిగా మరుగున పడిపోయిన ఒక ప్రత్యేకమైన యోగా విధానం. ఎటువంటి పరికరాల అవసరం లేకుండా చేయగలిగే తీవ్రమైన వ్యాయామం ఇది. మీకు కావలిసింది ఆరు బై ఆరు అడుగుల స్థలం మాత్రమే. ఆ తర్వాత ఇందులో మీరు చేసేదంతా మీ శరీరంతోనే. ఇది మీ శరీర బరువు, వేగాల సాయంతో మీ కండరాల యొక్క వంగే గుణాన్ని పెంచి క్రమక్రమంగా ఎంతో భిన్నమైన శారీరక సామర్థ్యాన్నీ, దృఢత్వాన్నీ కలిగిస్తుంది.

మేము ప్రస్తుతం నేర్పిస్తున్నది ఒక 25 నిమిషాల ప్రక్రియే. కానీ ఇది ఆరోగ్యపరంగా, శ్రేయస్సుపరంగా అద్భుతాలను సృష్టించగలదు. శక్తిమంతమైన శరీరాన్ని నిర్మించడంలో, ఇది బరువులతో జిమ్‌లో చేసే వ్యాయామమంత సమర్థవంతమైనది. అదే సమయంలో ఇది వ్యవస్థ మీద ఎటువంటి అనవసరమైన ఒత్తిడిని కలిగించదు.
 
‘అంగమర్ధన’ అంటే అర్థం మీ అవయవాల మీద ఆధిపత్యం లేదా నియంత్రణ కలిగి ఉండటం. మీరు ఏ పని చేయదలచుకున్నా, మీ అవయవాల మీద ఎంత ఆధిపత్యం కలిగి ఉన్నారన్న విషయమే మీరు ఆ పనిని ఎంత బాగా చేయగలరు అనే దానిని నిర్ణయిస్తుంది. నేను ఒక క్రీడాకారుల జట్టులోనో, మరో దాంట్లోనో చేరి రాణించడం గురించి మాట్లాడటం లేదు. మీరు మీ మనుగడ కోసం చేసే పనులకు, మీ ముక్తి కోసం చేసే పనులకు మధ్య ఉన్న వ్యత్యాసం గురించి మాట్లాడుతున్నాను. మీరు మీ ముక్తి కోసం ఏదైనా చేయాలంటే, మీ అవయవాల మీద మీకు కొంత నియంత్రణ ఉండాలి.
 
మీరు దీన్ని కేవలం ఒక వ్యాయామంగా చూసినా అంగమర్దన సరితూగుతుంది. కండరాలను దృఢం చేయడం, కొవ్వు తగ్గించడం అనేవి కేవలం సహ ప్రయోజనాలు మాత్రమే. ఈ సాధనతో మనం ముఖ్యంగా చేసేది మన శక్తిని ఒక స్థాయికి తీసుకెళ్ళి, దానిలో ఒక సమగ్రతను తీసుకురావడమే. అసలు విషయం ఏమిటంటే మిమ్మల్ని మీరు పూర్తి సామర్థ్యంతో పనిచేసే వ్యక్తిగా మలచుకోవాలి. ఎందుకంటే పూర్తి సామర్థ్యంతో పనిచేసే వ్యక్తిని మాత్రమే అత్యున్నత విషయాలను గ్రహించగలిగే స్థాయికి తీసుకెళ్ళగలం.
 
ఒక వ్యక్తి నడిచే పద్ధతిని చూస్తే, అతను సరైన శారీరక వ్యాయామం చేసాడా, లేదా అనేది స్పష్టమౌతుంది. ఒక వ్యక్తి ముఖం చూస్తే, అతను తన మెదడును సరిగ్గా ఉపయోగించుకున్నాడా లేదా చెప్పవచ్చు. అలాగే మీరు నిశితంగా చూస్తే, ఒకరి శక్తి సరిగ్గా ఉత్తేజితం చేయబడిందా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఒకరు ఏమి చేయగలరో, ఏమి చేయలేరో నిర్ణయించబడేది దీని ఆధారంగానే.
 
మీ శక్తులపై మీకు పూర్తి నియంత్రణ ఉంటే, మీరు వాటిని విస్ఫోటనం చెందించవచ్చు. చాలా మంది ఏవో పెద్ద అనుభూతులను కోరుకుంటారు. కానీ దానికి అనుగుణంగా, అంటే ఆ అనుభూతులను పొందేందుకు యోగ్యంగా శరీరాన్ని మలచుకోవడానికి వారు సుముఖంగా ఉండరు. యోగాలో మీరు ఒక అనుభవం కోసం తాపత్రయపడరు. మీరు కేవలం దాన్ని పొందేందుకు సంసిద్ధులవుతారు, అంతే. అందుకు మీ అవయవాల మీద మీకు కొంత నియంత్రణ ఉండాలి.
 ప్రేమాశీస్సులతో...
- మీ సద్గురు

మరిన్ని వార్తలు