నా కలను నిజం చేసిన రంగులకల

21 Jul, 2013 00:12 IST|Sakshi
నా కలను నిజం చేసిన రంగులకల

మస్తిష్కపు మారుమూల చీకటి గుహల్లో రాత్రుళ్లు మెరిసి మాయమయ్యే కల ఉదయాన్నే ముక్కలవుతుంది. పగిలిన ముక్కల్ని మూటగట్టుకుని సమూహంలోకి విసిరేసినప్పుడు ఆ నలుపు తెలుపుల కల ఒక ‘రంగులకల’గా రూపుదిద్దుకుంటుంది. కలను చెదిరిపోని కళగా ఆవిష్కరిస్తుంది. తన కల చెదిరిపోతున్న క్రమంలో ఒక కళాకారుడి ఘర్షణని, రూపాంతర క్రమాన్ని వెండితెరపై సృజనాత్మక విలువలతో చిత్రించారు బి.నరసింగరావు. సీన్ నంబర్ ఇరవై రెండు.

జర్నలిస్ట్ మురళి, ప్రొటాగనిస్ట్ (కథానాయకుడు) రవి మాట్లాడుకునే సన్నివేశం. పేపర్‌మీద సీన్ తప్ప డైలాగ్ లేదు. ఏడు గంటలకు షూటింగ్. అప్పుడు సమయం ఉదయం నాలుగు గంటలు. హోటల్ బాల్కనీలో నిల్చున్నాను. శీతాకాలపు వేకువజామున ఆలోచనలు సెగలు కక్కుతున్నాయి.

లొకేషన్‌లో ఆర్టిస్టులకు ఏం చెప్పాలి!
యూనిట్‌ను ఎలా హ్యాండిల్ చేయాలి!
నా భవిష్యత్ ఎలా ఉండబోతోంది!
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రెడీ అయ్యాను.
కాఫీ తాగి స్క్రిప్ట్ ముందు కూర్చున్నాను.
చకచకా డైలాగులు రాయడం మొదలుపెట్టాను.

 ఈ సంఘర్షణ వెనుక చాలా స్ట్రగుల్ ఉంది.1970ల మధ్యకాలంలో ‘నగరంలో నాతో పాటు నలుగురు’ అనే స్కెచ్ రాశాను. ఒక సందర్భంలో ఒక మిత్రుడి ఇంట్లో ఇరవై రోజులు ఉండాల్సి వచ్చింది. పెద్ద మండువా లోగిలి ఉన్న ఆ ఇంటి టిపికల్ వాతావరణం నాకు బాగా నచ్చింది. ఆ ఇంటి వాతావరణంలో నా కథను ఊహించడం మొదలుపెట్టాను. ఆ ఇంటి మొదటి గదిలో కండక్టర్, రెండవ రూమ్‌లో ప్రొటాగనిస్ట్, మూడవ గదిలో ఇద్దరు క్రిస్టియన్స్, నాలుగో గదిలో ఫ్యాక్టరీ వర్కర్ సూర్యారావు, ప్రొటాగనిస్ట్ రవి గదికి ఎదురుగా గుడిసెలో పేద దంపతులు కనకమ్మ, రంగయ్య దంపతులు... అలా నా కథలోని పాత్రలు ఒక్కొక్కటిగా ఆ కల్పిత వాతావరణంలో అడుగుపెట్టాయి. నా ఊహల్లో కొంత సినిమా పూర్తయింది. ప్యాలెట్‌లో కలర్స్ నింపాను. ఒక కాన్వాస్ మీద రంగుల కల గీయడమే మిగిలింది.

అంతకుముందు ‘మా భూమి’ సినిమాకు నిర్మాణం దగ్గరి నుంచి ప్రతి డిపార్ట్‌మెంట్‌లోనూ నేను ఇన్‌వాల్వ్ అవడంతో దర్శకత్వం పట్ల నాకు ప్రాథమిక అవగాహన ఉంది. నేను డెరైక్షన్ చేస్తానని చెప్పగానే సన్నిహితులు చాలామంది నిరుత్సాహపరిచారు. అనుభవం లేకుండా ఎందుకు, ఇంకెవరినైనా దర్శకుడిగా పెట్టుకో అని చాలా రకాలుగా సలహా ఇచ్చారు. ఇప్పుడు డెరైక్షన్ చేయకపోతే ఇంకెప్పుడైనా చేయగలుగుతానో లేదో అన్న భయం నా లోపల. నన్ను హీరోగా తెరమీద చూసుకోవాలి అన్న నా కల, డెరైక్టర్ కావాలన్న నా కోరికను మరింత బలపరిచింది. సినిమా చేయడానికి కావలసిన నాలెడ్జ్ కోసం ఎడిటింగ్, కెమెరా, కలర్ పర్‌సెప్షన్ గురించి బోలెడన్ని బుక్స్, ఫిల్మ్స్ రిఫర్ చేశాను. దేవీప్రియ, ప్రాణ్‌రావు, మరో ఇద్దరిని రైటర్లుగా తీసుకున్నాను. నా కథకు నలుగురూ నాలుగు వెర్షన్లు రాశారు. నాకేదీ నచ్చలేదు. నేను సొంతగా స్క్రిప్ట్ రాసుకున్నాను. తరువాత పదిహేను మంది ఫేమస్ ఆర్టిస్టుల ఇంటర్వ్యూలు చేశాను. వాళ్ల లైఫ్‌ను, నా స్క్రిప్ట్‌ను పక్కన పెట్టుకుని తరిచి చూసుకుని అవసరమైన మార్పులు చేసుకున్నాను. కానీ చివరి వరకు నేను, ప్రాణ్‌రావ్ కలసి ఒక్క డైలాగ్ కూడా రాయలేక పోయాం. చివరకు ఎలాగోలా పూర్తిచేసి లొకేషన్‌లో అడుగుపెట్టాను.

కానీ నాకు రేంజ్ ఆఫ్ లెన్సెస్ గురించి ఏమాత్రం తెలియదు. ఎలా? అంతకుమునుపే గౌతమ్ ఘోష్‌ను అడిగితే లెన్సెస్ గురించి చాలా చెప్పాడు కానీ, నాకు అంతగా ఎక్కలేదు. సినిమాటోగ్రాఫర్ వేణుగోపాల్ ఠక్కర్‌ను అడిగితే అమెరికన్ సినిమాటోగ్రాఫర్ మాన్యువల్ ఇచ్చాడు. అది ఎంత చదివినా అర్థం కాలేదు. సెట్‌లో ఆ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాను. నేను కెమెరామెన్‌కు షాట్ చెబుతున్నప్పుడు అతను తన అసిస్టెంట్‌ను ఏ లెన్స్‌లు తెమ్మంటున్నాడో గమనించేవాణ్ని. కెమెరాకు, సబ్జెక్ట్‌కు ఉన్న దూరాన్ని బట్టి అతను ఏ లెన్స్ వాడుతున్నాడో అర్థమైంది.

మరుసటిరోజు నుంచి ఫలానా షాట్‌కు ఫలానా లెన్స్ అని నేను చెబుతుంటే అతను ఆశ్చర్యపోయాడు. ఈ సినిమాలో చాలా ప్రయోగాలు చేస్తూ పోయాం. 35 ఫీట్ టాప్ యాంగిల్ షాట్. ఫ్రేమ్ నిండా గడ్డితో ఆకుపచ్చగా ఉంటుంది. రెడ్ శారీలో హీరోయిన్, బ్లూ జీన్స్‌లో ప్రొటాగనిస్ట్ ఫ్రేమ్‌లో ఒక వైపు నుంచి మరోవైపు డయాగ్నల్‌గా నడుచుకుంటూ వెళతారు. ఆ సీన్‌కు తరువాత విపరీతమైన స్పందన వచ్చింది. చిదానంద్‌దాస్ గుప్తా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ‘ఈ షాట్ ఇండియన్ హిస్టరీలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ షాట్’ అని రాశారు. సినిమాలో షాట్స్ ఫిలిం టెక్నిక్ బుక్స్ చదివి, ఇంటర్నేషనల్ ఫిలింస్ ప్రభావంతో కొత్తగా ప్రయత్నించాను. రవి, మురళి మాట్లాడుతున్నప్పుడు స్విష్ ప్యాన్స్ వాడాం.

ఇక సౌండ్స్‌కు సంబంధించి చాలా ప్రయోగాలు చేశాం. క్లైమాక్స్‌కు ముందు సీన్‌లో రవి మిడ్ క్లోజ్ షాట్‌లో తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. అక్కడ రకరకాల సౌండ్స్ ఉపయోగించాం. డ్రీమ్ సీక్వెన్స్‌లో సర్రియలిస్ట్ పద్ధతిని ఉపయోగించాం. సినిమాలో చాలావరకు నా రియల్‌లైఫ్ ఇన్సిడెంట్స్‌ను తీసుకున్నాను. ఆ రోజుల్లో ఒక ఫేమస్ ఆర్టిస్ట్ లైఫ్‌ను బేసిక్ లైన్‌గా వాడుకున్నాను. మిగతా సంఘటనలు కొన్ని నా లైఫ్‌లోంచి తీసుకున్నాను. నేను కూడా ఒక ఆర్టిస్ట్‌ను కాబట్టి నా లైఫ్ ఇందులో చాలావరకు కనిపిస్తుంది.

 నేను ఫ్రెండ్స్‌తో కాఫీ హోటల్‌లో కూర్చున్నప్పుడు మా మిత్రుడు అజీజ్ (నేటి ప్రఖ్యాత చిత్రకారుడు) చాలా పెయింటింగ్స్ పట్టుకుని మా దగ్గరకు వచ్చాడు. ‘నర్సింగ్‌భాయ్ కాఫీ తాగించు’ అని అడిగాడు. టీ ఆర్డర్ చేశాం. ఇన్ని పెయింటింగ్స్ పట్టుకుని ఎక్కడికి వెళుతున్నావని అడిగితే ‘బంజారా హిల్స్‌లో ఒక మేడమ్ ఆర్డర్ చేసింది. కానీ ఆటోలో వెళ్లడానికి డబ్బులు లేక నడిచి వెళుతున్నాను’ అన్నాడు. ఈ సీన్ కూడా సినిమాలో ఉపయోగించాం.

ఒక సందర్భంలో నేను వారం రోజుల పాటు తినకుండా గడిపాను. అది గమనించి పక్కింటివాళ్లు కాఫీ పంపారు. వాళ్ల పాప వచ్చి ‘అంకుల్, అమ్మ కాఫీ పంపింది’ అనగానే నేను ఒంటరినయ్యానన్న భావనతో ఒక్కసారిగా ఏడుపు తన్నుకు వచ్చింది. ఇది సినిమాలో వాడాను. మరో సందర్భంలో నేను ఫ్రెండ్స్‌తో కాఫీ హోటల్‌లో కూర్చున్నప్పుడు మా మిత్రుడు అజీజ్ (నేటి ప్రఖ్యాత చిత్రకారుడు) చాలా పెయింటింగ్స్ పట్టుకుని మా దగ్గరకు వచ్చాడు. ‘నర్సింగ్‌భాయ్ కాఫీ తాగించు’ అని అడిగాడు. టీ ఆర్డర్ చేశాం. ఇన్ని పెయింటింగ్స్ పట్టుకుని ఎక్కడికి వెళుతున్నావని అడిగితే ‘బంజారాహిల్స్‌లో ఒక మేడమ్ ఆర్డర్ చేసింది. కానీ ఆటోలో వెళ్లడానికి డబ్బులు లేక నడిచి వెళుతున్నాను’ అన్నాడు. ఈ సీన్ కూడా సినిమాలో ఉపయోగించాం. దాదాపు డెబ్భై ఎనభై లొకేషన్లలో సినిమా షూట్ చేశాం. ఒక రకంగా ఆనాటి హైదరాబాద్‌కు మా లొకేషన్స్ రూపంలో డాక్యుమెంట్ చేశాం.

ఎడిటింగ్ వచ్చేసరికి సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉందని చాలా సీన్లు ఎడిట్ చేశాం. మొదట డైలాగ్స్ రాసుకున్న ఇరవై రెండవ సీన్ కూడా సినిమాలో లేదు. సినిమా విడుదలయ్యాక వచ్చిన స్పందన నన్ను ఆశ్చర్యపరిచింది. సినిమాలో ఒక పాటను ఎలా వాడాలో నరసింగరావు ‘రంగులకల’లో మదనాసుందరి పాటను చూసి తెలుసుకోవాలని ఎం.టి.వాసుదేవ నాయర్ ఒక సందర్భంలో అన్నారు. ఆరుద్రగారు ఆంధ్రజ్యోతిలో రంగులకలను విశ్లేషిస్తూ చాలా పెద్ద ఆర్టికల్ రాశారు. 1984 నేషనల్ అవార్డ్స్‌లో ‘సాగరసంగమం’ సినిమాతో పోటీపడి, ‘రంగుల కల’ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును గెలుచుకుంది.‘రంగుల కల’ ప్రతి స్ట్రగులింగ్ ఆర్టిస్ట్ జీవితం. ఒక రకంగా ఇది నా పర్సనల్ ఫిలిం. ఈ సినిమా మీద బోలెడన్ని ప్రభావాలు ఉన్నా, ఫ్రెంచి దర్శకుడు గోడార్డ్ ఇన్‌ఫ్లూయెన్సే ఎక్కువ!

- కె.క్రాంతికుమార్‌రెడ్డి

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా