పాలు ఇవ్వడంలో ఇబ్బంది... ఏం చేయాలి?!

24 Apr, 2016 01:45 IST|Sakshi
పాలు ఇవ్వడంలో ఇబ్బంది... ఏం చేయాలి?!

సందేహం
నాకు ఈ మధ్యనే బిడ్డ పుట్టింది. ఆరోగ్యంగానే ఉంది. అయితే నాకు పాలివ్వడంలోనే సమస్యగా ఉంటోంది. కుడివైపు ఓకే కానీ ఎడమవైపు స్తనం నుంచి అస్సలు పాలు రావడం లేదు. అలా ఎందుకవుతోంది? ఏదైనా సమస్య ఉందంటారా? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?
 - చంద్రకళ, మెయిల్

 
సాధారణంగా బిడ్డ పుట్టిన తర్వాత ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ల ప్రభావం వల్ల రొమ్ములో పాల ఉత్పత్తి మొదలవుతుంది. బిడ్డ రొమ్ము మొనను (నిపుల్) చీకడం మొదలు పెట్టిన తర్వాత ఆక్సిటోసిన్ హార్మోన్ మరింతగా విడుదలై పాల ఉత్పత్తిని మరింతగా ప్రేరేపించి, వాటిని నిపుల్ ద్వారా బయటకు పంపిస్తుంది. పైన చెప్పిన హార్మోన్స్, బిడ్డ చీకడం, మానసిక, శారీరక ప్రశాంతత అన్నీ సరిపడా ఉన్నప్పుడు, బిడ్డకు సరిపడా పాలు చక్కగా వస్తాయి. మీకు ఒకవైపు వస్తున్నాయి, మరోవైపు రావట్లేదు అంటున్నారు కాబట్టి కొన్ని విషయాలు పరిశీ లించాలి.

కొంతమందిలో నిపుల్‌పైన ఉన్న రంధ్రాలపై పొక్కు కట్టి, మూసుకుపోతాయి. అలాంటప్పుడు పొక్కులను తడిబట్టతో మెల్లిగా తీసేసే ప్రయత్నం చేయొచ్చు. ఒకవైపే పాలు వస్తున్నాయని, అటే బిడ్డకు పాలు ఇస్తూ పోతే, ఇటువైపు ప్రేరేపణ లేకపోవడం వల్ల కూడా రాకపోవచ్చు. కాబట్టి ఈసారి బిడ్డ బాగా ఆకలిగా ఉన్నప్పుడు మొదట పాలు రాని రొమ్మును శుభ్రం చేసి పట్టిస్తే, బిడ్డ చీకే కొద్దీ, అది ప్రేరేపణకు గురై పాలు మెల్ల మెల్లగా రావడం మొదలవుతుంది. అయినా రాకపోతే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి.
 
నా వయసు 22. నాకిప్పుడు నాలుగో నెల. నా సమస్య అంతా బరువుతోనే. నా ఎత్తు ఐదడుగుల రెండంగుళాలు. బరువు 72 కిలోలు. ఇంత బరువు ఉంటే ప్రసవం తేలికగా జరగదని, చాలా కాంప్లికేషన్స్ వస్తాయని అంటున్నారు. నిజమేనా? ఇప్పుడు బరువు ఎలా తగ్గాలి? వ్యాయామాలవీ చేస్తే కడుపులో బిడ్డకు ఇబ్బంది రాదా? చాలా భయంగా ఉంది. సలహా ఇవ్వండి.
- వి.మృదుల, విశాఖపట్నం

 
సాధారణంగా అయిదున్నర అడుగుల ఎత్తుకు 50-55 కిలోల బరువు ఉంటే సరిపోతుంది. మీరు 72 కిలోల బరువు ఉన్నారంటే, ఉండాల్సిన దాని కన్నా, అంటే దగ్గర దగ్గరగా 15 కిలోలు ఎక్కువ బరువు ఉన్నారు. బరువు తగ్గి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు నాలుగో నెల కాబట్టి భయపడి చేసేది ఏమీ లేదు. ప్రెగ్నెన్సీలో బరువు ఎక్కువగా ఉండటం వల్ల కడుపులో బిడ్డ పెరిగే కొద్దీ, పొట్ట పైకి వచ్చే కొద్దీ.. తినడానికి, కూర్చోడానికి, మాట్లాడటానికి, నడవడానికి ఆయాసం వస్తుంది. గాలి తీసుకోవడానికి ఇబ్బంది. పడుకోవడానికి, ఒకవైపు నుంచి మరోవైపుకు తిరగడానికి ఇబ్బంది. నడుము నొప్పి, కాళ్లవాపులు, తిన్నది గొంతులోనే ఉన్నట్లుండటం వంటి ఇబ్బందులతో పాటు బీపీ పెరగడం, షుగర్ లెవెల్స్ పెరగడం కూడా జరగొచ్చు.

వీటివల్ల తల్లికి, బిడ్డకి రిస్క్ ఎక్కువగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోక పోతే  ప్రాణాపాయస్థితికి కూడా చేరవచ్చు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల సాధారణ కాన్పుకు కష్టం అవుతుంది. అంతే కాకుండా పొట్ట మీద కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల సిజేరియన్ ఆపరేషన్ చేయడానికి కూడా డాక్టర్లు చాలా కష్టపడవలసి వస్తుంది. డెలివరీ (ఆపరేషన్) తర్వాత కూడా శరీరంలో రక్తం ఎక్కడైనా గూడుకట్టి, pulmonary embolism, thrombo embolism అనే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువ.

అదీగాక మీరు ఎత్తు కూడా తక్కువగా ఉన్నారు కాబట్టి, పొట్ట పైకి పెరిగే కొద్దీ ఆయాసంగా, ఇబ్బందిగా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు డైటింగ్, విపరీతమైన వ్యాయామాలు చేసి బరువు తగ్గాలనే నిర్ణయాన్ని, ఆలోచనను వెంటనే మానెయ్యండి. కాకపోతే సాధారణంగా ప్రెగ్నెన్సీలో 10-11 కేజీల వరకు బరువు పెరగొచ్చు. మీరు ప్రయత్నిస్తే అంత ఎక్కువగా పెరగకుండా 5 కేజీల వరకు నియంత్రించు కోవచ్చు. అంటే ఆహార నియమాల్లో అన్నం తక్కువ తిని, కూరలు, పండ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం, పండ్లలో షుగర్ ఎక్కువగా ఉండే అరటిపండ్లు, సపోటా వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.

డైటీషియన్ పర్యవేక్షణలో ఆహార నియమాలను పాటించవచ్చు. ఇక వ్యాయామం చేయాలను కుంటే, మొట్టమొదటగా చిన్న నడకతో మొదలు పెట్టి, ఆయాసం లేనంత వరకు పొద్దున 15 నిమిషాల నుంచి అరగంట, సాయంత్రం అరగంట చేయవచ్చు. తర్వాత ప్రాణాయామం, బ్రీతింగ్ వ్యాయామాలు, తేలికపాటి వ్యాయామాలు మీ గైనకాలజిస్ట్ సలహా మేరకు మీ ఆరోగ్యం, బిడ్డ మాయ, గర్భాశయ ముఖ ద్వార పొజిషన్‌ను బట్టి చేయవచ్చు. డాక్టర్ పర్యవేక్షణలో చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే బిడ్డకు ఎలాంటి ప్రమాదం ఉండదు.

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా