యోగాపై పతంజలి ప్రభావం

24 Jan, 2015 23:38 IST|Sakshi
యోగాపై పతంజలి ప్రభావం

జగ్గీ వాసుదేవ్
www.sadhguru.org

యోగా సూత్రాలను సంకలనం చేసిన పతంజలి మహర్షిని ‘ఆధునిక యోగా పితామహుడి’గా భావిస్తారు. మొదటి ఆదియోగి ‘శివుడు’ యోగాలోని వివిధ అంశాలను సప్తరుషులకు అందించారు. ఇవే ఏడు ప్రాథమిక వ్యవస్థలుగా మారాయి. కానీ ఆయన ఎప్పుడూ ఏదీ లిఖిత రూపంలో ఉంచలేదు. కాలక్రమేణా అవి కొన్ని వందల వ్యవస్థలుగా ఆవిర్భవించాయి. భారతదేశంలో ఒకప్పుడు 1700 విభిన్న యోగా విధానాలు ఉండేవి. అందువల్ల పతంజలి వాటన్నిటినీ 200 సూత్రాలలో క్రోడీకరించి ‘‘మానవ అంతర్గత వ్యవస్థ గురించి చెప్పగలిగేదంతా ఇందులో ఉంది’’ అన్నారు.
 

పతంజలి యోగాసూత్రాలు కేవలం ఒక నిర్దిష్ట స్థాయి అనుభవం కలిగినవారికి మాత్రమే అర్థం అయ్యేలా రూపొందించబడ్డాయి. సాధారణ పాఠకునికి అవి అర్థరహితమైన మాటలుగా అనిపిస్తాయి. పతంజలి జీవితం గురించి రాసిన ఈ మహత్తర గ్రంథాన్ని ఒక వింత పద్ధతిలో మొదలుపెట్టారు. మొదటి అధ్యాయం, ‘ఇక ఇప్పుడు యోగా’ అనే అర్థ వాక్యం మాత్రమే. ఆయన చెప్పదలచుకున్నదేమిటంటే కోరుకున్న ఉద్యోగం, అవసరమైన డబ్బు, నచ్చిన జీవిత భాగస్వామి ఉన్నా కూడా, మీలో ఇంకా ఏదో వెలితి ఉన్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటే... అప్పుడు మీ జీవితంలో ‘యోగా’కి సమయం ఆసన్నమైనట్లు.

కొత్త ఇల్లు కట్టుకుంటేనో, లేక మరొక ఉద్యోగంలో చేరితేనో అంతా బాగుంటుంది అని మీరు ఇంకా విశ్వసిస్తున్నట్లయితే, మీ జీవితంలో ‘యోగా’కి సమయం ఇంకా రానట్లే. ఇలాంటివేమీ మీకు నిజమైన సంపూర్ణతను కలిగించవని మీకు అవగతమైనప్పుడే, మీకు యోగా చేయవలసిన సమయం ఆసన్నమైనట్లు. అందుకే పతంజలి యోగాసూత్రాలలోని మొదటి అధ్యాయం ఒకే అర్థ వాక్యం. అదే ‘ఇక ఇప్పుడు, యోగా’. వాస్తవానికి, జీవితం గురించి పతంజలి చెప్పగలిగినదంతా చెప్పేశారు.

మేధస్సు పరంగా, అలాగే  గణితశాస్త్రం, జ్యోతిశ్శాస్త్రం, విశ్వనిర్మాణ శాస్త్రం, సంగీతం... వంటి వాటిలో ఆయనకున్న నైపుణ్యం పరంగా చూస్తే, మనిషిగా కేవలం ఒకే ఒక వ్యక్తికి జీవితం పట్ల ఇంత విస్తారమైన అవగాహన ఉండటం అసాధ్యం. మేధస్సు పరంగా నేటి శాస్త్రవేత్తలు పతంజలి ముందు పిల్లకాయల్లాగా కనిపిస్తారు. ఎందుకంటే జీవితం గురించి చెప్పగలిగేదంతా ఆయన చెప్పేశారు. మీరు ఏది చెప్పాలని ప్రయత్నించినా, అది ఆయన ఇదివరకే చెప్పేశారు. ఆయన ఎవరికీ ఏదీ చెప్పటానికి మిగల్చలేదు. ఇది అన్యాయం!

మరిన్ని వార్తలు