యంత్ర మర్మం తెలిసింది

28 Mar, 2015 23:47 IST|Sakshi
యంత్ర మర్మం తెలిసింది

మహిళా విజయం: ఆటో మొబైల్‌రంగం అనగానే... యంత్రాల మోతలు, గుర్తొస్తాయి. వాటితో పని చేసే గరుకు చేతులు కళ్ల ముందు మెదలుతాయి. అందుకు భిన్నంగా... రెండు సున్నితమైన చేతులు ఈ యంత్రాంగాన్ని నడిపిస్తున్నాయి. మన పక్కింటమ్మాయిలా కనిపించే సునీత చేస్తున్న సాహసం ఇది.  మా కుటుంబంలో తొలితరం పారిశ్రామికవేత్త మా అమ్మ. ఆమె మా నాన్న స్థాపించిన పౌల్ట్రీ పరిశ్రమను నడిపింది. నేను ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టడం సాహసోపేతమైన నిర్ణయం అనుకోవడం లేదు. మా అమ్మానాన్నలు నాకు ‘ఆడపిల్ల కాబట్టి...’ అంటూ పరిధులు విధించలేదు. మాది విజయవాడ దగ్గర సూరంపల్లి. ‘నున్న’లో మా కోళ్లఫారాలుండేవి. అమ్మానాన్నలు ఇతర పనుల్లో ఉన్నప్పుడు నేను లూనా మీద వెళ్లి కోళ్లఫారం పనులు చూసేదాన్ని. బీకామ్ పూర్తవగానే పెళ్లి చేశారు. అలా హైదరాబాద్‌కొచ్చాను. మావారు మెకానికల్ ఇంజనీర్. నాలో వ్యాపార లక్షణాలున్నాయంటూ ఎంబీఏ చేయమన్నారు. ‘నేను చేయగలను’ అని నిరూపించుకోవాలనే తపన నాలో చాలా ఉండేది. ఎంబీఏ కాగానే 2008లో ఈ యూనిట్‌ని స్థాపించాను.
 
 మొదట్లో చేతులతోనే...
 మొదట్లో మిల్లింగ్ మెషీన్‌తో చిన్న చిన్న కాంపోనెంట్స్ తయారు చేశాం. తర్వాత నానోబోరింగ్ ద్వారా బ్లాక్ సిస్టమ్ చేశాం. హారిజాంటల్ బోరింగ్, మూసపోత వంటివన్నీ చేత్తోనే చేయాల్సి వచ్చేది. 2010 నాటికి నాణ్యమైన దేశీయ, విదేశీ యంత్రాలతో పరిశ్రమ స్థాయి పెంచాను. మాన్యువల్‌గా చేసినప్పుడు నెలకు పాతిక- ముప్పై వేల రూపాయల పనులు చేసేవాళ్లం. ఇప్పుడది ఏడాదికి అరవై లక్షల టర్నోవర్‌కి చేరింది. సోలార్ స్ట్రింగింగ్ జిగ్స్ తయారీలో దక్షిణ భారతదేశంలో మొదటిస్థానంలో ఉన్నాం. ప్రోగ్రామింగ్, మార్కెటింగ్ నేను, రోజువారీ పనులు మావారు చూసుకుంటున్నాం.
 
 శిక్షణ ఇచ్చే స్థాయికి...
 ఇంజనీరింగ్‌లో ప్రాథమిక సూత్రాలను మా వారు నేర్పించారు. ఆ తర్వాత మొత్తం కంప్యూటర్ ద్వారా రూపొందించడానికి 2డి, 3డి ఆపరేషన్స్ నేర్చుకున్నా. ఒక వస్తువు రూపొందాలంటే అనేక విడిభాగాలు తయారు చేసుకుని వాటిని కరెక్టుగా అసెంబుల్ చేయాలి. ప్రతి విడిభాగానికీ ముందు ఒక మూసను తయారుచేయాలి. మేము ఆ మూసలను, విడిభాగాలను తయారు చేస్తాం. 24 కట్టర్స్ ఆధారంగా కంప్యూటర్‌లో ప్రోగ్రామ్ చేస్తే యంత్రాన్ని ఆన్ చేయగానే ఎప్పుడు ఏ కట్టర్ పని చేయాలో అది ఆ పని చేసుకుపోతుంది. టూ వీలర్ తయారు కావాలంటే వందలాది విడిభాగాలు కావాలి, కారుకైతే వెయ్యి విడిభాగాలుంటాయి. నేను ఇందులో ప్రత్యేకంగా కోర్సు చేయలేదు కానీ, సబ్జెక్టు క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. నేనిప్పుడు మాకు వచ్చిన ఆర్డర్లకు స్వయంగా డిజైన్ చేసుకోవడంతోపాటు ఇంజనీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేట్లకు వారు చదివిన విషయాన్ని పనిలో ఆచరించడానికి తగిన శిక్షణ ఇవ్వగలను.
 
 పరిశ్రమకు ముందు...
 యంత్రాల మధ్య సమన్వయం కుదిర్చి పనిచేయడం అసాధ్యమేమీ కాదు అని నమ్మాకే ఇందులోకి దిగాను. నాకేం కావాలో తెలుసుకున్న తర్వాత నేర్చుకోవడం కష్టం కాలేదు. పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చెందిన సాంకేతికరంగంలో యంత్రాల విడిభాగాల తయారీ చేస్తున్న ఏకైక తెలుగు మహిళను అని గర్వంగా చెప్పగలను.    
 
 ఆ నిబంధన ఉండాలి
 మన దగ్గర మెటల్ ఇండస్ట్రీకి ప్రోత్సాహం తక్కువ. గుజరాత్‌లో బాగుంది. వ్యవస్థను నడిపించే శక్తి మహిళలకు ఉంది. పరిశ్రమ స్థాపనతోపాటు, మార్కెటింగ్‌లో కూడా మహిళలకు ప్రభుత్వం నుంచి ఆసరా ఉంటే మరింత మంది ఈ రంగంలోకి రాగలుగుతారు. ప్రభుత్వ అధీనంలో నడిచే భారీ పరిశ్రమలకు అవసరమయ్యే విడిభాగాల ఆర్డర్లు మహిళలు నిర్వహించే పరిశ్రమలకు ఇవ్వాలనే నిబంధన పెడితే బావుంటుంది.
 - జె. సునీత, ఎం.డి, ఎస్.ఎల్.పి. ఇంజినీర్స్ (సీఎన్‌సీ కాంపోనెంట్స్, సబ్ అసెంబుల్స్)
 ఫోన్: 9441549202
 రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి
 ఫొటో: రాజేశ్
 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు