ఈ రాశి వారికి క్షమాగుణం ఎక్కువ

28 Jun, 2015 01:03 IST|Sakshi
ఈ రాశి వారికి క్షమాగుణం ఎక్కువ

ఆస్ట్రోఫన్‌డా
రాశులలో కన్యరాశి ఆరోది. ఇది సరి రాశి, వాయుతత్వం, శీతల స్వభావం, సౌమ్య రాశి,శూద్ర జాతి, రంగు ఆకుపచ్చ, శరీరంలో పొట్ట, నడుము, నరాలను ఈ రాశి సూచిస్తుంది. ఇది ద్విస్వభావ రాశి, స్త్రీరాశి, దిశ దక్షిణం. ఇందులో ఉత్తరా ఫల్గుణి 2, 3, 4 పాదాలు, హస్త నాలుగు పాదాలూ, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. దీని అధిపతి బుధుడు. నివాస స్థానం కేరళ ప్రాంతం. ఇది భారత్, బ్రెజిల్, టర్కీ పరిసర ప్రాంతాలను సూచిస్తుంది.

పెసలు, బఠాణీలు, ఆముదం, పత్తి మొదలైన ద్రవ్యాలపై ప్రభావం కలిగి ఉంటుంది.

 
కన్యరాశి వారు మృదు స్వభావులు, కాస్త సిగ్గరులు, మొహమాటస్తులు. శ్రద్ధగా తమ పని తాము చేసుకుపోవడంలో తేనెటీగలను తలపిస్తారు. అడిగినదే తడవుగా ఇతరులకు సాయం చేయడంలోనే ఆనందం వెదుక్కుంటారు. తమ మితిమీరిన పరోపకార ధోరణి గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా, తమదైన ధోరణిలోనే జీవిస్తారు. ప్రణాళికాబద్ధంగా, పూర్తి అంకిత భావంతో కష్టించి పనిచేయడంలో వీరికి సాటివచ్చే వారు అరుదు. ఎంత ఒత్తిడి ఎదురైనా సహనం కోల్పోకుండా ఉండటం వీరి ప్రత్యేకత.

మొహమాటం వల్ల తమంతట తామే చొరవ తీసుకుని ఇతరులతో కలుపుగోలుగా ఉండలేరు. ఈ లక్షణం వల్ల తరచు అపార్థాలకు గురవుతారు. అయితే, ఇతరులు చొరవ తీసుకుని, వీరితో స్నేహం చేస్తే మాత్రం వారి పట్ల నమ్మకంగా ఉంటారు. వీరికి క్షమాగుణం కూడా ఎక్కువే. ఇతరులు తమ పట్ల చేసిన చిన్న చిన్న తప్పులను తేలికగా క్షమిస్తారు. చురుకైన మేధాశక్తి వీరి సొంతం. పనిభారం ఎంత ఉన్నా తొందరగా అలసిపోరు. బయటకు నిరాడంబరంగా కనిపించినా, వీరికి విలాసాలపై కూడా మక్కువ ఉంటుంది. తమ కష్టానికి ఆశించిన ఫలితం దక్కకుంటే తొందరగా నిర్వేదానికి లోనవుతారు.

మానసికంగా గాయపడినప్పుడు ఇతరులను ఏమీ అనలేక ఆత్మనిందకు పాల్పడతారు. తాము ఉండే చోట అన్నీ పరిశుభ్రంగా, పద్ధతిగా ఉండాలని కోరుకుంటారు. వీరి ధోరణి ఒక్కోసారి సన్నిహితులకు చాదస్తంగా అనిపిస్తుంది. సృజనాత్మకతకు ఆస్కారం ఉండే రచన, నటన, సంగీత, నృత్య కళా రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. అకౌంటింగ్, బ్యాంకింగ్, వైద్యం, సామాజిక సేవ, విదేశీ వ్యవహారాలు వంటి రంగాల్లోనూ తమ ప్రత్యేకత చాటుకుంటారు. వ్యవసాయం, పండ్లతోటల పెంపకం, పశుపోషణ వంటివి వీరికి అనుకూలిస్తాయి. బయటకు ఏదీ చెప్పుకోకుండా లోలోనే కుమిలిపోయే తత్వం వల్ల మానసిక సమస్యలతో, నాడీ సమస్యలతో బాధపడతారు.
 - పన్యాల జగన్నాథ దాసు

మరిన్ని వార్తలు