కాసేపు ఎదుటివాళ్ల స్థానంలో కూర్చొని ఆలోచించు...

21 Sep, 2014 01:25 IST|Sakshi
కాసేపు ఎదుటివాళ్ల స్థానంలో కూర్చొని ఆలోచించు...

పద్యానవనం: మకర ముఖాంతరస్తమగు మాణికమున్ బెకిలింప వచ్చు, బాయక చలదూర్మికానికరమైన మహోదది దాటవచ్చు, మస్తకమున పూలదండవలె సర్పమునైన భరించవచ్చు, మచ్ఛిక ఘటించి మూర్ఖ జన చిత్తము దెల్పనసాధ్యమేరికిన్!
 
మనిషికి సమస్తం అర్థమైనా సాటి మనిషి అర్థం కాని సందర్భాలెన్నో! అర్థం చేసుకోరా? అర్థం కారా? అంటే, ఒకటో, రెండో, రెండూనో? ప్రఖ్యాత కవి, రచయిత బెర్నార్డ్ షా అనేవారట, ‘నీ మిత్రులెవరెవరో చెప్పు నువ్వేంటో నే చెబుతా!’ అని. ఎదుటి వారిని అర్థం చేసుకొని నడచుకోవడం అన్నది మానవేతిహాసంలోనే ఓ మహోన్నతమైన లక్షణం.

ఏ విషయంలోనైనా ఒక స్పర్థ, సంక్లిష్టత, వివాదం తలెత్తినపుడు... ఎదుటివారి దృష్టి కోణంలో కూడా కొన్ని క్షణాలు ఆలోచించి మనం నడుచుకుంటే చాలా వరకు వ్యవహారం దానంతట అదే చక్కబడుతుందని విజ్ఞులు చెబుతారు, ఇందుకేనేమో! ‘వినదగు నెవ్వరు చెప్పిన...’ అనే మాట విస్తృతార్థంలో చెప్పిందిగా భావించాలి. అలా అని, ఎవరేం చెప్పినా దాన్నే శిరోధార్యంగా భావించి అదే చేయాలనేం లేదు.
 
‘వినినంతనె వేగపడక వివరింప దగున్’ అని చెబుతాడు సుమతీ శతకకారుడు బద్దెన. ‘కని, కల్ల-నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు’ అంటూ ముక్తాయింపు నిచ్చాడు. వినేది విని, అందులో నిజమెంత, అబద్ధమెంత అని నిర్ధారించుకొని నడుచుకోవడం ఉత్తమమని గ్రహించమంటాడు. ఎదుటివారి మనసెరిగి, మంచి చెడుల విచక్షణతో... వారి వాదనతో మనం అంగీకరించినా, విభేదించినా... వాటితో నిమిత్తం లేకుండా తగు గౌరవమిచ్చి నడచుకోవడమన్నది ఉన్నతులైన వారి లక్షణం. ‘వాల్తేర్’ అనే మహానుభావుడీ విషయాన్ని మహా గొప్పగా చెప్పాడు. ‘‘నేను నీ వాదనను అంగీకరించకపోవడమే కాదు పూర్తిగా విభేదించవచ్చు, కానీ ఆ వాదనను వ్యక్తీకరించే నీ హక్కుందే, దాన్ని పరిరక్షించడానికి నా ప్రాణాలివ్వడానికైనా నే సిద్ధం’’.
 
మనకా సద్బుద్ధి ఉన్నా, అవతలివారి వాదన గానీ, ఏమాలోచిస్తున్నాడని గానీ, మనసులో ఏమనుకుంటున్నాడని గానీ తెలియనప్పుడు? చాలా ఓపిక ఉన్నవాళ్లయితే అవతలి వారి మనసులో ఏముందో...! అని కొంచెం తెలుసుకోవడానికి యత్నిస్తారు. కానీ, అవతలి వాళ్లు పరమ మూర్ఖులయితే అది తెలుసుకోవడం దుస్సాధ్యమని భర్తృహరి అంటాడు. ఆయన శ్లోకాన్ని అనువదిస్తూ ఏనుగు లక్ష్మణ కవి, మూర్ఖులైన వారి చిత్తం తెలుసుకోవడం ఎంత కష్టమో కష్టసాధ్యమైన ఇతర పనులతో పోల్చి ఎంతో రమ్యంగా చెప్పాడీ పద్యంలో. గజేంద్రుడినే గడగడ వణికించిన బలశాలిగా, నీటిలో అత్యంత క్రూర మృగంగా పేరున్న మొసలి ముఖంలో ఉండే మాణిక్యాన్ని కూడా పెకిలించవచ్చట! మొసళ్లను వేటాడే మొనగాడిగా పేరుగడించిన ‘స్టీవ్ ఇర్విన్’ లాంటి వాళ్లను చూశాక మనకీ మాట నిజమే అనిపించింది.
 
పరవళ్లతో పరుగిడుతూ అడుగిడడానికే ప్రమాదకరమైన మహోగ్ర జల ప్రవాహాన్ని కూడా దాటేయవచ్చట. శరీరం గడ్డకట్టుకుపోయేంత చలిలో కూడా ఇంగ్లీష్ చానల్‌ను ఈదే వాళ్లను, ఆధునిక సాధన సంపత్తి సహకారంతో నీళ్లలో సాహసయాత్రలు చేసే వాళ్లను చూస్తే.... కొంచెం కష్టమైనా మానవ సాధ్యమే అనిపిస్తుంది. పూలదండలాగ సర్పాన్నయినా మెళ్లో వేసుకోవచ్చంటాడు. ఒకప్పుడు శివుడికి మాత్రమే సాధ్యమైన ఈ సాహసక్రీడ అందరూ చేయలేకపోవచ్చు కానీ, ‘ఆనిమల్ ప్లానెట్’ ‘నేషనల్ జియోగ్రఫిక్’ వంటి చానళ్ల పుణ్యమా అని ‘బియర్ గ్రిల్స్’ ‘మాల్కవ్ డగ్లస్’ వంటి వాళ్లను చూశాక ‘‘వామ్మో! ఇదీ సుసాధ్యమే’’ అనిపిస్తుందిప్పుడు. ఇంత చెప్పాక, ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే! ఎంత యత్నం చేసినా, ఎంత మంచితనం ప్రదర్శించినా మూర్ఖుడైన వాడి మనసులో ఏముందో, ఏమాలోచిస్తున్నాడో, ఏం చేస్తే వాడ్ని బాగు చేయొచ్చో తెలుసుకోవడం, తెలియజెప్పడం ఎవరికైనా అసాధ్యమంటాడు శతకకారుడు.

అంత మూర్ఖత్వం మనిషికి పనికిరాదని మనం గ్రహించాలి. అవగాహన, ఆత్మనిగ్రహమే మనిషిని మూర్ఖుడు కానీకుండా నిరోధించగలిగేది. భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు చెప్పినా, భారత సనాతన సంప్రదాయ-సంస్కృతీ సంపత్తిని విశ్వానికి చాటిచెప్పిన వివేకానందుడు వ్యక్తపరచినా, భారత జాతి మొత్తానికి తండ్రిలాంటి వాడనిపించుకున్న గాంధీ మహాత్ముడు ఆచరించి చూపినా... ఆత్మనిగ్రహమే మనిషిని పరిపూర్ణుడ్ని చేస్తుందన్నది సార్వకాలిక జీవన సత్యం! తరతరాలకి మార్గదర్శనం !!

 - దిలీప్‌రెడ్డి

మరిన్ని వార్తలు