నెరవేరిన మూడో ప్రతిజ్ఞ

8 Apr, 2018 00:55 IST|Sakshi

ఆచార్య మాడభూషి శ్రీధర్

సహస్రాబ్ది ధారావాహిక – 24

నమ్మాళ్వార్లు అనుగ్రహించిన ద్రావిడ వేదాన్ని ఇంటింటికీ తీసుకు వెళ్లడం మరో యజ్ఞం. అదే యామునులకు రామానుజులు ఇచ్చిన మూడో వాగ్దానం. యామునుల మరో శిష్యుడు తిరుమాలై ఆండాన్‌. ఆయనను అనుసరించి రామానుజులు తిరువాయిమొళి ప్రబంధ అధ్యయనంపై సాధికారికమైన కృషి చేశారు. అందులోని తత్వ గాంభీర్యాన్ని వెలికి తీసి విశేషార్థాలను వివరించి రామానుజులు చెప్పేవారు. ఆండాన్‌ నుంచి ప్రత్యక్షంగా తిరువాయిమొళి వ్యాఖ్యానాన్ని ఆమూలాగ్రంగా చదివి నిష్ణాతులైనారు రామానుజులు. యామునుల మరో శిష్యరత్నం శ్రీవరరంగాచార్యులు. వారికి తిరువరంగప్పెరుమాళ్‌ అఱైయర్‌ అని మరో పేరు ఉంది. నాలాయిర దివ్య ప్రబంధగానంలో ఈయన నిష్ణాతుడు. వారి నుంచి ప్రత్యక్షంగా నాలుగువేల పాశురాల అర్థాన్ని నేర్చుకున్నారు రామానుజులు. ఎంత ఏకసంథాగ్రాహి అయినా గురుముఖతః వినయంతో విద్య నేర్చుకోవాలని రామానుజులు ఆ విధంగా ఆచరించి తరతరాలకు ప్రబోధించారు. శ్రీవిష్ణు పురాణానికి సమంగా ఆరువేల సంఖ్యతో అలరారే విధంగా తిరువాయిమొళికి వ్యాఖ్యానాన్ని రచించమని తిరుక్కురుగై పిరాన్‌ పిళ్లాన్‌ అనే తన శిష్యుడిని ఆదేశించారు. అదే ఆరాయిఱప్పడి (ఆరువేల శ్లోకాల సంపుటి). ఇది ద్రావిడవేదానికి తొలి భాష్యం. ఆ తరువాత మరికొందరు ఆచార్యులు తిరువాయిమొళిపై ఇదేబాటలో మరో నాలుగు వ్యాఖ్యాన గ్రంథాలు రచించారు.

ఆరువేల పద్యాలున్న ఆరాయిఱప్పడి తరువాత మిగిలిన నాలుగువేల పాశురాలపైన కూడా వ్యాఖ్యానాలు రావడానికి ఈ గ్రంథం ప్రేరణ అయింది. అదే విధంగా వేదాంతసారాన్ని కూడా రామానుజులు తన శ్రీభాష్య రచన ద్వారా సామాన్యీకరించారు. తమిళ సంస్కృత వేదాల అధ్యయనం చేసిన వారిని ఉభయ వేదాంత ప్రవక్త అని సంబోధిస్తారు. అటువంటి ఉభయవేదాంత ప్రవక్తలు ఎందరో రామానుజుల శిష్యకోటిలో ఉన్నారు. ఆ విధంగా రామానుజుడు యామునాచార్యుల మూడో వాగ్దానాన్ని కూడా పూర్తి చేశారు. రామానుజుల ఆచార్యత్వంలో వేలాది శిష్యులు నాలుగువేల పాశురాలను నేర్చుకుని ప్రతి ఆలయంలో గానం చేస్తూ మంగళా శాసనం పలుకుతూ ఉన్నారు. ప్రతి ఆలయం తిరువాయిమొళి పారాయణాలతో ప్రతిధ్వనిస్తున్నది. రామానుజ కూటములు ప్రతి ఊళ్లో ఏర్పడ్డాయి. కులమత భేద రహితంగా అందరికీ భోజనం పెట్టే సత్సంప్రదాయాన్ని రామానుజులే ప్రారంభింపచేశారు. ఆ రామానుజ కూటములలోనే ద్రవిడ వేద పారాయణం కూడా సాగుతూ ఉండేది. ఆ విధంగా ఊరూరా వాడవాడలా ఇంటింటా ద్రవిడవేదం ప్రతిధ్వనించింది. వైష్ణవం ప్రకాశించింది. శరణాగతి గద్య, శ్రీరంగ గద్య, శ్రీవైకుంఠ గద్య అనే మూడు గద్యములను (గద్యత్రయం) రామానుజులు రచించారు. ప్రపన్నుడు ప్రతిదినం భగవంతుడి గురించి ఏ విధంగా చింతించాలో ధ్యానించాలో ఆయన ఈ మూడు అద్భుత రచనల్లో వివరించారు. మనలో అహంకారాన్ని తొలగించుకుని, సాధారణ అల్ప జీవులమన్న నిజాన్ని గుర్తించి అందరికన్న తక్కువ అనే నైచ్యానుసంధానాన్ని వివరించి, జగన్నాథుడిని ఆశ్రయించే పద్ధతులను సామాన్యులకు కూడా అందే రీతిలో ఈ గ్రంథాలు తెలియజేశాయి. 

జగన్నాథుడి ప్రేమ
రామానుజుడు ఉత్తరదేశ యాత్ర కొనసాగిస్తూ పూరీ జగన్నాథ క్షేత్రం చేరుకున్నారు. అది పురుషోత్తమ క్షేత్రం. అతి పవిత్రమైన నారాయణ స్థానం. అన్నధామం. జగన్నాథుడు మట్టికుండల్లో వండిన ఆహారాన్ని భుజించే సామాన్యుడు. అందరికీ అందుబాటులో ఉండే సౌశీల్యుడు. అక్కడ రామానుజ మఠాన్ని స్థాపించారు. అక్కడ పూజా వ్యవహారాలలో అవకతవకలు శాస్త్ర వైరుధ్యాలు కనిపించాయి. వాటిని సరి చేద్దామనుకున్నారు. పాంచరాత్ర ఆగమ పద్ధతిలో అర్చనాది కార్యక్రమాలను క్రమబద్ధం చేద్దామనుకున్నారు కానీ అక్కడి పండాలు అందుకు అంగీకరించలేదు. మరునాటి నుంచి ఈ కొత్త విధానాలు ప్రవేశ పెట్టాల్సిందే అని నిర్దేశించారు. ప్రేమతో మాకు వచ్చిన రీతిలో మాకు నచ్చిన రీతిలో నిన్ను పూజిస్తాము కానీ మాకీ కొత్త పద్ధతుల్లో వాత్సల్యం కనిపించడం లేదు మాకొద్దు ఈ పద్ధతి అని జగన్నాథ భక్తులు తమ దేవున్ని వేడుకున్నారు. ఆ రాత్రి జగన్నాథ క్షేత్రంలో నిద్రించిన రామానుజుడు మరునాడు శ్రీకూర్మంలో నిద్రలేచారు. 

శ్రీకూర్మమా? శివలింగమా?
శ్రీరామానుజులు కళ్లు తెరిచే సమయానికి ఎదురుగా ఒక మహాలింగం నెలకొన్న ఆలయం ఉంది. త్రిశూలాలు పట్టుకున్న వారు చుట్టూ చేరి శివనామ స్మరణ చేస్తున్నారు. తన వెంట శిష్యులు లేరు. తన ఆరాధనా సామగ్రి లేదు. పెరుమాళ్ల పెట్టె లేదు. తిరుమణి పెట్టె లేదు. ఇప్పుడు ఏం చేయడం. తన నిత్యానుష్ఠాన కార్యక్రమానికి అవరోధం ఏర్పడినట్టేనా. నిరాహారంతో పరమాత్ముడిని ధ్యానం చేస్తూ గడిపారు. స్వామీ ఏమిటీ పరీక్ష అని మనసు దైవాన్ని ప్రశ్నిస్తున్నది. అంతలో ఒక అంతర్వాణి అశరీరవాణి వినిపించింది. ‘‘రామానుజా..నీ ముందున్న ఆలయంలో మహాదేవుడు కాదు, మహాకూర్మం ఉంది. ఆ ఎదురుగా ఉన్న పుష్కరిణి నా పాల సముద్రమే. తిరుమన్ను లేదనే కదా నీ బాధ. ఆ పుష్కరిణి చుట్టూ ఉన్నదంతా తిరుమణే’’ అని వినిపించింది. తరచి చూస్తే ఆ విషయం నిజమని అర్థమైంది. అక్కడ పురుషోత్తమపురం పూరీలో రామానుజుని శిష్యులు గురువుగారు కానరాక ఆందోళన పడ్డారు. ఒక వృద్ధ బ్రాహ్మణుడు వారికి కనిపించి ‘‘మీ గురువుగారు శ్రీకూర్మంలో ఉన్నారు. వెళ్లండి వెళ్లండి’’ అన్నారు. వారు వెంటనే బయలుదేరి రామానుజులను చేరుకున్నారు. 

శ్రీకూర్మంలో ఉన్నది మహాకూర్మమే కానీ మహాలింగం కాదని రామానుజులు అనేక ప్రమాణాలు చూపారు. అనేక పురాణాలు స్థలపురాణంలోని భాగాలు వివరించి, ఆలయంలో శ్రీకూర్మపు జాడలు ప్రత్యక్షంగా చూపినారు. అయినా అక్కడి అర్చకులు ఒప్పుకోలేదు. ఆ దేవుడు శివుడనే వాదించారు. సరే అయితే ఈ రాత్రి తలుపులు మూసి రేపు తెరుద్దాం. శ్రీ కూర్మనాథుడు  శివలింగమే అయితే ఎట్లున్నది అట్లే ఉండును. శ్రీకూర్మావతారుడైతే ఈ మూర్తి పడమర వైపు తిరుగుగాక అన్నారు. అందుకు అర్చకులు ఒప్పుకున్నారు. రాత్రి గుడి తలుపులు మూసివేశారు. మరునాటికి పడమటవైపు తిరిగి తానే శ్రీకూర్మనాథుడినని, హరిననీ నిరూపించుకున్నారు స్వామి. అప్పటికే తూర్పుదిశలో అక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది. వైష్ణవ క్షేత్ర పాంచరాత్రాగమ విధానం ప్రకారం మూలస్వామి ఎటువైపు చూస్తూ ఉంటే అటువైపే (అంటే ఇక్కడ పడమరవైపు ముఖం ఉంటే అటువైపే) ధ్వజస్తంభం ఉండాలని, అక్కడ మరో ధ్వజస్తంభాన్ని ప్రతిష్టింపచేశారు రామానుజుడు. ప్రపంచంలో రెండు ధ్వజస్తంభాలున్న మహాక్షేత్రం శ్రీకూర్మం ఒక్కటే. అక్కడి నుంచి సింహాచలం చేరుకున్నారు రామానుజులు. 

సింహాచలంలో రామానుజులు
ద్వయరూపంలో హరి నెలకొన్న పుణ్యక్షేత్రం సింహాచలం. వరాహ నరసింహుడాయన. దశావతారాల్లో మూడో అవతారమైన వరాహరూపంలో ముఖం ఉంది. నిలబడినది నరుని తీరు. కొండ సింహం ఆకారంలో ఉంటుంది కనుక సింహాచలం. మొత్తంగా ఆయన వరాహ, నర, సింహుడు. కూర్మం నుంచి వరాహమై, నరసింహమై ఆ తరువాత వామనుడు, పరశురాముడు, రాముడనే పరిపూర్ణ మానవుడిగా పరిణమించబోతున్న క్రమానికి ఒక విచిత్ర సంధి దశ సింహాచలాధీశుడు. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల హింసకు జ్వలిస్తున్న కోపాన్ని తగ్గించుకోవడానికి ఆయన నిరంతరం చందనంలో మునిగి శాంత స్వరూపంగా ఉంటారు.  అక్కడ శ్రీ కృష్ణమాచార్యులనే కవి, సంగీత విద్వాంసుడు మహాభక్తుడు ఉన్నారు. ఆయన గానం వినడానికి నరసింహుడు స్వయంగా వచ్చి పాటకు తగ్గట్టు లయబద్ధంగా నృత్యం చేసేవాడు. ప్రతిరాత్రి ఈ భక్తుడు ఆ భగవంతుడు కవితా గాన మృదంగ నృత్య కార్యక్రమాలతో గడుపుతారు. వారి నిలయానికి చేరి రామానుజులు కృష్ణమాచార్యులకు నమస్కరించారు. ఆయన ప్రతి నమస్కారం చేయకుండా ‘క్షేమమే కదా’ అని పలకరించారు. ‘‘మీ దయవల్ల, హరి అనుగ్రహం వల్ల అంతా క్షేమమే స్వామీ. నాదొక మనవి. వరాహ నరసింహుని ఆంతరంగికులైన మీరు ఈసారి పెరుమాళ్లతో ముచ్చటించినప్పుడు శ్రీరంగం నుంచి వచ్చిన (తనను చూపుతూ) ఈ సన్యాసికి మోక్షం ఉందో లేదో కనుక్కోవాలని ప్రార్థన’’ అని వినయంగా చెప్పుకున్నారు. ‘ఓ అదెంత పని...సరే’నన్నారాయన. ఆ రాత్రి నరసింహుని ముందుంచారు ఈ సందేహాన్ని. ‘‘ఆ సన్యాసికి తప్పక మోక్షం లభించగలదు. ఆయనకే కాదు కృష్ణమాచార్యా.. ఆయన ఎవరికి మోక్షం ఉండాలని చెబితే వారికి కూడా మోక్షం ఉండగలదు’’ అన్నారు హరి. ‘ఓహో సన్యాసి సామాన్యుడు కాడ’న్నమాట అనుకున్నారు కృష్ణమాచార్య. మరునాడు రామానుజుడు కలిస్తే ఈ విషయం చెప్పారు. ఆయన చాలా సంతోషించి ‘‘స్వామీ నా సంగతి సరే మీ మోక్షం గురించి కూడా కనుక్కున్నారా, కనుక్కునే ఉంటారు లెండి’’, అని రామానుజులు వాక్యాన్ని మధ్యలోనే ఆపారు. ‘నాకు మోక్షం లేకపోవడమా, నా సంగీతానికి నాట్యం చేసే హరి నాకు మోక్షం ఇవ్వడా? అయినా సరే అడుగుదాం’ అని మనసులో అనుకున్నారు. 

ఆ రాత్రి హరిని అడిగితే నవ్వి ఊరుకున్నారు. ‘భగవాన్‌ ఏమిటిది? నాకు నిత్యదర్శనం ఇచ్చే భాగ్యం కలిగించిన మీరు మోక్ష భాగ్యం ఇవ్వడం లేదా?’ అని ఆందోళనగా అడిగారు. ‘‘అది నీవు ఇప్పటిదాకా అడుగనే లేదు కదా కృష్ణమాచార్యా. నీ పాటకు మృదంగానికి నా ఆట సరిపోయింది కదా. అయినా ప్రస్తుతం మోక్షం ఇచ్చే అధికారం ఆ శ్రీరంగం సన్యాసికే ఉంది. నీవు మోక్షార్థివే అయితే ఆయన్ను ఆశ్రయించాల్సిందే’’ అని నరసింహుడు అనగానే కృష్ణమాచార్యులు ఆగ్రహోదగ్రులైనారు. తీవ్రకోపంతో ‘‘నీ గుడి ఏడు రాత్రులూ పగళ్లూ దగ్ధమైపోవు గాక.. ఈ గుడి శిఖరము నేలకూలుగాక’’ అని శపించారు.  
‘‘అకారణంగా ఇంత తీవ్ర శాపమా, నీ కవిత్వం నీచుల పాలవుగాక’’ అని హరి ప్రతిశాపం ఇచ్చారు. తన కోపమే విధ్వంసానికి కారణమని అర్థం అయిన వెంటనే ఆయనకు పాదాక్రాంతులైనారు కృష్ణమాచార్య. ‘‘నీవు ఈ అహంకారాన్ని వదులుకుని అకారత్రయాన్ని (అనన్యార్హశేషత్వము, అనన్యశరణత్వము, అనన్యభోగత్వము) తెలుసుకున్నపుడే నీకు శాంతి, మోక్షం. రామానుజుని ఆశ్రయించడమే నీకు మార్గం’’ అని హరి అంతర్థానమైనారు. 

మరునాడు ఆయన రామానుజుని ఆశ్రమానికి వెళ్లి ‘‘నేను కృష్ణమాచార్యుడిని వచ్చానని చెప్పండి’’ అన్నారు. చెప్పారు. రామానుజులు ‘‘నేను చనిపోయిన తరువాత రమ్మన్నానని చెప్పండి’’ అని తిరిగి పంపించారు. ఆయన తరువాత ఎవరి దగ్గరికి వెళ్లాలి, దీని అర్థం ఏమిటి అని లోతుగా ఆలోచిస్తే ‘‘నేను అంటే అహంకారం. అది ఛస్తేనే లోనికి అనుమతి’’. తన లోపమేమిటో తెలిసింది. కోపంతో పాటు లోపమూ పోతేనే గురువు ఆశ్రయం లభిస్తుంది. ఈసారి ఆయన కృష్ణదాసుడు వచ్చాడని చెప్పుకున్నాడు. చెప్పగానే లోనికి రమ్మన్నారు. రామానుజుని శిష్యులైనారు. సింహాచలంలో కొన్నాళ్లుండి రామానుజులు అక్కడి భక్తులకు తిరుమంత్రార్థాన్ని ఉపదేశించారు. ఆ మూలను హంస మూల అని పవిత్రభావంతో పిలుస్తారు. కొన్నాళ్ల తరువాత అక్కడి నుంచి బయలుదేరితే కృష్ణరామానుజ దాసు తానూ కూడా వస్తానన్నాడు. ‘‘ఇక్కడే ఉండి వరాహ నరసింహుని సేవించు’’ అని ఆదేశించి వెళ్లారు రామానుజులు. కృష్ణమాచార్యుని శాపం వల్ల తురుష్కులు దాడిచేసి దేవాలయాన్ని ఏడురోజుల పాటు కాల్చారట. 

గోదాగ్రజుడు... గోదాభీష్టుడు
ఒకరోజు నాచ్చియార్‌ తిరువాయ్‌మొళికి వ్యాఖ్యానం చెబుతున్నపుడు తొమ్మిదవ తిరుమోళి లో ఆరు, ఏడో పాశురాలకు అర్థం వివరిస్తున్నారు రామానుజులు. సుందరబాహు స్వామికి నూరు పాత్రలలో వెన్నను, చక్కెర పొంగలిని సమర్పిసా ్తనని గోదాదేవి వాగ్దానం చేసినట్లు ఆ పాశురాల్లో ఉంది. కానీ గోదాదేవి ఆ మాట చెల్లించుకోలేక పోయారు. రామానుజులు ఆ వ్యాఖ్యానాన్ని అక్కడే నిలిపివేసి అప్పుడే శ్రీవిల్లి పుత్తూరుకు బయలుదేరి గోదాదేవి మొక్కిన విధంగా నూరు గిన్నెల వెన్నను, చక్కెరపొంగలిని సమర్పించారు. గోదాదేవి అభీష్టాన్ని పూర్తి చేసినందుకు రామానుజుడు గోదాదేవికి అన్న అయ్యారనే పేరు తెచ్చుకున్నారు. రామానుజ అష్టోత్తరంలో గోదాగ్రజాయనమః అనీ గోదాభీçష్టపూరకాయనమః అనీ నామాలను సంతరించుకున్నారు.  

వడుగనంబి
రామానుజుని శిష్యులలో వడుగనంబికి రామానుజుని రూపమే దైవం. రామానుజుని పాదాలను తయారు చేయించుకుని సాలగ్రామంలో పెట్టి పూజించుకునే వాడు. శ్రీపాద తీర్థం మాత్రమే తీసుకునేవాడు. శ్రీరామానుజుల తిరువారాధన పెట్టెను నెత్తిన పెట్టుకుని రామానుజుల పాదుకలను చేతిలో పట్టుకుని ప్రయాణిస్తూ ఉండేవాడు. ఓ సందర్భంలో నీటి ప్రవాహం దాట వలసివచ్చినపుడు రామానుజుని ఆరాధన పేటికలోనే ఆయన పాదుకలను కూడా పెట్టి తీసుకుపోతుంటే నా దేవుడిమీద నా పాదాలు పెట్టడం నాకు పాపం కదూ అని అడిగారు రామానుజులు. మీకు మీ దేవుడెంతో మాకు నా దేవుడంతే స్వామీ... అనేవాడు. శ్రీరంగనాథుని ఊరేగింపు వస్తున్నది. రామానుజుడు శ్రీరంగనాథుని చూడడానికి మఠంలోంచి బయటకు నడుస్తూ ‘వత్సా నీవూ రా స్వామిని చూద్దాం’ అని పిలిచారు. అప్పుడు ఆయన రామానుజుల కోసం పాలు మరిగిస్తున్నారు. ‘మీ దేవుడి కోసం మీరు వెళ్లండి స్వామీ నా దేవుడి కోసం నేను పాలు మరగబెట్టుకోవడమే నాకు ముఖ్యం.’ అని జవాబిచ్చాడు. అతని గురుభక్తిని రామానుజులు చిరునవ్వుతో ప్రశంసించేవారు. వడుగనంబి రామానుజ అష్టోత్తరశత నామ స్తోత్రం రచించారు. అందులో చివరి శ్లోకం ఇది.యదాన్ద్ర పూర్ణేవ మహాత్మానేదం కృతం స్తుతం సర్వజనావనాయ, తజ్జీవ భూతం భువి వైష్ణవానాం బభూవ రామానుజ మానసానామ్‌
  

మరిన్ని వార్తలు