పదములు లేని మౌనలేఖ...

17 Jul, 2016 00:29 IST|Sakshi
పదములు లేని మౌనలేఖ...

పాటతత్వం
చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేవాడిని. ఈ అలవాటుతోనే కథలు రాయడం మొదలుపెట్టా. నటుడిగా ‘అష్టా చెమ్మా’ సినిమాతో తెరకు పరిచయమైనా... నా ఆలోచనలన్నీ రచన, దర్శకత్వం వైపే ఉండేవి. ఇలా కొంత హాస్యాన్ని మేళవించి... ఒక అందమైన ప్రేమకథను చూపించాలనుకుని ‘ఊహలు గుసగుసలాడే’ స్క్రిప్ట్ తయారు చేసుకున్నా. అమ్మాయిలతో ఎలా వ్యవహరించాలో బొత్తిగా తెలీని తన బాస్‌కు వాళ్లకు నచ్చేలా ఎలా ఉండాలో నేర్పుతుంటాడు కథానాయకుడు వెంకీ. వైజాగ్‌లో తన ప్రేమ గతాన్ని తల్చుకుంటూ...

బాస్‌కు ప్రేమ పాఠాలు చెబుతుంటాడు. అయితే తను ప్రేమించిన అమ్మాయి ప్రభావతి... బాస్‌కు వచ్చిన పెళ్లి సంబంధంలో అమ్మాయి శిరీష ఒక్కరే అని వెంకీకి తెలీదు. ఈ సందర్భంలో వస్తుందీ పాట... మ్యూజిక్ సిట్టింగ్‌లో కూర్చోగానే... అప్పటికే తన దగ్గర ఉన్న ట్యూన్ వినిపించారు కళ్యాణ్ కోడూరి. బాగా నచ్చింది. అనంత్ శ్రీరామ్ అద్భుతంగా పాట రాశారు... చరణాలు లేకుండా మూడు పల్లవులు ఉండటం ఈ పాట ప్రత్యేకత.
 
ఏం సందేహం లేదు...
 ఆ అందాల నవ్వే ఈ సందళ్లు తెచ్చింది...
 ఏం సందేహం లేదు..
 ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు తెచ్చింది..
 ఏం సందేహం లేదు..
 ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది..
 ప్రేమికుడికి సందళ్లు, తొందర్లు, ఆనందాలు తెచ్చేది చెలే కదా. ఆ అందాల నవ్వులు, కందేటి సిగ్గులు, గంధాల గొంతులు... అన్నీ చెలికాడికి అపురూపమే అని తొలి పల్లవి రాశారు అనంత్ శ్రీరామ్.
 
వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే...
 ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే...
 నాకళ్లల్లోకొచ్చి నీ కల్లాపి జల్లి ఓ ముగ్గేసి వెళ్లావే...
 నిదురిక రాదు అన్న నిజమును మోసుకుంటు...
 మది నిను చేరుతుందె చిలకా...
 తనకొక తోడు లాగ వెనకనే సాగుతుంది...
 హృదయము రాసుకున్న లేఖా...
 ప్రేమలోని విరహం వెన్నెల్లో వేడిని... ఎండల్లో హాయినీ పుట్టిస్తుంది... ఎందరిలో ఉన్నా... తన మోమునే చూడాలని తహతహలాడుతుంది మనసు.

ఇక ఈ తపనలో నిద్ర అనే మాటే గుర్తుకురాదు. ఈ భావాలనే అక్షరాల్లో చూపించాడు అనంత్ శ్రీరామ్. కళ్లల్లోకి వచ్చి కల్లాపి జల్లి ముగ్గేసి వెళ్లావే అనే వ్యక్తీకరణ మా అందరినీ బాగా ఆకట్టుకుంది.
 నీ కొమ్మల్లో గువ్వ...
 ఆ గుమ్మంలోకెల్లి కూ అంటుంది విన్నావా...
 నీ మబ్బుల్లో జల్లు...
 ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా...
 ఏమవుతున్నా గానీ...
 ఏమైనా అయిపోనీ ఏం ఫర్వాలేదన్నావా...
 
ఈ పల్లవి కథను వివరిస్తుంది. ఇంట్లో పోరు పడలేక పెళ్లి చూపులకు వస్తుంది నాయిక ప్రభావతి. ఆ విషయం తెలీని కథానాయకుడు... బాస్‌కు సాయం చేద్దామని ప్రేమ పాఠాలు చెబుతుంటాడు... తను ప్రేమించిన గువ్వ మరో గుమ్మంలో కూయ నుంది విన్నావా అంటాడు గీత రచయిత. నీ మబ్బుల్లో జల్లులాంటి ప్రేమ మరో ముంగిట్లో పూలు పూయిస్తే చాలా అని అడిగాడు... ఇలా చిన్న చిన్న పదాల్లో కథానాయకుడి పాత్రను ప్రశ్నించాడు అనంత్ శ్రీరామ్. సాహిత్యంలో తనకున్న పట్టుకు ఈ పాట మరో నిదర్శనం. సాధ్యమైనంత తెలుగు పదాలతోనే పాటలు రాసే అనంత్ శ్రీరామ్ అంటే నాకు ప్రత్యేక అభిమానం.

చిన్న వయసులోనే అపార ప్రజ్ఞను సంపాదించుకున్నారాయన. దర్శకుల ఆలోచనలను, సన్నివేశాల నేపథ్యాన్ని మనసును చదివినట్లుగా అర్థం చేసుకోగలరు. కథతో పాటే ప్రయాణించేలా ఈ పాట రాశారు. సినిమాలో చాలా ముఖ్యమైన సందర్భంలో వచ్చే ఈ పాట ఇంత హిట్ అయిందంటే... అనంత్ శ్రీరామ్ పనితనమే కారణం. ఇక సంగీత దర్శకుడు కళ్యాణ్ కోడూరి ఈ ట్యూన్ నా కోసమే ఉంచారేమో అనిపించింది. వేరే దర్శకులకు ఈ స్వరం వినిపించినా... వాళ్ల సినిమాలో సందర్భానికి సరిపోలేదట. నాయిక హృదయాన్ని ఆవిష్కరిస్తూ... చివరి పల్లవి ఇలా సాగుతుంది...
 అడుగులు వేయ్యలేక అటు ఇటు తేల్చుకోక
 
సతమతమైన గుండె గనుకా..
 అడిగిన దానికింక బదులిక పంపుతుంది
 పదములు లేని మౌన లేఖా...
 వైజాగ్ పరిసరాల్లో రాత్రి పూట ఈ పాట చిత్రీకరించాం. మంచి లొకేషన్లు ఎంచుకుని వారం రోజుల పాటు షూటింగ్ చేశాం. ఈ పాటకు నేనే కొరియోగ్రఫీ చేయడం మరో అనుభూతి. సినిమాలో ఈ పాట ఎంత కీలకమని మేము భావించామో... అంతే పర్ఫెక్ట్‌గా పాట వచ్చింది. కష్టే ఫలి అన్నట్లు సినిమాలో ఈ పాట సూపర్ హిట్. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా అంటే ‘ఏం సందేహం’ లేదు పాటే అంటుం టారు శ్రోతలు. అంతగా ఆకట్టుకుందీ పాట.    
 సేకరణ: రమేష్ గోపిశెట్టి
 
వారాహీ చలన చిత్రం సంస్థ పై నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించిన ’ఊహలు గుసగుసలాడే’ చిన్న చిత్రాల్లో పెద్ద విజయంగా నిలిచింది. ఈ సినిమాతో నాగశౌర్య, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా అరంగేట్రం చేశారు. నాగశౌర్య, రాశీ ఖన్నా ఇద్దరికీ ఈ సినిమా మంచి పునాది అయ్యింది. రాశీ ఖన్నా పెద్ద హీరోల సరసన నటిస్తుండగా...నాగశౌర్య హీరోగా నిలదొక్కుకున్నాడు. దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్‌కు మొదటి చిత్రమిదే. తొలి సినిమా అయినా... కథను స్పష్టంగా తెరకెక్కించాడు. పాటల చిత్రీకరణలో దర్శకుడు వంశీ శైలిని ప్రదర్శించాడు. దర్శకత్వం వహిస్తూనే అవసరాల శ్రీనివాస్ ఓ ముఖ్య పాత్రలో నటించారు. అమాయకత్వం, హాస్యం, కొంత స్వార్థం కలిసిన ఆ క్యారెక్టర్‌లో అంతే బాగా నటించారు.
 - అనంత శ్రీరామ్, గేయ రచయిత
- అవసరాల శ్రీనివాస్, నటుడు, దర్శకుడు

మరిన్ని వార్తలు