మ్యాచ్ ఫిక్సింగ్..

21 Feb, 2016 17:43 IST|Sakshi
మ్యాచ్ ఫిక్సింగ్..

దేడ్ కహానీ - రబ్‌నే బనాదీ జోడీ
‘పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి’ అని అనుకున్న రోజుల నుంచి ‘పెళ్లి జరగడం, భూలోకంలో నరకంతో సమానం’ అనుకునే రోజుల దాకా సమాజం చాలా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు చేసిన జోడీ లాంటి పాత చింతకాయపచ్చడిని కొత్తగా వడ్డించాలనుకోవడం ఒక దుస్సాహసం. దాన్ని షారుక్ లాంటి అగ్రహీరోతో ప్లాన్ చేయడం, అది కూడా ఒక బోరింగ్ భర్త పాత్రలో,
ఇంకో దుస్సాహసం.
 
ఒక విచిత్రమైన దర్శకుడి గురించి ముందు మాట్లాడుకుని, తర్వాత సినిమా గురించి మాట్లాడుకుందాం. ‘ఆదిత్య చోప్రా’. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శక నిర్మాత యష్‌చోప్రా కొడుకు.1995లో ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ అని ఒక ప్రేమకథని రాసుకుని షారుక్‌ఖాన్, కాజోల్‌తో జంటగా తీస్తే... ఇరవయ్యొక్క సంవత్సరాలుగా ఇంకా ఆడుతూనే ఉంది ముంబై మరాఠా మాదిర్‌లో.

ఈ మధ్యే సాక్షి టీవీలో వెయ్యి వారాలు పూర్తి చేసుకున్న డీడీఎల్‌జే సినిమా గురించి అరగంట సేపు చర్చించాం కూడా నేను, మిత్రులు సిరాశ్రీగారు, మహేష్ కత్తిగారు. అంత పెద్ద హిట్ ఇచ్చిన ఏ దర్శకుడైనా 1995 నుంచి ఈ ఇరవయ్యొక్క సంవత్స రాలలో కనీసం 15, 16 సినిమాలు తీసేస్తాడు సునాయాసంగా. కానీ దర్శకుడిగా ఆదిత్య చోప్రా మూడే సినిమాలు తీశాడు. నాలుగోది ఈ ఏడాది తీయబోతున్నాడు. అదే విచిత్రం. ఈలోగా నిర్మాతగా, కథకుడిగా, పంపిణీదారుడిగా రకరకాలుగా ఆక్యుపై అయినా, అతనిలోని దర్శకుడిని సినిమాలు తీయకుండా ఎలా నియంత్రించుకోగలుగుతున్నాడని నాకెప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది.

ఎందుకంటే, తీసిన సినిమాలు అంత బాగా తీస్తాడు మరి. అవి ‘మొహబ్బతే’ లాగ ఆడకపోయినా, ‘రబ్‌నే బనాదీ జోడీ’లాగా ఆడినా అతని తీతలో మాత్రం తేడా ఉండదు. ‘తడి’ ఉంటుంది. అది తెర నుంచి మనలోకి నేరుగా ప్రవహిస్తుంది. తడుముతుంది. అలాంటి ఒక భావో ద్వేగాల, అనుభూతుల ప్రయాణమే ‘రబ్‌నే బనాదీ జోడీ’.  ‘పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి’ అని అనుకున్న రోజుల నుంచి ‘పెళ్లి జరగడం, భూలోకంలో నరకంతో సమానం’ అను కునే రోజుల దాకా సమాజం చాలా మారిపోయింది.

అటువంటి పరిస్థితుల్లో దేవుడు చేసిన జోడీ లాంటి పాత చింతకాయ పచ్చడిని కొత్తగా వడ్డించా లనుకోవడం ఒక దుస్సాహసం. దాన్ని షారుక్ లాంటి అగ్రహీరోతో ప్లాన్ చేయడం, అది కూడా ఒక బోరింగ్ భర్త పాత్రలో... ఇంకో దుస్సాహసం. అయినా ఆదిత్య చోప్రా ఈ సినిమా తీయడానికి సాహసించడం వెనుక నాకు కొన్ని కారణాలున్నాయని అనిపించింది.

భారతీయ సమాజంలో ఎంత ఆధునికత బైటకి కనపడినా, లోపల ‘కన్వెన్షనల్ థింకింగ్’ అలాగే గూడు కట్టుకుని పోయి ఉండడం మొదటి కారణం. షారుక్ లాంటి హీరో మీద,  తన కాంబినేషన్లో కేవలం 22 కోట్ల బడ్జెట్‌లో సినిమా అయిపోగలిగే కథ, కథనాలుండడం రెండో కారణం. అంటే, సినిమా అట్టర్ ఫ్లాపయినా తీసినవాళ్లు, కొన్నవాళ్లు నష్టపోరు ఈ బడ్జెట్‌కి. అనుష్కశర్మ లాంటి అందమైన అమ్మాయిని మొదటిసారి హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం కాబట్టి, కుర్రకారుని అట్రాక్ట్ చేయగలం అన్న ధీమా ఇంకో కారణం.

మొత్తమ్మీద సినిమా రిలీజై, థియేటర్‌లో కూర్చుంటే... రెండో ‘రాజ్‌కపూర్’ (షారుక్) అదర గొట్టేశాడు. ప్రేక్షకుడికి ఆ పాత్ర ఎక్కడం అన్నదాన్నే నమ్మి సినిమా తీసినట్టు అనిపించింది. సుఖ్వీందర్‌సింగ్ ‘హాలే హాలే’ అని, రూప్‌కుమార్ రాథోడ్, శ్రేయాఘోషల్ ‘తుఝ్ మే రబ్ దిఖ్‌తా హై’ అని, సునిధి చౌహాన్, లభ్‌నూజీ ‘డాన్స్‌పే ఛాన్స్’ అని పాడే స్తుంటే వాళ్ల మధురమైన గొంతులతో, గమకాలతో, పాత్రల మధ్య మనమూ లీనమైపోయినట్టు ఉంటుంది. సలీమ్-సులేమాన్ మ్యూజిక్‌తో చేసిన మ్యాజిక్ అది.
 
సురేందర్ సాహ్ని నా అన్నవాళ్లు లేని అనాథ. ఓ ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌లో చిరుద్యోగి. అతనికి ఒకడే బెస్ట్‌ఫ్రెండ్... బాబీ అని ఒక బార్బరు. చిన్న, మధ్య తరగతి ఇంట్లో నివాసం. సింపుల్ జీవితం. ఓసారి సురేందర్ తనకి చదువు చెప్పిన మాస్టరుగారి కూతురి పెళ్లికెళ్తాడు. ఆ కూతురే తానీని (అనుష్క). చలాకీగా గడగడా మాట్లాడుతూ, ఆడుతూ, పాడుతూ... చూడగానే ప్రేమించేయాలని పించేంత సరదాగా ఉంటుంది. ఆమె సూరిని చూడగానే ‘మీరేనా సూరి, మీవల్ల చిన్నప్పట్నుంచి ఎన్ని తిట్లు తిన్నానో, సూరిలా చదువుకో, సూరిలా మార్కులు తెచ్చుకో, సూరిలా క్రమశిక్షణగా ఉండు అని మా నాన్నగారు రోజూ తిట్టడమే’ అంటుంది. సూరి కళ్లల్లో గర్వం.

అంతలోనే ఓ విషాదం. పెళ్లి కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడన్న వార్త. కూతురి పెళ్లి ఆగిపోవడాన్ని తట్టుకోలేక మాస్టారికి గుండెపోటు వస్తుంది. తాను వెళ్లిపోతే తన కూతురు ఒంటరిగా మిగిలి పోతుందన్న భయంతో, ఆమెకు తోడుగా ఉండమని సురేందర్‌ని కోరతాడు. ఇద్దరినీ ఒక్కటి చేసి కన్నుమూస్తాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది.
 
జరిగిన విషాదం నుంచి తానీ బయట పడదు. సురేందర్‌ని భర్తగా అంగీకరించదు. దగ్గరవదు. మౌనంగా ఉంటుంది. వండి పెడుతుంది. ఇంటి పనంతా చేస్తుంది. అంతే తప్ప అంతకు మించి ఆమెలో అతడి పట్ల ఏ భావమూ ఉండదు. కానీ సురేందర్ మాత్రం ఆమెను పిచ్చిగా ప్రేమిస్తాడు. మనసులోనే ఆరాధిస్తాడు. ఆమెకు ఎలా దగ్గరవ్వాలా అని చూస్తుంటాడు.
 
అప్పుడే అతడికి ఓ అవకాశం దొరుకుతుంది. తానీ డ్యాన్‌‌స నేర్చుకోవాలని ఆశపడుతుంది. అందుకు అతడు అనుమతిస్తాడు. అయితే ఆమెకు దగ్గర కావాలన్న ఆశతో గెటప్ మార్చుకుని, మోడ్రన్ యువకుడిగా తయారయ్యి, రాజ్‌కపూర్ పేరుతో ఆమెకు డ్యాన్‌‌స పార్‌‌టనర్‌గా ఇన్‌స్టిట్యూట్‌లో చేరతాడు. భర్తగా దూరంగా ఉండిపోయినా స్నేహితుడిగా దగ్గరవుతాడు. ఆమె కోసం తనను తాను పూర్తిగా మార్చేసుకుని, ఆమె ఇష్టాలే తన ఇష్టంగా జీవించడం మొదలు పెడతాడు.

హీరో వేషాలేసి ఆమెని ఫ్లర్టింగ్ చేసి, ఆమెతో తిట్లు తిని,  ఆమెకి మంచి ఫ్రెండై, ఆమెని కాసేపు కన్‌ఫ్యూజ్ చేసి చివరికి తనతో ప్రేమలో పడేలా చేస్తాడు. లేచిపోదాం అంటాడు. ఇక్కడ్నుంచి ఆమె అంతర్మథనాన్ని ఎంతో అందంగా చిత్రీకరించాడు ఆదిత్య చోప్రా. నిజానికి తానీ అతనితో ప్రేమలో పడదు. పడబోయి ఆగిపోతుంది. స్నేహం దగ్గరే ఫుల్‌స్టాప్ పెడుతుంది. తన భర్తలో తనకు దేవుడు కనబడుతున్నాడని ముఖమ్మీదే చెప్పేస్తుంది. దాంతో అతడు కాంపిటీషన్ ఫైనల్స్‌కి రాడు.

అయినా ఫర్వాలేదు అని ఓటమిని అంగీకరించే సమయంలో ఆమె భర్త ఎంటరవుతాడు.  అద్భుతంగా డ్యాన్‌‌స చేస్తాడు. ఆ క్రమంలో ఆమెకి అర్థమౌతుంది... తన భర్త, ఆ యువకుడు ఒక్కరేనని. తన ప్రేమ కోసం అతడు మరో వ్యక్తిగా మారి తనకు చేరువయ్యాడని తెలుసుకుంటుంది. కన్నీళ్లతో భర్తకి అంకితమైపోతుంది.
 భగవంతుడి లీలా వినోదంలో ప్రతి అమ్మాయికీ ఓ రాజ్‌కపూర్ కావాలని ఉంటుంది. తొంభై తొమ్మిది శాతం మందికి సూరిలు దొరుకుతారు.

తెగిస్తే విడాకులతో జీవితాలు పాడైపోతాయి. బరి తెగిస్తే రాజ్‌కపూర్‌తో సెటిలైపోయి గుణహీనులౌతారు. సూరిని అర్థం చేసుకునే సంస్కారం ఒకళ్లకో ఇద్దరికో ఉంటుంది. కానీ, ఆ సంస్కారాన్ని బైటకి తెచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత మాత్రం సూరిదే అవుతుంది. రాజ్‌కపూర్‌లా భార్యని సుఖపెట్టాలని, చేరువ అవ్వాలని కష్టపడే ప్రతి సూరి... భార్య పాలిట హీరో అవుతాడు. ఇది చాలామంది మగాళ్లకి సంసార జీవితంలో భార్యల పట్ల ఉండాల్సిన బాధ్యతల పాఠం.

చాలామంది ఆధునిక ,ఆదర్శ వివాహిత స్త్రీలకి భర్త పట్ల ఉండవలసిన దృక్పథాల పాఠం. కమర్షియల్ సినిమాల్లో కుదిరినట్టు సడన్‌గా వేషాలు మార్చి నాటకం ఆడేయడం నిజ జీవితంలో కుదరని పనే అయినా, వేషం స్థానే మనిషి తనవారి కోసం కొంచెం మారినా, 22 శాతం మార్పుకి 180 శాతం సుఖాన్ని, సంతోషాన్ని పొందడం ఖాయమని రబ్‌నే బనాది జోడీ చూస్తే మనకర్థమౌతుంది.
 
అసలీ సినిమా గురించి చెప్పుకున్నప్పుడు ఆదిత్య గురించి ఎంత చెప్పుకుంటామో... షారుక్ గురించి కూడా అంతే చెప్పుకోవాలి. పాత తరహా దుస్తులు, మీసకట్లు, నూనె పూసిన తల కట్టు... అసలు రొమాంటిక్ హీరో షారుక్ ఇతనేనా అన్నంతగా సూరి పాత్రను ఆకళింపు చేసుకున్నాడు. అంతలోనే రాజ్ కపూర్‌గా తన సహజమైన స్టయిల్‌ను ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నాడు. కాబట్టి ఈ చిత్ర సక్సెస్‌లో ఆదిత్యది సగభాగమైతే, షారుక్‌ది సగభాగం. ఆదిత్య చోప్రాలో ఆదిత్య అనే సగం పేరు నాకున్నందుకు నా తర్వాతి సినిమాల నుంచీ నీలో సగమైనా నేనాలో చిస్తానని కంకణం కట్టుకున్నానయ్యా చోప్రా... థాంక్యూ సో మచ్.             
- వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు

మరిన్ని వార్తలు