మీసంపెంగ వాసనలు!

12 Mar, 2016 22:53 IST|Sakshi
మీసంపెంగ వాసనలు!

హ్యూమర్
మీసాలకూ... కవులకూ ఒకింత దగ్గరి సంబంధం ఉంది.  దీనికి చాలా దృష్టాంతాలూ, బోల్డన్ని తార్కాణాలూ ఉన్నాయి. దాదాపు మీసాల్లోని కేశాలెన్నో ఈ దృష్టాంతాలూ అన్నే ఉన్నాయని కవులనూ, మీసాలనూ నిశితంగా పరిశీలించిన వారు అంటుంటారు. ఉదాహరణకు తిరుపతి వెంకట కవులిద్దరూ కూడబలుక్కొని మీసాలు పెంచారు. ‘సినిమాలకు హాలీవుడ్ హీరోలెలాగో, కావ్యాల్లో కవులలాగ. వాళ్లకు మీసాలెందుకు’ అంటూ కొందరు పెద్దలు కోప్పడ్డారు. అప్పుడు సదరు జంటకవులు కాస్తా పద్యంతో బదులిచ్చారు.

‘మేమే కవీంద్రులమని తెల్పడానికి మీసాలు పెంచాం. రోషం కలిగిన వాళ్లెవరైనా మమ్మల్ని గెలిస్తే ఈ మీసాలు తీసి మీ పద సమీపాలలో ఉంచి, మొక్కుతాం. కాబట్టి దుందుడుకుగా ఇలా మీసాలు పెంచాం’ అంటూ మీసాలెందుకు పెంచుతున్నారంటూ అడిగిన వాళ్లను కవిత్వంలో నిరసించారు. ‘మీకు దిక్కున్న చోట చెప్పుకోఫోండి...’ అన్నట్టుగా పద్యంతో ఫెడీ ఫెడీమని కొట్టి చెప్పారు.
 
కాస్త వయసు మీరాక ఈ బాడీ జాడీలోని జీవితప్పచ్చడికి మొదట ఉన్నంత  టేస్టు ఉండదు. ఈ లోతైన ఫిలాసఫీని చాలా తేలిక మాటల్లో తెలిపాడు శ్రీశ్రీ. ‘మీసాలకు రంగేస్తే యౌవనం వస్తుందా... సీసా లేబుల్ మారిస్తే సారా బ్రాందీ అవుతుందా’ అన్నాడాయన. అంటే యుక్త వయసులోనూ.. ముదిమిలోనూ మీసం ఈక్వలే అయినా ఆ తర్వాతి సీక్వెల్‌లో అవి తెల్లబోతాయనీ... తద్వారా తదుపరి దశలో తెల్లబడి వెలవెలబోతాయనీ  తేటతెల్లం చేశాడు. ఆ విషయం గుర్తెరిగిన జ్ఞాని కాబట్టే ఆయన మీసాలు పెంచలేదు.
 
చౌడప్ప అనే మరో కవి... ‘మీసాలూ-అవి పెంచాల్సిన వారి లక్షణాలూ’ అనే అంశం మీద పద్యం రాశాడు. ‘ఇవ్వగల, ఇప్పించగల అయ్యలకే మీసాలుండాలనీ, మిగతావాళ్లకు ఉన్నా అవి పెద్ద లెక్కలోకి రావ’ని కరాఖండీగా చెప్పాడు. మీసాలు ఎవరికి ఉండాలి, ఎవరికి ఉండకూడదు అనే అంశాన్ని నిమ్మకాయ నిలబెట్టిన మీసమంత పవర్‌ఫుల్‌గా చెబుతూ... ‘ఆ మాటకొస్తే రొయ్యకు లేవా బారెడు’ అంటూ మిగతా మీసగాళ్లను అలా తీసిపడేశాడు. అత్యద్భుత కావ్యాలు రాసి... తన పద్యాలతో పండిత-పామరులతో ‘వన్స్‌మోర్’ అంటూ జేజేలు చెప్పించుకున్న జాషువా గారికి తన మీసాల పట్ల మోజు ఎక్కువ.   

ఒకసారి ప్రముఖ రచయిత, చిత్రకారుడూ, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సంజీవ్‌దేవ్‌గారు జాషువాను చూసి ‘ఇంతటి గుబురు మీసాలు లేకపోతే మీరు ఇంకెంత అందంగా ఉండేవారో కదా’ అన్నార్ట. వెంటనే జాషువా గారు తన వేళ్లతో ఒకసారి ఆ మీసాలను పైకి దువ్వుతూ, గట్టిగా నవ్వుతూ ‘నాలో కవిత్వం లేకపోయినా సహించగలను. కానీ మీసాలు లేకపోతే మాత్రం  సహించ లేను’ అన్నార్ట. జాషువా గారు తన ఇష్టాన్ని అంత పవర్‌ఫుల్‌గా చెప్పారని అంటారు సంజీవ్‌దేవ్ గారు ‘కవి, మనీషి, జాషువాతో’ అనే తన వ్యాసంలో.

జాషువా వంటి మహానుభావుడు మీసాలకు అంత ప్రాధాన్యం ఇచ్చాడంటే కవిత్వం కంటే బలమైనది ఏదో మీసాల్లో ఉండే ఉంటుందని ఆ మీస వ్యాస రత్నాకరాన్ని పరిశీలిస్తే మనకు తెలిసి వస్తుంది. అలాంటి జాషువాగారు  వృద్ధాప్యంలో పక్షవాతం వచ్చి మాట్లాడలేకపోయేవారట. ఎవరైనా వచ్చి ‘కవిగారూ... ఎలా ఉన్నారు’ అని పలకరిస్తే... హుందాగా మీసం తిప్పి తాను మానసికంగా దృఢంగా ఉన్నానంటూ బదులిచ్చేవారట. అంటే సదరు పలుకుతో వచ్చే జవాబు కంటే మీసం దువ్వడం ద్వారా ఇచ్చే ఆన్సరే బలమైనదని తెలియడం లేదూ.

‘మెలిదిరిగిన మీసాలను సవరించుకుంటూ జాషువా కవిగారు కలియదిరుగుతుంటే చూస్తున్నవారికి శ్రీనాథ మహాకవి తలపునకు రాకమానడు’ అనుకుంటూ ఆయన మీసాలను తలచుకుంటూ ఉంటారు ఆయనతో కలిసి తిరిగినవారు.
 అంతెందుకు... ‘వియన్నా సులోచనాలూ, స్విట్జర్లాండు రిస్ట్ వాచి, ఫారెన్ డ్రస్, ఫ్రెంచి కటింగు మీసాలును,  ఫారిన్ ఫ్యాషన్ లేనిచో...’ సొంత పెళ్లాలయినా మొగుణ్ణి పెద్దగా లెక్కచేయరని మృత్యుంజయ శతకం వంటి మహాద్భుత రచనలు చేసిన మాధవపెద్ది సుందరరామశాస్త్రి అనే కవిగారు మీసాల గొప్పదనాన్ని సెలవిచ్చారు.
 
‘మీసము పస మగ మూతికి’ అంటూ ఒక పక్క ఒక కవి అంటున్నా... ఇంకెవరో అజ్ఞాత కవి అధిక్షేపణ పూర్వకంగా పవర్‌ఫుల్‌గా తిడుతూ... ‘మింగ మెతుకు లేదు... మీసాలకు సంపెంగ నూనె’ అనే సామెతను పుట్టించాడు. ఇంచుమించూ ఇలాంటి అర్థమే వచ్చేలా ‘అంబలి తాగే వాడికి మీసాలెత్తే వాడు ఒకడు’ అంటూ మరొకరు  కాస్త గట్టిగానే కోప్పడ్డాడు. అంటే... మన పస తెలియజేయడానికి మీసాలు పెంచవచ్చు... కావాలంటే వాటికి సంపెంగ నూనె కూడా రాసుకోవచ్చు గానీ... మొదట ఉదర పోషణ జరగాలనీ, ఆ తర్వాతే మీస పోషణకు రావాలని సామెతలు సృష్టించిన ఆయా ప్రజాకవుల భావం.

ఎవరేమనుకున్నా క్యాలెండర్ అన్నాక మాసాలూ... మగాడన్నాక మీసాలూ ఉండి తీరాల్సిందేనని కొందరు పురుషపుంగవుల అభిప్రాయం. కానీ పెంపుడు జంతువుల్లాగానే వాటినీ దువ్వుడానికే తప్ప మరో ఉపయోగం లేదని క్లీన్‌షేవోత్తములు వాకృచ్చుతూ ఉంటారు. పోనీ మీరూ పెంచరాదా అంటే... ‘ఎందుకు పెంచం’ అంటారే తప్ప గబుక్కున పెంచలేరు. మెయింటెనెన్స్ ఎక్కువ కాబట్టి అలా క్యాట్‌ఫిష్షుల్లా ‘మీనమీసాలు’ లెక్కబెడుతూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు.
 - యాసీన్

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

శంకర విజయం-4

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?