కాలం మింగిన నెమలిగుడ్డు

11 Sep, 2016 01:36 IST|Sakshi
కాలం మింగిన నెమలిగుడ్డు

కథ
పొద్దు ఇంకా పొడవక పోయినా.. అంతటా వెలుగు వ్యాపించిన ఉదయపు వేళ- గలగల పారుతున్న కొండవాగు వెన్నెల రాత్రి అనర్గళంగా కథలు చెప్పే బామ్మలా ఉంది. వాగుకు ఎగువన ఉన్న దట్టమైన అడవి మాత్రం ఎవరూ విప్పలేని పొడుపుకథలా ఉంది. వాగుకు పడమరన కొంచెం దూరంలో వనకన్యలు తీర్చిన బొమ్మల కొలువులా ఉంది ఆ పల్లె. డెబ్భయ్యోపడిలో ఉన్న వృద్ధుడూ, పాతికేళ్ళ వయసుండే యువకుడూ భుజాలపై తువాళ్ళతో వడివడిగా వాగు దిక్కుకు వస్తున్నారు. యువకుడు ఏదో చెపుతుంటే వింటున్న వృద్ధుడి ముఖంలో- విత్తూచేనూ, అదునూ పదునూ, నీరూసారం అన్నీ కుదిరి విరగపండిన పంటలా కుతూహలం. కథ చెపుతూ.. చెపుతూ బిగువు కోసమో, గుక్క తిప్పుకోవడానికో ఆగే బామ్మల్లాగే యువకుడు కొంతసేపు మౌనం వహించాడు.
 
‘‘చెప్పు.. చెప్పు.. అప్పుడేమైంది?’’ బామ్మ గడ్డం పట్టుకుని బలంగా తనవైపు తిప్పుకునే మనవడిలాగే.. ఆ వృద్ధుడు నడక ఆపి, యువకుడి భుజం పట్టి లాగాడు. తన ప్రశ్నకు జవాబిచ్చే వరకూ అడుగు ముందుకు వెయ్యనివ్వనన్నట్టు ‘‘మధ్యలో ఆపేశావేం.. చెప్పరా బాబూ! స్నానానికి తొందరేముంది గానీ, ముందు కథ పూర్తి చెయ్యి’’ అన్నాడు. యువకుడు మందహాసం చేస్తూ ‘‘తాతా! మరి అప్పుడేమైందంటే..’’ అని క థ కొనసాగిస్తూ మళ్ళీ నడక మొదలు పెట్టాడు. తండ్రి చెయ్యి పట్టుకుని, కళ్ళింతలు చేసుకుని తిరణాలలో వింతలు చూస్తున్న పిలగాడిలా వృద్ధుడు మనవడి చెయ్యి పట్టుకుని వెంట నడిచాడు. వాగు చేరే సరికి మనవడు చెపుతున్న కథ పూర్తయింది.
 
‘‘శభాష్‌రా.. మనవడా! కథల కనకయ్య మనవడివనిపించావ్. కాదు, కాదు.. నేనే గాథల గోవిందు తాతనని గొప్పగా చెప్పుకునేలా చేశావు. ఇన్నేళ్ళుగా కథలు చెపుతున్నాను.. వాటిలో ఏ ఒక్కటీ ఇప్పుడు నువ్వు చెప్పిన కథకు ఆమడ దూరాన నిలవలేదురా. మనుషుల బతుకుల్లోని అన్ని రసాలనూ, అనుభూతులనూ, వాళ్ళ జీవితాల్లోని అనూహ్యమైన మలుపులనూ, వాళ్ళ మనసుల్లోని రాగాలనూ ఇంత గొప్పగా చెప్పిన వాళ్ళెవరూ లేరన్నది ఈ వాగు పల్లానికి ప్రవహిస్తుందన్నంత నిఖార్సైన నిజం. ఉంటే గింటే ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ భగవంతుడే కావాలి’’ మనవడిని వాటేసుకుని మురిసిపోయాడు.
 
స్నానం ముగించుకుని, వాగు ఒడ్డు ఎక్కుతున్న ఓ వృద్ధుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు : ‘‘ఏంటయ్యా.. తాతామనవలు మాంచి జోరు మీదున్నారు. కొత్త కథేమైనా కట్టారా.. ఏమిటి?’’
 ‘‘ కథల కనకయ్యగా మీరంతా నన్ను మెచ్చుకుంటుంటారు. నిజం చెప్పాలంటే ఇంతవరకు నేను మీకు చెప్పిన కథలన్నీ వీడిప్పుడు నాకు చెప్పిన కథ ముందు- మహారణ్యం ముందు పెరటి మొక్కల్లాంటివే. నా బాటలోనే వీడూ కొన్నేళ్ళ నుంచి కథలు చెపుతున్నా, అవి నవరసాలతో నిండి ఉంటున్నా.. వీడిలో కల్పనాచాతుర్యం, వర్ణనా ప్రతిభ ఈ స్థాయిలో ఉన్నాయని నేనే ఊహించలేకపోయాను. వీడిప్పుడు చెప్పిన కథలో వసంతకాలంలో విరబూసిన వెయ్యి అరణ్యాల పరిమళాలున్నాయి. అంతకు మించిన వన్నెలున్నాయి’’ మెరిసే ముఖంతో మనవడిని చూస్తూ చెప్పుకుపోతున్నాడు కనకయ్య.
 
‘‘అదంతా సరే.. నీ మనవడు ఆ గొప్ప కథని ఆనక రచ్చబండ దగ్గర వినిపిస్తాడు కదా?’’ దుర్గయ్య అడిగాడు.
 ‘‘పొద్దుటిపూట కుదరదు దుర్గయ్యా! మా వాడికి పొలంలో తీరిక లేని పనుంది. ఊళ్ళో అందరికీ చెప్పు.. గోవిందు చెప్పే గొప్ప కథ వినాలంటే రాత్రికి రచ్చబండ దగ్గరకు రమ్మను’’ మురిసిపోతూ చెప్పాడు కనకయ్య.
 ‘‘వాడైతే పొలం వెళతాడు. మరి, నువ్వు చెప్పొచ్చుగా.. రాత్రి వరకూ ఆగడం ఎందుకు?’’
 ‘‘అబ్బే.. అలా కుదరదు. వాడు కట్టిన గొప్ప కథ వాడి నోటి నుంచి వింటేనే మజా’’ అన్నాడు కనకయ్య.
 ‘‘అలాగే.. వాడి నోటి నుంచే వింటాంలే..’’ అంటూ దుర్గయ్య ఊరి దిక్కుకు నడిచాడు. తాతామనవలు వాగులో దిగారు.
   
మీనాపురంలో రెండు వందల గడప ఉంటుంది. అమ్మవారి జాతరప్పుడూ, వేణుగోపాలస్వామి కళ్యాణమప్పుడూ ప్రదర్శించే నాటకాలూ, బుర్రకథలూ, తోలుబొమ్మలాటలూ, పర్వదినాల్లో హరికథలూ, మధ్య మధ్య కోలాటాలూ, భజనలూ, పురాణ కాలక్షేపాలూ, అప్పుడప్పుడూ సంచార జీవులైన జంగాలు చెప్పే కథలూ, పగటి వేషధారుల వేషాలూ.. ఇవే ఆ పల్లెలో వినోదాలు. అలాంటి పల్లెలో ఏడాది పొడవునా ఎండని వాగులా కనకయ్య కథాస్రవంతి అన్ని రుతువుల్లో కొనసాగుతూ ఉంటుంది. కథకుడిగా కనకయ్య ప్రస్థానం అతడి నూనూగు మీసాల ప్రాయంలో ప్రారంభమైంది.

ఓరోజు అతడు పెద్దవాళ్ళతో కలిసి కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. బాగా తెలిసిన మనిషే అయినా ముఖానికి రంగు వేసుకుని, వైవిధ్యభరితమైన వస్త్రధారణతో రంగస్థలంపై అభినయిస్తున్నప్పుడు గుర్తించలేనట్టు-అడవి అతడికి నిత్యం కొత్త వన్నెలతో, కొత్త కవళికలతో అపరిచితంగా కనిపిస్తుంది. అడవిని తమకంతో చూస్తూ మిగిలిన వారికి ఎడంగా వెళ్ళిపోయిన కనకయ్య అది గుర్తించే సరికే చాలా దూరం వచ్చేశాడు. వాళ్ళ కోసం వెతికీ వెతికీ నీరసం రావడంతో ఓ చెట్టు నీడన పడుకున్న అతడికి గాఢంగా నిద్ర పట్టేసింది. నిద్రలో అతడికి అందమైన కలొచ్చింది. ఆ కలలో అతడు ముళ్ళను ఖాతరు చేయని గాలిలా ఆ కీకారణ్యంలో దట్టమైన పొదలలోకీ చొచ్చుకుపోయాడు.

పులులపై స్వారీ చేశాడు. ఏనుగుల తొండాలపై ఊయలలూగాడు. గండభేరుండ పక్షి రెక్కలనెక్కి మబ్బుల్ని తాకాడు. చిత్రవిచిత్రమైన జంతువులు, పక్షులతో వాటి భాషలోనే సంభాషించాడు.  మేలుకునే సరికి పొద్దు పడమటికి వాలవచ్చి అడవిలో వెలుగు క్రమంగా తరుగుతోంది. కల ఇచ్చిన ఆనందానుభూతితో కనకయ్య ముఖం మాత్రం పున్నమి వేళ తేట నింగిలో జాబిలిలా వెలిగిపోతోంది. తిరిగి తోటి వారిని చేరుకునేందుకు తోచిన దారిలో ముందుకు సాగాడు. చీకటి పడేలోగా వాళ్ళు కనబడకపోతే తన పరిస్థితి ఏమిటన్న ఆందోళన కన్నా తన అనుభవాన్ని వాళ్ళకు చెప్పాలన్న ఆరాటమే అతడిలో అధికంగా ఉంది. కాసేపటికి వాళ్ళు తారసపడ్డారు.
 
‘‘ఇంతసేపూ ఎక్కడకు పోయావురా కనకయ్యా! నీ కోసం వెతకలేక చచ్చామనుకో!’’ వాళ్ళలో ఒకడు నిరసనగా అన్నాడు.
 కనకయ్యకు ఎందుకో కొంటెతనం వచ్చింది. ‘‘నేను పోవడమేమిటి.. వాళ్ళే నన్ను తీసుకు వెళ్ళారు’’ నిబ్బరంగా చెప్పాడు.
 ‘‘వాళ్ళెవర్రా?’’
 ‘‘ఎవరేమిటి.. వనదేవతలు. వాళ్ళ ఇళ్ళకు తీసుకుపోయి ఎంత మర్యాద చేశారో తెలుసా..!
 ‘‘మరీ ఇంత ఆనబకాయ కోతలేంట్రా బాబూ!’’ మిగిలిన వాళ్ళు ఎకసెక్కెం చేశారు.
 ‘‘కోతలు కాదు.. నేను చెపుతున్నది జరిగిందే’’ ఏ మాత్రం తొణక్కుండా చెప్పాడు కనకయ్య.
 
‘‘సరే..సరే.. ఊళ్ళోకి పోతూ ఆ కథే చెపుదువు గానీ’’ అంటూ అందరూ కట్టెలమోపులు తలలకెత్తుకున్నారు.
 తనకొచ్చిన కలకు తన కల్పనాశక్తిని జోడించి, కలలోని దృశ్యాలన్నింటినీ గుదిగుచ్చి సుదీర్ఘమైన ఒకేకథగా మలచి చెప్పాడు కనకయ్య. విరుపులతో, నొక్కులతో, వర్ణనలతో, చిన్నిచిన్ని విరామాలతో కనకయ్య కథ చెపుతుంటే తమ తలలపైనున్నవి బరువైన కట్టెల మోపులు కాక పూలకిరీటాలన్నట్టు అలసట తెలియకుండా నడిచారు వాళ్ళంతా.  కథ పూర్తయిందని కనకయ్య అన్న మరుక్షణం వాళ్ళందరిలో పెద్దవాడైన వ్యక్తి మోపును అమాంతం కింద పడేసి కనకయ్యను వాటేసుకున్నాడు.
 
‘‘ఒరే కనకయ్యా! ఎంత బాగా చెప్పావురా కథ. ఎక్కడ అబ్బిందిరా నీకీ కళ?’’ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.
 ‘‘అదిగో మళ్ళీ కథ అంటావ్.. నేను జరిగిందే చెపుతున్నానన్నానా’’ రుసరుసలాడాడు కనకయ్య.
 ‘‘నువ్వు చెప్పింది నిజమేనని ఒప్పుకుంటాను. అది సరే గానీ.. ఇలా అడవికి వచ్చినప్పుడల్లా నువ్వు మాకో కథ చెప్పరాదటరా? పది పుట్ల కట్టెలైనా పూచికపుల్లల్లా మోసేస్తాం’’ పెద్దవ్యక్తి అడిగాడు.
 కనకయ్య కథన చాతుర్యం పల్లె పెద్దల చెవిన పడింది. గ్రామాధికారి నుంచి అతడికి కబురు వచ్చింది. ఓరోజు మధ్యాహ్నం రావిచెట్టు మొదలు చుట్టూ ఉన్న రచ్చబండపై గ్రామాధికారీ, పెద్దలూ కనకయ్యతో కథ చెప్పించుకున్నారు. అడవి నుంచి ఊరికి వచ్చే దారిలో తోటి వారికి చెప్పిన కథకే మరికొన్ని మలుపులు జోడించాడు కనకయ్య.

అతడు కథ చెపుతున్నంతసేపూ- రచ్చబండ చుట్టూ అర ఎకరం విస్తీర్ణంలో పరుచుకున్న రావిచెట్టు నీడ నీడలా కాక హరివిల్లులా కనిపించింది వింటున్న వారందరికీ. ముగ్ధుడైన గ్రామాధికారి ‘‘ఇప్పటి నుంచీ వీడు ఉత్త కనకయ్య కాదురా.. కథల కనకయ్య’’ బిరుదు ప్రదానం చేసేశాడు. తాను చెప్పింది కథ అనడంపై పెద్దలతోనూ విభేదించాడు కనకయ్య. ఇప్పటికీ తాను తొలిసారి చెప్పింది కథ కాదు.. తన అనుభవమేనంటుంటాడు. తన మాటను పల్లెలో ఎవరూ నమ్మడం లేదని అతడికీ తెలుసు. అయినా అతడికి అదో ముచ్చట.. అలా అంటూనే ఉంటాడు.

జనం కూడా దానికి తలూపుతూ అతడితో కొత్త కథలు చెప్పించుకుంటూనే ఉంటారు. అతడికి మనవడు గోవిందు తోడవడంతో పల్లెకు జంట కథకులు దక్కినట్టయింది. ఇప్పుడా పల్లె వారి బతుకులో- గాలిలో ప్రవహించే గుడిగంటల సవ్వడిలాగే, అడవి నుంచి ప్రసరించే సుగంధంలాగే, పల్లె జనుల దప్పిక తీర్చే తియ్యని వాగు నీటిలాగే తాతామనవల కథా కథనమూ భాగమైంది. తాతకు ‘కథల కనకయ్య’ బిరుదునిచ్చిన గ్రామాధికారే మనవడికి ‘గాథల గోవిందు’ అన్న బిరుదును ఇచ్చాడు.
   
జనం చెవులారా జుర్రుకున్న నవరసభరితమైన వందలాది కథలు చెప్పిన తాతామనవళ్ళ జీవితంలో శోకమే ప్రధానరసమైంది. గోవిందుకు పదేళ్ళ వయసప్పుడు కుటుంబమంతా ఎడ్లబండిపై కొండకు అవతల నాలుగు క్రోసుల దూరంలో ఉన్న ఊళ్ళో బంధువుల ఇంట జరిగే శుభకార్యానికి బయల్దేరారు. బండి కొండవాలు బాటలో వెళుతున్నప్పుడు కొండ పైనుంచి మృత్యువు ప్రయోగించిన ఫిరంగి గుండులా ఓ బండరాయి దొర్లుతూ వచ్చి బండి కాడిపై పడింది. బెదిరిన ఎడ్లు చిడత తాళ్ళు తెంపుకుని చెరోవైపూ దౌడు తీశాయి. గతి తప్పిన బండి లోయలోకి దొర్లింది.

ఆ పాటుతో కనకయ్య భార్య, కొడుకు, కోడలు బండలకూ, చెట్ల కొమ్మలకూ కొట్టుకుని మరణించారు. గోవిందును ఒళ్ళో కూర్చోబెట్టుకుని బండి తోలుతున్న కనకయ్య మనవడితో సహా ఓ గుబురుపొదపై పడడంతో ప్రాణాలు దక్కాయి. నెత్తుటి ముద్దలుగా మారి, కసాయి దుకాణంలో కోసి వేలాడదీసిన మేకల్లా చెట్ల కొమ్మలకు వేలాడుతున్న తమ వాళ్ళను చూసి తాతామనవలు బండలు పగిలేంత బిగ్గరగా రోదించారు. పల్లె పల్లంతా కదిలి వచ్చింది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కన్నీరు పెట్టుకున్నారు. వృద్ధులు తాతామనవళ్ళను అక్కున చేర్చుకున్నారు. ముగ్గురిని పోగొట్టుకున్న ఆ ఇద్దరికీ పల్లెలో అందరూ అయినవారేనని ఓదార్చారు. తాతామనవలు నెమ్మదిగా తేరుకుని పనిపాటుల్లో పడ్డారు.

అప్పటి వరకూ పల్లెజనమే వాళ్ళ ఆలనాపాలనా చూశారు. పిడుగు పడ్డ మడుగులో కలువలు పూయనట్టు- జరిగిన ఘోరంతో కనకయ్య ఇక కథలు చెప్పలేడని అందరూ భావించారు. అయితే- చేలో పెరిగిన కలుపులా తన హృదయంలో అలముకున్న దుఃఖాన్ని పెకలించడానికి కథలనే పనిముట్టుగా వాడుకున్నాడు. ఉబికి వచ్చే కన్నీటిని తుడిచేందుకు తన కల్పననే దస్తీగా వినియోగించుకున్నాడు. తాత నుంచి కనుముక్కు తీరునే కాదు- కథన కౌశలాన్ని పుణికి పుచ్చుకున్నానన్నట్టు- కాలక్రమంలో గోవిందు కూడా కనకయ్యకు దీటుగా కథలు చెప్పనారంభించాడు.
   
మధ్యాహ్నమైంది. కమ్మిన మబ్బుల వెనుక నుంచి మసకగా కనిపిస్తున్న సూర్యుడు ఎవరో దేవత కంటి నుంచి చెక్కిలి మీదకు జారి, అక్కడి నుంచి ఆమె చేలాంచలంపై రాలిన కన్నీటిబొట్టులా ఉన్నాడు. కనకయ్య పూరింటి అరుగుపై కొందరు వృద్ధులు చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. దుర్గయ్య కనకయ్యతో అన్నాడు : ‘‘మీ గోవిందు ఈరాత్రికి గొప్ప కథ చెప్పబోతున్నాడని నాకు కనిపించిన వాళ్ళందరికీ చెప్పేశాను. మిగిలిన అందరికీ చెప్పమని కూడా చెప్పాను. మీ వాడు పొలం పని చూసుకుని, రాత్రి బువ్వ తిని వచ్చేసరికే రచ్చబండ దగ్గర తిరణాలలాగే ఉంటుందనుకో’’
 
కనకయ్య ముఖంలో సంతోషం కదలాడింది. ఇంతలో దూరంగా కొందరు పొలాల వైపు నుంచి వడివడిగా రావడం కనిపించింది. మరికొంత దగ్గరకు వచ్చేసరికి వాళ్ళలో కొందరు ఓ మనిషిని చేతుల మీద మోసుకు వస్తున్నట్టు తెలిసింది. వాళ్ళు కనకయ్య ఇంటి ముందు ఆగి చేతుల మీద ఉన్న మనిషిని దించారు. అతడు గోవిందు. అప్పటికే అతడి ప్రాణం గాలిలో కలిసిపోయింది. మోసుకు వచ్చిన వాళ్ళు దుఃఖిస్తూ విషయం చెప్పారు. మధ్యాహ్నం వరకూ పొలం పని చేసి అలసిన గోవిందు బువ్వ తిని, ఓ చెట్టు నీడలో విశ్రాంతిగా పడుకున్నాడు. అలసి ఉన్నాడేమో అలాగే నిద్ర పట్టేసింది. ఆ సమయంలో పక్కనున్న పుట్టలోంచి తాచుపాము బయటకు వచ్చింది. నిద్రలో ఎలా కదిలాడో, ఏమైందో పాము గోవిందుని కాటేసింది. మెలకువ వచ్చిన గోవిందు కేకలు వేయడంతో పక్క పొలాల్లోని వారు వచ్చారు.

అతడిని ఊళ్ళోకి మోసుకు వస్తుంటే దారిలోనే ప్రాణం గాలిలో కలిసిపోయింది. చీకటి పడ్డాక పల్లెవాసులను రంగురంగుల ఊహల్లో ముంచెత్తే కథను చెపుతాడనుకున్న గోవిందు నోటి నుంచి తెల్లని నురగ వస్తోంది. వాకిట పడి ఉన్న మనవడి శవాన్ని చూస్తూ కనకయ్య హృదయం దుఃఖాన్నీ, కన్నులు చెమ్మనూ, పెదవులు రోదననూ కోల్పోయినట్టు శిలలా ఉండిపోయాడు. గోవిందు మృతదేహాన్ని చూసిన దుర్గయ్యకు రివాజుకు విరుద్ధంగా చిన్నపిల్లల కథకు చేదు ముగింపునిచ్చినట్టు అనిపించింది.
   
గోవిందు పెద్దకర్మ నాడు ఆ తతంగమంతా ముగిశాక దుర్గయ్యతో చెప్పాడు కనకయ్య : ‘‘నా మనవడు చెప్పకుండానే వెళ్ళిపోయిన కథను ఈరాత్రికి నేను చెపుతాను. పల్లెలో అందరికీ చెప్పు’’
 ‘‘ఇప్పుడెందుకులే కనకయ్యా! తర్వాత చెపుదువు గానిలే!’’ వారించాడు దుర్గయ్య.
 ‘‘లేదు.. ఆ కథ ను నేను ఈరోజే చెపుతాను’’ దృఢ నిశ్చయంతో అన్నాడు కనకయ్య.
 ‘‘సరే’’ అన్నాడు దుర్గయ్య.
 ఆ రాత్రి పున్నమి. చకచక కదిలే మబ్బుల నడుమ బిరబిరా సాగుతున్న జాబిలి మీనాపురం రచ్చబండను చేరుకోవాలని ఆరాటపడుతున్నట్టుంది. రచ్చబండ రావిచెట్టు- కనకయ్య చెప్పనున్న గోవిందు కథను ఆలకించడానికి భూమాత రిక్కించిన చెవిలా ఉంది.

ఊయలల్లోని బిడ్డలను ఎత్తుకున్న తల్లుల నుంచి అడుగు వేయడానికి శక్తి చాలని వృద్ధుల వరకూ పల్లె అంతా రచ్చబండను చేరుకుంది. పైలోకాలకు చేరిన గోవిందు నవ్వు తునకల్లా- రావిచెట్టు సందుల్లోంచి వెన్నెల తరగలు రచ్చబండ మీదున్న కనకయ్యను తాకుతున్నాయి. గొంతు సవరించుకుంటూ మొదలు పెట్టాడు కనకయ్య.  ‘‘నా మనవడు కట్టిన ఈ కథతో నా జీవితంలో నేను కట్టిన కథలన్నీ కలిపినా తూగవు. ఇంతకాలం మా కథలు విని ఆనందిస్తున్న మీరు ఈ కథనూ విని సంతోషిస్తేనే వాడి ఆత్మ శాంతిస్తుంది. ఇక కథ మొదలు పెడతాను..’’ అంటూనే.. చెట్టు నుంచి పండు రాలినట్టు రచ్చబండ అంచు నుంచి దబ్బున కిందకు కుప్పకూలిపోయాడు.

జనంలో రేగిన కలకలానికి చెట్టుపైనున్న గూళ్ళలోని పక్షులు బిలబిలా ఎగిరిపోయినట్టే కనకయ్య ప్రాణం గాలిలో కలిసిపోయింది. జనం కనుకొలుకు ల్లోంచి రాలిన నీటిబొట్లు నేలలో ఇంకిపోయాయి. గోవిందు కనకయ్యకు చెప్పిన కథ, కనకయ్య నుంచి ఇంకెవరూ వినలేకపోయిన కథ- కొండచిలువ మింగిన నెమలిగుడ్డులా కాలగర్భంలో కలిసిపోయింది. విశ్వరహస్యం లాంటి శాశ్వత అజ్ఞాతంలా మిగిలిపోయింది.
- యు.సూర్యచంద్రరావు (వి-రాగి)

మరిన్ని వార్తలు