నిజరూప దర్శన భాగ్యం

2 Oct, 2016 02:19 IST|Sakshi
నిజరూప దర్శన భాగ్యం

దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిజరూపంలో దర్శించుకునే భాగ్యం భక్తులకు గురువారం మాత్రమే దక్కుతుంది. ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత ఎలాంటి ఆభరణాలు, అలంకారాలు లేకుండా స్వామి నిరాడంబర స్వరూపంతో దర్శనమిస్తారు.
 
గురువారం నాటి దర్శనాన్నే నేత్రదర్శనం అని అంటారు. ఎలాంటి ఆభరణాలు లేకుండా కేవలం ధోవతి, పై వల్లెవాటు, మెడలో కంటెలు, నొసటన సన్నని నామం, బుగ్గన పచ్చకర్పూరపు చుక్క, తలకు చుట్టూ సొగసుగా చుట్టిన తలగుడ్డ (పరివీటం, పరివేష్ఠనం) తో నగుమోముతో దేదీప్యమానంగా దర్శనమిస్తాడు స్వామి.
 
ఆభరణాలే కాకుండా నొసటన పెద్దగా ఉండే పచ్చకర్పూరపు నామాన్ని (ఊర్థ్వపుండ్రాలు) బాగా తగ్గిస్తారు. ఆ రోజంతా భక్తులు శ్రీవారి నేత్రాలను దర్శించుకునే మహ ద్భాగ్యం కలుగుతుంది. ఆ రోజు ఆభరణాల బదులు 24/ 4 కొలతలు గల పట్టుధోవతి ధరింపచేస్తారు. 12/ 2 కొలతలతో పట్టు ఉత్తరీయాన్ని యజ్ఞోపవీతంగా అలంకరిస్తారు. స్వామివారి శిరస్సుపై కిరీటాన్ని తీసి ఒక పట్టువస్త్రాన్ని కిరీటం తరహాలో తలపాగాను చుడతారు.

మెడలో వక్షఃస్థల బంగారు అలమేలు మంగహారం అలంకరిస్తారు. స్వామికి బంగారు శంఖచక్రాలు, బంగారు కర్ణభూషణాలు, సాలిగ్రామ హారాలు అలంకరిస్తారు. కాళ్లకు కడియాలు, పాదాలకు బంగారు తొడుగులు అలంకరిస్తారు. ఇలా ద్వాపర యుగంలో నల్లని కృష్ణయ్యే వెంకటాద్రిలో గోవిందుడయ్యా అన్న రీతిలో దర్శనమిస్తారు. భక్తుల్లో కొందరికి తాము చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిందిగా హెచ్చరించినట్టుగా స్వామివారికి గోచరిస్తారు. గురువారం మాత్రం ఆలయంలోనే కాదు, తిరుమలలో కూడా ఏ చిన్న తప్పు చేయడానికి సిబ్బంది భయపడతారు.

మరిన్ని వార్తలు