తరాలు మారినా... సంప్రదాయాలు మారలేదు!

2 Oct, 2016 02:33 IST|Sakshi
తరాలు మారినా... సంప్రదాయాలు మారలేదు!

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు శ్రీవేంకటేశ్వర స్వామివారి కైంకర్యంలో ఎన్నెన్నో సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి.  ఉత్సవ ప్రియుడైన స్వామివారి బ్రహ్మోత్సవాల నిర్వహణలో భక్తులు వందలయేళ్లుగా ప్రత్యేక కానుక లు సమర్పిస్తూ తమ భక్తి ప్రపత్తులు చాటుతున్నారు. వీటిలో తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు మాలలు, చెన్నయ్ నుండి గొడుగులు, తెలంగాణ  రాష్ట్రంలోని గద్వాల సంస్థానం నుండి ఏరువాడ జోడు పంచెలు ప్రధానమైనవిగా పేర్కొనవచ్చు. వాటి విశేషాల గురించి తెలుసుకుందామా!!
 
తరాలుగా తిరుమలేశుని సేవలో చెన్నయ్ గొడుగులు

తిరుమలేశుని బ్రహ్మోత్సవాల సందర్భంగా  చెన్నయ్ (నాటి చెన్నపట్నం) నుండి గొడుగులు సమర్పించే సంప్రదాయం వందలయేళ్లుగా వస్తోంది. చెట్టియార్లు, హిందూధర్మార్థ ట్రస్టుతోపాటు ఎన్నెన్నో కుటుంబాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి.
 
నాడు దివిటీ వెలుగుల్లో...
సౌకర్యాలు అంతగా లేని నాటి రోజుల్లో దివిటీల వెలుగుల  ఎడ్లబండ్లు, కాలినడకన ఊరేగింపుగా తీసుకొచ్చేవారట. దశాబ్దమున్నరకాలంగా గొడుగుల సమర్పణలో అనేకరకాల వివాదాలు చోటు చేసుకోవటంతో తిరుమల ఆలయ మర్యాదలు లేకుండా కేవలం భక్తులు గొడుగులు సమర్పిస్తే తీసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ కారణంగా అనేకమంది భక్తులు శ్రీవారికి ఛత్రిలు సమర్పిస్తున్నారు. ఇందులో హిందూ ధర్మార్థ సమితి గత 12 ఏళ్లుగా గొడుగులు సమర్పించే కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తోంది.

* శ్రీవారి బ్రహ్మోత్సవం తొలిరోజు చెన్నయ్‌లోని చెన్నకేశవాలయం నుంచి 11 గొడుగులతో భక్తబృందం కాలినడకన బయలుదేరుతారు. తొలుత తిరుచానూరు అమ్మవారికి రెండు గొడుగులు సమర్పిస్తారు. తర్వాత గరుడసేవ రోజున ఆలయం వద్ద మరో 9 గొడుగులు సమర్పిస్తారు. స్వామివైభవం, దర్పానికి ప్రతీకగా ఆలయాల్లో గొడుగులను వాడే సంప్రదాయాన్ని వెయ్యేళ్ల క్రితమే భగవద్రామానుజులవారు ఆరంభించినట్టు చరిత్ర.
 
4 నుండి10 అడుగుల ఎత్తు వరకు...

శ్రీవారికి సమర్పించే గొడుగులను 4 నుండి 10 అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తారు. గరుడసేవ కోసం 10 అడుగులు, ఇతర వాహనాలకు 9 అడుగులు, సూర్య, చంద్రప్రభ వాహనాలకు 7.5 అడుగులు, బంగారు తిరుచ్చి వాహనాలకు 4 నుండి 6  అడుగుల ఎత్తులో తయారు చేస్తారు. ఇవి ఒక్కొక్కటి రూ.5 వేల నుండి రూ.50 వేల వరకు ధర పలుకుతాయి. వీటి అలంకరణకు వెండి కలశాలు, ఇతర సామగ్రి వాడతారు.
 
తరతరాలుగా గొడుగుల తయారీలోనే...
తిరుమలతోపాటు తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలకు గొడుగులు తయారు చేసే కుటుంబాలలో ప్రధానంగా చిన్నస్వామి షా కుటుంబాన్ని చెప్పొచ్చు  ఈయన పూర్వీకులది మహారాష్ర్టలోని  సౌరాష్ట్ర ప్రాంతం. వలసల ద్వారా చెన్నయ్‌లోని చింతాద్రిపేటలోని అయ్యామెదలువీధిలో స్థిరపడ్డారు. చిన్నస్వామి కుమారుడు స్వామి షా, మనుమలు గజేంద్రషా, సుబ్రమణి షా. ఈ కుటుంబ సభ్యులు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మూడు నెలల ముందు చెన్నయ్ ప్యారిస్‌లోని చెన్నకేశవ స్వామి ఆలయంలో పూజలు చేసి భక్తి శ్రద్ధలతో గొడుగుల తయారీపై దృష్టిపెడతారు.  

ఇలా తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ), మధుర మీనాక్షి, శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం, తిరువళ్లూరు వీర రాఘవస్వామి, కాంచీపురం వరదరాజస్వామి, చెన్నయ్‌లోని పార్థసారథి స్వామి ఆలయం, తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరుడు, అన్నవరం సత్యనారాయణ స్వామి, ద్వారకా తిరుమల, నెల్లూరు రంగనాథ స్వామి ఆలయాలకు కూడా వీరు గొడుగులు సమర్పించారు.
* పూర్వం వీటిని కాగితంతో తయారు చేసేవారట. తాజాగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ పద్ధతి, డిజిటల్, బోల్డ్ సిల్క్, ప్యూర్‌సిల్క్ పద్ధతుల్లో గొడుగులు సిద్ధమవుతున్నాయి. వాటిపై ఆయా ఆలయాల సంప్రదాయాలకు అనుగుణంగా వివిధ రకాల బొమ్మల అల్లికలు చేస్తున్నారు. ఊరేగింపులో ఉత్సవమూర్తి పక్కనే గొడుగులు ఉండేలా తయారీదారులు జాగ్రత్త పడతారు.
 
లోకకల్యాణం కోసమే గొడుగుల సమర్పణ

లోకకల్యాణం కోసం పదకొండేళ్ల్ల్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వందల కిలోమీటర్ల నుంచి కాలిబాటలో వీటిని తీసుకొస్తాం. మార్గంలో అడుగడుగునా పూజలు అందుకుంటాయి. ఈ గొడుగులు స్వామి వారికి సమర్పించటం వల్ల సకాలంలో వర్షాలు కురిసి, అందరూ క్షేమంగా ఉంటారని పెద్దల విశ్వాసం. ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమాన్ని దీక్షగా నిర్వహిస్తున్నాం. ఈ యజ్ఞానికి టీటీడీ యాజమాన్యం సంపూర్ణంగా సహకరిస్తోంది.
- ఆర్‌ఆర్. గోపాలన్
చైర్మన్, హిందూ ధర్మార్థ ట్రస్టు
 
మహద్భాగ్యం
తిరుమల వెంకన్నను దర్శించుకోవడమే మహాభాగ్యం. అటువంటి  స్వామికి మరింత దర్పాన్ని తీసుకొచ్చే గొడుగులను మా ఇంటి నుండి తీసుకు వెళ్లటం మహద్భాగ్యం... గర్వకారణంగా, పూర్వజన్మ సకృతంగా భావిస్తాం.
- గజేంద్రషా, చెన్నయ్
 
పూర్వజన్మ సుకృతం

ఈ భాగ్యం పూర్వజన్మసుకృతం. ఇంతకంటే ఆనందం లేదు. తిరుపతికి వెళ్లినప్పుడు స్వామి ఊరేగింపులో మా చేత తయారైన  గొడుగుల చూసి ఆనందించే క్షణాలు విలువ చెప్పలేము.
- సుబ్రమణి షా, చెన్నయ్
 
జగన్మోహనుడి అలంకరణలో శ్రీవిల్లిపుత్తూరు పుష్పమాలలు, చిలుక
ప్రతియేటా బ్రహ్మోత్సవం గరుడ రోజున శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి అమ్మవారికి అలంకరించిన పూలమాలలను తిరుమలేశునికి అలంకరించటం సంప్రదాయం.
 
గోదాదేవి  శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్రశాయి శ్రీమహావిష్ణువును శ్రీకృష్ణునిగా, తనను గోపికగా భావించి రోజుకొకటి చొప్పున నెల రోజులపాటు పాశురాలను గానం చేశారు. ఆమె నిష్కల్మష భక్తికి మెచ్చిన శ్రీరంగనాథుడు ఆమెను పరిణయమాడారు. నాటినుంచి గోదాదేవి (ఆండాళ్)గా ప్రసిద్ధి పొందారు 
దానికి గుర్తుగానే తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసంలో నెలరోజులపాటు సుప్రభాతం బదులు గోదాదేవి ‘తిరుప్పావై’ పఠిస్తారు. 
బ్రహ్మోత్సవం ఐదోరోజు అలంకార ప్రియుడైన మలయప్ప స్వామివారు మోహినీ రూపంలో శ్వేతవర్ణ పట్టు శేషవస్త్రం, శిఖపై కొప్పు, వజ్రాలు పొదిగిన బంగారు వాలు జడ, ఎదపై పచ్చలహారం, కుడిచేతిలో బంగారు చిలుకను, ఎడమవైపు శ్రీవిల్లిపుత్తూరు చిలుకను ధరించి ఆసీనులై జగన్మోహనాకారంగా భక్తలోకాన్ని సమ్మోహపరుస్తూ దివ్యమంగళరూపంలో దర్శనమివ్వటం సంప్రదాయం 
ఐదోరోజు రాత్రి ఉత్కృష్టైమైన గరుడవాహన సేవలో గర్భాలయ మూలవిరాట్టుకు అలంకరించే మకర కంఠి, లక్ష్మీహారం, సహస్ర నామమాల ధరించి మలయప్పస్వామి తనకు నిత్యసేవకుడైన గరుత్మంతుడిపై ఊరేగుతూ అశేష భక్తజనాన్ని అనుగ్రహిస్తారు. అదేసందర్భంగా గోదాదేవి పనుపున శ్రీవిల్లి పుత్తూరు ఆలయం నుండి వచ్చిన తులసిమాలలు అలంకరిస్తారు.

మరిన్ని వార్తలు