స్వామి సేవకు వేళాయెరా!

2 Oct, 2016 02:55 IST|Sakshi
స్వామి సేవకు వేళాయెరా!

* రెండువేల ఏళ్ళ చరిత్ర కలిగిన తిరుమలేశుని ఆలయంలో  అర్చక వ్యవస్థకు 1800 సంవత్సరాల చరిత్ర ఉంది.
స్వామి ఆత్మసాక్షాత్కారంగా విఖనసముని తొలిసారిగా పూజా కైంకర్యాలు నిర్వహించినట్టు ఐతిహ్యం. ఆ తర్వాత ఆలయంలో మొదటిసారిగా భరద్వాజ గోత్రానికి చెందిన గోపీనాథ్ దీక్షితులు వేంకటేశుడికి పూజాకైంకర్యాలు నిర్వహించారు. తర్వాత కౌశిక గోత్రానికి చెందిన శ్రీనివాస దీక్షితులు వచ్చారు. 1996 వరకు శ్రీవారి ఆలయంలో అర్చక మిరాశి వ్యవస్థ కొనసాగింది. ఆలయ వ్యవహారాలు, నగల రక్షణ బాధ్యత వీరి చేతుల్లోనే ఉండేది.

* 1977 నుంచి ప్రస్తుతం భరద్వాజ గోత్రంలో అర్చక పైడిపల్లి, అర్చక గొల్లపల్లి, కౌశిక గోత్రంలో అర్చక పెద్దింటి, అర్చక తిరుపతమ్మగారి అనే నాలుగు కుటుంబాలు శ్రీవారి ఆలయంలో అర్చక వ్యవస్థను కొనసాగిస్తున్నాయి.
 
* భరద్వాజ గోత్రానికి చెందిన అర్చక గొల్లపల్లి రమణ దీక్షితులు, పైడిపల్లి శ్రీనివాస నారాయణ దీక్షితులు, కౌశిక  గోత్రానికి చెందిన పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు, అర్చక తిరుపతమ్మగారి శ్రీనివాస నరసింహ దీక్షితులు  ఇప్పుడు శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తున్నారు.
 
* వీరు వేకువజామున 1గంటకు నిద్రలేస్తారు. చల్ల నీటి స్నానం చేసి మడికట్టుకుంటారు. ద్వాదశి ఊర్వపుండ్రాళ్లు (నామాలు) పెట్టుకుంటారు.
 
* అర్చక నిలయంలో కొలువైన విఖన స ముని వద్ద  ప్రార్థన చేస్తారు. సన్నిధి గొల్ల దివిటీ చేతబట్టి అర్చకులను ఆలయానికి తీసుకెళుతారు. జీయర్ ఆదేశాలతో సన్నిధి గొల్ల ఆలయ తలుపులు తీస్తారు. గోవింద గోవింద అంటూ అర్చకులు ఆలయ ప్రవేశం చేస్తారు.
 
* గర్భాలయంలో కైంకర్య పూజా విధులు నిర్వహిస్తున్నందున మూలమూర్తిపై ఎక్కడ నోటి గాలి, లాలాజలం పడుతుందో? అని శిరోవస్త్రం (నోటికి వస్త్రం కట్టుకుంటారు).

* జీయర్ ఇచ్చే పుష్పాలను స్వామికి అలంకరించి, హారతులు సమర్పిస్తారు. వారపు, పర్వదినాల్లో విశేష అలంకరణ చేస్తారు. వేకువజామున 2.30 గంటలకు సుప్రభాతంలో మేల్కొలుపు నుంచి తిరిగి అర్ధరాత్రి 1.30 గంటలకు పవళింపు (ఏకాంత) సేవ వరకు నిత్య కైంకార్యల్లోనూ అర్చకులు పాత్ర విశేషంగా ఉంది. ఇలా అర్చకులు స్వామి సేవకులుగా సపర్యలు చే స్తూ పరమానందం పొందుతున్నారు.
 

మరిన్ని వార్తలు