నేర్పండి... నేర్చుకుంటారు!

7 Dec, 2014 01:35 IST|Sakshi
నేర్పండి... నేర్చుకుంటారు!

ఒకప్పుడు స్కూళ్లు పది గంటలకు మొదలయ్యేవి. కానీ ఇప్పుడు ఏడున్నర, ఎనిమిది గంటలకే మొదలైపోతున్నాయి. ఆ సమయానికల్లా పిల్లల్ని తయారుచేసి పంపడం తల్లులకు కత్తిమీద సాముతో సమానం. అయితే మొదట్నుంచీ వాళ్లకి కొన్ని పద్ధతులు నేర్పిస్తే, ఈ సమస్య ఉండదు.
 
స్కూల్లో వేయడానికి కొన్ని రోజుల ముందు నుంచే పిల్లలను పొద్దున్నే లేపేయండి. ఆ సమయానికల్లా వారికి అలవాటైపోతుంది.  స్కూల్ బ్యాగుని రాత్రి హోమ్‌వర్క్ పూర్తవగానే సర్దిపెట్టుకోమనండి.  పొద్దున్న లేచి చేయాల్సిన పనుల గురించి పేపర్ మీద రాయండి. బాత్రూమ్‌కి వెళ్లాలి, బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, టిఫిన్ తినాలి ఇలా. ఆ చీటీని పిల్లల మంచం దగ్గర అతికించి, దాని ఫాలో అవమనండి. కొన్నాళ్లకు అలవాటైపోతుంది.  ప్రతిదానికీ ఇంత టైమ్ అని కేటాయించి, ఆ సమయంలో ఆ పనిని పూర్తి చేసి తీరాలని చెప్పండి.  మొదట్లో మీరే రెడీ చేసినా, మెల్లగా వారినే అవ్వమనండి.

యూనిఫామ్, షూ, టై, బెల్ట్ అన్నీ ఒకే చోట పెడితే వాళ్లు కన్‌ఫ్యూజ్ అవకుండా ఉంటారు.  చాలామందికి తెలియని విషయం ఏమిటంటే... పొద్దున్న లేవగానే పిల్లలకు నచ్చిన ఏదైనా పనిని చేయించాలి. డ్యాన్స్ ప్రాక్టీస్, నచ్చిన కార్టూన్స్ చూడటం, గార్డెన్ వర్క్, సైకిల్ తొక్కడం... ఏదో ఒకటి. ఎందుకంటే లేవగానే నచ్చిన పని చేయడం వల్ల వాళ్లు రోజంతా యాక్టివ్‌గా ఉంటారని పరిశోధనలో తేలింది.

>
మరిన్ని వార్తలు