ఆ వైరస్ సోకింది... చనిపోతానా?!

17 Apr, 2016 14:51 IST|Sakshi
ఆ వైరస్ సోకింది... చనిపోతానా?!

సందేహం
నా వయసు 22. ఇంకా పెళ్లి కాలేదు. నాకు అప్పుడప్పుడూ పిరుదుల్లో మంటలాగా వస్తోంది. కంటిన్యుయస్‌గా రావడం లేదు. వచ్చి ఆగుతోంది. తగ్గిపోయిందిలే అనుకుంటే మళ్లీ వస్తోంది. మంటతో పాటు దురద కూడా ఉంటోంది. బాగా నడిచినప్పుడు ఎక్కువగా అలా అవుతోంది. ఒక్కోసారి మోషన్‌కి వెళ్లాక కూడా నొప్పి, దురద వస్తాయి. మోషన్‌లో బ్లడ్ కానీ, వెళ్లేటప్పుడు నొప్పి కానీ లేవు. ఎందుకిలా వస్తోందో అర్థం కావడం లేదు. నెల రోజుల్నుంచీ యూరిన్ ఇన్ఫెక్షన్‌కి యాంటీ బయొటిక్స్ వాడుతున్నాను. వాటివల్ల ఇలా అవుతోందా? ఇప్పుడు నేనేం చేయాలి?
 - లోహిత, మెయిల్

 
మీరు ఎంత బరువు ఉన్నారు, చదువు కుంటున్నారా లేక ఉద్యోగం చేస్తున్నారా అనేవేవీ రాయలేదు. ఎందుకు అడుగుతున్నానంటే... ఉద్యోగరీత్యా గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు. అధిక బరువు ఉన్నవారు ఇలా గంటల తరబడి కూర్చునే ఉంటే... ఒక్కోసారి పిరుదుల్లోని నరాలు ఒత్తుకుని, మంటగా తిమ్మిరిగా అనిపించవచ్చు. మరికొంత మందికి కూర్చునే ఉండటం వల్ల గాలి ఆడక చెమట పట్టడం, పిరుదుల చర్మంపై మంటగా ఉండటం జరగవచ్చు. కొన్నిసార్లు వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా మంట, దురద వచ్చే అవకాశం ఉంటుంది.

నెల నుంచి యాంటీ బయొటిక్స్ వాడటం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గి, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడి, మంట దురద వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మోషన్‌కి వెళ్లాక మంట, దురద వస్తున్నాయి అంటున్నారు కాబట్టి మోషన్‌లో నులి పురుగులేమైనా ఉండవచ్చు. లేదా మోషన్ ఫ్రీగా రాకపోవడం వల్ల కూడా అలా జరగవచ్చు. పరీక్ష చేస్తేనే ఏదైనా చెప్పగలం. కాబట్టి మీరు ఓసారి డాక్టర్‌ని సంప్రదిస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ మరేదైనా సమస్య కానీ ఉందేమో చూస్తారు. కడుపులో నులి పురుగులు ఉన్నాయా అనేది కూడా పరీక్షించి చికిత్స చేస్తారు.
 
నాకు పెళ్లై మూడు నెలలు అవుతోంది. ఈ మధ్యనే నాకు హెర్పిస్ సింప్లెక్స్ 2 ఉందని తేలింది. రేపు నేను బిడ్డని కంటే ఈ వ్యాధి తనకి కూడా సోకుతుందా? ఈ వ్యాధి భవిష్యత్తులో క్యాన్సర్‌గా మారే అవకాశం ఉందా? నేనింకా ఎన్నేళ్లు బతుకుతాను? అసలు నేనేం ట్రీట్‌మెంట్ తీసుకోవాలి?
 - రమ, మెయిల్

 
కేవలం వైరల్ ఇన్ఫెక్షన్‌కే చావుదాకా ఎందుకు ఆలోచిస్తున్నారు? హెర్పిస్ సింప్లెక్స్ 2 అనేది హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ 2 వల్ల వస్తుంది. దీనివల్ల జననేంద్రియాల వద్ద, తొడల వద్ద చిన్న చిన్న నీటి పొక్కులు వస్తాయి. వాటివల్ల అక్కడ దురద, మంట ఉంటాయి. మూత్రం పోసినప్పుడు మంట ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా కలయిక ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. దీన్ని నిర్ధారించడానికి క్లినికల్ ఎగ్జామినేషన్‌తో పాటు అవసరమైతే HSV2 Igg, Igm antibodies రక్తపరీక్షలు చేయాలి. అలాగే నీటిపొక్కుల నుంచి Swab తీసి మైక్రోస్కోపిక్ టెస్ట్‌కి పంపించవచ్చు. మీకు  HSV2 నిర్ధారణ అయ్యింది కాబట్టి మీరు, మీవారు కూడా డాక్టర్ పర్యవేక్షణలో acyclovir, valacyclovir  అనే యాంటీ వైరల్ మందులు, క్రీములు వాడి చూడండి.

పొక్కులు పూర్తిగా తగ్గిపోయేవరకు కలయికకు దూరంగా ఉండండి. కొందరిలో ఈ పొక్కులు వాటికవే మాడిపోతాయి. అయితే ఈ వైరస్ చాలావరకూ నరాల్లో దాగి ఉంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు, మానసిక ఆందోళన, ఒత్తిడి వంటివి కలిగినప్పుడు మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చికిత్స కరెక్ట్‌గా తీసుకోవాలి. ఇది దీర్ఘకాలిక వ్యాధి కాదు. క్యాన్సర్‌గా మారే అవకాశాలూ లేవు. ఓసారి ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా మూడు వారాల్లో HSV యాంటీ బాడీస్ తయారవుతాయి.

వీటివల్ల మళ్లీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పైన చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో మళ్లీ వచ్చినా... తీవ్రత తక్కువగా ఉంటుంది. గర్భం దాల్చినా బిడ్డకు సోకే అవకాశాలు ఉండవు. గర్భంతో ఉన్నప్పుడు కనుక HSV2 ఇన్ఫెక్షన్ వస్తే... అది వ్యాధి తీవ్రతను బట్టి బిడ్డకు సోకే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనవసరంగా ఆలోచించి భయపడకుండా మీరు, మీవారు మంచి చికిత్స తీసుకోండి.

- డా.వేనాటి శోభ
లీలా హాస్పిటల్, మోతీనగర్,హైదరాబాద్

మరిన్ని వార్తలు