క్యాన్సర్‌కు ఆన్సర్‌!

3 Jun, 2017 23:51 IST|Sakshi
క్యాన్సర్‌కు ఆన్సర్‌!

నేడు క్యాన్సర్‌ సర్వైవర్స్‌ డే
క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత మంచిది. అప్పుడే తగిన చికిత్సకు ఆస్కారం ఉంటుంది. క్యాన్సర్‌ ఒక మాయదారి జబ్బు. ఒక్కోసారి ఎలాంటి లక్షణాలూ కనిపించకపోయినా ఒంట్లో ఎక్కడో మారుమూల నక్కి ఉంటుంది. అందుకే ఎలాంటి లక్షణాలూ లేకపోయినా, పూర్తి ఆరోగ్యంగా ఉన్నా ఒంట్లో క్యాన్సర్‌ ఉందో లేదో తెలుసుకోవడానికి అప్పుడప్పుడు స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవడం మంచిది. క్యాన్సర్‌లో కొన్ని రకాలు కేవలం మహిళల్లోనే కనిపిస్తే, ఇంకొన్ని కేవలం పురుషుల్లో మాత్రమే కనిపిస్తాయి.

మరికొన్ని రకాల క్యాన్సర్‌ స్త్రీ పురుష భేదం లేకుండా అందరిలోనూ కనిపిస్తాయి. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు అందరికీ అంత అవసరం కాకపోయినా, రకరకాల కారణాల వల్ల క్యాన్సర్‌ సోకే అవకాశాలు గల రిస్క్‌ గ్రూపులకు ఈ స్క్రీనింగ్‌ పరీక్షలు చాలా అవసరం. ఎవరెవరు రిస్క్‌ గ్రూపుల్లోకి వస్తారో, ఏయే రకాల క్యాన్సర్లకు ఎలాంటి స్క్రీనింగ్‌ పరీక్షలు అవసరమో అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌ నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం...

మహిళల్లో  మాత్రమే...
సర్వికల్‌ క్యాన్సర్‌: సర్వికల్‌ క్యాన్సర్‌కు ముందు సుదీర్ఘమైన ప్రీ–క్యాన్సర్‌ దశ ఉంటుంది. అందువల్ల దీనిని పదేళ్ల ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రతి మహిళా పాతికేళ్ల వయసు దాటాక  పాప్‌స్మియర్‌ టెస్ట్‌ అనే సాధారణ పరీక్ష చేయించుకోవడం మంచిది. ప్రీ–క్యాన్సర్‌ లక్షణాలేవీ లేకుంటే ప్రతిమూడేళ్లకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి. ప్రీ–క్యాన్సర్‌ లక్షణాలు ఉంటే తగిన చికిత్స పొందడం ద్వారా ఈ క్యాన్సర్‌ను నిరోధించవచ్చు.

రొమ్ము క్యాన్సర్‌
 రొమ్ము క్యాన్సర్‌ విషయంలో వయస్సుకూ వ్యాధికీ దగ్గరి సంబంధం ఉంది. అంటే... వయస్సు పైబడుతున్న కొద్దీ వ్యాధి వచ్చే అవకాశాలు అంతగా పెరుగుతుంటాయి.

రిస్క్‌ గ్రూప్‌ అంటే ఎవరెవరు?
 కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి వచ్చిన వారు, పిల్లలు లేని వాళ్లు, ముప్ఫయి ఏళ్లు దాటాక మొదటి బిడ్డను కన్న మహిళలు... వీరంతా రొమ్ము క్యాన్సర్‌కు రిస్క్‌ గ్రూప్‌. ఈ రిస్క్‌ గ్రూపులు చేయించాల్సిన పరీక్షలు మూడు. అందులో మొదటిది ఎవరికి వారే చేసుకునే రొమ్ము పరీక్ష. ప్రతి మహిళా తమ రుతుక్రమం ముగిసిన వారం తర్వాత ఎడమ రొమ్మును కుడి చేత్తో, కుడి రొమ్మును ఎడమ చేత్తో తాకుతూ పరీక్ష చేసుకోవాలి. ఫలితంగా రొమ్ములో ఏ చిన్నమార్పు వచ్చినా డాక్టర్‌ కంటే ముందుగా, తమకే అర్థమైపోతుంది. రొమ్ముల్లో తేడా ఏమైనా ఉంటే దాన్ని మీ డాక్టర్‌/గైనకాలజిస్ట్‌ దృష్టికి తీసుకెళ్తే అదేమైనా ప్రమాదకారా లేక మామూలు గడ్డా అన్నది చెబుతారు. మమోగ్రఫీ అనే మరో పరీక్షతోనూ రొమ్ము క్యాన్సర్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు.

మమోగ్రఫీ ఎవరికి అవసరం అంటే...
ముప్ఫయి ఏళ్లప్పుడు ఓసారి మామోగ్రామ్‌ చేయించాలి.
ఆ తర్వాత 35 ఏళ్లప్పుడు ఒకసారి, 40 ఏళ్ల వయసప్పుడు మరోసారి చేయించాలి.
40 ఏళ్లు దాటాక 50వ ఏటి వరకూ ప్రతి రెండేళ్లకోసారి చొప్పున చేయిస్తుండాలి.
50 ఏళ్లు వచ్చాక ఏడాదికోమారు చేయించడం మంచిది.
ఎక్కువ రిస్క్‌ ఉన్నవాళ్లకు డాక్టర్‌ సలహా మేరకు ఇంకా ముందుగానే ఈ పరీక్ష అవసరం కావచ్చు.

హైరిస్క్‌ గ్రూప్‌ వారికి...
కొందరిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ అని డాక్టర్లు అనుకుంటే... ఒక చిన్న రక్తపరీక్ష ద్వారా దాన్ని కనుక్కోవచ్చు. జన్యుపరీక్షల ద్వారా– బీఆర్‌సీఏ–1, బీఆర్‌సీఏ–2 అనే జీన్‌ మ్యూటేషన్స్‌ ఉన్నాయా లేవా అనే దాన్ని బట్టి వాళ్లకు రొమ్ము క్యాన్సర్‌ వచ్చేదీ రానిదీ తెలుసుకోవచ్చు.

పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌
వయసు పైబడ్డ పురుషుల్లో సాధారణంగా కనిపించేది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌. దీనిని ప్రొస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటీజెన్‌ (పీఎస్‌ఏ) అనే తేలికైన, చౌకైన పరీక్ష సాయంతో ముందుగానే గుర్తించవచ్చు. యాభై ఏళ్లు పైబడ్డ పురుషులు ఏటా చేయించుకోవాల్సిన పరీక్ష ఇది. ఇదేకాకుండా, మలద్వారం ద్వారా వేలితో చేసే డిజిటల్‌ రెక్టల్‌ ఎగ్జామినేషన్‌ (డీఆర్‌ఈ) అనే మరో పరీక్ష ద్వారా వైద్యులు ఈ వ్యాధిని ముందే కనుగొంటారు.తల నుంచి కాలివరకు తొలి దశలో గుర్తించేందుకు కొన్ని ప్రాథమిక లక్షణాలు...

తల భాగంలో...
ఈ క్యాన్సర్స్‌ నోరు, దవడ, నాలుక మీద లేదా చిగుళ్లలో ఎక్కడైనా రావచ్చు. ఎరుపు, తెలుపు రంగుల ప్యాచెస్‌ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు ఉన్నా క్యాన్సర్‌ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది. ఇక స్వరపేటిక ప్రాంతంలో అయితే స్వరంలో మార్పు. మెడ దగ్గరి లింఫ్‌ గ్రంధుల వాపు.

గొంతు భాగంలో...
దీన్ని ఓరో ఫ్యారింజియల్‌ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఉన్న అనుభూతి ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడంలో ఇబ్బంది.

కడుపులో...
కడుపులో క్యాన్సర్‌ ఉన్నట్లయితే పొట్టలో మంట,  పొట్టలో రక్తస్రావం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత కూడా కనిపించవచ్చు. దాంతో పాటు కొన్ని సార్లు కొంచెం తినగానే కడుపు నిండిపోయిన ఫీలింగ్‌. పేగుల్లో... మల మూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు రావడం జరుగుతుంది.
 
రెక్టల్‌ క్యాన్సర్‌లో...
మలద్వారం (రెక్టమ్‌) క్యాన్సర్‌ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న ఫీలింగ్‌ ఉంటుంది. దాంతో పాటు బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

ఒవేరియన్‌ క్యాన్సర్‌...
దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కింది భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి క్యాన్సర్‌ వస్తే ఒక్కోసారి ఏ లక్షణాలూ చూపించకుండానే ప్రమాదకరమైన పరిస్థితులకు తీసుకెళ్తుంది కాబట్టి దీన్ని ‘సైలెంట్‌ కిల్లర్‌’గానూ అభివర్ణిస్తుంటారు.

టెస్టిస్‌ క్యాన్సర్‌...
పురుషుల్లో వచ్చే ఈ క్యాన్సర్‌లో వృషణాల సైజ్‌ పెరగడం, దాన్ని హైడ్రోసిల్‌గా పొరబాటు పడి పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో అది సైజ్‌లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు ఎక్కువ.

చర్మ క్యాన్సర్‌...
చర్మ క్యాన్సర్‌ను ఏ,బీ,సీ,డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– బార్డర్‌ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ–కలర్‌ అంటే రంగు మారినా, డీ అంటే డయామీటర్‌... అంటే వ్యాసం (సైజు) పెరిగినా దాన్ని చర్మం క్యాన్సర్‌ లక్షణాలుగా భావించవచ్చు.

కిడ్నీ అండ్‌ బ్లాడర్‌ క్యాన్సర్స్‌...
మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం.

బ్లడ్‌ క్యాన్సర్‌...
రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి... బ్లడ్‌ క్యాన్సర్‌ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద పొడలాంటిది రావడం, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్‌ క్యాన్సర్‌ లక్షణాలు.  లింఫ్‌ గ్లాండ్స్‌ అన్నవి బాహుమూలాల్లో, దవడల కింది భాగంలో మెడకు ఇరువైపులా, గజ్జ్జల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్‌ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు.

బ్రెయిన్‌ క్యాన్సర్‌...
శరీరంలోని అన్ని భాగాలకు లాగే మెదడుకూ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలుంటాయి. తలనొప్పి, అకస్మాత్తుగా మతిమరపు రావడం, విషయాలు గుర్తుంచుకోకపోవడం, కొన్నిసార్లు సాంఘిక, సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు అవయవాలు చచ్చుబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

క్యాన్సర్‌ తొలిదశలో కనిపించే లక్షణాల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించినవే అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే తొలిదశలో తేలిగ్గా గుర్తిస్తే క్యాన్సర్‌ తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. లక్షణాలేవైనా కనిపిస్తే ఆందోళన చెందకుండా పరీక్ష చేయించుకొని అది క్యాన్సర్‌ కాదని నిర్ధారించుకొని నిశ్చింతగా ఉండండి.

పెద్దపేగు క్యాన్సర్‌... రిస్క్‌ ఫ్యాక్టర్లు
మహిళలకూ, పురుషులకూ వేర్వేరుగా వచ్చే క్యాన్సర్ల తర్వాత ఇద్దరిలోనూ కనిపించే సాధారణ క్యాన్సర్లూ, అవి వచ్చే రిస్క్‌ గ్రూప్‌ల వివరాలివి. ఈ కింద పేర్కొన్న రిస్క్‌ ఫ్యాక్టర్లు మీలో ఉంటే మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వారి సూచనల మేరకు స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి.

మలద్వారం, పెద్ద పేగు క్యాన్సర్‌... (కోలో రెక్టల్‌ క్యాన్సర్‌) ఇందులోని రిస్క్‌ గ్రూపులను లెవెల్‌–1, లెవెల్‌–2, లెవెల్‌–3, లెవెల్‌–4 అని నాలుగు దశలుగా విభజించవచ్చు. ఇందులో

లెవెల్‌–1: కుటుంబ చరిత్రలో ఈ రకం క్యాన్సర్‌ వచ్చిన రోగులున్నవారు.

లెవెల్‌–2: కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి ఉండి, 50 ఏళ్లు పైబడ్డవారు. ∙లెవెల్‌–3: 50 ఏళ్లకు ముందుగానే ఈ వ్యాధి వచ్చిన దగ్గరి బంధువులున్నవారు, వారితో పాటు మరో ఇద్దరు ముగ్గురికి ఈ వ్యాధి ఉంటే...∙లెవెల్‌–4: చాలా స్ట్రాంగ్‌ ఫ్యామిలీ హిస్టరీ, 50 పైబడి ఉండటంతో పాటు... చాలా దగ్గరి బంధువులు అంటే తల్లిదండ్రుల్లో ఒకరికి వ్యాధి రావడం...

లెవెల్‌–1 స్థాయి రోగులైతే... మలంలో ఏవైనా రక్తకణాలున్నాయేమో తెలుసుకునేందుకు చేసే ఫీకల్‌ అక్కల్ట్‌ బ్లడ్‌ టెస్ట్‌ అనే సాధారణ మలపరీక్ష 50 ఏళ్లు పైబడ్డవారిలో ఏడాదికోసారి చేయించాలి. వారికి సిగ్మాయిడోస్కోపీ విత్‌ రెక్టల్‌ ఎగ్జామినేషన్‌ అనే పరీక్షను ప్రతి ఐదేళ్లకు ఓసారి చేయించాలి.

లెవెల్‌–2 రోగులకు... పై పరీక్షలే. అయితే... అవి ప్రతి మూడేళ్లకోమారు చేయిస్తుండాలి. లెవెల్‌–3 రోగులకు... కొలనోస్కోపీతో పాటు డాక్టర్లు వేలితో చేసే డిజిటల్‌ రెక్టమ్‌ ఎగ్జామినేషన్‌ పరీక్షలను 35 ఏళ్లు దాటిన దగ్గర్నుంచి ప్రతి 3–5 ఏళ్లకు చేయిస్తుండాలి. దాంతో పాటు ఫీకల్‌ అక్కల్ట్‌  బ్లడ్‌ టెస్ట్‌ను 35 ఏళ్ల వయస్సు నుంచి ప్రతి ఏడాదీ చేయిస్తుండాలి.

లెవెల్‌–4 రోగులకు... కొలనోస్కోపీ పరీక్షతో పాటు డిజిటల్‌ రెక్టమ్‌ పరీక్షను 25 ఏళ్ల వయసప్పటి నుంచే ప్రతి 1–3 ఏళ్లకోమారు చేయిస్తుండాలి.

ఇటీవలే కొత్తగా మల పరీక్షలో ఒకరకమైన స్టూల్‌ డీఎన్‌ఏ పరీక్షతో పాటు, సీటీ కొలనోస్కోపీ అనే నొప్పి లేని వర్చువల్‌ కొలనోస్కోపీ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. వాటి వల్ల ఈ క్యాన్సర్లను చాలా ముందుగా తెలుసుకోవచ్చు.

క్యాన్సర్‌ను గుర్తించడానికి...  ∙తగిన కారణాల్లేకుండా బరువు తగ్గడం ∙ఆకలి తగ్గడం  ∙ఎడతెరిపి లేకుండా దగ్గు  lలింఫ్‌ గ్లాండ్స్‌ (చంకల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు  lఆయా అవయవాల్లోంచి రక్తస్రావం...  ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు తగిన పరీక్షలు జరిపించుకోవాలి.

ఇప్పుడు నయమయ్యే కేసులు ఎక్కువ..
గతంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన ప్రతి ఐదుగురు క్యాన్సర్‌ పేషెంట్లలో ఒకరు భారతీయుడు. కానీ ఇటీవల ప్రతి నలుగురిలోనే ఒకరు భారతీయుడు. అయితే క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి, ముందుగానే అరికట్టగల విషయంలో భారత్‌దే అగ్రస్థానం. కానీ దురదృష్టకరమైన అంశం ఏమిటంటే... దీన్ని ముందుగా గుర్తించలేకపోవడం కూడా ఇక్కడే జరుగుతోంది. ఇక సర్వైకల్‌ క్యాన్సర్‌ విషయానికి వస్తే... ముందుగా గుర్తిస్తే 40–50 శాతం సర్వైకల్‌ క్యాన్సర్లను చాలా సమర్థంగా నయం చేయవచ్చు.

 అంటే ముందుగా గుర్తించడమే చికిత్సకు కీలకం అన్నమాట. సర్వైకల్‌ వ్యాక్సిన్‌తో సర్వైకల్‌ క్యాన్సర్‌ను కలిగించే వైరస్‌ అయిన హెచ్‌పీవీ వైరస్‌ను తుదముట్టించడం సాధ్యమే. ఇందుకోసం 9–35 ఏళ్ల వయసు గల మహిళలు దీన్ని తీసుకోవాలి. హైదరాబాద్‌లోని అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ఈ వ్యాక్సిన్‌ అందించే సదుపాయం ఉంది. ఇక మా సంస్థలో ఉన్న  డిజిటల్‌ మామోగ్రామ్‌ అనేది రొమ్ము క్యాన్సర్‌ను చాలా నిర్దిష్టంగా, కచ్చితంగా గుర్తించగలదు.  హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్స్‌ విషయానికి వస్తే ముందుగా గుర్తిస్తే వీటిని కూడా కచ్చితంగా నయం చేయవచ్చు.
– డాక్టర్‌ ఎమ్‌. బాబయ్య,
కన్సల్టెంట్‌ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్,
మెడికల్‌ డైరెక్టర్‌


  స్టమక్‌ క్యాన్సర్‌...
దక్షిణ భారతదేశంలో ఇది చాలా సాధారణంగా కనిపించే క్యాన్సర్‌.  ఇది రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న హైరిస్క్‌ ఉన్నవారు ఎవరంటే...∙వయసు పైబడిన దశలో పర్నీసియస్‌ ఎనీమియా అనే ఒక రకం రక్తహీనతతో బాధపడేవారు. ∙గతంలో అల్సర్‌కు ఆపరేషన్‌ (గ్యాస్ట్రెక్టమీ) చేయించుకున్నవారు lఫెమీలియల్‌ అడెనోమేటస్‌ పాలిపోసిస్‌ అనే పాలిప్స్‌ ఉన్నవారు. ∙హెలికోబాక్టర్‌ పైలోరీ (హెచ్‌ పైలోరీ) అనే సూక్ష్మజీవి వల్ల ఇన్ఫెక్షన్‌ వచ్చినవాళ్లు... వీళ్లంతా కడుపులో క్యాన్సర్‌ కోసం తరచు డబుల్‌ కాంట్రాస్ట్‌ బేరియం పరీక్ష, ఎండోస్కోపీ చేయించుకోవాలి. lవాళ్లతో పాటు ఆహారంలో ఉప్పు ఎక్కువగా తినేవాళ్లూ, పొగతాగేవాళ్లూ, ఆహారంలో విటమిన్‌ ఏ, విటమిన్‌ సీ తక్కువగా తీసుకునేవారితో పాటు రబ్బరు, బొగ్గు పరిశ్రమల్లో పని చేసేవాళ్లు తరచు ఈ పరీక్షలు చేయంచుకోవాలి.

మస్క్యులోస్కెలెటల్‌ చికిత్సలతో కాళ్లూ, చేతులు పదిలమిప్పుడు...
ఇటీవల కాళ్లు, చేతులు, వెన్నెముకకు వచ్చే క్యాన్సర్లు పెరుగుతున్నాయి. దాదాపు 50 శాతం క్యాన్సర్‌ రోగుల్లో... వారికి ఉండే ఇతర క్యాన్సర్లు ఎముకలకూ వ్యాపించడం వల్ల ఈ పరిణామం చోటు చేసుకుంటోంది. అయితే ఈ చికిత్స విధానంలో వచ్చిన ఆధునాతనమైన పురోగతి వల్ల ఆ క్యాన్సర్లను తగ్గించడంతో పాటు... వ్యాధి వల్ల కాళ్లు, చేతుల్లో వచ్చిన నిర్మాణపరమైన అవకరాలను తగ్గించడం ఇప్పుడు బాగా సాధ్యమవుతోంది. రోగిని రక్షించుకోవాలంటే గతంలో కేవలం క్యాన్సర్‌ వచ్చిన కాలు లేదా చెయ్యి భాగాన్ని తొలగించాల్సి రావడమే మార్గంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ అగత్యం లేదు. ఇప్పటికి నా ఆధ్వర్యంలోనే 2500 మందికి పైగా రోగులకు మేం తగిన చికిత్స అందించి, క్యాన్సర్‌ను నయం చేయడమే కాకుండా అవయవాలు కోల్పోకుండా కూడా కాపాడగలిగాం. అందులో కేవలం ఐదు నెలల బాలుడు కూడా ఉండటం విశేషం.
– డాక్టర్‌ కిశోర్‌ బి. రెడ్డి, కన్సల్టెంట్‌ అండ్‌ చీఫ్‌ ఆఫ్‌ మస్క్యులో స్కెలెటల్‌ ఆంకాలజీ

ఇప్పటి శస్త్రచికిత్స పద్ధతులు అత్యంత అధునాతనం
క్యాన్సర్‌ చికిత్సల విషయంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న సరికొత్త శస్త్రచికిత్స విధానాలు, రేడియేషన్‌ చికిత్స, టార్గెట్‌ థెరపీ, జెనెటిక్‌ ప్రొఫైలింగ్‌ ద్వారా అందించే వ్యక్తిగత చికిత్సల ద్వారా గతంలో కంటే క్యాన్సర్‌ నయం కావడం అన్నది ఇప్పుడు చాలా ఎక్కువ.  దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్, హైబీపీ ఉన్నవారు చికిత్స తీసుకుంటూ నిశ్చింతగా ఉన్నట్లే వీళ్లూ ఉండవచ్చు.
– డాక్టర్‌ శ్రీనివాస్‌ జూలూరి,
కన్సల్టెంట్‌ అండ్‌ చీఫ్‌ ఆఫ్‌ సర్జికల్‌ ఆంకాలజీ  (మినిమల్‌ ఇన్వేజివ్‌ సర్జరీ)


నయం అయ్యాక అంతా నార్మలే!
కాస్తంత అప్రమత్తంగా ఉండి, ఏవైనా లక్షణాలను గుర్తించగానే వెంటనే తగిన పరీక్షలు చేయించుకోండి. ఎంత ముందుగా గుర్తించగలిగితే... క్యాన్సర్‌ అంత త్వరగా తగ్గుతుంది. అందుకే అవగాహనతో స్క్రీనింగ్‌ పరీక్షలు, త్వరగా కనుగొనడం, సమర్థమైన చికిత్స, ఆ తర్వాత అవసరాన్ని బట్టి డాక్టర్‌ సూచనల ప్రకారం ఫాలో అప్‌.. ఇవన్నీ ఉంటే క్యాన్సర్‌ పూర్తిగా దూరం చేసుకోవచ్చు. క్యాన్సర్‌ వ్యాధి సోకిన తర్వాత తగిన చికిత్స తీసుకుని, వ్యాధి తగ్గిన వారు... మిగతా  వ్యక్తులు మామూలు జీవితం గడిపినట్టే సాధారణమైన జీవితాన్ని గడపవచ్చు.
– డాక్టర్‌ అరుణ్‌ లింగుంట్ల,
కన్సల్టెంట్‌ ఆంకాలజిస్ట్‌


ప్రమాదం నుంచి బయటపడ్డ కొందరి ఉదాహరణలు
సుమిత్‌
సుమిత్‌ అనే పదేళ్ల బాలుడు కర్ణాటకలోని బీదర్‌కు చెందినవాడు. అతడికి అప్లాస్టిక్‌ అనీమియా అనే క్యాన్సర్‌ ఉందని తేలింది. దాంతో అతడికి అత్యవసరంగా ఎముక మూలుగ మార్పిడి శస్త్రచికిత్స చేయించాల్సి వచ్చింది. తండ్రి మల్లికార్జున ఎముక మూలుగ సరిపోలడంతో సుమిత్‌కు అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో శస్త్రచికిత్స నిర్వహించారు. అతడు ఇప్పుడు కోలుకుంటూ అందరు పిల్లల్లాగే సాధారణ జీవితం గడుపుతున్నాడు.

ఆర్కే...
ఆర్కే (పేరు మార్చాం) అనే చిన్నారి బి–అక్యూట్‌ లింఫోబ్లాస్టిక్‌ ల్యూకేమియా ఉన్నట్లు తేలింది. అతడికి ఆగష్టు 2016 నుంచి రెండుసార్లు కీమోథెరపీ, జనవరి, 2017లో అలోజెనిక్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అనే చికిత్సను అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించారు. ఇందుకోసం అవసరమైన స్టెమ్‌సెల్స్‌ను అతడి సోదరుడి నుంచి స్వీకరించారు. ఇప్పుడు ఆర్కే బాగా కోలుకుంటున్నాడు.

ఉమారాజు
ఉమారాజు 52 ఏళ్ల మహిళ ఒక మాజీ సైనికుడి భార్య. 2016 జులైలో తీవ్రమైన తలనొప్పి, ఫిట్స్‌తో ఆసుపత్రికి వచ్చే వరకు  పాటు చాలా మంచి జీవనశైలితో ఆరోగ్యంగా ఉండేవారు. లక్షణాలు కనిపించగానే బ్రెయిన్‌ టీబీ లేదా బ్రెయిన్‌ క్యాన్సర్‌ కావచ్చనే అనుమానంతో వెంటనే ఆమెను అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు తీసుకొచ్చారు. డాక్టర్లు ఆమెకు క్యాన్సర్‌ అని తేలింది. శస్త్రచికిత్స తర్వాత రేడియేషన్, కీమోథెరపీ ఇచ్చారు. ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితిలో ఎనిమిది నెలలు చాలా కష్టాలు అనుభవించిన ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. ఇప్పుడు స్వతంత్రంగా జీవిస్తూ అందరిలాగే హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు.

కౌశిక్‌
ఐదేళ్ల కౌశిక్‌కు తుంటి భాగంలో గడ్డ అయ్యింది. అది అక్కడి ఎముకను పూర్తిగా తినేసింది. మొదట ఆపరేషన్‌ చేసి తొలగించినా... ఆ తర్వాత అది మళ్లీ తిరగబెట్టింది. అతడికి అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో శస్త్రచికిత్స చేసి, గతంలో తుంటి భాగంలో తొలగించిన ఎముకను... కాలి నుంచి సేకరించిన ఎముకతో భర్తీ చేశారు డాక్టర్లు. ఇప్పుడు ఆ పిల్లాడు హాయిగా ఆడుతూ, పాడుతూ... ఆనందంగా మామూలు జీవితం గడుపుతున్నాడు.

మరిన్ని వివరాలకోసం...
అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్,
నల్లగండ్ల, శేరిలింగంపల్లి, హైదరాబాద్‌ – 500 019.
ఫోన్‌ : 040 6719 9999 / 9000900773
ఇ–మెయిల్‌ : contactus@americanoncology.com

మరిన్ని వార్తలు