కల్లమాటలే పలకొద్దు 

15 Mar, 2020 12:31 IST|Sakshi

కె. విశ్వనాథ్‌ గారి దర్శకత్వంలో వచ్చిన ‘నిండు హృదయాలు’ చిత్రంలో నేను బాల నటుడిగా నటించాను. చలం గారి చిన్నప్పటి పాత్ర వేశాను. అప్పటికి నా వయసు పది సంవత్సరాలు. నేను, రాజ్‌కుమార్, రాము, నేను ముగ్గురం నటించాం. మా ముగ్గురి మీద ‘ఒకటి రెండు మూడు విడివిడిగా ఉంటే ఒకటి రెండు మూడే/ఒకటి రెండు మూడు ఒకటై ఉంటే అది నూటా ఇరవై మూడు’ అనే పాట చిత్రీకరించారు. ఆ పాట వీనస్‌ స్టూడియోలో జరిగింది. గుమ్మిడిపూడి, తడ ప్రాంతాల్లో ఔట్‌డోర్‌ షూటింగ్‌ జరిగింది. ఈ పాటలో ఎంతో నీతి ఉంటుంది.  ‘కల్లమాటలే పలకొద్దు వద్దు అసలొద్దు/కుళ్లు పెంచుకుని బతకొద్దు/ వద్దు అసలొద్దు/పరువు చంపుకుని మనసు అమ్ముకొని బతికే బతుకు మనొకద్దు’ అంటూ మనిషి ఎంత మంచిగా జీవించాలో ఈ పాట నేర్పుతుంది. అప్పట్లో ఈ పాటలోని ఆంతర్యం మాకు తెలియదు. 

ఈ పాటంతా ఒక ఎత్తయితే, నా భుజం మీద కోతిని ఉంచుకుని నటించటం నాకు కత్తి మీద సామే. కోతి వలల్లొక ప్లస్‌ ఒక మైనస్‌ రెండూ ఉన్నాయి. భుజం మీద కోతి ఉండటం వలన కదలక్కర్లేదు. అయితే ముఖంలో భావాలు ప్రదర్శించటం, చేతుల కదలికలు, టైమింగ్‌ అన్నీ ఒకేసారి వచ్చేలా జాగ్రత్తపడాలి. కోతి నన్ను ఏమీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఎటువంటి ఇబ్బంది పడుకుండా నటించానంటే అది దర్శకులు కె.  విశ్వనాథ్‌ గారి గొప్పదనం. ఆయన రాయి చేత కూడా నటింపచేయగలరు.
మేం పిల్లలుగా ఉన్నప్పుడు రెండు చరణాలలో నటిస్తాం. ఆ పాటకు కోరియోగ్రఫీ విశ్వనాథ్‌ గారే చేశారు. చిన్న చిన్న మూమెంట్స్, క్లోజప్‌లు ఉంటాయి. మేం ముగ్గురం కలిసి ఆనందంగా గడుపుతూ, కష్టపడి డబ్బు సంపాదించటం మొదటి రెండు చరణాలలోను వస్తుంది. 
ఇంట్లో దీపం వెలిగిస్తూ ‘నల్లని చీకటి నెరగకపోతే/ తెల్లని వెలుగుకు విలువేది

ఆపదలన్నవి కలగకపోతే ఆనందానికి రుచి ఏది’ అంటూ రెండో చరణం సాగుతుంది. ఇందులోనూ విలువలు బోధించారు నారాయణరెడ్డిగారు.
మూడో చరణం ‘మాకు తెలుసును ఈ సంఘం/మంచిచెడ్డల రణరంగం/మనిషిమనిషిగా పురోగమిస్తే మంచికే అంతిమ విజయం’ వచ్చేసరికి మా పాత్రల్లో పెద్దవాళ్లు కనిపిస్తారు. 
నిండు హృదయాలు సినిమా టైమ్‌కే నేను 30 సినిమాలు చేసి ఉన్నాను. కాబట్టి నాకు ఇందులో నటించటంలో ఇబ్బంది ఏమీ ఎదురవ్వలేదు. 
ఈ పాటను సినిమా షూటింగ్‌ అంతా అయ్యాక షూట్‌ చేశారు. అప్పటికి నాకు కోతి అలవాటు పడింది. అందువల్ల పాటలో కోతితో నటించడానికి ఇబ్బంది కలగలేదు. కోతి ఏమీ చేసేది కాదు. కాని కుదురుగా ఉండేది కాదు. దానికి ఏవేవో గింజలు పెట్టేవాడిని. షూటింగ్‌కి రాగానే ముందు ఆ కోతిని అరగంట సేపు మచ్చిక చేసుకునేవాడిని. ఎంతైనా కోతిని నమ్మటానికి కుదరదు కదా.  దానిని నమ్మటానికి ఉండదు కదా. అందువల్ల బాగానే వచ్చింది. 
సంభాషణ: డా. వైజయంతి పురాణపండ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు