అపురూపం: తియ్యని స్వరానుబంధం

13 Oct, 2013 02:09 IST|Sakshi
అపురూపం: తియ్యని స్వరానుబంధం

లతామంగేష్కర్ - పి.సుశీల
 నైటింగేల్స్ ఆఫ్ ఇండియా.
 జాతి గర్వపడే కోయిలలు.
 ఒకరు ఉత్తరాన్ని ఏలితే ఇంకొకరు దక్షిణాది సంగతి చూసుకున్నారు.
 అనుకరణకు ఏమాత్రం వీలు కాని తియ్యటి గొంతులు వారివి.
 భాష ఉచ్ఛారణలో,  భావ ప్రకటనలో ఇప్పటివారికి వారే డిక్షనరీ!
 లతాజీకి సుశీలగారంటే ఎంతో అభిమానం.
 అలాగే సుశీలగారికి లతాజీ అంటే గురుభావం!
 గాత్రం రీత్యా, రూపం రీత్యా ఇద్దరికీ దగ్గర పోలికలు ఉండటంతో
 అక్కాచెల్లెళ్లలా అనిపిస్తారు.
 లతాజీ కూడా సుశీలగారిని తన నాల్గవ చెల్లెలుగా భావిస్తారు.
 చెన్నై ఎప్పుడొచ్చినా సుశీలగారిని చూడకుండా వెనుదిరిగేవారు
 కాదు లతాజీ.
 అలాగే బొంబాయి వెళితే లతాజీని
  కలవకుండా వచ్చేవారు కాదు సుశీల!

 
 ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ గాయిని... ఇలా వ్యక్తిగత అవార్డులను భారత ప్రభుత్వం 1969 నుంచి ఇవ్వడం ప్రారంభించింది. ప్రవేశపెట్టిన తొలి సంవత్సరమే జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా పి.సుశీలగారు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏవీయం అధినేత మెయ్యప్పన్ చెట్టియార్‌గారు చెన్నైలో సుశీలగారికి పెద్ద అభినందన సభ ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా లతామంగేష్కర్ విచ్చేశారు. తన సాటి గాయనికి దక్కిన ఈ గౌరవానికి లతాజీ పొంగిపోయి బొంబాయి నుండి ప్రత్యేకంగా వచ్చి సత్కరించడమే కాకుండా మరుసటిరోజు సుశీలగారి ఇంటికి వెళ్లి ఆమెకు బంగారు నెక్లెస్‌ను కూడా బహుకరించారు. అది ఆమె ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆ సందర్భంగా వారిద్దరూ కాఫీ తాగుతూ ముచ్చటించుకుంటున్న స్టిల్(పైన) అప్పటిదే.
 
 ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం సుశీలగారికి పద్మభూషణ్ ప్రదానం చేసిన సందర్భంలో తన మానసిక గురువు అయిన లతాజీ ఆశీస్సులు తీసుకోవడానికి బొంబాయి వెళ్లినప్పుడు వారిరువురూ కాఫీ సేవిస్తూ కబుర్లాడుకుంటున్న దృశ్యాన్నీ (కింది ఫొటో) చూడవచ్చు.
 
 సంవత్సరాలు మారాయి!
 కానీ వారి మధ్య సంబంధాలు మారలేదు!
 వారి అనుబంధం, స్వర బంధం అంత తియ్యనిదీ, చెరగనిదీ, తరగనిదీ కాబట్టే ఇన్నేళ్లయినా... ఎన్నాళ్లయినా అలా కొనసాగుతూనే ఉంది... ఉంటుంది!!
 - ఫొటోలు, రచన: సంజయ్ కిషోర్

మరిన్ని వార్తలు