శివమెత్తిన గంగ...

19 Aug, 2017 23:24 IST|Sakshi
శివమెత్తిన గంగ...

చరిత్ర...
విష్ణువర్ధనుని పట్టపురాణి అయిన శాంతల దేవి తనకు కుమారుడు కలగలేదనే కారణంతో ఈ పర్వతం మీదే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాన్ని ఆవిడ పేరుతోనే పిలుస్తారు. హొయసాల ప్రభువైన విష్ణువర్ధనుడు శివగంగ దేవాలయ పునరుద్ధరణకు కృషి చేశాడు. తరువాత ఏలుబడిలోకి వచ్చిన కెంపెగౌడ రెండు గాలిగోపురాలను నిర్మించాడు.

బెంగళూరుకు 34 మైళ్ల దూరంలో, తుముకూరు దగ్గర దక్షిణానికి రోడ్డు చిన్నదిగా చీలి, శివగంగ గ్రామం చేరుతుంది. దాబస్‌పేట్‌ రైల్వే స్టేషను నుంచి శివగంగ నాలుగు మైళ్ల దూరంలో ఉంది. ఈ పర్వతం... ఉత్తర దిక్కు నుండి శివలింగాకారంలో, తూర్పు దిక్కు నుంచి వృషభాకృతిలో, దక్షిణం నుంచి మహాసర్పంగా, పశ్చిమం నుంచి మహాగణపతి ఆకారంలో దర్శనమిస్తుంది. ఈ పర్వతం మీద అనేక నీటి బుగ్గలు, తటాకాలు, పెద్ద దేవాలయాలతో కూడిన గుహలు ఉన్నాయి. పురాణాలలో ఈ పర్వతాన్ని కకుద్గిరి అని పిలిచారు. కకుత్‌ అంటే ఎద్దు మూపురం అని అర్థం.ఈ శిఖరంపైన పరిశుద్ధమైన గంగాజలంతో నిండిన నీటిబుగ్గలున్న కారణంగా, ఈ పర్వతానికి శివగంగ అనే పేరు సార్థకమైనదని చెబుతారు. ఇక్కడి స్వామి గంగాధరేశ్వరుడు.

శివగంగ గ్రామం నుంచి పర్వత ప్రాంతం చేరుతుండగా మానవ నిర్మితాలైన నున్నటి మెట్లు కనిపిస్తాయి. మార్గంలో పెద్ద రాతితో మలచబడిన గణపతి విగ్రహం, నంది మంటపం, పాదెకల్‌ వీరభద్ర విగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం కనిపిస్తాయి. ఇక్కడ రెండు పెద్ద గుహలలో శివాలయం, అమ్మవారి ఆలయాలు దర్శన మిస్తాయి. రెండు ద్వారాలకు పైన ఉన్న రెండు గోపురాలలో తూర్పు గోపురం హొయసాల కాలం నాటిది, ఉత్తర గోపురం విజయనగర కాలంనాటిది.

 లోపలకు వెళ్తే గిరిజా కల్యాణ మంటపం, ఏక స్తంభాధారంగా ఉన్న నవరంగం కనిపిస్తాయి. నవరంగ దక్షిణ భాగం నుంచి గుహకు చేరుకోవాలి. గంగాధరేశ్వరుని ముఖ్య ఉత్సవమూర్తికి గంగాపార్వతీ మూర్తులు ఇరుపక్కల కనువిందు చేస్తాయి. ఆలయంలో శాసనాలతో నిండిన అనేక గంటలు ఉన్నాయి.  ఏటా జనవరిలో సంక్రాంతి రోజున, గంగాధరేశ్వరుడు, హొన్నమ్మదేవిల కల్యాణోత్సవం  జరుగుతుంది. కొండ శిఖరం మీద నుంచి జాలువారే గంగాజలంతో కల్యాణోత్సవంలో దేవతామూర్తులను అభిషేకిస్తారు.

గంగాధరేశ్వర శివలింగం దివ్యమైనది. ఈ లింగం మీద పూత పూయబడిన నెయ్యి మరుక్షణం వెన్నగా మారిపోతుంది. ఓషధీ శక్తుల కారణంగానే ఈ విధంగా జరుగుతోందని, ఈ వెన్న వల్ల అనేక రుగ్మతలు తగ్గుతాయని చెబుతారు. ఆలయ గుహకు ఉత్తరంగా మరొక చిన్న గుహాలయంలో హొన్నదేవి కొలువుతీరి ఉంది. కొద్దిగా ముందుకు వెళితే ఐదడుగుల ఎత్తులో అమ్మవారి విగ్రహం సాక్షాత్కరిస్తుంది. సాక్షాత్తు శంకరాచార్యులు ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని చెబుతారు. శ్రీచక్ర ప్రభావంతో హొన్నదేవి మహాత్మ్యం వృద్ధి చెందుతోంది.

 ఈ మందిరానికి పడమరగా గల పాతాళగంగ నీరు కొబ్బరినీళ్లలా మధురంగా ఉంటాయి. కొండ మీద చక్రతీర్థం, శంకరాచార్య తీర్థం, శంకర గుహ, శంకర పాద చిహ్నాలు, శంకరాచార్య విగ్రహం ఉన్నాయి. అగస్త్యేశ్వరునికి ప్రత్యేకం మందిరం ఉంది. మఠ సమీపంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దివ్యశక్తి ఉన్నట్లుగా చెబుతారు. సుబ్రమ్మణ్యేశ్వరునికి క్షీరాభిషేకం చేస్తుండగా, పాలు సర్పాకృతిలో దర్శనమిచ్చాయట. అంతేకాదు, ఈ స్వామిని కొలిచిన వారికి సంతానం కలుగుతుందని కూడా స్థానికులు చెబుతారు. వాలుగా ఉన్న ఒక కొండ శిఖరం మీద చెక్కిన నంది లేదా బసవన్న మూర్తి అద్భుత శిల్ప నైపుణ్యానికి ప్రతీక.

వెళ్ళే మార్గం... బెంగళూరు నుంచి దోబస్‌పేట వరకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. దోబాస్‌పేట నుంచి శివగంగ ఎనిమిది కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుంచి బస్సులు, టాక్సీలు నిత్యం అందుబాటులో ఉంటాయి. దోబస్‌పేట్‌ రైలు స్టేషన్‌ అతి సమీపంగా ఉంది. బెంగళూరు వరకు విమానంలో వచ్చి, అక్కడ నుంచి టాక్సీ లేదా మినీ బస్సుల ద్వారా పర్వతశిఖరం చేరుకోవచ్చు.

♦ ఇక్కడ వినాయకుని దేవాలయం, అగస్త్య తీర్థానికి సమీపంలో 108 శివలింగాలు ఉన్నాయి. శిఖరం మీద ఉన్న నంది విగ్రహాన్ని దర్శించుకోవడానికి వెళ్లేవారు తమ వెంట తప్పనిసరిగా మంచినీళ్లు ఉంచుకోవాలి. పైన చాలా వేడిగా ఉంటుంది.

♦ కొండ మీద గంగాధరేశ్వరుడు, స్వర్ణాంబ, శాంతేశ్వర, ఓంకారేశ్వర, రేవన సిద్ధేశ్వర, కుంభేశ్వర, సోమేశ్వర, ముద్దు వీరేశ్వర అనే అష్ట శివలింగాలు ఉన్నాయి.

♦ నంది వృషభ, మకర  వృషభ, మహిష బసవ, గారే బసవ, దొడ్డ బసవ, కొడుగళ్లు అనే బసవ అష్ట వృషభాలు, అగస్త్య తీర్థం, శంకర తీర్థం, కణ్వతీర్థం, కదంబ తీర్థం, మైథల తీర్థం, పాతాళగంగ, ఒలకల్లు తీర్థం, కపిల తీర్థం అనే అష్టతీర్థాలు ఉన్నాయి.
– డా. వైజయంతి

మరిన్ని వార్తలు