సర్వ సంపదల ప్రదాయిని

23 Oct, 2016 00:11 IST|Sakshi
సర్వ సంపదల ప్రదాయిని

 కొల్హాపూర్ మహాలక్ష్మి
   సకల ఐశ్వర్యాలు ఆమె చెంతే!
 సమస్త లోకాలు ప్రణమిల్లేది ఆమె చరణాల వద్దే!
 సర్వ సమ్మోహన ముగ్ధ మనోహర రూపంతో
 విలసిల్లే ఆ దేవతామూర్తి శ్రీ మహాలక్ష్మి.
 పాలసంద్రంలోన జనించి
 నారాయణుని వరించి
 నరులను తరింపజేసే లోకపావని
 అమరపురులను దాటి అవనికి ఏతెంచి
 కోరి కొలువున్న చోటు కొల్హాపురి.

 
 ‘దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం..’ అంటూ సమస్త లోకాలు కీర్తించే అమ్మ భౌతిక, ఆధ్యాత్మిక సంపదలకు, సమృద్ధి, తేజస్సు, జ్ఞానము, అదృష్టము, సంతానము, ధైర్యము మొదలైన లక్షణాలకు నిలయమైన విష్ణుపత్ని శ్రీమహాలక్ష్మి. అలాంటి అమ్మవారు నరులకు సకల ఐశ్యర్యాలను సిద్ధింపజేసేందుకు మహారాష్ట్రలోని సహ్యాద్రి కనుమలలో పంచగంగా తీరంలో కొల్హాపూర్  క్షేత్రంలో కొలువుదీరి ఉంది. సతీదేవి అష్టాదశ శక్తిపీఠాలలో కామ్యమోక్ష కారక పీఠంగానూ ఈ క్షేత్రం పేరుగాంచింది. ప్రళయకాలంలో కూడా లక్ష్మీనారాయణులు ఈ క్షేత్రాన్ని విడువకుండా ఇక్కడే ఉంటారని విశ్వాసం.
 
 అందుకే ఈ క్షేత్రానికి అవిముక్త క్షేత్రమని పేరు. ఈ ప్రాంతం జగన్మాత కుడిచేతిన ఉన్నది కాబట్టి ప్రళాయాతీతమైనదిగా ప్రతీతి. శ్రీమహాలక్ష్మి ఇక్కడ నివసించటం వలన శ్రీహరి నిరంతరం ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడని ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ ప్రాంతం అనేకమంది రుషులను, యోగులను, మహాపురుషులను ఆకర్షించి వారికి మోక్షకారకమైంది. త్రిమూర్తి రూపుడైన దత్తాత్రేయుడు ప్రతి మధ్యాహ్నం ఇక్కడ భిక్షకు వస్తాడని అనేక స్తుతులలో చెప్పబడింది. షిర్డీసాయి ఆరతులలో కాశీలో స్నానం, జపం, కొల్హాపూరులో భిక్ష అనే దత్తస్తుతి ఈ విశ్వాసాన్ని మరింత చాటుతుంది. అమ్మవారు చంపిన కొల్హాసురుడనే రాక్షసుడి పేరు మీదుగానే ఈనగరం వెలియడం ఈ ప్రాంత విశేషమని కథనం. మరాఠీయులు ప్రేమతో ‘అంబాబాయి’గా పిలుచుకునే శ్రీమహాలక్ష్మి ఆలయం కొల్హాపూర్‌కి ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం.  
 
 కలువపువ్వు ఆలయం
 మహారాష్ట్రలో కొల్హాపూర్ మహాలక్ష్మి, తుల్జాపూర్ భవాని, మహూర్ రేణుక, వణిసప్తశృంగిమాత ఇవి నాలుగూ మహిమాన్వితమైన శక్తిపీఠాలు. అయినా కొల్హాపూర్ మహాలక్ష్మికి అత్యంత  మహిమాన్వితమైన క్షేత్రంగా పేరు. అతి పురాతనమైన ఈ ఆలయం క్రీస్తుపూర్వం 4-5 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మితమై ఉండవచ్చని, క్రీస్తు శకం 7వ శతాబ్దంలో చాళుక్యరాజు కరణ్‌దేవ్, 8వ శతాబ్దంలో యాదవరాజులు పునర్నిర్మించారని ఇక్కడి శాసనాలు తెలుపుతున్నాయి. విశాల ప్రాంగణంలో నిర్మితమైన ఈ ఆలయం హేమాడ్‌పంత్ శైలిలో కనువిందు చేస్తుంది.
 
 నాలుగు దిక్కులా నాలుగు ముఖద్వారాలు ఉండగా గర్భాలయం 5 గోపురాల కింద ఉంటుంది. మధ్యలో ఒక గోపురం నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు.. పైన నుంచి చూస్తే తెల్లని కలువ పువ్వులా గోచరిస్తుంది. తూర్పు గోపురం కింద మహాలక్ష్మి, మధ్య కుమార మండపం, పడమర గణపతి, ఉత్తర దక్షిణ గోపురాల కింద మహాకాళి, మహాసరస్వతి కొలువుతీరి ఉన్నారు. ఉపాలయాలలో వెంకటేశ్వరస్వామి, నవగ్రహాలు, రాధాకృష్ణ, కాలభైరవ, వినాయకుడు, సింహవాహిని, తుల్జాభవాని తదితర దేవతలు కొలువుదీరి ఉన్నారు.
 
 ఆలయం ప్రాంగణంలో అమ్మకు అర్పించడానికి పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, పుష్పాలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాంగణంలోనే మేడి చెట్టు, దాని వెనుక భగవాన్ శ్రీధరులు స్థాపించిన దశావతార మూర్తులు, అమ్మవారు ఉంటారు. మరోపక్క ఖండోబా మందిరం, శివాలయం ఉన్నాయి. ప్రధాన ఆలయ తూర్పుద్వారం వైపు శేషశాయి మందిరం అష్టభుజాకారంలో అద్భుతంగా ఉంటుంది. ప్రాంగణంలోని అన్ని బయట గోడలపై సురసుందరీమణులు, నృత్య అప్సరసలు, చతుష్షష్టి యోగినులు నల్లని రాతిపై అద్భుతంగా చెక్కబడి ఉంటాయి.
 
 కాశీతో సమానమైన ప్రాశస్త్యం
 ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షించగా, నీటిలో మునిగిన కొల్హాపురి క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన చేతులతో పైకి ఎత్తినందువల్ల ఈ  క్షేత్రానికి ‘కరవీర’ క్షేత్రమనే పేరు వచ్చిందని కథనం. ఈ క్షేత్రంలో అధిష్టాన దేవత మహాలక్ష్మి కాగా, శివుడు నీరుగా, విష్ణువు రాయిగా, మహర్షులు ఇసుకగా, దేవతలు చెట్లుగా, మూడున్నర కోట్ల తీర్థాలు సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటారని, అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానమాచరిస్తే పంచ మహాపాతకాలు సైతం ప్రక్షాళనమవుతాయని పద్మ, స్కాంద, దేవీభాగవతాలు చెబుతున్నాయి.
 
 శివుని ఆనతి మేరకు అగస్త్యమహాముని కొల్హాపూర్‌లో మహాలక్ష్మిని, అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాని ఆ విధంగా క్షేత్రానికి కాశీతో సమానమైన ప్రాశస్త్యం గలదని స్థలపురాణం. ఈ నగరాన్ని ‘కోల్‌పూర్’, ‘కోల్‌గిరి’, ‘కోలదిగిరి పట్టణ్’ అని పిలిచేవారు. ‘కొల్లా’ అంటే లోయ’, ‘పూర్’ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రంలో విలసిల్లింది. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359వరకు శివాజీ పూర్వీకులు పాలించగా 17వ శతాబ్దిలో  ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రర్ధమానమైందని తెలుస్తోంది.
 
 అమ్మ మోమున సూర్యకిరణాల సొగసు
 గర్భగుడిలో అమ్మవారి విగ్రహం దాదాపు ఐదువేల ఏళ్లనాటిదని తెలుస్తోంది. అరఅడుగు చదరంగా ఉన్న వేదిక, రెండడుగల పీఠం మీద మూడడుగుల ఎత్తున ఉంటుంది అమ్మవారి మూర్తి. నాలుగు చేతులలో పండు, గద, డాలు, పానపాత్ర ధరించి ఉంటుంది. కిరీటంపై నాగపడగ, కింద శివలింగం, యోని ఆకారాలు ఉంటాయి. అందుకే ఈ మూర్తిని మూలప్రకృతిగా, విష్ణుమాయా స్వరూపిణిగా భావిస్తారు. వెలకట్టలేని ఆభరణాలతో అత్యంత అందంగా ఆకర్షణీయంగా ఉండే అమ్మవారి వెనుక సింహవాహనం కనపడుతుంది. దేశంలోని మిగిలిన క్షేత్రాలకు భిన్నంగా మూలవిరాట్ పడమర ముఖంగా ఉంటుంది.
 
  ఏడాదిలో 2 మార్లు 3 రోజుల పాటు సూర్యస్తమయ వేళలో సూర్య కిరణాలు పడమటి దిక్కులో గల చిన్న కిటికీ గుండా అమ్మవారి ముఖాన్ని తాకుతాయి. ఆమె చీర అంచులో కాంతులను పొదుగుతాయి. ఈ ప్రత్యేక దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. గర్భగుడి గోడపై శ్రీచక్రం, మూలవిరాట్-మహాకాళికి మధ్య మహాలక్ష్మి యంత్రం స్థాపించబడ్డాయి. ఆది శంకరులు ఈ క్షేత్రాన్ని సందర్శించి, తపస్సు చేసి శ్రీచక్రాన్ని ప్రతిష్టించారట. ఆ తర్వాత కాలంలో విద్యాశంకర భారతి కొల్హాపూర్ క్షేత్రానికున్న ధార్మిక విశిష్టతను గుర్తించి 13వ శతాబ్దంలో ఓ మఠం నిర్మించారు. ఈ ఆలయానికి దగ్గరలో 35 చిన్న పెద్ద గుళ్లు ఉన్నాయి.  
 
 ప్రత్యేక పూజలు
 శ్రావణ, చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి, నవరాత్రి ఉత్సవాలలో విశేష పూజలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు జరుపుతారు. కొల్హాపూర్‌లో చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంతటి ఫలాలనిస్తుందని పురాణోక్తి. ఆలయగుండంలో జ్యోతి ప్రజ్వలనం చేస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ నశించి శాంతి సౌఖ్యాలు సిద్ధిస్తాయని స్థలపురాణం.
 
 శ్రీచక్రపూజలతో జీవితం నందనవనం
 ఇక్కడ అమ్మవారిని సేవిస్తే సంతానం లేని వారికి సంతు కలుగుతుందట. పిల్లలను అమ్మవారి సమక్షంలో ఉంచితే వారి భవిష్యత్తు అమోఘంగా ఉంటుందట. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి పాయసాన్ని సమర్పిస్తే రోగాలు నయమైపోతాయట. అవివాహితులు  శ్రీచక్రపూజలు జరిపిస్తే వివాహయోగం కలిగి వారి జీవితం నందనవనంలా ఉంటుందని భక్తుల విశ్వాసం.
 
 ఇతర దర్శనీయ స్థలాలు
 కొల్హాపూర్‌లోని ప్రతి కోటకీ అబ్బురపరిచే చారిత్రక వారసత్వం ఉంది. మహారాజ భవనం 200 గదులతో 3 అంత స్తులతో విశాలమైన మైదానం మధ్యలో ఉంటుంది. నాటి ఆయుధాలు, రాజరికపు సామగ్రి ఇందులో పొందుపరిచారు. చరిత్ర ప్రేమికులు శాహూ ప్రదర్శనశాల తప్పక సందర్శించాలి. సంప్రదాయ కుస్తీ కళను ఇప్పటికీ సాధన చేసే ఖుష్బాగ్ మైదానంలో ఒకేసారి 30 వేల మందికి కూర్చునే వసతి ఉంది. ప్రకృతి ప్రేమికులు ఇక్కడి చెరువుల ఒడ్డున కాలక్షేపం చేయవచ్చు. పిల్లలను అలరించే చోటు ‘రంకాల చౌపాటే.’ దత్తాత్రేయుడి రెండవ అవతారం నృసింహ సరస్వతి ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో కృష్ణ, పంచగంగల సంగమ క్షేత్రమైన నర్సోబావాడిలో తపస్సు చేసుకున్నారట. అక్కడ వారి పాదుకల మందిరం ఉంది. పన్హాలా కొండలపై శివాజీ కొట, జ్యోతిబా మందిరం ప్రసిద్ధి చెందినవి.
 
 వడాపావ్ టేస్ట్!
 ‘దేశపు చక్కెర పాత్ర’గా పేరు గల కొల్హాపూర్‌లో వడాపావ్, పావ్ మిశాల్ ప్రసిద్ధ వంటకాలు. ఇక కొల్హాపూర్ చెప్పుల జతలు కొనకుండా తిరుగుముఖం పట్టలేం. మహారాష్ట్రీయన్ స్టైల్‌లోని ఆర్టిఫిషియల్ నగలు, వెండి వస్తువులు మంచి డిజైన్లలో లభిస్తాయి.   
 
 ఇలా చేరుకోవచ్చు!
 ముంబై నుంచి 387, పుణే నుంచి 240 హైదరాబాద్ నుంచి 540 కిలోమీటర్లు. కొల్హపూర్‌కి బస్సు, రైలు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. విమాన, రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఈ నగరం ఇతర ప్రధాన నగరాలకు కలపబడి ఉంది. వాయు మార్గం అయితే.. ఉజలాయివాడిలో విమానాశ్రయం ఉంది. రైలు మార్గం ముంబై, పుణేల నుంచి చేరుకోవచ్చు. రోడ్డుమార్గంలో ప్రభుత్వ, ప్రైవేటు బస్సుసర్వీసుల ద్వారా చేరుకోవచ్చు.
 
 - చిలుకమర్రి నిర్మలారెడ్డి
 

మరిన్ని వార్తలు