శిలలే శిల్పాలుగా ఉనకోటి

15 Apr, 2017 23:57 IST|Sakshi
శిలలే శిల్పాలుగా ఉనకోటి

అదొక మహారణ్యం. పర్వతాలు చుట్టుముట్టిన లోయ ప్రాంతం. అయితే ఇక్కడ అడుగడుగునా ఓ అందమైన శిల్పం. అలా సుమారు కోటి శిల్పాలు అక్కడకు అడుగుపెట్టిన వారినందరినీ పలకరిస్తున్నట్లుగా ఉంటాయి. తమ హావభావాలతో కనువిందు చేస్తాయి. ఆ ప్రాంతం ఉనకోటి. ఆ రాష్ట్రం త్రిపుర. అత్యంత పురాతన శైవక్షేత్రం ఇది. బెంగాలీలో ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ అని అర్థం. అసలు ఇంత చిన్న రాష్ట్రంలో ఇన్ని శిల్పాలు ఎందుకు ఉన్నాయో చూద్దాం...

ఓసారి శివుడు కోటిమంది దేవతలతో కలసి కైలాసానికి బయలు దేరాడు. మార్గమధ్యంలో ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశించి, కాసేపు విశ్రమించాలనుకున్నాడు. ఆయన వెంట వచ్చిన దేవతలందరూ కూడా ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకుని కాసింత సేద దీరాలను కున్నారు. అందుకు శివుడు సమ్మతిస్తాడు. అయితే మర్నాడు సూర్యోదయానికి ముందే అక్కడి నుంచి బయలుదేరాలని, లేదంటే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలని షరతు విధిస్తాడు. దేవతలందరూ తీవ్రమైన అలసట కారణంగా గాఢనిద్రలో మునిగిపోవడంతో సూర్యోదయానికి ముందు మేలుకో లేకపోతారు. దాంతో శివుడు వారిని అక్కడే శిలలై పడి ఉండండని శపిస్తాడు. మరో కథనం ఏమిటంటే... అప్పట్లో ఈ ప్రాంతంలో కుల్లు కంహార అనే శిల్పి ఉండేవాడు. అతను శక్తి ఉపాసకుడు. ఓసారి శివగణాలతో పార్వతీ పరమేశ్వరులు ఈ మార్గం గుండా పయనిస్తున్నారు. అది తెలిసి అక్కడికి చేరుకున్న కుల్లు తననూ వారితో తీసుకు వెళ్లమని ప్రార్థించాడు. అందుకు పరమేశ్వరుడు సమ్మతించలేదు.

 తన భక్తుడు కావడంతో  తెల్లవారేలోగా కోటి శిల్పాలను చెక్కగలిగితే శివుణ్ణి ఎలాగైనా ఒప్పించి తమతో తీసుకు వెళ్లేలా చేస్తానని పార్వతి చెప్పింది. అతను ఆనందంతో విగ్రహాలు చెక్కడం మొదలు పెట్టాడు. అయితే దురదృష్టవశాత్తూ అవి కోటికి ఒకటి తక్కువగా ఉన్నాయి. దాంతో పరమేశ్వరుడు అతన్ని కైలాసానికి రానివ్వలేదు. అసలు విషయం ఏమిటంటే, తాను చాలా గొప్పశిల్పినని అతనికి అహంభావం. పైగా బొందితో కైలాసానికి వెళ్లాలన్న కోరిక చాలా అసంబద్ధమైనది, అందుకే పరమేశ్వరుడతన్ని అనుగ్రహించలేదు. ఇక శిల్పాల విషయానికి వస్తే, ఇవి 30–40 అడుగుల ఎత్తున ఉంటాయి. అయితే అన్నీ అసంపూర్తిగా ఉంటాయి. వీటి పళ్లు, కళ్లు అలంకరణ, హావభావాలు అన్నీ కూడా అక్కడి గిరిజనులను ప్రతిబింబిస్తుంటాయి. ఈ పర్వత ప్రదేశంలోని ప్రతి మూలకూ వెళ్లడానికి ఎగుడుదిగుడుగా, అడ్డదిడ్డంగా రిబ్బన్‌ ఆకారంలో మెట్లు, పర్వతాలను అనుసంధానిస్తూ వంతెనలూ ఉన్నాయి. ఇక్కడ కాలు పెట్టగానే ఇంతటి అద్భుతమైన సుందరప్రదేశాన్ని ప్రపంచం ఎందుకు విస్మరించిందా అనిపిస్తుంది.

ఇక్కడి శివుడికి ఉనకోటీశ్వర కాలభైరవుడని పేరు. దాదాపు ముప్ఫై అడుగుల ఎత్తులో చెక్కి ఉంటుంది శివుడి విగ్రహం. ఆయన తలే పదడుగులుంటుంది. ఒకవైపు సింహవాహనంపై పార్వతి, మరోవైపు గంగ ఉంటారు. పాదాల చెంత మూడు పెద్ద పెద్ద నంది విగ్రహాలు భూమిలో కూరుకుపోయినట్లుగా కనిపిస్తాయి. ఉనకోటీశ్వరుడికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అర్చనలు, అభిషేకాలు జరుగుతుంటాయి. పూజారులు ఇక్కడికి దగ్గరలో  భక్తులకు అందుబాటులో ఉంటారు. ఇక్కడి రాతి విగ్రహాలకు పైన చక్కటి పచ్చిక బయళ్లు, కింది భాగాన గలగల పారే సెలయేళ్లు లేదా పైనుంచి కిందికి పరవళ్లు తొక్కుతూ పడే జలపాతాలు ఉంటాయి. ప్రతి ఏటా ఏప్రిల్‌లో ఇక్కడ పెద్ద ఎత్తున జరిగే అశోకాష్టమి ఉత్సవాలకు త్రిపుర నుంచే గాక చుట్టుపక్కల రాష్ట్రాలనుంచి వేలాది మంది భక్తులు విచ్చేస్తారు. జనవరిలో కూడా చిన్నపాటి ఉత్సవం నిర్వహిస్తారిక్కడ.

ఎలా చేరుకోవాలి?
త్రిపుర రాజధాని అగర్తలాకు న్యూఢిల్లీ, అస్సాం, నాగాలాండ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్‌... ఇలా ఇంచుమించు అన్ని ప్రధాన నగరాల నుంచి ట్రెయిన్లు ఉన్నాయి. రైలుమార్గంలో వచ్చేవారికి అతి సమీపంలోని రైల్వే స్టేషన్‌ కుమార్‌ఘాట్‌. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉనకోటి శిల్పసౌందర్యాన్ని వీక్షించ వచ్చు. విమానంలో వచ్చేవారు ఐజ్వాల్‌ విమానాశ్రయంలో దిగాలి. అక్కడి నుంచి ఉనకోటికి నేరుగా ట్యాక్సీలు ఉంటాయి. త్రిపుర పర్యాటకాభివృద్ధి శాఖ హెలికాప్టర్‌ ఛార్జీలను అందుబాటు ధరలోనే ఉంచడం కొంత ఉపశమనం కలిగిస్తుంది.

 – డి.వి.ఆర్‌.భాస్కర్‌

మరిన్ని వార్తలు