చిట్కాలు తెలిస్తే చిటికెలో పని!

27 Jul, 2014 00:38 IST|Sakshi
చిట్కాలు తెలిస్తే చిటికెలో పని!

వాయనం
 
ఇంటిని తళతళలాడేలా ఉంచుకునేందుకు ప్రతి గృహిణీ పెద్ద కసరత్తే చేస్తుంది. చేసీ చేసీ అలసిపోతుంది. నిజానికి అంత అలసిపో నక్కర్లేదు. ఎంత పెద్ద పని అయినా కొన్ని చిట్కాలు పాటిస్తే చిటికెలో అయిపోతుంది. ఇంటి క్లీనింగ్ మాత్రం ఎందుకవ్వదు!

వాష్ బేసిన్స్‌కి పట్టిన మురికి, జిడ్డు వదలాలంటే... వాష్ బేసిన్ రంధ్రాలను మూసేసి, కాసింత గోరువెచ్చని నీళ్లను పోయండి. ఓ రెండు నిమ్మచెక్కల్ని కూడా వేస్తే నిమ్మతో కలిసి నీరు యాసిడ్‌లా పని చేస్తుంది. బేసిన్ క్లీనైపోతుంది.

ఫ్రిజ్ క్లీన్ చేసేటప్పుడు ముందుగా ఉప్పు, నిమ్మరసం కలిపిన నీటిని లోపల చల్లి కాసేపు వదిలేయండి. ఆ తర్వాత బట్టతో తుడిస్తే మరకలు తేలికగా పోతాయి, క్రిములూ చచ్చిపోతాయి.

టైల్స్ క్లీన్ చేసేటప్పుడు నీటిలో సర్ఫ్ వేసి, ఆ నీటితో తుడుస్తారు కొందరు. పొరపాటున కాస్త సర్ఫ్ ఎక్కువైనా కూడా ఆ జిడ్డు పోదు. తర్వాత నడిచినప్పుడు కాళ్లు జారిపోతాయి. మార్కెట్లో తక్కువ ధరలో కూడా ఫ్లోర్ క్లీనర్స్ దొరకుతున్నాయి. వాటిని వాడండి. లేదంటే తడి బట్టతో టైల్స్ తుడిచేసి, మరకలున్నచోట బేకింగ్ పౌడర్ చల్లి, స్పాంజితో తుడిచేయండి. మరక మాయమౌతుంది.
మౌత్‌వాష్ మన నోటిలో క్రిములనే కాదు, ఇంటిలో క్రిముల్ని కూడా చంపేయగలదు. వాష్ బేసిన్స్‌లోను, టైల్స్ క్లీన్ చేసే నీటిలోనూ కలిపి వాడుకోవచ్చు.

టవళ్లు, దుప్పట్లు, రగ్గులు, కర్టెన్సు, కార్పెట్లు, డోర్ మ్యాట్స్‌ని క్లీన్ చేసేటప్పుడు నీటిలో కాస్త వెనిగర్‌ను కలిపితే మీ చేతికి పని తగ్గుతుంది.
ఫ్లవర్ వాజుల్లో చేయి దూరక ఇబ్బందిగా ఉంటే... బియ్యం కడిగిన నీటిని వేడి చేసి, ఆ నీటితో కడగండి. ఎంత బాగా శుభ్రమవుతాయో చూడండి!

గోడల మీద గీసిన గీతలు, పెయింటు మరకలు పోవాలంటే... హెయిర్ స్ప్రేని మరకమీద స్ప్రే చేసి నానిన తరువాత బట్టతో తుడిచేయండి.
ఎంత శుభ్రం చేసినా ఒక్కోసారి ఇల్లు అదోలాంటి వాసన వస్తుంది. అలాంట ప్పుడు కొన్ని కాఫీ గింజల్ని తీసుకుని, ఇంట్లో అక్కడక్కడా ఒక్కోటి పెడితే... ఘుమఘుమలు వస్తాయి కాసేపటికి!

మరిన్ని వార్తలు