ట్రంప్‌కు అమెరికా వంటలు నచ్చట్లేదిప్పుడు!

1 Mar, 2020 09:57 IST|Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

ట్రంప్‌ ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి అమెరికన్‌ వంటలు ఎంతమాత్రం నచ్చడం లేదు.
పదే పదే ఇండియన్‌ వంటకాలే గుర్తుకొస్తున్నాయి. ఒక ఫైలు మీద అయితే తన సంతకానికి బదులు ‘ఆంధ్రా నాటుకోడి పులుసు’ అని రాశాడు.
‘‘ఇదేంటి సార్‌?’’ అని ఆయన  పీయే అడగాలనుకున్నాడుగానీ ‘ఎందుకొచ్చిన లొల్లి’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా కామ్‌గా ఉండిపోయాడు. ఆరోజు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ వైట్‌హౌస్‌కు ఫోన్‌ చేశాడు.
ఆ సంభాషణ ఇలా జరిగింది:
సెక్రెటరీ: హలో ట్రంపుగారు...
ట్రంప్‌: ‘హలో’ ట్రంపు కాదు... డొనాల్డ్‌ ట్రంప్‌ని మాట్లాడుతున్నాను...హీ హీ హీ....
సెక్రెటరీ: ఆపవయ్యా బాబూ... నీ నవ్వు... వినలేక ఛస్తున్నాను...
( ఆ సున్నితమైన నవ్వు ఆగిపోయింది)
ట్రంప్‌: విషయం ఏమిటో చెప్పిచావు...
సెక్రెటరీ: ఆ ఇరాన్‌ వాడు మళ్లీ ‘అణ్వాయుధం తయారుచేస్తున్నాను ఖబడ్దార్‌’ అంటున్నాడు...
ట్రంప్‌: బాసూ, ఇరాన్‌ అంటే గుర్తుకు వచ్చింది... నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇరానీ చాయ్‌ రుచి చూశాను. అబ్బబ్బా ఎంత బాగుందో! ఆ రోజంతా తాగుతూనే ఉన్నాననుకో...
సెక్రెటరీ: ఆపవయ్యా నీ ‘టీ’ గోల! ప్రపంచశాంతి గురించి మాట్లాడుదామని ఫోన్‌ చేస్తే  ఇరాన్‌ టీ గురించి చెప్పి చావగొడుతున్నావు. అసలు మీ రెండు దేశాల వాళ్లు తెల్లారి లేస్తే చాలు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. ఇదేమన్నా బాగుందా? అని నేను ఐరాస సెక్రెటరీ జనరల్‌ హోదాలో ప్రశ్నిస్తున్నాను...
ట్రంప్‌: బాసూ... కారాలు మిరియాలు అంటే గుర్తుకువచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు కారం బాగా దట్టించిన రాయలసీమ నాటుకోడి పులుసు రుచి చూశాను... అబ్బా! అదిరిపోయిందనుకో. తింటున్నప్పుడు ఎవరో ‘మిరియాల చారు’ పట్టుకొచ్చారు. అది కలుపుకొని తింటే రుచి ఉంది... నా సామిరంగా... ఇప్పటికి నోట్లో నీళ్లూరుతున్నాయి... (ట్రంప్‌ రాకతో ఒరిగిందేంటి?)

సెక్రెటరీ: ఆపవయ్యా బాబూ నీ బ్యాంబూలో సోది...
ట్రంప్‌: అరే... బొంగులో చికెన్‌ గురించి నీకు చెప్పడం మరిచాను. ఒకరోజు అది వడ్డించారు. ‘బొంగులో చికెన్‌’ ఈజ్‌ ట్రడిషనల్‌ ఫామ్‌ ఆఫ్‌ కుకింగ్‌. ఆల్‌మోస్ట్‌ నో ఆయిల్‌ అండ్‌ కారం... డిష్‌ అదిరిపోయింది అనుకో!
సెక్రెటరీ: కాస్త నీ చికెన్‌ గోల ఆపుతావా! కాసేపు ఇండియా–అమెరికా సంబంధాల గురించి మాట్లాడదాం. నువ్వు ఇండియా పర్యటించడం ‘చారిత్రక ఘట్టం’ అనే చెప్పుకోవాలి. ఏమంటావు ట్రంపూ...
ట్రంప్‌: ‘చారిత్రక’ అంటే గుర్తుకువచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు రకరకాల చారుల రుచిచూశాను. ఎంత బాగా నచ్చిందో! మజ్జిగ చారు, మిరియాల చారు, టమాటా చారు... వీటిలో పప్పుచారు హైలెట్‌ అనుకో... హై ప్రోటీన్‌ చారు... ప్రిపరేష్‌ 16 నిమిషాలు, కుక్‌ 30 నిమిషాలు, టోటల్‌...46 నిమిషాలు... సింపుల్‌గా చేసుకోవచ్చు...
సెక్రెటరీ: ఏమిటయ్యా బాబూ...అప్పటి నుంచి తెగ చావగొడుతున్నావు. నేను మాట్లాడుతున్నదేమిటి, నువ్వు మాట్లాడుతున్నదేమిటీ. ఏమైనా సంబంధం ఉందా? అయినా తప్పు నీది కాదులే...పొద్దున లేచి ఎవడి ముఖం చూసానో... సరే కర్మగాలి చూశానే అనుకో... నీకు ఫోన్‌ చేయాలని నాకు ఎందుకు అనిపించాలి... దరిద్రం కాకుంటే...
ట్రంప్‌: ఏమిటయ్యో మాటలు మితిమీరి మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? డోనాల్డ్‌ ట్రంప్‌తో, అమెరికా ప్రెసిడెంట్‌తో మాట్లాడుతున్నావు. నాకు గానీ తిక్క రేగింది అంటే...
సెక్రెటరీ: కూల్‌ ట్రంప్‌ కూల్‌...
ట్రంప్‌: బాసూ... ‘కూల్‌’ అంటే గుర్తుకు వచ్చింది... ఇండియాలో ఉన్నప్పుడు ‘కుల్ఫీ’ తిన్నానయ్యా... తెగ నచ్చేసిందనుకో... మలై కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, మ్యాంగో కుల్ఫీ, స్ట్రాబెర్రీ కుల్ఫీ, బటర్‌ స్కాచ్‌ కుల్ఫీ, లిచ్చి కుల్ఫీ, కేసర్‌ పిస్తా కుల్ఫీ, కేసర్‌ బాదం కుల్ఫీ... ఒక్కటా రెండా... ఎన్నెన్ని కుల్ఫీలు తిన్నానో...
సెక్రెటరీ: నీ ఇండియా పర్యటన నా చావుకొచ్చిందయ్యా. బతికుంటే బలుసాకు బిజినెస్‌ చేసుకొని బతుకుతాను... ఇక సెలవా మరి...
ట్రంప్‌: నువ్వు బలుసాకు అంటే గుర్తుకొచ్చింది... నేను  ఇండియా నుంచి తిరుగుప్రయాణం అవుతున్నప్పుడు బ్రహ్మాండమైన విందు ఇచ్చారు. అందులో స్పెషల్‌ ఏమిటో తెలుసా? బలుసాకు పప్పు, బలుసాకు పప్పుచారు, బలుసాకు మటన్‌ కర్రీ, బలుసాకు చికెన్‌ కర్రీ, బలుసాకు ఫిష్‌ ఫ్రై, బలుసాకు ఫిష్‌ పులుసు, బలుసాకు బిర్యానీ, బలుసాకు అప్పడాలు, బలుసాకు వడియాలు, బలుసాకు సకినాలు, బలుసాకు కాజా...
గమనిక: అటునుంచి ‘సచ్చాన్రో’ అంటూ పెద్ద శబ్దం వినబడి ఫోన్‌ కట్‌ అయిపోయింది.
అశుభం
– యాకుబ్‌ పాషా 

మరిన్ని వార్తలు