ఈ బంధం ఇక సడలదా?!

7 Sep, 2014 01:45 IST|Sakshi
ఈ బంధం ఇక సడలదా?!

అసలు కథను పక్కకు నెట్టేసి, కొసరు కథలతో సీరియళ్లను సాగదీయడం టీవీ వాళ్లకు బాగా అలవాటైన పనే. కానీ ఆ సాగతీత మరీ అర్థం పర్థం లేకుండా ఉంటే మాత్ర ప్రేక్షకుల బుర్రలు వాచిపోవడం ఖాయం. జీ టీవీలో ప్రసారమయ్యే ‘పవిత్రరిష్తా’తో ఇప్పుడు అదే సమస్య వచ్చింది. మొన్న ఆగస్టు 22కు 1,378 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ సీరియల్‌లో కథేంటి అని ఆలోచిస్తే... జుట్టు పీక్కున్నా గుర్తుకు రాదు.
 
 ఎందుకంటే అసలు కథను అందరూ ఎప్పుడో మర్చిపోయారు. మానవ్, అర్చన అనే రెండు పాత్రలు, వారి కుటుంబాల చుట్టూ తిరగుతూ మొదలైన కథ... ఇప్పుడు చాలామంది చుట్టూ తిరుగుతోంది. రకరకాల పాత్రలు రంగ ప్రవేశం చేశాయి. చెప్పలేనని మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట మానవ్‌గా నటించిన సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ సినిమాల్లోకి వెళ్లిపోయాడు. అతడి స్థానంలో హితేన్ తేజ్‌వానీ ఎంటరయ్యాడు. కానీ హీరోయిన్ ఇప్పటికీ అంకితా లోఖండేనే. ఆమెతో పాటు హితేష్ కూడా పేరున్నవాడు కావడంతో సీరియల్‌కి ఇంకా కాస్త ఆదరణ ఉంది. లేదంటే ఆ జీడిపాకాన్ని భరించడం అంత సులభం కాదు. పవిత్రబంధం అంటూ ఇలా రకరకాల బంధాలను అలా కలుపుకుంటూ పోతుంటే... ప్రేక్షకులకు పిచ్చెక్కిపోవడం ఖాయం!
 
 వాస్తవాలకు దర్పణం
 సీరియళ్లు చూస్తే నిజ జీవితాలకు దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ నిజంగా నిజాలను చెప్పే సీరియళ్లు వేళ్లమీద లెక్కపెట్టేటన్నే ఉంటాయి. కుటుంబ సమస్యలు, పాత్రలు పడే ఇబ్బందుల్ని చూపించడమే తప్ప... సమాజం, అందులోని సమస్యలు, వాటికి పరిష్కారాలు వంటి వాటిని చర్చించే సీరియళ్లు ఎప్పుడోగానీ రావు. చాలా కాలం తర్వాత ‘బాలికావధు’ ఒకటి వచ్చింది. ఆ సీరియల్ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తెరకెక్కింది. ఇప్పుడు అదే కోవలో ‘ఉడాన్’ (కలర్‌‌స) ప్రారంభమయ్యింది.
 
 ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని వెనుకబడిన గ్రామాల్లో పాతుకునిపోయి ఉన్న బాల కార్మిక వ్యవస్థ చుట్టూ తిరిగే కథ ‘ఉడాన్’. కోట్లకు పడగలెత్తిన ఓ జమీందారు ఊరిని గుప్పెట్లో పెట్టుకుంటాడు. ధన సహాయం చేస్తున్నట్టు, జీవనోపాధి కల్పిస్తున్నట్టు నటిస్తూ... అందరినీ తమ కాళ్ల దగ్గర పడివుండేలా చేసుకుంటాడు. అలాంటి ఊళ్లో జన్మిస్తుంది ‘చకోర్’. ఆమె కడుపులో ఉన్నప్పుడు డబ్బు అవసరమై జమిందారు దగ్గరకు వెళ్తే, బిడ్డను తాకట్టు పెట్టించుకుని డబ్బు ఇస్తాడు. ఏడేళ్లు వచ్చేవరకూ పెంచి, తర్వాత బిడ్డను తమకు అప్పగించమని కండిషన్ పెడుతుంది జమీందారు భార్య. కూతుర్ని తాకట్టు పెట్టామన్న బాధ, ఏడేళ్ల తర్వాత ఆమె తమకు దూరమైపోతుందే అన్న ఆవేదనతో చకోర్ తల్లిదండ్రులు కుమిలిపోతుంటారు.
 
 ఇవేమీ తెలియని చకోర్ సంతోషంగా కాలం గడుపుతూ ఉంటుంది. చిలిపి చేష్టలతో, అల్లరి వేషాలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. మరి ఏడేళ్లు వచ్చాక చకోర్ జీవితం ఏమవుతుంది? ఎదిగేకొద్దీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది అన్న ఉత్కంఠతో సాగుతోంది ‘ఉడాన్’. చిన్నారి చకోర్‌గా స్పందన్ చతుర్వేద్ నటన అద్భుతం. ఇప్పటికే మధుబాల, సంస్కార్ లాంటి సీరియళ్లకు తన టాలెంట్‌తో అందాన్ని తెచ్చిన స్పందన్... చకోర్ పాత్రను రక్తి కట్టిస్తోంది.
 
 గతంలో ఉడాన్ పేరుతో దూరదర్శన్‌లో ఓ సీరియల్ ప్రసారమైంది. మన దేశంలో మొట్టమొదటి మహిళా డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య జీవితం ఆధారంగా, ఆవిడ చెల్లెలు కవితా చౌదరి తీసిన ఆ సీరియల్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. మరి ఈ ‘ఉడాన్’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!

మరిన్ని వార్తలు