ఆజన్మం: ఒక (అ)పరిచిత ముఖం

24 Nov, 2013 02:32 IST|Sakshi
ఆజన్మం: ఒక (అ)పరిచిత ముఖం

ఆయనతో నేను సంభాషించినట్టుగా ‘ప్లే’ చేసుకుంటే అది సరిగ్గా అమరుతోంది. అంటే ఆయన నాకు ఎక్కడో తారసపడ్డాడనిపించేంత వాస్తవికంగా ఆ ఊహ పొసిగింది.
 
 ధ్యానం మీద కూడా నాకు ఆసక్తి లేకపోలేదు. కొన్నిసార్లు ప్రయత్నించిన మాట కూడా నిజమే! తీరా ఆ సమయంలో, నాలోకి మరింత బలంగా చొచ్చుకువచ్చే శబ్దాల్తో మమేకమైపోతాను; ఎంతగా అంటే, వేటిని తొలగించుకోవాలని చెబుతుంటారో, వాటిని కాక, తొలగించుకోవడమనే కర్తవ్యాన్నే మరిచిపోతాను. అయితే, ఎప్పటికైనా ధ్యానాన్ని విస్మరించకూడని లక్ష్యంగా గుర్తిస్తూనే... అలాంటిదొకటి ఇవ్వబోయే ఆనందమంటూ ఏమీవుండబోదనే ‘సంశయాత్మక జాగ్రత్త’ను గమనింపులో ఉంచుకుంటూనే... ఏదైనాసరే, దాన్ని నాకు నేనుగా తేల్చుకోవాల్సిన విషయంగా పక్కకు పెట్టేస్తుంటాను.
 
 కళ్లు మూసినప్పుడు పరిస్థితి అలావుంది సరే; తెరిచినప్పుడు మాత్రం దానికి భిన్నంగా ఏంవుందీ!  మొన్నోరోజు, యథావిధిగా ఆఫీసుకని బయల్దేరాను. మా కాలనీలోంచి మెహిదీపట్నాన్ని అందుకోగలిగే మెయిన్ రోడ్డుకు వస్తుండగా ఒకాయన స్కూటర్ మీద వెళ్లడం చూశాను. శివాలయం దాటుతున్నాడు. రోజూ కనబడే వందల ముఖాల్లో అదీ ఒకటి; దానికి ఏ ప్రత్యేకతా లేదు; రెండు కళ్లు, రెండు చెవులు, ఒక ముక్కు, కొంత జుట్టు! నాలుగు అడుగులు వేసేంతవరకే ఈ భౌతిక వర్ణన పరిధి! దీనికి ఆవల కూడా ఆ ముఖానికీ నాకూ మధ్యన ఏదో ఉందనిపిస్తోంది. ఏమిటది?


 ఆయనతో నేను సంభాషించినట్టుగా ‘ప్లే’ చేసుకుంటే అది సరిగ్గా అమరుతోంది. అంటే ఆయన నాకు ఎక్కడో తారసపడ్డాడనిపించేంత వాస్తవికంగా ఆ ఊహ పొసిగింది. కాబట్టి ఆయన నాకు తెలుసు. కాని ఎక్కడ, ఎలా తెలుసు?
 
 ఆ లొకాలిటీలో నేను ఎక్కడెక్కడ వ్యవహారం కోసం తిరగ్గలిగే అవకాశం ఉంది? జిరాక్సు, పాలు, పాన్‌డబ్బా, కిరాణా, కర్రీ పాయింట్, గోల్డెన్ ప్యాలెస్... ఊహూ! ఏ క్లూ లేదు. ఎంతకీ తెగని ‘సుడోకు’ను ఇక చేయలేమని తేలిపోయాక, పేపర్‌ను మానసికంగా గిరవాటేసినట్టుగా ఆ ఆలోచనను దులిపేసుకున్నాను.అయితే, తెల్లారి, అదే తోవలో, ఎడమవైపు వేసుకున్న బ్యాగును వీపుకు సమంగా ఉండేట్టుగా జరుపుకొంటూ మెయిన్‌రోడ్డున వస్తుండగా- ఉన్నట్టుండి, అసందర్భంగా ఆ ముఖం మళ్లీ నా మెదడులో ప్రత్యక్షమైంది. అవునుగదా, ఇంతకీ ఆయనెవరు?
 
 ఎంత గింజుకున్నా స్ఫురించలేదు. నేను షేర్ ఆటో ఎక్కడంతో, చోటుచాలక, ఆ ఆలోచనే నన్ను దిగిపోయింది. చిత్రంగా- మళ్లీ మరుసటి రోజు, ఆ పైరోజు... అదే తోవలో, అదే సమయంలో, శివాలయం ఇంకో నాలుగడుగుల్లో వస్తుందనగా- అంటే ఏ పాయింట్‌లో ఆయన్ని ‘తొలిసారి’ చూశానో అక్కడే ఉన్నట్టుండి, ‘అరే! ఆ ముఖం ఎవరిదో ఇంకా గుర్తురాలేదే’ అని గుర్తురావడం...
 
 అవే పోలికలున్న మరో ముఖం హఠాత్తుగా ఈ ముఖం మీద ఇంపోజ్ అవుతుంది. రెండూ కలిసిపోయి... అసలు ఏ ముఖం నాక్కావాలి? ఇదా, అదా? రెంటికీ సారూప్యత ఉన్నప్పటికీ ఎక్కడో వాటిని వేరుచేసే కీలకాన్ని కాసేపటికి పట్టుకుంటాను. ఇద్దరిలో ఈయనది కొంచెం నడ్డిముక్కు. ఆఆఆ... నాక్కావాల్సింది ఇదే! ముక్కు సరే; ముఖం ఎవరిది?
 
 ఒక్కోసారి, పళ్లల్లో జామగింజ ఇరుక్కుంటే, నాలుకతో ఎన్ని జిమ్నాస్టిక్స్ చేయించినా అది ఊడిరాదు. ఇక విసిగిపోయి, నాలుక మానాన నాలుకను పడేశాక, ఎప్పుడో ఉన్నట్టుండి, గింజ పళ్లకిందికి వచ్చి ‘కిట్క్’మంటుంది; నాలుక నోరంతా సంచరించే స్వేచ్ఛ దొరుకుతుంది. ఇదిగో, అలా, నేను ఆయనెవరో ఉన్నట్టుండి ‘ఊడిపడ్డాక’ ఆ ఆలోచననుంచి విముక్తం కాగలిగాను. ఇంతాచేస్తే- ఆయన, నేను ఏ వారానికో వెళ్లి గోధుమపిండో, ఎండు ఖర్జూరాలో కొనే రైతుబజార్ దుకాణదారు!
 
 ఒక నిర్ణీత ప్రదేశంలో, కుర్చీకి పైన, భుజాల వరకే చూసివున్న ముఖాన్ని... స్కూటర్ మీద కాళ్లు కనబడేలా, పైగా బంధితుడిలా కాకుండా సంచారిలా చూసేసరికి... తెలిసిన ముఖమే అయినా తెలియని దేహం కావడంతో లింకు తెగిపోయినట్టుంది! ఆ ముఖం ఇంకా కిందికి, కాళ్ల దాకా కూడా వ్యాపించివుంటుంది... ఆ కాళ్లకు ప్యాంటు వేసివుంటుంది... అన్న స్పృహ అంతకుముందు మనకు ఎందుకు ఉండబోతుంది?
 చాలా విషయాలు- ఇలాగే మనకు ముఖం వరకే తెలిసివుండి, తీరా దాన్ని నిలబెట్టిన కాళ్లు కనబడ్డప్పుడు- రెంటినీ కలుపుకోవడంలో విఫలమై ఉక్కిరిబిక్కిరి అవుతామేమో!
 - పూడూరి రాజిరెడ్డి

మరిన్ని వార్తలు