లేటైనా పరవాలేదు...

12 Dec, 2016 14:27 IST|Sakshi
లేటైనా పరవాలేదు...

 ‘ఆ... ఇప్పటికే చాలా కాలం నుంచి స్మోకింగ్ చేస్తున్నాం. దాదాపు 60 ఏళ్లకు పైగా బతికాం. ఇంకా బతకబోయే పది-పదిహేనేళ్ల కోసం ఏం మానతాం లే’ అన్నది కొంతమంది అభిప్రాయం. ఈ దురభిప్రాయంతోనే పొగతాగే అలవాటు ఉన్న కొందరు మానాలని ఉన్నా మానలేరు.  కానీ పొగతాగే అలవాటుకు నో చెప్పడం ఎంత లేటైనా పరవాలేదు. డెబ్బయి ఏళ్ల వయసప్పుడు కూడా మానినా పరవాలేదు. అంతకు మించిపోయినా పరవలేదు. ఎందుకంటే ఆ వయసులోనైనా, ఆ తర్వాతైనా అప్పటి నుంచి అభివృద్ధి చెందే క్యాన్సర్ కణాలు వృద్ధి చెందవనీ, అక్కడే ఆగిపోతాయని చెబుతున్నారు యూఎస్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు.
 
 ఈ పరిశోధన ఫలితాలను డాక్టర్ సారా నాష్  వివరించారు. ఒకవేళ ఆ వయసులో అభివృద్ధి చెందే క్యాన్సర్స్ ఒకవేళ వచ్చినా సరే... పొగతాగే అలవాటు మానేయడం వల్ల ఆ క్యాన్సర్ కణజాల వృద్ధిలో వేగం చాలా వరకు తగ్గిపోతుందని, దాంతో జీవితకాలం హాయిగా జీవించవచ్చునని ఆమె పేర్కొంటున్నారు. అందుకే ఏ వయసులోనైనా పొగమానేయడం లేటేమీ కాదు అంటూ ఆ అలవాటు మానేవారిని ప్రోత్సహిస్తున్నారు డాక్టర్ సారా నాష్. ఈ పరిశోధన వివరాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి.
 

మరిన్ని వార్తలు