మొగలిపూల వాసన

13 Oct, 2019 11:25 IST|Sakshi

పాటతత్త్వం 

శ్రీరమణ

చిత్రం : ఉయ్యాల జంపాల    రచన : ఆరుద్ర    గానం : ఘంటసాల, సుశీల    సంగీతం : పెండ్యాల

‘ఉయ్యాల – జంపాల’ చిత్రంలో ఆరుద్ర సమకూర్చిన పాట ‘కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది’. అప్పటికీ (1965) ఇప్పటికీ మసకబారలేదు. ప్రతి పదం పూలరెక్కల కోమలం. కవితామయం. అన్ని వర్గాల తెలుగు శ్రోతలకి యీ పాట ఒక కలవరం.
మాన్యులు ఆరుద్రని ఎప్పుడు కలిసినా ‘కొండగాలి తిరిగింది’ పల్లవిని మెచ్చుకునేవాణ్ని. ఆయన ఒకసారి ఆ పల్లవి రహస్యం చెప్పమంటారా అని మొదలుపెట్టారు. ‘‘కె. బి. తిలక్, నేను బాగా కావల్సినవాళ్లం. ‘ఉయ్యాల – జంపాల’ లొకేషన్స్‌ వేటలో తిలక్‌తో బాటు నేనూ వెళ్లాను. మద్రాసు దాటి ఆంధ్రా నడిబొడ్డుకు వచ్చాం. ఎక్కడ చూసినా రోడ్డు పక్క పశువులు, వాటి కాపర్లు. నిదానంగా కారులో వెళుతున్న మాకు గొడ్ల కాడి బుడ్డోడు గేదె మీద ఎక్కి వుల్లాసంగా పాడుకున్న పాట గూబలు అదిరేలా వినిపించింది. పరమ జానపదం. అది చెప్పలేనంత ముతక భాష, ముతక భావం. కారు వెంటనే రోడ్డు వార ఆపించాను. ఆ పిల్లలు అడిగితే మళ్లీ పాడరు. వాళ్లంత వాళ్లు పాడినపుడే దాని అందం, మళ్లీసారి శ్రద్ధగా విన్నా. 
‘,,,,,.... కొండగాలి తిరిగింది..... కూతుర్ని పంపారో మామో’’ – యిదీ... మినహాయింపులతో మాతృక. ఆ జానపదంలోంచి కొండగాలి తిరిగింది పల్లవి పుట్టింది. స్వేచ్ఛగా, ఏ సెన్సారు జంకులూ లేకుండా వచ్చిన పల్లవి కదా... జీవశక్తి దానికి అధికం’’ అంటూ ఆరుద్ర గడ్డం సవరించుకున్నారు.
పుట్ట మీద పాలపిట్ట పొంగిపోయి కులికింది.. అసలే పాలపిట్ట రంగులతో సొగసుగా వుంటుంది. ఇక అది కులికితే చెప్పాలా! పచ్చని గట్ల మీద చెంగుచెంగున వయసులో వున్న లేడి గంతులేసి ఆడుతుంటే చూడముచ్చట. పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడడం, పట్టరాని లేతవలపు పరవశించి పాడడం... కన వేడుకే. అన్నీ కవి సమయాలే! ఈ చక్కదనాల్ని ఆరుద్ర చరణాలలో సమకూర్చారు. నిలువెల్లా పాటకు నిండుదనం తెచ్చారు. 

తర్వాతి చరణంలో –
మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది/ నాగమల్లెపూలతో నల్లని జడ నవ్వింది
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది/ ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది

అంటూ పాట ముగించారు. సినిమా పాటకు కొత్త ఆయతనం తెచ్చారు ఆరుద్ర. పడుచుదనానికి ఉద్దీపకం తాంబూలం. తాంబూలంతో పడుచుదనం మరింత అందగిస్తుంది. అన్ని ఆశలూ చూపించి చివరకు ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది అనే తాత్విక ధోరణిలో తీర్మానించారు. కవికి యీ పాట పల్లవి ఒక ముతక సాహిత్యం ప్రేరణ అయితే, మిగతా పాటని ఒక పూనకంలో తన్మయత్వంలో రాశారన్నది నిజం. ఈ పాటంటే తెలుగువారికే కాదు ఆరుద్రకి కూడా యిష్టం. ‘అది అలా కుదిరింది’ అని ఆరుద్ర గడ్డం సవరించుకునేవారు.
– నిర్వహణ : వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు