వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా...

18 Jun, 2017 00:44 IST|Sakshi
వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా...

శేఖర్‌ కమ్ముల, ఆనంద్‌ సినిమాలో ‘వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా... పాట సందర్భం గురించి వివరించారు. ఈ సినిమాలో కథానాయిక జీవితం విషాదంగా ఉంటుంది.  జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. ఒకరోజు బయటి నుంచి ఇంటికి వచ్చేసరికి వాన వస్తుంది. తన కష్టాలన్నీ మర్చిపోయి, చిన్నపిల్లలందరితో కలిసి తాను కూడా పసిపిల్లలా వాళ్లతో వానలో చిందులు వేస్తుంది. అప్పటికి ఇంకా ఆమె ప్రేమలో పడదు. ఆమె ఆడుతూ పాడుతూ ఉండటాన్ని హీరో తదేకంగా పరిశీలిస్తుంటాడు. వానలు పడుతుంటే చదువుకు సెలవు చెప్పి, పిల్లలంతా కాగితపు పడవలు తయారుచేసి, నీళ్లల్లో వదులుతారు. ఎవరి పడవ ఎంత దూరం వెళ్లిందా అని చూస్తుంటారు. ఎవరిదైనా మునిగిపోతే, మిగతా పిల్లలు సంబరపడతారు. ఇది పిల్లల సంబరం.

గాలివాన కబడ్డీ ఆడుతుంటే అనే ఎక్స్‌ప్రెషన్‌ వేటూరిగారు అద్భుతంగా  చేశారు. ఆకాశంలో నుంచి వాన కురుస్తుంటే, ఇంద్రుడు ధనుస్సు సంధించి సప్తవర్ణాలు చిత్రించడం, వాన  హోరు జలతరంగంలా ధ్వనించడం...ఇలా ప్రతివారిలోనూ రకరకాల భావోద్వేగాలు బయలుదేరతాయి.జోరున కురుస్తున్న వానతో ఆకాశానికి వాన పందిరి వేసినట్లుగా ఉంటుంది. ఉరుములు ఉరిమి, పిడుగులు పడుతుంటే పసిపాపలు ఉలిక్కిపడుతుంటారు. ప్రకృతి పులకరిస్తుంది. చెట్లన్నీ చిగురుస్తాయి. పచ్చదనాన్ని సంతరించుకుని కనువిందు చేస్తాయి. హిందు స్థానీ రాగ మేళవింపుతో ఈ పాట చేశాను.

 ఈ పాటలో కథానాయిక జీవితం, అమ్మాయి మనసుని బాగా చూపారు. వానతో వచ్చే మార్పులను, కథానాయిక తన భావోద్వేగాలను అన్వయించుకున్నట్లుగా రాశారు. జీవితంలో చీకటివెలుగులు సహజం. నల్లటి మబ్బులు ప్రయాణిస్తాయి... ఆ తరవాత వెలుగురేకలు వస్తాయి. చల్లటి వర్షపు జల్లులు కురిసి, అందరికీ హాయిని కలిగిస్తాయి. ఇదంతా ప్రకృతిలో అతి సహజంగా జరుగుతుంది. కథానాయిక పక్షిలా స్వేచ్ఛాజీవిలా ఎగురుతున్నట్లు చూపారు ఈ పాటలో. జోరున వాన కురుస్తుంటే ఈ పాటను పాడుకోకుండా ఉండలేరు.
– సంభాషణ: డా. వైజయంతి

మరిన్ని వార్తలు