వాహన సేవలు... వైభోగ బ్రహ్మోత్సవం

24 Sep, 2017 01:46 IST|Sakshi

వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించింది ఆశ్వయుజ మాసంలో వచ్చే శ్రవణా నక్షత్ర శుభ ముహూర్తాన. అందుకే దసరా నవరాత్రులలో ఓ శుభముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు మొదలయ్యేవిధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం.

అంకురార్పణతో ఆరంభం...
వెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ఆరంభమవుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్థనప్రదేశాల నుంచి మృత్తికను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మ్రిత్సవం గ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో(కుండలు) –నవధాన్యాలను పోసి, వాటిని మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా నిత్యం నీరుపోసి అవి మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు.

ధ్వజారోహణం
బ్రహ్మాండనాయకునికి నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక నూత్నవస్త్రం మీద గరుడుని బొమ్మని చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

పెద్ద శేషవాహనం
ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యమిస్తూ తొలిరోజు ఆ వాహనం మీదే ఊరేగుతాడు స్వామి.

చిన్నశేషవాహనం
రెండోరోజు ఉదయం స్వామివారు తన ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ‘ఆదిశేషుడి’గా, చిన్నశేషవాహనాన్ని ‘వాసుకి’గా భావించవచ్చు.

హంసవాహనం
రెండోరోజు రాత్రి స్వామివారు సర్వ విద్యా ప్రదాయిని అయిన శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతారు. హంస పాలు, నీళ్లను వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణ జ్ఞానానికి సంకేతంగా స్వామి హంస వాహనాన్ని అధిరోహిస్తారు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమ హంస అయిన శ్రీనివాసుడు ఊరేగడం నయనానందకరం. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమైన మనోమందిరమని కూడా అర్థం ఉంది. కోర్కెలనే అంధకారాన్ని వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తి మార్గం వైపు నడవాలని స్వామి తన భక్తులకు చాటుతారు.

సింహవాహనం
మూడోరోజు ఉదయం సింహ వాహనమెక్కి స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానే నంటూ మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు.

ముత్యపు పందిరి వాహనం
మూడోరోజు రాత్రి శ్రీస్వామివారికి జరిగే సుకుమారసేవ ముత్యపు పందిరి వాహనం. ముక్తి సాధనకు మంచిముత్యం లాంటి స్వచ్ఛమెన మనసు కావాలని ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోజ్ఞంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు.

కల్పవృక్ష వాహనం
కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుంది. తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే వేల్పు వెంకటాద్రివాసుడు. కల్పవృక్షం.. అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలదు. కానీ స్వామివారు శాశ్వతమైన కైవల్యాన్ని ప్రసాదించే కల్పతరువు. ఈ విషయాన్ని తన భక్తకోటి గ్రహించాలనే స్వామివారు నాలుగోరోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై సర్వాలంకార భూషితుడై ఊరేగుతాడు.

సర్వభూపాల వాహనం
లోకంలోని భూపాలురు అంటే రాజులందరికీ భూపాలుడు తానేనని ప్రపంచానికి చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగోరోజు రాత్రి సర్వభూపాల వాహనం మీద కొలువుదీరుతారు. సర్వభూపాల వాహన సేవ, సందర్శన భాగ్యం జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది.  

మోహినీ అవతారం
బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది ఐదోరోజు. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తజనానికి సాక్షాత్కరిస్తారు. అన్ని వాహనసేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలో నుంచే పల్లకిపై ప్రారంభమవుతుంది. పరమ శివుడిని సైతం సమ్మోహపరచి, క్షీర సాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. ఈ అవతార సందర్శనం వల్ల మాయామోహాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి.

గరుడవాహనం
స్వామివారి వాహనం గరుత్మంతుడు. ఐదోరోజు రాత్రి తనకు నిత్యసేవకుడైన గరుత్మంతుడి మీద ఊరేగుతారు. స్వామివారి మూలమూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ మాల ధరించి మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తారు.  గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాలను, నూతన గొడుగులను గరుడవాహనంలో అలంకరిస్తారు.

హనుమంత వాహనం
ఆరోరోజు ఉదయం జరిగే సేవ ఇది. త్రేతా యుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుమంతుడిని వాహనంగా చేసుకుని స్వామి వారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతుని భక్తి తత్పరతను ఈ కాలం వారికి చాటి చెబుతూ, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ సేవ ద్వారా స్వామివారు తెలియజేస్తారు.

గజ వాహనం
గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరోరోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతారు. గజ వాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా చీమలా తొలగి పోతుందని భక్తుల విశ్వాసం.

సూర్యప్రభ వాహనం
బ్రహ్మోత్సవాలలో ఏడోరోజు ఉదయం సప్త అశ్వాలపై భానుడు రథసార«థిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగడం ద్వారా సూర్యభగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతారు.

చంద్రప్రభ వాహనం
ఏడోరోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పువ్వుల మాలలు ధరించి స్వామి చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని ఈ రెండు వాహనసేవల ద్వారా స్వామి లోకానికి తెలియజేస్తారు.

రథోత్సవం
గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్త్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదో రోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.

అశ్వవాహనం
ఎనిమిదో రోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామి ఊరేగుతారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం.

చక్రస్నానం
ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో  అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రత్తాళ్వార్‌కు వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రత్తాళ్వార్‌ స్నానమాచరించే సమయంలో కోనేటిలో స్నానం చేస్తే సకల పాపాలు, దీర్ఘరోగాలు నశించి కష్టాలు తీరుతాయని విశ్వాసం.

ధ్వజారోహణం
చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతా మూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజ పటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.

మరిన్ని వార్తలు