అనుబంధాల వాలెంటైన్‌

10 Feb, 2019 00:36 IST|Sakshi

ప్రేమబంధం

ప్రేమంటే.. కేవలం ప్రేమికుల మధ్య ఉండేదేనా? తండ్రీ కూతుళ్ల మధ్య, అన్నా చెల్లెళ్ల మధ్య, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమానురాగాల మాటేమిటి? రకరకాల అనుబంధాల మధ్య పెనవేసుకున్న ప్రేమానురాగాలకు తెలుగు సినిమాలు పట్టం కట్టాయి. వాటిలోని నటీ నటులు ఆ అనుబంధాల మధ్యనున్న భావోద్వేగాలకు అద్దం పట్టారు. ప్రేక్షకులు ఆ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు. అలాంటి కొన్ని సినిమాల ముచ్చట్లు వాలెంటైన్స్‌ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా...

అన్నా చెల్లెళ్ల అనురాగం
తెలుగు సినిమాల్లో ఎక్కువగా సెంటిమెంట్‌కి ప్రాధాన్యత ఉంటుంది. భావోద్వేగపూరితమైన సన్నివేశాల్లో తమ నటనతో ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించిన నటీనటులు ఎందరో. టాలీవుడ్‌లో అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల జాబితాలో ‘రక్త సంబంధం’ తొలి స్థానంలో ఉంటుంది. ఆ సినిమా తర్వాత అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌ కథలతో ఎన్నో సినిమాలు విడుదలై ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్నాయి. శోభన్‌బాబు ‘చెల్లెలి కాపురం’, చిరంజీవి ‘హిట్లర్‌’, బాలకృష్ణ ‘ముద్దుల మావయ్య’, ఆర్‌.నారాయణ మూర్తి ‘ఒరేయ్‌ రిక్షా’, రాజశేఖర్‌ ‘గోరింటాకు’, జగపతిబాబు ‘శివరామరాజు’, మహేశ్‌బాబు ‘అర్జున్‌’, పవన్‌ కల్యాణ్‌ ‘అన్నవరం’, జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘రాఖీ’... ఇలా అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌ చిత్రాల్లో నటించి, మెప్పించారు. అలాగే సురేశ్, యమున జంటగా బోయిన సుబ్బారావు దర్శకత్వంలో చిన్న సినిమాగా వచ్చిన ‘పుట్టింటి పట్టుచీర’ సినిమా మంచి హిట్‌ అయ్యి, భారీ కలెక్షను రాబట్టింది. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన సినిమాల్లో ‘పుట్టింటికిరా.. చెల్లి’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అర్జున్, మీనా జంటగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించి, బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అన్నగా అర్జున్, చెల్లిగా మధుమిత తమ నటనతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు. అంతలా ప్రేక్షకాదరణ పొందిన ‘పుట్టింటికిరా.. చెల్లి’ కథ ఏమిటో ఓ లుక్కేద్దాం.. 

ఊహ తెలియక ముందే తండ్రిని, ఊహ వచ్చిన తర్వాత తల్లిని కోల్పోతారు శివన్న (అర్జున్‌), లక్ష్మి (మధుమిత). అన్నీ తానై బాగా కష్టపడి చెల్లిని పెంచి పెద్ద చేస్తాడు శివన్న. చెల్లి అంటే శివన్నకు పంచ ప్రాణాలు. అన్న అంటే లక్ష్మికి కూడా అంతే ప్రేమ మరి. ఇద్దరికీ వయసులో మూడేళ్లు తేడా ఉన్నా ఇద్దరి పుట్టినరోజులూ ఒకే రోజు ఉంటాయి. తన క్లాస్‌మేట్‌ అజయ్‌తో (శ్రీనాథ్‌) ప్రేమలో పడుతుంది లక్ష్మి. అక్క (అపూర్వ) కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అజయ్‌ని కోరుతుంది తల్లి. ఇది నచ్చని అజయ్‌ ఇంటి నుంచి వచ్చేస్తాడు. చెల్లి ప్రేమకు అడ్డు చెప్పకుండా అజయ్‌కి, లక్ష్మికి ఘనంగా పెళ్లి చేస్తాడు శివన్న. పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లాక లక్ష్మికి కష్టాలు మొదలవుతాయి. ఆ కష్టాలు భర్త నుంచి కాదు, అత్తా ఆడపడుచుల నుంచి. లక్ష్మిపై ఏదో ఒక నింద మోపి అజయ్‌ చేత లక్ష్మిని ఇంట్లో నుంచి గెంటేయించి నీ కూతుర్ని ఇచ్చి అజయ్‌కి కట్టబెట్టి, ఈ ఇంటికి యజమానురాల్ని చేస్తానని అల్లుడు (సూర్య), కూతురికి (అపూర్వ) మాట ఇస్తుంది తల్లి. డ్రైవర్‌కి, లక్ష్మికి మధ్య వివాహేతర సంబంధం ఉందనే నింద వేసి అజయ్‌ నమ్మేలా చేస్తారు తల్లి, అక్క, బావలు. అంతేకాదు.. లక్ష్మిని చిత్ర హింసలు పెడుతుంటారు. ఈ నరకం నుంచి మన ఇంటికి వెళ్లిపోదాం రమ్మని లక్ష్మిని కోరతాడు శివన్న. నేను వచ్చేస్తే నాపై పడ్డ నింద చెరిగిపోదు.. నేను నిర్దోషిని అని తేలిన తర్వాతే వస్తానని అన్నతో అంటుంది లక్ష్మి.  చెల్లెలు తల్లి కాబోతుందని ఇంటికి తీసుకెళదామని వచ్చిన అన్నను ఆ నింద ఇంకా చెరిగి పోలేదు కదా అని అంటుంది. ఈలోపు అక్క కూతురితో(జ్యోతి) అజయ్‌ని పెళ్లికి ఒప్పిస్తారు తల్లి, అక్క, బావలు కలిసి.

పొద్దున్నే అజయ్, జ్యోతి పెళ్లి అనగా ఆ రోజు రాత్రి లక్ష్మికి పురిటి నొప్పులు వస్తాయి. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇంట్లోని స్టోర్‌ రూంలో ఉంచుతారు. ఏ డ్రైవర్‌తో అయితే లక్ష్మికి వివాహేతర సంబంధం అంటకట్టారో అదే డ్రైవర్‌ని పట్టుకుని వచ్చిన శివన్న నిజం ఏంటో అజయ్‌కి చెప్పిస్తాడు. ‘ఇదంతా నాటకమని, నువ్వు నిర్దోషి అని నిరూపించాను.. నీపై పడిన నింద చెరిపేసాను’ రామ్మా ఇంటికి వెళదాం అంటాడు శివన్న. ‘అన్నయ్యా.. నాకు నిద్ర వస్తోంది.. అమ్మ దగ్గరకి వెళ్లిపోతా’ అంటూ అన్న ఒడిలో కన్నుమూస్తుంది లక్ష్మి. ‘ఇంత చేసిన మీరు భూమిపై బతక్కూడదు.. బతకనివ్వను’ అంటూ అజయ్, తల్లి, అక్క, బావ, జ్యోతి, డ్రైవర్‌లపై కిరోసిన్‌ పోసి శివన్న తగలబెట్టబోతుండగా పాప అరుపు వినిపిస్తుంది. ‘అన్నా.. చెల్లి ఊపిరి వదులుతూ ఈ పసిబిడ్డకు ప్రాణం పోసింది. అమ్మ పోతూ పోతూ చెల్లిని నీ చేతుల్లో పెట్టింది. చెల్లెమ్మ కనుమూస్తూ ఈ పసిబిడ్డని నీ చేతికి ఇచ్చింది. దేవుడనేవాడుంటే వీళ్లని శిక్షిస్తాడు.. లేకుంటే దేవుడే లేడనుకుందామన్నా.. వీళ్లను చంపి నువ్వు జైలుకెళితే ఈ బిడ్డ అనాథ అవుతుంది. నిన్నే నమ్ముకున్న మేమంతా దిక్కులేని వాళ్లం అయిపోతాం.. పసిబిడ్డ ముఖం చూసైనా ఆవేశ పడొద్దన్నా’’ అని స్నేహితుడు (శివాజీరాజా) చెబుతాడు శివన్నకి. ‘నీ మీద పడ్డ నింద చెరిపి నిన్ను మహారాణిలా పుట్టింటికి తీసుకెళదామనుకున్నా.. కానీ, ఇంత దురదృష్టం ఏ అన్నయ్యకూ రాకూడదు’ అంటూ లక్ష్మి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళతాడు శివన్న. అన్నా చెల్లెళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్‌ సన్నివేశాలు ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టిస్తాయి. 

సాటిలేనిది తల్లిప్రేమ
ప్రేమ... ఈ మాట  వినగానే అందరిలోను ఒకే ఫీలింగ్‌. ఇదేదో టీనేజ్‌లో ఉన్న ఇద్దరు ఆడ, మగా వ్యవహారం గురించి అనుకుంటారు. కానీ ఇది చాలా చిన్న విషయంలా కనిపించే పెద్ద విషయం.  ఓ నిమిషం ఆలోచిద్దాం ప్రేమ గురించి...అది ఎన్ని రకాల బంధాలతో ముడిపడి ఉంటుందో గమనిద్దాం.  ప్రేమ...ప్రతిమనిషిలో పుట్టిన క్షణం నుంచి తన తుదిశ్వాస వదిలేదాకా తనకు తానుగా కూడబెట్టుకున్న సంపాదన. దాన్ని పూరి గుడిసెలో ఉన్నవాడికి ఇంత, ఆకాశ హార్మ్యాలు కట్టిన వాడికి ఇంత అనే కొలమానం లేని ఒకే ఒక వస్తువు ప్రేమ. డబ్బు పెట్టి కొందామన్నా ఎక్కడా దొరకదు, కొనటానికి డబ్బు లేదని సరిపెట్టుకుందామన్నా ఉండకుండా ఉండదు. మనం దాన్ని గౌరవించాలే కాని ఎంతకాలమనా మనతోనే ఉంటుంది, ఎంత దూరమైనా మనతో పాటే ప్రయాణిస్తుంది. దానికి గవర్నమెంట్‌ రిజర్వేషన్‌లు ఇవ్వనవసరం లేదు. పాస్‌ మార్కులు అస్సలు అక్కరలేదు. నీకు ప్రేమ ఉందా? అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి ఎవ్వరూ సమాధానం చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకంటే, అది ఎవరికి వారు వారి వారి మానసిక స్థాయితో ముడిపడి ఉండే సమాధానం కాబట్టి. అందుకే ప్రేమకు పాస్‌ మార్కులు ఉండవు. ప్రేమ మాత్రమే ఉంటుంది. ఎన్ని ప్రేమలు ఉన్నా అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. వెండితెర మీద అమ్మ ప్రేమను అద్భుతంగా  కళ్లకు కట్టిన చిత్రం ‘మాతృదేవోభవ’.

నిర్మాత  కె.యస్‌ రామారావు.. ‘కెరీర్‌లో గర్వంగా చెప్పుకునే సినిమాలు తీశాను నేను’ అని ఎప్పుడూ చెబుతుంటారు. ఆ గర్వానికి కారణం ‘మాతృదేవోభవ’ లాంటి కథను ఆయన తీయటమే. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఈ చిత్రానికి కె. అజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. 1993లో విడుదలైన ఈ సినిమాలోని పాటలకు ప్రాణం పోసిన వేటూరికి జాతీయ అవార్డు లభించింది. ‘మాతృదేవోభవ’ సినిమా కథ గురించి నాలుగు మాటలు... నాజర్‌ ఒక లారీడ్రైవర్‌ , మనిషి చాలా మంచివాడు. ఎంత మంచితనం ఉంటేనేం..? మద్యానికి బానిస..  అతని భార్య మాధవి. పిల్లలకు సంగీత పాఠాలు నేర్పుతూ ఉంటుంది. ఆ జంటకు నలుగురు పిల్లలు. సినిమాలోని ఫస్ట్‌హాఫ్‌ అందరి జీవితాల్లోనూ ఎక్కడో ఓ మూల జరుగుతూనే ఉంటుందిలే అనుకోవచ్చు. ఇంటిపెద్ద నాజర్‌ చనిపోయిన తర్వాత తన నలుగురు పిల్లలతో ఆ ఒంటరి ఇల్లాలు పడే వేదనే మిగిలిన కథ. ఆ కథలో ప్రతి సీన్‌లోనూ దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంటుంది. తెలుగు సినిమాల్లో శుభం కార్డు పడే సరికి అన్ని సమస్యలూ సర్దుకుపోయి హ్యాపీ ఎండింగ్‌ ఉంటేనే సినిమా హిట్‌. ఈ ఫార్ములాతో సంబంధం లేకుండా కథను నమ్మి, కథ వెంటే ప్రయాణం చేసిన తెలుగు సినిమా ‘మాతృదేవోభవ’ కమర్షియల్‌గా పెద్ద విజయమే సాధించింది. భర్త చనిపోయాక బిడ్డలను ఏదోవిధంగా కష్టపడి పెంచుదామనే సరికి తాను క్యాన్సర్‌ బారిన పడుతుంది. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ సినిమా చూసిన ప్రతిఒక్కరికీ ఆ నలుగురు బిడ్డలూ గుర్తుండిపోతారు. తన చావు దగ్గరపడే కొద్దీ ఆ పిల్లల జీవితాలను తీర్చిదిద్దే క్రమంలో ఒక్కో బిడ్డని ఒక్కోచోట దత్తత ఇస్తూ ఆ తల్లి పడే మానసిక వేదన గురించి ఎంత చెప్పిన తక్కువే. మంచిగా ఉన్న ముగ్గురు బిడ్డల్ని మూడు కుటుంబాలకి దత్తత ఇచ్చిన తర్వాత తన వద్ద మిగిలిన నాలుగో అవిటి బిడ్డను తనతో పాటు ఉంచుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ‘రాలిపోయో పువ్వా నీకు రాగాలెందుకే...’ అనే పాట చూస్తే కళ్లలో నీళ్లు తిరగనివారు ఉండరు. 

ప్రేమకు సాధ్యం కానిదేది?
ఈ ప్రేమ.. ఎవరిని ఎప్పుడు తన వలలో బంధిస్తుందో తెలియదు. ఆ ఖైదు కూడా కులాసాగానే తోస్తుందంటుంటారు. అలాగే ప్రేమ, బాధ అవిభక్త కవలలంటారు. అవును బాధ లేనిదే ప్రేమ లేదులే. ప్రేమ ఎవ్వరి మీదైనా కలగొచ్చు. క్షణాల్లో కలిగే ప్రేమ యుగాలైనా మాయదు, మానదు. ప్రేమ, ప్రేమికులు తెలుగు సినిమాకు నిత్య నూతనంసరుకు. ఎవర్‌గ్రీన్‌ హిట్‌ ఫార్ములా. ఈ వస్తువుతో ప్రతీ వారం ఏదో ఓ సినిమా వస్తూనే ఉంది. వస్తూనే ఉంటుంది. ‘లైలా మజ్ను, మరోచరిత్ర, గీతాంజలి’వంటి ఎన్నో గొప్పæ ప్రేమకథా చిత్రాలు మనకున్నాయి. ఆ లిస్ట్‌లో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా? కూడా ఓ మంచి ప్రేమ కథ. లండన్‌లో ప్లే బాయ్‌గా పెరిగిన సంతోష్‌ (సిద్ధార్థ్‌) చుట్టాల పెళ్లి కోసం ఇండియా వస్తాడు. అక్కడ సిరిని (త్రిష) చూసి ప్రేమలో పడతాడు సంతోష్‌. ఆకర్షణ కాదు ప్రేమే అని తెలుసుకుని తన కోసం ఎంత వరకైనా వెళ్లాలని నిశ్చయించుకుంటాడు. లండన్‌ తిరుగు ప్రయాణం మానేసి ప్రేమ ప్రయాణం మొదలెడతాడు.  సిరి కోసం సిరినే పండిస్తానని వాళ్ల అన్నతో సవాలు చేస్తాడు. ప్రేమ తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని సిరి వాళ్ల అన్నయ్య కంటే ఎక్కువ పండించడమే కాకుండా, వాళ్ల అన్నయ్య గుండెల్లో తన పట్ల సధాభిప్రాయాన్నీ పండిస్తాడు.  

ఆలుమగల అనుబంధం
భార్యభర్తల అనుబంధం మీద వచ్చిన చిత్రాల్లో ‘సూర్యవంశం’ సినిమా ఒకటి. ఆ సినిమాలో తండ్రి వెంకటేశ్‌ కొడుకు వెంకటేశ్‌ను అప్రయోజకుడని భావించి ఇంట్లో నుంచి బయటకు పంపిస్తాడు. భార్య మీనాతో కలసి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు ఇద్దరూ కలసి తమ జీవితాలను ఎలా చక్కదిద్దుకున్నారన్నది సినిమా కథాంశం. ఈ సినిమాలో భార్యాభర్తల అనుబంధం అనగానే ఈ సినిమాలో ఓ సన్నివేశం గుర్తురాకమానదు. కొత్తగా ఏర్పాటు చేసుకున్న కాపురం కావడంతో కేవలం నాలుగువేల రూపాయలే ఉంటాయి వెంకటేశ్, మీనా వాళ్ళ దగ్గర. అందులో సగం ఇంట్లో దాచమని ఇచ్చి మార్కెట్‌కు వెళ్తాడు వెంకటేశ్‌. దార్లో కొత్త చీరలు ఆఫర్లో కనిపిస్తాయి. ఇంట్లో కొంత డబ్బుంది కదా అని భార్య కోసం కొత్త చీర ఖరీదు చేస్తాడు. ఇంటì కొచ్చి దాచిన డబ్బులడిగితే భార్య గుంజీలు తీయడం మొదలెడుతుంది. ఎందుకని అడిగితే ఆ డబ్బులతో తన కోసం ఫ్యాంటు, షర్టు కొన్నానంటుంది. ఆ వార్త విని భర్త కూడా గుంజీలు తీస్తాడు. ఎందుకని అడిగితే డబ్బులతో చీరలు కొన్నాను అంటాడు. అలా ఉంటాయి భార్య భర్తల అనుబంధాలు. ఉన్నదెంతైనా సరే.. ఉన్నదాంట్లో సగం సగం.

కూతురంటే తండ్రికి మమకారం
కూతురిలో తల్లిని చూసుకోవడమే ఏ తండ్రైనా చేసేది. కూతురి ప్రేమ ముందు ఏదీ పనికి రాదనే తరహా తండ్రులు ఉంటారు. మన తెలుగు సినిమాల్లో ఇలాంటి తండ్రులను చూశాం. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల ఆధారంగా వచ్చిన చాలా మంచి చిత్రాల్లో  ‘ఆకాశమంతా’ ఒకటి. ప్రకాశ్‌ రాజ్, త్రిష తండ్రీ కూతురిగా నటించారు. తమిళంలో ‘అభియుమ్‌ నానుమ్‌’గా వస్తే ‘ఆకాశమంతా’గా అనువాదించారు. కూతురితో తనకున్న అనుబంధాన్ని పార్క్‌లో కలిసిన ఓ మిత్రుడి (జగపతిబాబు)తో ప్రకాశ్‌ రాజ్‌ పంచుకోవడమే ఈ సినిమా కథ. రఘురామన్‌ (ప్రకాశ్‌ రాజ్‌) కు కుమార్తె అభి (త్రిష) అంటే ‘ఆకాశమంత’ ప్రేమ. పిల్లలకు ఎగరడం నేర్పడంలో కన్నవాళ్లు ఆనందం వెతుక్కుంటారు. కానీ రెక్కలొచ్చాక వాళ్లు ఎగిరిపోతుంటే బాధపడుతుంటారు. అలా తన కూతురు తనకు ఎక్కడ దూరమౌతుందో అనే తండ్రి ఆవేదనను ప్రకాశ్‌రాజు అద్భుతంగా ఆవిష్కరించారు ఈ సినిమాలో. అభికి సంబంధించిన ప్రతి విషయాన్నీ ఆనందిస్తుంటాడు రఘు. అభి మొదటిసారి నడవడం, సైకిల్‌ నేర్చుకోవడం, ఒంటరిగా స్కూల్‌కి వెళ్లడం... ఏదీ మిస్‌ అవ్వకూడదనుకుంటాడు. అభిని జాగ్రత్తగా పెంచాలన్నది రఘు ఆలోచన. ఆ ఆలోచనతోనే కొంచెం అతి ప్రేమను చూపిస్తుంటాడు. సైకిల్‌ నేర్చుకోవడం వచ్చిన అభి స్కూల్‌కు వెళ్తుంటే ఎక్కడ పడిపోతుందో అని వెనకాలే బైక్‌ వేసుకెళ్ళేంత అతి ప్రేమ అతనిది. కాలేజ్‌ చదువు కోసం ఢిల్లీ వెళ్తుందని తెలుసుకొని, కూతురిని ఒంటరిగా పంపించడానికి ఇష్టపడడు. కానీ ఒప్పుకోక తప్పదు. ఆ తర్వాత అభి ఓ వ్యక్తిని ప్రేమించిందని తెలుసుకుని తట్టుకోలేడు. స్కూల్‌కి ఫస్ట్‌ డే వెళ్తేనే కన్నీళ్లు పెట్టుకున్న రఘురామ్, అభి పెళ్లి చూసి తట్టుకోగలడా? అని అనుకుంటారంతా. కానీ రఘురామ్‌ ప్రశాంతంగానే ఉండి కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తాడు. అభి నా దగ్గర ఉండదంటే నాకు దూరమైనట్టు కాదు కదా? అని జగపతిబాబుకు చెప్పడంతో కథ ముగుస్తుంది.  
– సినిమా డెస్క్‌ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

శంకర విజయం-4

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం