సత్యనిష్ఠ

9 Dec, 2018 02:07 IST|Sakshi

పురానీతి

‘ఆడిన మాట తప్పని రాజులు ఎవరైనా ఉన్నారా?’ అని ఇంద్రసభలో ఒకసారి చర్చ వచ్చింది. భూలోకంలో హరిశ్చంద్ర మహారాజు ఉన్నాడని వశిష్టుడు చెప్పాడు. వశిష్ట విశ్వామిత్రులకు మొదటినుంచి వైరం ఉంది. అందువల్ల హరిశ్చంద్రుడి చేత ఎలాగైనా అబద్ధం చెప్పించాలని విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి వద్దకెళ్లి తాను ఒక బృహత్తర యాగం తలపెట్టాననీ, దానికి విశేషంగా ధనం కావాలన్నాడు. యాగ నిర్వహణకు ఎంత అవసరమైతే అంత ఇస్తానన్నాడు హరిశ్చంద్రుడు. తనకు కావలసి వచ్చినప్పుడు వచ్చి ధనాన్ని తీసుకుంటానని విశ్వామిత్రుడు వెళ్లిపోయాడు. ఒకసారి హరిశ్చంద్రుడి రాజ్యంలోని కొందరు ప్రజలు వచ్చి తమ పైర్లన్నిటినీ అడవిమృగాలు పాడుచేస్తున్నాయని చెప్పడంతో వాటిని సంహరించేందుకు అడవులకు వెళ్లాడు. హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడించేందుకు రకరకాల కుయుక్తులు, కుట్రలు పన్నిన విశ్వామిత్రుడు ఇద్దరు మాతంగ కన్యలను సృష్టించి, హరిశ్చంద్రుని వద్దకు పంపాడు. వారు ఆయన వద్దకొచ్చి తమను పెళ్లాడమని కోరారు. హరిశ్చంద్రుడు తిరస్కరించాడు.  వారిని విశ్వామిత్రుడు వెంటబెట్టుకుని వెళ్లి వారిని పెళ్లి చేసుకోమని ఆదేశించాడు. ఏకపత్నీవ్రతాన్ని తప్పనన్నాడు హరిశ్చంద్రుడు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు అతడు తన యాగానికి కావలసిన ధనాన్ని ఇస్తానన్న సంగతి గుర్తుచేసి, ఇప్పుడు అవసరమొచ్చింది, ఇమ్మన్నాడు. ఎంత ధనం ఇచ్చినా చాలదంటుండడంతో చేసేదేం లేక హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని, కొడుకు లోహితుణ్నీ తీసుకుని రాజ్యం విడిచి వెళ్లిపోయాడు. అదీ చాలదన్నాడు విశ్వామిత్రుడు. దాంతో కాశీనగరంలో చంద్రమతిని విక్రయించి, ఆ వచ్చిన ధనాన్ని విశ్వామిత్రుడికి ఇచ్చాడు. అది కూడా చాలదన్నాడాయన. దాంతో తానే స్వయంగా ఓ కాటికాపరికి అమ్ముడుపోయాడు. 

ఓ రాత్రివేళ హరిశ్చంద్రుడి కొడుకు లోహితుణ్ణి పాము కరవడంతో అతను మరణించాడు. చంద్రమతి కొడుకు దేహాన్ని కాటికి తీసుకువెళ్లింది. సుంకం చెల్లించమన్నాడు కాటికాపరి. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని వాపోయిందా ఇల్లాలు. ఆ మెడలోని మంగళసూత్రాలు అమ్మి చెల్లించమన్నాడు కాపరి. తన మాంగల్యం భర్తకు తప్ప ఇతరులెవరికీ కనపడదన్న వరం గల చంద్రమతి, ఆ కాటికాపరే తన భర్త హరిశ్చంద్రుడని గుర్తించింది. ఇద్దరూ ఒకరినొకరు తెలుసుకుని దుఃఖపడ్డారు. సత్యధర్మాచరణలో భర్త అడుగుజాడల్లో నడిచే చంద్రమతి మంగళసూత్రాలు అమ్మి డబ్బు తెచ్చేందుకు నగరానికి వెళ్లింది. అర్ధరాత్రివేళ వీధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆమెను భటులు రాజుగారి దగ్గరకు తీసుకు వెళితే ఆయన ముందు వెనకలు ఆలోచించకుండా ఉరిశిక్ష విధించాడు. భటులు ఆమె తలను నరికేందుకు తలారి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ తలారి ఎవరో కాదు, హరిశ్చంద్రుడే! విధినిర్వహణలో భాగంగా కత్తి తీసి ఆమె మెడ మీద పెట్టాడు హరిశ్చంద్రుడు. అది పూలమాల అయింది. ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమై అతని సత్యనిష్ఠను కొనియాడారు. హరిశ్చంద్రుడి చేత అబద్ధమాడించలేకపోయానని ఒప్పుకుని అతని రాజ్యం అతనికి అప్పగించి ఆశీర్వదించి వెళ్లిపోయాడు విశ్వామిత్రుడు. మాటకు ప్రాణం సత్యమే. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, ఇచ్చిన మాటకు కట్టుబడిన వాడే గొప్పవాడు. 
– డి.వి.ఆర్‌. భాస్కర్‌ 

మరిన్ని వార్తలు