అడవివూరులో  ఆ సాయంత్రం...

17 Mar, 2019 00:25 IST|Sakshi

ఓపెన్‌ స్పేస్‌

కోనాయపాలెంకు కొంచెం దూరంగా పడమటి భాగంలో అడవి ఉండేది. అందులో బిలుడు చెట్లూ, జాన చెట్లూ, కలేచెట్లూ, తునికిచెట్లూ, చంద్రచెట్లూ, మోదుగుచెట్లూ...మొదలైన చెట్లుండేవి. ఆ అడవిలో పెద్దపులులు లేవుకాని చిరుత పులులు ఉన్నట్లు వాడుక. ఒకోరోజూ రాత్రిపూట ఆ చిరుత పులులు కోనాయపాలెం ప్రవేశించి గాడిదలనో, కుక్కలనో చంపి తిని పోతుండేవి. ఉదయాన్నే చెప్పుకొనేవాళ్లు, రాత్రి చిరుతపులి వచ్చి కుక్కనో, గాడిదనో లేక రెంటినో తినిపోయిందని.ఆ ఊరుకు ఆంధ్రదేశ దివ్యక్షేత్రాలలో ఒకటైన వేదాద్రి ఆరుమైళ్లు మాత్రమే ఉంటుంది. అడవిలో గుండా, గుట్టల మీదుగా కురవలు దాటిపోవాలి వేదాద్రికి!మేమంతా ఒకరోజు ఎద్దులబండి మీద వేదాద్రి అనే నెపంతో అడవి చూడడానికి బయలుదేరాం. రోడ్డు లేదు సరికదా డొంక దారి కూడా లేదు. దారి నిండా రాళ్లూ, బండలూ. బండిలో కూర్చున్నవాళ్లు ఆ దడదడలకు ఎగిరిపడుతున్నారు. గ్రామంలో ఇళ్లుంటాయి, మనుష్యులుంటారు. చెట్లుంటాయి. మరి అడవిలో ఇళ్లుండవు. మనుషులుండరు. చెట్లు మాత్రమే ఉంటాయి. ఎంత దూరం చూసినా చెట్లేచెట్లు!
 చిన్న చెట్లు, పెద్దచెట్లు, కుంటిచెట్లు,పూలులేనిచెట్లు, పూలున్నచెట్లు, చచ్చిన చెట్లు... అయితే అడవిలో కూడా అక్కడక్కడ ఇళ్లూ, మనుషులూ ఉండకపోరు. అటువంటప్పుడు, ఆ ప్రదేశాన్ని ›గ్రామమే అంటారు కాని అడవి అనరు. అయితే దాన్ని అడవివూరు అనవచ్చు.

లంబాడీలు పశువులను మేపుతూ అడవిలో అక్కడక్కడ కనబడసాగారు. కొంతదూరంలో కృష్ణానది గోచరిస్తుంది. సాయం సమయం కావస్తుంది. అది వసంతరుతువు. మోదుగుచెట్లు చాలా కనిపించినాయి.ఎర్రటిపూలతో అరణ్యం మంటలతో మండిపోతున్నట్టు కనిపించింది. అందుకే వీటిని ఇంగ్లీష్‌లో ‘ఫ్లేమ్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌’ అంటారు. సంస్కృతంలో దీన్ని ‘కంశుకం’ అని, ‘పలాశం’ అనీ అంటారు.దీని పుష్పం ప్రజ్వలిస్తున్న అగ్నికణంలాగా ఎంతో రమ్యంగా ఉంటుంది. కాని ఏమి లాభం? దీనికి వాసనే ఉండదు. రూపం బాగుండి గుణం లేని మనిషిని అందుకే మోదుగుపువ్వుతో పోలుస్తారు. సంస్కృంతలో ఒక శ్లోకం ఉంది.

‘రూపయవ్వన సంపన్నా విశాలకుల సంభవాః విద్యాహీన విశోభంతే విర్గంధా ఇవకింశుకాః’రూపము, యవ్వనము, కులీనతా, సంపద... ఇన్ని ఉండి విద్య గనుక లేనిచో ఆ వ్యక్తులు మోదుగుపూలతో సమానమని.మా దారికంటే క్రిందుగా మోదుగుచెట్లున్నాయి. వాటి జ్వలంత రక్తకుసుమాల మీదుగా కృష్ణానదిలోని నీలహరిత నీటిపాయలు కనిపిస్తున్నాయి. మోదుగుపూల చూచి మండేకన్ను ఆవలకు చూస్తే కృష్ణాజలాల నీలహరితంతో చల్లబడుతుంది. అడివిని చూడడం, దగ్గరగా కొండలనూ, లోయలను చూడడం కూడా జీవితంలో అదే మొదలు.దూరాన్నుంచి కనిపించే నునుపూ, నీలము కూడా దగ్గరలో చూచినప్పుడు కొండలలో కనిపించకపోవడం చూచి ఆశ్చర్యపోయాను. హిమాలయపర్వతాల గురించి, ఆ ప్రాంతపు మహారణ్యాలను గురించి పుస్తకాలలో చదవడం జరిగింది. మేము ఇప్పుడు చూస్తున్నకొండలు హిమాలయాలంత ఎత్తు కొండలు కావని, ఈ అరణ్యం హిమాలయ ప్రాంతపు మహారణ్యంలాంటి గొప్ప అరణ్యం కాదని తరువాత  తెలుసుకున్నాను.మిత్రులం అందరం బండి దిగి నడవసాగాము. చదరమైన భూమి నుంచి ఏటవాలుగా క్రమేణ ఎత్తుగా లేచి ఉన్న పర్వత సానువులను చూస్తుంటే ఏదో మధురానుభూతి కలిగేది.మేము నడిచే బాటకు ఒకవైపు ఎత్తు ప్రదేశం, మరోవైపు లోతులు గోచరించాయి.సంధ్యలోని రక్తారుణకాంతులు ముదిరి నలుపులోకి మారి చీకట్లు కమ్ముతున్న సమయానికి వేదాద్రి చేరుకున్నాం. ఆ రాత్రికి దేవాలయంలోని పులిహోర తిని కృష్ణలోని నీరుత్రాగి పడుకున్నాం. తెల్లవారిన తరువాత లేచిచూస్తే వేదాద్రి చాలా రమ్యంగా కనిపించింది. దేవాలయం దగ్గర నుంచి కృష్ణలోకి చాలా లోతు దిగి వెళ్లాలి. సోపానాల మీదుగా పై నుంచి కృష్ణలోకి క్రిందికి చూచినా, కృష్ణలో నుంచి దేవాలయం వైపుకు చూచినా, ఈ రెండు చోట్ల నుంచి ప్రక్కలకు చూచినా–ఎటుచూసినా ప్రదేశం రమ్యంగా  తట్టసాగింది.
– సంజీవదేవ్‌ ‘తెగిన జ్ఞాపకాలు’ పుస్తకం నుంచి.

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు