దహనం

28 Feb, 2015 23:52 IST|Sakshi
దహనం

కథ
- వేంపల్లె షరీఫ్

కథారచయిత పులిరాజును ఆ మాయాగోవు వదలడం లేదు. ఎక్కడికెళ్తే అక్కడికి హచ్ కుక్కలా వస్తోంది. తన కథ రాయమని పోరుతోంది. పులిరాజుకు చిరాకొచ్చేసింది.
 ‘‘నీ కథ నేనెందుకు రాయాలి? నాకేం పని లేదా?’’ అన్నాడోరోజు.
 గోవు దీనంగా బతిమాలింది. తన కథ రాయకపోతే చచ్చిపోతానంది. పులిరాజు కరగలేదు.
 ‘‘నువ్వేమైపోయినా పర్వాలేదు. నేను అనుకున్నదే రాస్తాను.

ఇలా మధ్యలో ఎవరు పడితే వాళ్లొచ్చి డిస్టర్బ్ చేస్తే కరిగిపోయి వేరేవాళ్ల కథలు రాసే రకం కాదు నేను. నాకొక పంథా ఉంది. వాదం ఉంది, వాదన ఉంది. నాకు కొంతమంది పాఠకులు ఉన్నారు. నేను వాళ్ల గురించే రాస్తాను. వాళ్ల కోసమే రాస్తాను. అసలు మనుషులే సవాలక్ష సమస్యలతో చచ్చీ చెడుతుంటే వాళ్ల గురించి వదిలేసి తగుదునమ్మా అని నీవంటి గోవు గురించి రాయడానికి నాకేమైనా పిచ్చా’’ అన్నాడు పుల్లవిరుపుగా. గోవు నొచ్చుకుంది. అక్కడ్నుంచి మాయమైంది. పులిరాజుకు తెలుసు. అది మళ్లీ వస్తుంది. ఇలాగే దేబరిస్తుంది. అది ఎన్నిసార్లు వచ్చినా తాను మాత్రం కరగకూడదనుకున్నాడు. తాను అనుకున్న కథ రాశాకే అప్పుడు కూడా తనకు బుద్ధి పుడితేనే గోవు కథ రాసేది. బలవంతంగా రాయమని అడగటానికి గోవు ఎవరు? తన ఇష్టాన్ని అడ్డుకునే హక్కు దానికేముంది? టైం చూశాడు. అర్ధరాత్రి పన్నెండు అవుతోంది. కలం కాగితం బల్లమీద పెట్టి లైట్ ఆఫ్ చేసి మంచమ్మీద పడుకున్నాడు. రాత్రంతా గోవుకు సంబంధించిన కలే.
 
‘‘అరరే... బాగైపోయిందే దీని పీడ...’’ తిట్టుకుంటూనే నిద్ర లేచాడు.
 కడుపు ఉబ్బరంగా ఉంది. రాత్రి పెళ్లాం వద్దు వద్దంటున్నా వినకుండా బేకరి నుంచి తెచ్చుకుని తిన్న పిజ్జా, బర్గర్ గుర్తుకువచ్చింది. అర్జంటుగా బాత్రూంలోకి దూరాడు. ఎంత వేగంగా వెళ్లాడో... అంతే వేగంగా వెనక్కి వచ్చాడు. బాత్రూం నిండా గోవు... తెల్లటి గోవు. దేదీప్యమానంగా వెలుగుతున్న గోవు... అడ్డంగా పడుకుని చూస్తోంది... తోక ఊపుతూ.
 ‘‘ఛ... ఇక్కడ కూడా దాపురించావూ...’’ తిట్టుకుంటూనే మరో గదిలోని బాత్రూమ్‌లోకి దూరాడు. కడుపు ఖాళీ చేసుకుని హాయిగా బయటికొచ్చాడు. తర్వాత పళ్లు తోముకున్నాడు. ఇందాక లెట్రిన్‌కెళ్లిన బాత్రూమ్‌లోనే స్నానమూ కానిచ్చాడు. చక్కగా డ్రస్ వేసుకుని ఆఫీసుకు బయల్దేరుతుంటే దారికి అడ్డంగా నిలబడింది గోవు.
 
‘‘ఎందుకిలా నా ప్రాణం తీస్తావు...’’ అన్నాడు పులిరాజు.
 గోవు మౌనంగా ఉంది. ఏ పాపమూ ఎరుగని పసిపాపలా ఉంది. దానిమీద ఎంత విపరీతమైన కోపమొస్తుందో అంత ప్రేమ, జాలి కూడా కలుగుతున్నాయి అతనికి. కానీ అదేమి బయటకు కనిపించకుండా... ‘‘దారికి అడ్డం జరుగుతావా... లేక కారును నేరుగా నీమీదికే తోలమంటావా?’’ అన్నాడు కఠినంగా. అది కదల్లేదు. కారు గేరు మార్చి ముందుకు ఉరికించాడు. గోవు మాయమైంది. వచ్చి ఆఫీస్‌లో పడ్డాడు.
 ఆ ఆఫీస్ అతనిదే. అతనికి ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. అసలే జమిందారీ వంశం. పూర్వీకులంతా బక్క జీవుల్ని కొట్టి బతికినవాళ్లే. ఇతనొక్కడే కాస్త సాహిత్యం, జనం అంటూ తిరుగుతున్నాడు.

ఆఫీసుకెళ్లి సంతకాల పనులన్నీ చూశాడు. ఎంత రచయితైనా ఆఫీసులో మాత్రం బాసే కదా... అందుకే ‘ఉద్యోగులంతా సక్రమంగా పనిచేస్తున్నారా, లేదా’ అని ఒక కన్నేశాడు. సాయంత్రంగా సరాసరి ఇంటికొచ్చేశాడు.
 కారు పార్కింగ్‌లో పెట్టి... ‘‘ఎక్కడా గోవు లేదు కదా’’ అని అనుమానిస్తూనే ఇంట్లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతానికి దాని జాడ కనపడకపోయేసరికి ‘హమ్మయ్యా’ అనుకున్నాడు. పెళ్లాం తెచ్చిచ్చిన వేడి వేడి కాఫీ తాగి కథ రాద్దామని కలం కాగితం అందుకున్నాడో లేదో... అంతలోకే వచ్చేసింది మళ్లీ గోవు... ‘‘నా మీద కథ రాయవూ’’ అంటూ.

పులిరాజుకు మండింది. ‘‘నీకెన్ని సార్లు చెప్పాలి. నీకు కాసింతైనా సిగ్గూ, శరం లేవా? అసలు నీవు మనిషి జన్మ ఎత్తావా? గోవు జన్మ ఎత్తావా?’’ గోవుకు కోపమొచ్చింది. ‘‘నువ్వు నన్ను ఏమైనా అను. కానీ మనిషితో మాత్రం పోల్చొద్దు. మనిషి స్వార్థపరుడు. ఎప్పుడూ తన కోసమే ఆలోచిస్తాడు నీలాగ. ఆ వాదం ఈ వాదం అంటూ ఉన్మాదంలో కొట్టుకుపోతాడు. ఈ భూమ్మీద తనతో పాటు సకల జీవరాశులూ ఉన్నాయని ఎప్పుడూ గుర్తెరగడు. తన ఉనికికి అడ్డమొస్తే దేన్నయినా అంతమొందిస్తాడు’’
 ‘‘ఇంకేం, బాగానే తెలుసుకున్నావే... జాగ్రత్తగా ఉండు మరి. నా జోలికి రాకు’’
 గోవు వినలేదు. అక్కడే నిలబడి ఉంది.

‘‘నిలబడితే నిలబడు... నేను మాత్రం కరగను. నాకు తోచింది నేను రాసుకుపోతాను’’ అంటూ కాగితమ్మీద గబగబా రెండు ముక్కలు రాశాడు. తర్వాత కలం ముందుకు కదలడం లేదు.
 ‘‘నువ్విక్కడ దెయ్యం మాదిరుంటే నేను కథ రాయలేను. దయచేసి వెళ్లిపో...’’ పిచ్చిపట్టినట్టుగా అరిచాడు.
 అది మాత్రం అలాగే నిలబడింది ఉలుకుపలుకు లేకుండా. తల పట్టుకున్నాడు పులిరాజు. విసుగొచ్చి పెన్ను కాగితం దాని మొహమ్మీదికి విసిరికొట్టాడు. అది మాయమైంది. వెంటనే సోఫాలో వెనక్కి కూలబడి ఆలోచనలో పడ్డాడు.
 పులిరాజు అసలు పేరు సందివేముల రాజబాబు. ఆ తర్వాత ఏదో ఒక తోక. ఆ తోకతో మనకు పనిలేదు కాబట్టి చెప్పడం లేదు. అసలే జమిందారు వంశం కదా.

రాజబాబుకు ఒక రోజు మెళ్లో పులిగోరు వేసుకోవాలని కోరిక కలిగింది. కొంతకాలం కథలు రాసేపని పక్కనపెట్టి పులిగోరు కోసం వెతికాడు. అక్కడ ఇక్కడా తిరిగాడు. సింహరాశిలో పుట్టిన తనకు పులిగోరు వేసుకుంటే ఇంకాస్త రాజసం వస్తుందని ఎవరో ఒక పెద్దమనిషి సలహా ఇచ్చాడు. దీంతో అతనిలో ఆ కోరిక రెండింతలైంది. వాస్తవానికి రాజబాబు అన్నీ సెంటిమెంట్లకు వ్యతిరేకమైన కథలు రాస్తాడు. కానీ నిజజీవితంలో ఒకలాగ, రచనల్లో ఒకలాగ ఉండే రచయితల సంప్రదాయానికి అతను భంగం కలిగించదల్చుకోలేదు. అందుకే పులిగోరు మీద విపరీతమైన వ్యామోహం పెంచుకున్నాడు. దానికి తగ్గట్టే అన్వేషణ మొదలుపెట్టాడు.

రకరకాల వ్యక్తుల్ని కలిశాడు. చాలా చోట్ల అతనికి పులిగోర్లు కనబడ్డప్పటికీ అవెందుకో అతనికి నచ్చలేదు. చివరికి పడమటి పట్నంలో ఒక చోట ఒక శ్రీమంతుడి దగ్గర బంగారు వర్ణంలో మెరిసే పులిగోరు ఉందని తెలిసింది.
 ఆగమేఘాల మీద అక్కడికి చేరుకున్నాడు. ఆ శ్రీమంతుడు అంపశయ్య మీదున్నాడు. రేపో మాపో చనిపోతాడని అతని కొడుకులు చెప్పారు. అతని వైద్యం కోసం ఎంతో ఖర్చుచేశామని, చివరికి డబ్బుకోసం పులిగోరు అమ్మేస్తున్నామని చెప్పారు. తన పంట పండిందనుకున్న పులిరాజు అడిగినంత చెక్కు రాసిచ్చి పులిగోరుతో ఇల్లు చేరాడు.
 
తెల్లవారుజామున ఓ మంచి ముహూర్తాన తలస్నానం చేసి తన ఇష్టదైవం కృష్ణుడ్ని మొక్కి మెళ్లో పులిగోరు వేసుకున్నాడు. ఇక అక్కడ్నుంచి అతని ఆనందానికి అంతులేదు. అయినవాళ్లింటికి, కానివాళ్లింటికి అవసరమున్నా లేకున్నా తిరిగాడు. తోటి రచయితల్ని కలిశాడు. అడిగినా, అడక్కపోయినా పులిగోరు గురించి, దాని ధర గురించి, అది సాధించడానికి పడ్డ కష్టం గురించి కథలు కథలుగా చెప్పాడు. అదంతా విన్న తోటి రచయితలు ‘‘నువ్వు కథల్లో పులిరాజు’’వని అతన్ని అమితంగా పొగిడారు. అతను పోయించిన మందు తాగి ఒకట్రెండు పత్రికల్లో వ్యాసాలు కూడా రాశారు. దీంతో అతని పేరు ‘పులిరాజు’గా స్థిరపడిపోయింది.
 
ఆ పేరు అతనిక్కూడా బాగా నచ్చింది. దీంతో అతను ఆ పేరుతోనే కథలు రాయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతనికి పులిగోరు మీద కూడా కథ రాయాలనిపించింది. ఇలా అందరినీ వ్యక్తిగతంగా కలసి పులిగోరు గురించి చెప్పడం కన్నా కథ రాసి అచ్చెయ్యడమే ఉత్తమంగా తోచింది. తోచిందే తడవుగా పులిగోరుకు సంబంధించిన అదనపు సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డాడు.
 చుట్టుపక్కల ఉన్న కొండజాతి మనుషులందరినీ కలిశాడు. గూగుల్‌లో సెర్చ్ కొట్టాడు. లైబ్రరీలో పుస్తకాలన్నీ తిరగేశాడు. ఎలాగోలాగ అక్కడింత ఇక్కడింత సమాచారాన్నంతా రాబట్టాడు. ఈలోపు విషయం పత్రికల వాళ్లకు లీకైంది. వాళ్లు ఇతని ‘కథానిబద్ధత’ గురించి గొప్పగా రాశారు. దీంతో పులిగోరు కథ మీద పాఠకుల్లో ఒక తెలియని ఆసక్తి ఏర్పడిపోయింది.

ఇప్పుడెలాగైనా ఆ కథ రాసి మంచి పేరు సంపాదించాలనేది అతని కోరిక. గోవు ముందు ‘వాదం...నాదం...’ అని ఏదో డబ్బా కొట్టాడు తప్పితే అతని మనసంతా ఇప్పుడు ‘పులిగోరు రాజసం’ అనే కథ రాయడం మీదే ఉంది.
 ఆ రోజు కూడా ఇదిగో ఇలాగే ఓ సాయంత్రం చక్కగా సోఫాలో కూర్చుని కథ రాస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో గోవు అచ్చం ఇప్పుడొచ్చినట్టే వచ్చి తగులుకుంది. ఇక వదలకుండా సాధించుకుని తింటోంది. ఎలాగైనా దాన్నుంచి విరుగుడు పొందాలనుకున్నాడు పులిరాజు.
 మరుసటి రోజు ఉదయానే లేచి దగ్గర్లోని ఓ మంత్రగాడిని కలిశాడు. అతనికి చిరాకొచ్చింది.

 ‘‘గోవు కనిపిస్తే మంచిదే కదా. దానికి మంత్రమెందుకు... తంత్రమెందుకు? అదేమైనా నిన్ను పొడవటానికొస్తోందా, చంపడానికి వస్తోందా? కథే కదా రాయరాదూ. పోయిపోయి గోవుతో పెట్టుకోవడం ఎందుకు? సూటిగా నీకో మాట చెప్పనా? మనిషి తనకు తాను కొన్ని తేడాలు పెట్టుకున్నట్టే జంతువుల్లో కూడా తేడాలు పెట్టాడు. కొన్నింటిని చంపితే పుణ్యం. మరికొన్నింటిని చంపితే పాపం. అర్థమైంది కదా, అందుకే గోవు జోలికి వెళ్లకు.’’
 పులిరాజు కంగుతిన్నాడు.
 ‘‘నీకేమైనా మెంటలా? గోవుకు విరుగుడు చెప్పమంటే వేదాంతం చెబుతున్నావ్’’ అంటూ కసిరాడు.
 మంత్రగాడు ‘‘నేను మందివ్వలేను పో’’ అన్నాడు.

 పులిరాజు ఆలోచించాడు. చివరికి పత్రికలో ఒక ప్రకటన ఇచ్చాడు.
 తనకిలా మాయాగోవు కనబడుతోందని... దానికి విరుగుడు చెప్పిన వాళ్లకి పదివేల రూపాయల బహుమానమని ప్రకటించాడు. ఆ ప్రకటన అచ్చయిన మరుసటి రోజు ఓ మనిషి తన ఇంటికి వెతుక్కుంటూ వచ్చాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు పులిరాజు.
 ‘‘నువ్వా...’’ అన్నాడు.
 ‘‘అవును నేనే...’’
 ‘‘నువ్వింకా చచ్చిపోలేదా...?’’

 ‘‘లేదు... భేషుగ్గా ఉన్నాను. నీకు పులిగోరు అమ్మేశాక సుఖంగా ఉన్నాను’’
 ‘‘అంటే...’’
 ‘‘అర్థం కాలేదా? పులిగోరు నా దగ్గర ఉన్నంతవరకు ఆ గోవు నన్ను కూడా ‘కథరాయవూ...’ అని వెంటాడింది. నాకెక్కడ కథలు రాయడం వస్తుంది... నా బొంద. నేను చెప్పినా అది వినలేదు. ఎక్కడికెళ్తే అక్కడ కనబడింది. ఓ రోజు కారు స్పీడుగా డ్రైవ్ చేస్తుంటే అడ్డంగా వచ్చి నింపాదిగా నిలబడింది. నిజమైన గోవేమో అనుకుని సడన్‌గా బ్రేక్ వేశాను. ఇంకేముంది కారు గాల్లోకి ఎగిరి ముప్పై రెండు పల్టీలు కొట్టి కిందపడింది. చూసుకుంటే ఏముంది, నా ముప్పై రెండు పళ్లూ రాలిపోయాయి. అంతేనా... ఒంట్లో అక్కడక్కడా పుల్లలిరిగినట్టు ఎముకలు పుటుక్కుమన్నాయి. మంచం ఎక్కాను. ఆరోగ్యం బాగవడం కోసం ఉన్న ఆస్తులన్నీ కరిగించాను. ఇదేం విచిత్రమో కానీ ఎప్పుడైతే నేను నీకు పులిగోరు అమ్మేశానో... అప్పటి నుంచి సుఖంగా ఉన్నాను.

ఒంట్లో తిరిగి సత్తువ వచ్చి ఇప్పుడిప్పుడే మెల్లగా తిరగ్గలుగుతున్నాను. నీ మంచి కోరి చెబుతున్నా... ఆ మెళ్లోని పులిగోరు తీసేయ్... ఆ గోవు తర్వాత నీకు కనబడదు. హాయిగా నీకు నచ్చిన కథ రాసుకో...’’
 పులిరాజు ఆలోచనలో పడ్డాడు. దాని వెనుక ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉన్నందుకు ఒకింత ఆశ్చర్యపోయాడు. ఏమైతేనేమి మళ్లీ ఈ పడమటి పట్నం శ్రీమంతుడి రూపంలోనే సమాధానం దొరికినందుకు సంతోషపడ్డాడు. చెప్పిన మాట ప్రకారం పదివేల బహుమానం ఇవ్వబోతుంటే వద్దని సున్నితంగా తిరస్కరించి, వచ్చిన దారిపట్టి వెళ్లిపోయాడు.
 ఇక పులిరాజు ఆనందం పట్టలేక వికటాట్టహాసం అంటారే అది చేశాడు. అర్జంటుగా గోవును పిలిచి వెక్కిరించాలనుకున్నాడు. కలం కాగితం తీసుకోగానే గోవొచ్చింది.

 ‘‘నాకు తెలుసు. నీవు వస్తావని. ఇదే నీకు చివరి చూపు. నీ విరుగుడు నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నేను నిన్ను శాశ్వతంగా దూరం చేసి నాకు నచ్చిన కథ రాయబోతున్నాను’’ అన్నాడు.
 గోవు భయపడిపోయింది. కాళ్లు పట్టుకుని తనను దూరం చేయొద్దని బతిమాలింది. పులిరాజు వినలేదు. దాని కళ్లముందే మెళ్లోని పులిగోరు తెంపి గూట్లోకి విసిరికొట్టాడు. అంతే... ఇక మాయాగోవు కనబడలేదు.
 ఇక హాయిగా పులిరాజు కథ రాయడంలో మునిగిపోయాడు. రాశాడు. రెండు రోజులు ఏకధాటిగా రాశాడు. సరిగ్గా అన్నం, నీళ్లు కూడా తీసుకోలేదు. తన అభిమానులను తల్చుకుని... తల్చుకుని... రాశాడు. కథ అద్భుతంగా వచ్చింది. పులిగోరు ప్రాశస్త్యం గురించి అది ధరిస్తే కలిగే ఆనందం, అందం గురించి శాస్త్రీయంగా సాధించి, శోధించిన విషయాన్నంతా రాశాడు. రాశాక తనలో తానే విజయగర్వంతో నవ్వుకున్నాడు. ఈ కథ అచ్చయ్యాక తనకొచ్చే ప్రశంసలను తల్చుకుని మురిసిపోయాడు.

 అంతలోనే అతనికి మళ్లీ ఓసారి గోవు గుర్తుకొచ్చింది. తాను అనుకున్న కథ రాసేసిన ఆనందాన్ని దాంతో పంచుకోవాలనిపించింది. వెంటనే గూట్లోంచి పులిగోరు తీసి మెళ్లో వేసుకున్నాడు. గోవు ప్రత్యక్షమైంది. ‘‘నా గురించి కథ రాయవూ’’ అంటూ.
 పకపకా నవ్వాడు పులిరాజు.
 ‘‘చూశావా... నేను నిన్ను గెలిచాను. ఇక నువ్వు ఎంత మొత్తుకున్నా లాభం లేదు. నేను అనుకున్న కథ రాసేశాను. ఇప్పటికైనా నా సత్తా తెలుసుకో. పదే పదే వచ్చి డిస్ట్రబ్ చేసినంత మాత్రాన నేను నీ దారికి వస్తానని అనుకోకు. అందరు రచయితలూ ఒకేలా ఉండరు...’’ ఇలా నోటికొచ్చింది చెప్పుకుంటూ వెళ్లాడు.


 బొటబొటా కన్నీళ్లు కార్చింది గోవు.
 ‘‘సరే... ఏడవద్దు.. నీ కథ కూడా రాస్తాన్లే...! కానీ ఒక మాట - అది నాకు నచ్చితేనే రాస్తాను. లేకుంటే లేదు. తర్వాత నన్నాడిపోసుకోవద్దు. కథ నచ్చకుండా ఏది పడితే అది రాసే రకం కాదు నేను. నాక్కొన్ని విలువలున్నాయి’’ అన్నాడు.
 గోవు ‘‘సరే’’ అంది.
 ‘‘అయితే చెప్పు’’ అన్నాడతను.
 గోవు చెప్పుకుంటూ పోతోంది.
 ‘‘నీకు ‘ఆవు-పులి’ కథ తెలుసుకదా’’
 ‘‘తెలుసు’’

 ‘‘అచ్చం అలాంటిదే నా కథ కూడా. రోజులాగే మేతకెళ్లి ఓ రోజు అడవిలో పులి కంటపడ్డాను. పులి తినేస్తానంది. ఇంటి దగ్గర దూడ ఉందని... పాలిచ్చి వస్తానని దీనంగా చెప్పాను. పులి కరిగిపోయింది. ఇంటికెళ్లి రావడానికి అనుమతినిచ్చింది. అంతటి ఆకలిలోనూ పులి చూపిన కరుణలో నాకు దైవం కనబడింది. సృష్టిలోని జీవులన్నింటికన్నా పులిగొప్పదిలా తోచింది. వీలైనంత తొందరగా తిరిగి రావాలని ఇంటికెళ్లాను. బిడ్డకు కడుపారా పాలిచ్చాను. ఇరుగుపొరుగువారితో ఎలా నడచుకోవాలో బుద్ధులు చెప్పాను. తిరిగి ఆదరబాదరగా అడవికొచ్చాను. కానీ అడవిలో పులి లేదు. దాని కళేబరం ఉంది. బాగా చూస్తే దాని కాళ్లకు గోళ్లు లేవు. ఇదే నా కథ’’ అని కన్నీళ్లతో చెప్పి గోవు మాయమైంది.
 పులిరాజుకు ఏడుపొచ్చేసింది.
 వెంటనే మెళ్లోని పులిగోరును తెంపి తాను కథరాసిన కాగితాల్లో వేసి నిప్పంటించాడు. నిప్పు దగద్ధాయమానంగా వెలుగుతోంది. అది ఈ లోకంలోని జనారణ్యాలన్నింటినీ దహించేస్తున్నట్టుగా ఉంది.
 
ఆ పేరు అతనిక్కూడా బాగా నచ్చింది. దీంతో అతను ఆ పేరుతోనే కథలు రాయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతనికి పులిగోరు మీద కూడా కథ రాయాలనిపించింది.
నీ మంచి కోరి చెబుతున్నా... ఆ మెళ్లోని పులిగోరు తీసేయ్... ఆ గోవు తర్వాత నీకు కనబడదు. హాయిగా నీకు నచ్చిన కథ రాసుకో...

మరిన్ని వార్తలు