ఎక్కువగా అదే అలవాటు?

19 Apr, 2020 06:48 IST|Sakshi

 సందేహం

గర్భిణులకు, బాలింతలకు ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ చాలా అవసరం అని విన్నాను. ఇది ఏ పదార్థాలలో ఉంటాయి? వీటి వల్ల ఉపయోగం ఏమిటి? నాకు ఎక్కువగా కూర్చునే అలవాటు ఉంది. గర్భిణిగా ఉన్నప్పుడు అదేపనిగా కూర్చుంటే ఏమైనా సమస్యలు తలెత్తుతాయా? – డి.నీరజ, రాజమండ్రి

ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌లో ప్రధానంగా డీహెచ్‌ఏ, ఈపీఏ అనేవి గర్భంలో ఉండే బిడ్డ మెదడు ఎదుగుదలకు, మానసిక ఆరోగ్యానికి, కళ్లలో రెటీనా పొర సరిగా ఏర్పడటానికి ఉపయోగపడతాయి. ఇవి ఒకరకం కొవ్వు జాతికి సంబంధించినవి. ఇవి తల్లి తీసుకునే ఆహారం ద్వారా మాయ నుంచి గర్భంలోని బిడ్డకు చేరుతాయి. ఇవి ఎక్కువగా సీ ఫుడ్‌లో అంటే చేపలు వంటి వాటిలో ఎక్కువగా దొరుకుతాయి. మెర్క్యురీ తక్కువగా ఉండే చేపలు వారానికి రెండుసార్లు తీసుకోవచ్చు. ఇవి తీసుకోని వాళ్లకు ఫిష్‌ ఆయిల్‌ క్యాప్సూల్స్‌ దొరుకుతాయి. అవి రోజుకొకటి చొప్పున తీసుకోవచ్చు. మాంసాహారం తినని వాళ్లకు ఫ్లాక్స్‌ సీడ్స్‌ (అవిసె గింజలు), వాల్‌నట్స్, చియా సీడ్స్, సోయాబీన్‌ ఆయిల్, ఫ్లాక్స్‌సీడ్‌ ఆయిల్‌ వంటి వాటిలో కొద్దిగా ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి కొందరిలో వీటి వల్ల నెలలు నిండకుండా అయ్యే కాన్పులను తగ్గించడమే కాకుండా, శిశువు ఆరోగ్యకరమైన బరువు పెరిగేందుకు దోహదపడతాయని కొన్ని పరిశోధనల ద్వారా తేలింది.

గర్భిణులు అదేపనిగా కూర్చునే అలవాటు ఉండటం వల్ల బరువు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. తద్వారా గర్భంతో ఉన్నప్పుడు 8–9 నెలల్లో సుగర్, బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాళ్లలో వాపులు, రక్తనాళాల్లో రక్తం గూడుకట్టడం, కండరాలు పట్టెయ్యడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భంతో ఉన్నప్పుడు కొన్ని రకాల పరిస్థితులు ఉంటే పూర్తిగా బెడ్‌రెస్ట్‌ చెప్పడం జరుగుతుంది. చాలావరకు అందరికీ కొద్దిగా వాకింగ్, విశ్రాంతితో పాటు మామూలు పనులు చేసుకోవాలని సలహా ఇవ్వడం జరుగుతుంది. దీని వల్ల శరీరం తేలికగా ఉంటుంది. కండరాలు, ఎముకలు మరీ బిగుసుకుపోకుండా ఉండి, సాధారణ కాన్పు తేలికవుతుంది.

గర్భిణులలో కరోనా లక్షణాలు కనిపిస్తే, ఆ వైరస్‌ కడుపులో ఉన్న బిడ్డకు కూడా సోకుతుందా? కడుపులో ఉన్న బిడ్డకు సోకింది లేనిది తెలుసుకోవడానికి ప్రత్యేకమైన పరీక్షలు ఏమైనా ఉన్నాయా?  ఇప్పుడున్న పరిస్థితుల్లో prenatal checkup లో మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా? దురదృష్టవశాత్తు ఈ వైరస్‌ బాలింతలకు సోకితే, బిడ్డను తల్లికి దూరంగా ఉంచాల్సి వస్తుందా? అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? దయచేసి తెలియజేయగలరు. – ఎన్‌కె, హైదరాబాద్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడం మొదలై ఐదు నెలలు కావస్తోంది. ఈ వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా చూసిన లెక్కల ప్రకారం కరోనా వైరస్‌ బారిన పడిన గర్భిణిలలో తల్లి నుంచి గర్భంలోని బిడ్డకు కరోనా వైరస్‌ సోకిన దాఖలాల్లేవు. దీని దుష్ప్రభావం గర్భస్థ శిశువులపై ఉంటుందా లేదా అనే దానిపై అదనపు సమాచారం తెలుసుకోవడానికి గర్భంలో బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు తీసి ల్యాబ్‌లో పరీక్షించాల్సి ఉంటుంది. ఇప్పుడు కరోనా లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ సందర్భంగా గర్భిణులకు చేసే చెకప్స్‌లో కొత్తగా రూపొందించిన గైడ్‌లైన్స్‌ కొన్ని మార్పులను సూచించడం జరిగింది. గర్భ నిర్ధారణ తర్వాత ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు వాడుతూ డాక్టర్‌ను ఒకసారి సంప్రదించడం, 12 వారాల సమయంలో, 20 వారాల సమయంలో అవసరమైన స్కానింగ్‌ చేయించుకుని, తర్వాత డాక్టర్‌ సలహా మేరకు ఐరన్, క్యాల్షియం మాత్రలు వాడుకుంటూ, బిడ్డ కదలికలు గమనించుకుంటూ, డాక్టర్‌తో వీడియో కన్సల్టేషన్‌తో ఉంటూ, వారు చెప్పిన సూచనలను పాటిస్తూ, సమస్యను బట్టి ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి చూపించుకుంటూ ఉండవలసి ఉంటుంది.

కరోనా వైరస్‌ బాలింతకు సోకితే, ఇది తల్లి నుంచి బిడ్డకు సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు చూసిన కేసుల్లో, చేసిన పరీక్షల్లో తల్లి పాలల్లో కరోనా వైరస్‌ కనిపించలేదు. తల్లి పాలను బిడ్డకు తాగించడం వల్ల బిడ్డకు కరోనా వైరస్‌ సోకదు. బాలింతకు కరోనా సోకితే బిడ్డను తల్లికి కొన్ని రోజుల పాటు దూరంగా ఉంచాల్సి ఉంటుంది. చేతులను శుభ్రంగా కడుక్కుని తల్లిపాలను రొమ్ముల నుంచి పిండి, బాటిల్‌లో పట్టి బిడ్డకు ఇవ్వవచ్చు. లేదా కొద్దిగా రిస్క్‌ తీసుకుని, తల్లి నోటికి, ముక్కుకు మాస్క్‌ సరిగా ధరించి, చేతులు శుభ్రంగా ఉంచుకుని బిడ్డకు పాలు ఇవ్వవచ్చు. పాలిచ్చిన తర్వాత బిడ్డను దూరంగా ఉంచడం మంచిది.

నేను చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురవుతుంటాను. అయితే ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. ఈ కరోనా పరిస్థితుల్లో ఒత్తిడి మరింత ఎక్కువైంది. ఏవేవో ఊహించుకుంటున్నాను. ఇది మంచిది కాదు అని తెలిసి కూడా మానలేకపోతున్నాను. ఈ ఒత్తిడి నివారణకు మందులు ఏమైనా ఉన్నాయా? నాకు యోగా కొంచెం తెలుసు. ఎలాంటి యోగాసనాలు వేయాలి? – స్వర్ణ, కరీంనగర్‌

ప్రెగ్నెన్సీ సమయంలో మానసిక ప్రశాంతతో ఉండటం వల్ల తల్లి ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం సరిగా ఉంటాయి. ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురికావడం వల్ల ప్రెగ్నెన్సీలో బీపీ, సుగర్‌ వంటి సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే, బిడ్డ సరిగా బరువు పెరగకపోవడం, నెలలు నిండకుండా కాన్పు కావడం వంటి సమస్యలు కూడా మామూలు వారితో పోల్చితే కాస్త ఎక్కువగా ఉండవచ్చు. పుట్టబోయే బిడ్డలో కూడా కొన్నిసార్లు మానసిక సమస్యలు ఏర్పడే అవకాశాలు కొద్దిగా ఉండవచ్చు. కాబట్టి అనవసరంగా టెన్షన్‌ పడకుండా, ప్రశాంతంగా ఉండటం మంచిది.

దీనికి సరైన నిద్ర, నడక, కొద్దిపాటి వ్యాయామాలు, ధ్యానం, యోగా వంటివి ఉపయోగపడతాయి. అలాగే కుటుంబ సభ్యుల సహకారం, అండదండలు కూడా చాలా వరకు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. ఈ సమయంలో మానసిక ఒత్తిడికి మందులు వాడటం అంత మంచిది కాదు. కొందరిలో వీటి వల్ల కొద్దిగా దుష్ప్రభావాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటే, పైన చెప్పిన చిట్కాలు ఏమీ ఉపయోగపడకపోతే, డాక్టర్‌ పర్యవేక్షణలో కౌన్సెలింగ్‌ చేయించుకుని, అవసరమైతే అతి తక్కువ మోతాదులో కొన్నిరోజుల పాటు మందులు వేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో మానసిక ఒత్తిడి తగ్గడానికి యోగాలో ప్రాణాయామం, పద్మాసనం, శుకాసనం, బాలాసనం వంటివి నిపుణుల సలహా మేరకు చేయడం మంచిది.

డా. వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌
హైదరాబాద్‌

మరిన్ని వార్తలు