మొదటిసారి జాగ్రత్తలు?

24 May, 2020 07:49 IST|Sakshi

 సందేహం

మొదటి కాన్పు సమయంలో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేయగలరు. మొదటి కాన్పుకు, రెండో కాన్పుకు ఉండే తేడా ఏమిటి? ‘లేబర్‌ పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌’ అంటే ఏమిటి? – లత, బాపట్ల

గర్భం దాల్చినప్పటి నుంచి డాక్టర్‌ సలహా మేరకు నెలనెలా చెకప్‌లు, అవసరమైన రక్తపరీక్షలు, స్కానింగ్‌ చేయించుకుని, పరిమితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, ఐరన్, క్యాల్షియం మందులు వాడుకుంటూ ఆరోగ్య పరిస్థితిని బట్టి చిన్నగా నడక, వ్యాయామాలు వంటివి చేసుకుంటూ తొమ్మిది నెలల పాటు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటే చాలావరకు కాన్పు సమయంలో ఎక్కువ ఇబ్బంది లేకుండా తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. తొమ్మిదో నెల చివరకు బిడ్డ బరువు, బిడ్డ పొజిషన్, ఉమ్మనీరు, బిడ్డ బయటకు వచ్చే దారి ఎలా ఉంది, తల్లి ఆరోగ్యం ఎలా ఉంది అనే అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని, సాధారణ కాన్పుకు అవకాశాలు ఉన్నాయా లేదా సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుందా అనే దానిపై ఒక అవగాహనకు రావడం జరుగుతుంది.

కాన్పుకు ముందు నుంచే దంపతులు ఇద్దరూ డెలివరీ అంటే ఎలా ఉంటుంది, నొప్పులు ఎలా తియ్యాలి వంటి విషయాలను తెలుసుకోవాలి. మొదట గర్భిణి తన మనసులో భయాన్ని పోగొట్టుకుని కాన్పుకి సిద్ధపడాలి. కాన్పు సమయంలో నొప్పులను బ్రీతింగ్‌ వ్యాయామాల ద్వారా నియంత్రించుకుంటూ నొప్పులను తీస్తే కాన్పు సులభతరంగా అవుతుంది. మొదటి కాన్పులో నొప్పులు ప్రారంభమైన తర్వాత కాన్పు కావడానికి 12 గంటల నుంచి 24 గంటల సమయం పట్టవచ్చు. రెండో కాన్పు అయితే, ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే 6 నుంచి 12 గంటల లోపే కాన్పు కావచ్చు.

లేబర్‌ పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ అంటే సాధారణ కాన్పుకి ప్రయత్నం చేసేటప్పుడు గర్భిణి నొప్పులను తేలికగా భరించడానికి, ఎక్కువ నొప్పులు తెలియకుండా ఉండటం కోసం అనేక పద్ధతులు పాటించడం. ఇందులో భాగంగా కాన్పు సమయంలో అటూ ఇటూ తిరగడం, బాల్‌ ఎక్సర్‌సైజ్‌ వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేయడం, చిన్న చిన్న మసాజ్‌లు, గర్భాశయ ముఖద్వారం త్వరగా తెరుచుకోవడానికి మందులు ఇవ్వడం, కొందరిలో నడుం పైనుంచి వెన్నుపూసలోకి ‘ఎపిడ్యూరల్‌ ఎనాల్జెసియా’ ఇంజెక్షన్‌ ద్వారా నొప్పులు తెలియకుండా చేయడం జరుగుతుంది.

నా వయసు 20 సంవత్సరాలు. ఎత్తు 5.2 అడుగులు. బరువు 48 కిలోలు ఉండేదాన్ని. కాని గత ఎనిమిది తొమ్మిది నెలలలో 60కి పెరిగాను. ఏమీ అర్థం కావడం లేదు. ఒక సంవత్సరం నుండి కాలేజీ అయిపోయి ఇంట్లో ఉంటున్నాను. ఎక్కువ తినడం వల్ల అలా బరువు పెరిగాను కావచ్చు...అనుకుంటున్నాను. అయితే థైరాయిడ్‌ సమస్య ఉన్నవాళ్లు ఇలా ఒకేసారి బరువు పెరుగుతారని చదివాను. నాకు రక్తం కూడా తక్కువగా ఉంది. మంచి డైట్‌ సూచించగలరు. నేను ఎత్తు పెరుగుతానా?
– పేరు రాయలేదు

ఇరవై సంవత్సరాల తర్వాత అమ్మాయిలు ఎత్తు పెరగరు. థైరాయిడ్‌ సమస్యకు సరైన మోతాదులో మందులు వాడుతూ, థైరాయిడ్‌ హార్మోన్‌ లెవల్స్‌ అదుపులో ఉంచుకుంటే, పెద్దగా బరువు పెరగరు. కాకపోతే ‘హైపో’థైరాయిడ్‌ సమస్య ఉన్నవారిలో వారి మెటబాలిక్‌ రేట్‌ చాలా తక్కువగా ఉంటుంది. కొంచెం తిన్నా కూడా అది కేలరీలుగా ఖర్చయ్యేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు ఎక్కువ పని చెయ్యకుండా, వ్యాయామాలు చెయ్యకుండా తింటూ ఉంటే బరువు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కొందరిలో రక్తం తక్కువగా ఉండటం వల్ల థైరాయిడ్‌ నియంత్రణలో లేకపోతే కూడా ఒంట్లో నీరు చేరడం వల్ల బరువు పెరిగినట్లు అనిపిస్తుంది.

మీకు రక్తం తక్కువగా ఉంటే, ఆహారంలో ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆకు కూరలు, ఖర్జూరం, బీన్స్, క్యారెట్, బీట్‌రూట్, మాంసాహారం వంటివి తీసుకోవడం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. కాబట్టి డాక్టర్‌ను సంప్రదించి థైరాయిడ్‌ లెవల్స్‌ అదుపులో ఉన్నదీ లేనిదీ చెక్‌ చేయించుకుని, దానికి తగ్గ డోస్‌లో థైరాయిడ్‌ మాత్రలు వాడుకుంటూ పైన చెప్పిన ఆహారం తీసుకుంటూ, అవసరమైతే ఐరన్‌ మాత్రలు వాడుకోవచ్చు. అలాగే రోజూ గంటసేపు వాకింగ్, వ్యాయామాలు, యోగా వంటివి చెయ్యడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.

- డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌

>
మరిన్ని వార్తలు