అయినా తగ్గలేదు..

12 Jul, 2020 08:40 IST|Sakshi

 సందేహం

మా పాపకు పన్నెండేళ్లు. సర్వైకల్‌ క్యాన్సర్‌ రాకుండా వ్యాక్సిన్‌ ఉందంటున్నారు కదా. పన్నెండేళ్లు నిండాక వేయించాలా? పన్నెండేళ్లు పడగానే వెయించాలా? ఇంకో సందేహం కూడా.. మా పాప ఇంకా పెద్దమనిషి కాలేదు. అయినా ఈ వ్యాక్సిన్‌ వేయించవచ్చా? మా కుటుంబంలో క్యాన్సర్‌ హిస్టరీ ఉంది. అందుకే అడుగుతున్నాను.
– సురేఖ, చిట్యాల
ఇప్పటి వరకు 100 శాతం క్యాన్సర్‌ రాకుండా ఉండటానికి ఎటువంటి వ్యాక్సిన్‌లు రాలేదు. సర్వైకల్‌ క్యాన్సర్‌ (గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్‌) రావడానికి 70 శాతం మందిలో హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) అనేది కారణం. 30 శాతం మందిలో వేరే కారణాల వల్ల సర్వైకల్‌ క్యాన్సర్‌ రావచ్చు. 2006లో హెచ్‌పీవీ వల్ల వచ్చే క్యాన్సర్‌ను అరికట్టడానికి గార్డసిల్‌ అనే క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ను ఎఫ్‌డీఏ వాళ్లు అనుమతించడం జరిగింది. ఇది  హెచ్‌పీవీ 6, 11, 16, 18 అనే రకాలను అరికడుతుంది. 2007లో  సెర్వారిక్స్‌ అనే వాక్సిన్‌ హెచ్‌పీవీ 16, 18 రకాలను అరికట్టేది విడుదలయింది. చాలా వరకు హెచ్‌పీవీ 16, 18 రకాల వల్లే ఎక్కువగా సర్వైకల్‌ క్యాన్సర్‌ వస్తుంది. ఈ వైరస్‌ సెక్స్‌ ద్వారా గర్భాశయ ముఖద్వారంలోకి చేరి, సర్వైకల్‌ క్యాన్సర్‌ రావడానికి కారణం అవుతుంది. (ఫెయిర్‌లో ఏముంది?)

కొందరిలో ఈ వైరస్‌ వల్ల వెజైనల్, వల్వల్‌ క్యాన్సర్‌లు, జనేంద్రియాల దగ్గర పులిపిరులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాక్సిన్‌లను 11 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. 9 సంవత్సరాల పిల్లలకు కూడా ఇవ్వవచ్చు. కొందరిలో 45 సంవత్సరాల వరకు ఇవ్వవచ్చు. మీ పాప 12 సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు ఇప్పించవచ్చు. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి, పెద్దమనిషి అవ్వడానికి ఏమీ సంబంధం లేదు. ఈ వయసులో తీసుకోవడం వల్ల వీరికి హెచ్‌పీవీ వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీస్‌ తయారవుతాయి. 15 సంవత్సరాలు రాకముందు వరకు అయితే 6 నెలల వ్యవధిలో రెండు సార్లు ఇంజెక్షన్‌ తీసుకోవచ్చు. 15 సంవత్సరాలు మొదలయిన తర్వాత అయితే 6 నెలల వ్యవధిలో 3 డోస్‌లు తీసుకోవలసి ఉంటుంది.

నా వయసు ఇరవై రెండేళ్లు. లాస్ట్‌ మంత్‌ మెన్సెస్‌ టైమ్‌లో ప్యాడ్స్‌ పెట్టుకునే ప్రాంతంలో విపరీతమైన దురద, స్వెల్లింగ్‌ వచ్చింది. ప్యాడ్స్‌ వల్ల వచ్చిందేమోనని రెండో రోజు వేరే కంపెనీ ప్యాడ్స్‌ మార్చాను. అయినా తగ్గలేదు. వారం రోజులు చాలా సఫర్‌ అయ్యాను. తర్వాత స్వెల్లింగ్‌ తగ్గింది కాని దురద మాత్రం ఇంకా ఉంది. సమస్య ఏంటో చెప్పగలరు? – మల్లీశ్వరి, ఆదోని
మెన్సెస్‌ టైమ్‌లో బ్లీడింగ్‌ అయినప్పుడు, రక్తాన్ని ప్యాడ్‌ పీల్చుకుంటుంది. ప్యాడ్‌ను చాలాసేపు మార్చకుండా అలానే ఉంచినప్పుడు వాసన వస్తుంది. జనేంద్రియాల వద్ద, తొడల దగ్గర, యోని భాగంలో ఉండే సాధారణ క్రిములకు అది అనుగుణంగా మారి, వాటి వృద్ధికి దోహదపడుతుంది. దాని వల్ల చాలా మందికి పీరియడ్స్‌ సమయంలో బ్లీడింగ్‌ అవ్వడం వల్ల, మూడు నుంచి ఐదు రోజుల పాటు వరుసగా ప్యాడ్‌ పెట్టుకొనే ఉండటం వల్ల, గాలి ఆడక, బ్యాక్టీరియా ఇతర క్రిములు పెరిగి, అక్కడ దురద, వాసన వచ్చి, గోకడం వల్ల వాపు కూడా వస్తుంది. ప్యాడ్‌లో బ్లడ్‌ వల్ల జనేయంద్రియాల దగ్గర ఒత్తుకొని, ఇరిటేషన్‌ వల్ల కూడా దురద వస్తుంది. ఈ లక్షణాలు, పీరియడ్స్‌ ఆగిపోయిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు ఉండి తర్వాత తగ్గిపోతుంది.

ఇవి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి రోగ నిరోధక శక్తిని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలాగా లక్షణాలు ఉంటాయి. కొందరిలో ప్యాడ్స్‌ అలర్జీ వల్ల కూడా దురద ఉండవచ్చు. అలాంటప్పుడు నువ్వు చేసినట్లు న్యాప్‌కిన్‌ బ్రాండ్‌ మార్చి చూడవచ్చు. కొందరిలో ఏ న్యాప్‌కిన్‌ పడనప్పుడు, కాటన్‌ బట్ట న్యాప్‌కిన్స్‌ వాడి చూడవచ్చు. న్యాప్‌కిన్‌ తడిసినా, తడవకపోయినా ప్రతి ఆరుగంటలకొకసారి మార్చడం మంచిది. లేకపోతే బ్లీడింగ్‌లోని ప్యాడ్‌పై రక్తంలో మార్పుల వల్ల పైన చెప్పిన లక్షణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాటన్‌ ప్యాంటీలు వాడటం మంచిది. న్యాప్‌కిన్స్‌ మార్చుకునే ప్రతిసారి, జనేంద్రియాల దగ్గర శుభ్రంగా కడుక్కొని, వీలయితే ఇంటిమేట్‌ వాష్‌తో శుభ్రపరుచుకోవచ్చు. తర్వాత అక్కడ క్యాండిడ్‌ డస్టింగ్‌ పౌడర్‌ చల్లుకొని ప్యాడ్‌ మార్చుకోవడం మంచిది. ఈ పౌడర్‌ని బ్లీడింగ్‌ ఆగిపోయిన తర్వాత కూడా రెండు మూడు రోజులు వాడటం మంచిది. నీకు మరీ దురద తగ్గకపోతే, ఒక సారి డాక్టర్‌ని సంప్రదిస్తే, వేరే ఇన్‌ఫెక్షన్‌ ఏమైనా ఉందా అని పరీక్ష చేసి దానికి తగ్గ మందులు ఇస్తారు. బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడానికి ప్రయత్నించడం మంచిది. (యూఎన్‌ మెచ్చిన ఇండియన్‌)
- డా.వేనాటి శోభ
హైదరాబాద్‌             

మరిన్ని వార్తలు