ఉద్యోగ ధర్మం

18 Nov, 2018 02:16 IST|Sakshi

అరుంధతీ రాజ్యానికి రాజు అమరసేనుడు. ఆ రాజ్యానికి వివేకుడు మంత్రి, ప్రమద్వరుడు కోశాధికారి. కోశాగారంలోని బంగారం, ధనం ప్రమద్వరుడి అధీనంలో ఉండేవి. ఒకసారి అకస్మాత్తుగా ప్రమద్వరుడి దగ్గరి బంధువు మరణించిన వార్త తెలిసింది. వెనువెంటనే  రాజధాని నుంచి బయలుదేరి బంధువుల ఊరికి వెళ్ళిపోయాడు ప్రమధ్వరుడు. ఆ సమయంలో రాజ్య పరిపాలన కోసం ధనం పెద్దమొత్తంలో అవసరమై మంత్రి కోశాగారం దగ్గరకు వెళ్ళాడు. తాను వచ్చినపని కాపలాదారులకు చెప్పాడు. ప్రమద్వరుడి అనుమతి లేనిదే ఎవరినీ కోశాగారంలోనికి అనుమతించమన్నారు వాళ్ళు. ‘నేను ఈ రాజ్యానికి మంత్రినని తెలియదా? కోశాగారానికి సంబంధించిన ఒక జత తాళాలు నా దగ్గరున్నాయి. అంటే నాకూ లోనికివెళ్ళే అర్హత ఉందనేకదా! మీ కోశాధికారి ప్రమద్వరుడు నేను నియమించినవాడే’ అన్నాడు మంత్రి.అందుకు వాళ్ళు ఒప్పుకోక ‘అయ్యా! మమ్ములను నియమించుకున్నది కోశాధికారి ్రçపమద్వరుడు కదా! మేము వారికి జవాబుదారీగా వుండాలికదా! ఆయన మీకు తన బాధ్యతలను అప్పజెబుతూ స్వదస్తూరీ, సంతకంతో ఇచ్చిన లేఖ వుంటే ఇవ్వండి. అనుమతిస్తాము‘అన్నారు. ప్రమద్వరుడు ఏదైనా పనిమీద రాజధాని దాటి వెళ్తున్నప్పుడుమంత్రికి లేఖ ఇచ్చి వెళ్ళేవాడు. అందులో ఏం వ్రాశాడో చూసే అవసరం తనకు ఏరోజూ రాలేదు. ఈసారి హుటాహుటిన బయలుదేరటం వల్ల, లేఖ మరచి వెళ్ళిపోయాడు. ఆ లేఖ అవసరమని మంత్రి ఏ రోజూ అనుకోలేదు. ఆ విషయం వారికిచెప్పినా ఒప్పుకోలేదు.

మంత్రి వెళ్ళి రాజుకు విషయం చెప్పి ‘నన్ను కూడా లెక్క చెయ్యని వాళ్ళు ఒక్కక్షణం కూడా ఉండటానికి వీల్లేదు. తొలగిస్తాను‘అన్నాడు ఆవేశంగా.రాజు నవ్వి ‘మంత్రివర్యా! మీ స్థానంలో ఎవరున్నా కోపం రావటం సహజమే.కానీ కొంచెం ఆవేశం తగ్గించుకుని ఆలోచించండి. వారి ఉద్యోగ ధర్మం వారు సక్రమంగా, నిజాయతీగా నిర్వహిస్తున్నారు. ప్రమధ్వరుడికి మీరు అధికారి కావచ్చు. వారికి మాత్రం ప్రమద్వరుడే అధికారి. అతనిఅనుమతి లేనిదే లోనికి వెళ్ళనివ్వని వారి కర్తవ్యనిర్వహణ ధర్మమైనదే కదా!.మన అవసరాన్ని ఒక్కరోజు వాయిదా వేసుకుంటే, ప్రమధ్వరుడు వస్తాడు కదా,!‘అన్నాడు.మంత్రి రాజు మాటలతో ఏకీభవించి వెళ్లిపోయాడు. మరునాడు ప్రమధ్వరుడు రాగానే ఎంతో నిజాయతీపరులు, ఉద్యోగ ధర్మం పట్ల అంకితభావం కలవారిని ఎన్నికచేసి, కాపలాదారులుగా నియమించినందుకు ప్రశంసించి సత్కరించాడు మంత్రి వివేకుడు. 
∙డి.కె.చదువులబాబు 

మరిన్ని వార్తలు