భక్తుల నెలవులోనే శ్రీవారి కొలువు 

7 Oct, 2018 02:12 IST|Sakshi

వెంగమాంబ బాటలో ఎందరో భక్తులు శ్రీవారి సేవలో తరించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. తిరుపతిలో శ్రీవారి పరమ భక్తురాళ్లు కోమలమ్మ, పొన్నమ్మ, రేబాల సుబ్బమ్మ చాటిన భక్తి అనన్యమైంది. శ్రీవారికి పుష్పకైంకర్యాలు నిర్వహించాలని, తమ నివాస ప్రాంతంలో కొలువు తీర్పించాలని వారు తపించారు. దట్టమైన కొండల్లో వెలసిన స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన ఆర్త జనులకు అంతగా సౌకర్యాలేవీ లేని రోజుల్లో ఇతోధికంగా సేవలు అందించారు. అన్నదాన సత్రాలను ఏర్పాటు చేసి, భక్తుల ఆకలిని తీర్చారు.  సుదూర ప్రాంతాల నుంచి కొండకు నడచి వచ్చిన వారికి విశ్రాంతి తీసుకునే వసతి సౌకర్యాలను కల్పించారు. ప్రస్తుత విపణిలో కోట్లాది రూపాయల విలువ చేసే విస్తారమైన స్థలాలను, అందులోని పూదోటలను శ్రీవారికి కానుకలుగా సమర్పించారు. తరాలు గడచినా  ఆ పుణ్య కార్యాలే వారిని కీర్తించేలా చేస్తున్నాయి. 

కోమలమ్మ కరుణార్ద్ర హృదయం
రామానుజాచార్యుల సంకల్పంతో తిరుమల పాదాల చెంత కొత్తూరు పేరిట కుగ్రామంగా వెలసిన నేటి తిరుçపతిలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండే రోజులవి. దట్టమైన చెట్లతో నిండిన కొండకు కాలిబాటన నడిచి వెళ్లాంటే భక్తులు భయపడాల్సి వచ్చేది. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసేవారికి సమయానికి ఇంత అన్నం దొరికేది కాదు. కాస్త విశ్రాంతి కావాలన్నా ఇబ్బందిగా ఉండేది. శ్రీవారి భక్తులు పడుతున్న కష్టాలను చూసిన రాఘవశెట్టి భార్య కోమలమ్మ తపించిపోయారు. అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసి, అక్కడికి వచ్చిన వారి ఆకలి దప్పికలను తీర్చారు. అక్కడే విశ్రాంతి తీసుకున్నాక భక్తులు తిరుమలకు పయనమయ్యేవారు. ఆమె చివరి రోజుల్లో శ్రీవారిని తన ఇలాకాలో ఏడాదికి ఓసారైనా కొలువు దీర్చాలని వేడుకుంది. నిత్య పుష్పకైంకర్యాల కోసం తానే పుష్పాలను ఇవ్వాలని తపించింది. తాను అనుకున్నట్టే ప్రస్తుత తిరుపతిలో నడిబొడ్డునే ఉన్న విస్తారమైన స్థలాన్ని, అందులోని పూదోటలను, అన్నదాన సత్రాన్ని దేవస్థానానికి కానుకగా సమర్పించింది. ఆమె కోర్కె ప్రకారం ఏడాదిలో ఒకసారి అదే స్థలంలో దేవస్థానం శ్రీవారి కొలువును నిర్వహిస్తోంది. తిరుచానూరులో వెలసిన శ్రీవారి దేవేరి పద్మావతీదేవి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే పంచమీతీర్థం రోజున కోమలమ్మ సత్రంలో వేడుకను నిర్వహించే సంప్రదాయాన్ని దేవస్థానం నేటికీ కొనసాగిస్తోంది. ప్రస్తుత పాత మెటర్నిటీ ఆసుపత్రి కూడలి వద్ద ఉన్న  కోమలమ్మ సత్రం నుంచే తన దేవేరి పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారెను ఏనుగులపై ఊరేగింపుగా తీసుకొచ్చి, పంచమీతీర్థం రోజున సమర్పిస్తుంటారు. కోమలమ్మ భక్తికి మరో గౌరవం దక్కింది. తిరుమల శ్రీవారి కాలినడక దారిలో అలిపిరి పాదాల మండపం వద్ద కోమలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు. 

పరమ భక్తురాలు పొన్నమ్మ
శ్రీవారికి పొన్నమ్మ పరమ భక్తురాలు. స్వామివారి ఆరాధనకు మించినది లేదని భావించేది. సువిశాల స్థలంలో పూల తోటలను పెంచి, అందులోని పుష్పాలను శ్రీవారి కైంకర్యాలకు వినియోగించేది. కొన్నాళ్లకు తాను కాలు కదల్చలేని స్థితిలో పూలతోటలతో సహా తన స్థలాన్ని శ్రీవారి పుష్పకైంకర్యాల కోసం సమర్పించింది. ప్రతిఫలంగా ఆమె ఏడాదిలో కనీసం ఒక్క రోజైనా తాను సమర్పించిన స్థలంలో శ్రీవారి క్రతువును నిర్వహించాలని వేడుకుంది. ప్రస్తుత టీటీడీ పరిపాలన భవనం ఎదురుగానే పొన్నమ్మ పూదోట ఉండేది. ఆ స్థలంలో గోవిందరాజస్వామి పాఠశాలతో పాటు, అదే ఆవరణలో టీటీడీ ఓ మండపాన్ని కూడా నిర్మించింది. ఈ మండపం పొన్నమ్మ మండపంగా గుర్తింపు పొందింది. ఏటా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల ముగింపునకు సూచనగా కపిలతీర్థంలో నిర్వహించే చక్రస్నాన ఘట్టానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పొన్నమ్మ మండపంలోనే నిర్వహిస్తారు. పొన్నమ్మ కోరిక ఇలా నెరవేరుతోంది. 

స్వామి భక్తిలో తరించిన సుబ్బమ్మ...
శ్రీవారి భక్తిలో తరించిన మరో భక్తురాలు రేబాల సుబ్బమ్మ. తనకున్న విస్తారమైన స్థలంలో పూదోటలను పెంచుతూ, అందులోని పుష్పాలను శ్రీవారి పుష్ప కైంకర్యాలకు సమర్పించేది. తన తర్వాత కూడా తను పెంచిన పూదోటల్లో శ్రీవారికి ఏడాదిలో ఓ రోజైనా కొలువు జరిపించాలని తపించేది. తను తలచిన విధంగానే ఆ పూదోటలను, స్థలాలతో పాటు దేవస్థానానికి కానుకగా సమర్పించింది. ఆమె కోరికను నెరవేర్చేందుకే తిరుపతి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక రోజంతా సీతారామలక్ష్మణ సమేత హనుమంతునికి  రేబాల  సుబ్బమ్మ తోటలోనే టీటీడీ కొలువు దీరుస్తోంది. నాటి రేబాల సుబ్బమ్మ తోట ఉన్న ప్రాంతమే ప్రస్తుతం తిరుపతిలో రేబాల సుబ్బమ్మ గార్డెన్‌– ఆర్‌ఎస్‌గార్డెన్‌గా ప్రాచుర్యం పొందింది. 
– జె.భాస్కరరెడ్డి తిరుపతి 

మరిన్ని వార్తలు