వేస్టేజ్‌ ఈజ్‌ మస్ట్‌!

24 Dec, 2016 23:43 IST|Sakshi
వేస్టేజ్‌ ఈజ్‌ మస్ట్‌!

హ్యూమర్‌

ఈమధ్య రాంబాబుగాడు వృథా చేయవద్దనే అంశం మీద అనర్గళంగా  మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడినంత కాలం ఏం పర్లేదు. వాడి వరకు ఆచరించినా ఓకే. కానీ దాన్ని విచిత్రంగా అందరిచేతా ఆచరణలో పెట్టిస్తున్నాడంటూ వాళ్ల అమ్మగారు కళ్లనీళ్లు పెట్టుకున్నారు.
సాధారణంగా వాడు నార్మల్‌గా ఉండటమే జరగదు. తన వాదనలతో వాడు అందరినీ ఇబ్బంది పెట్టడం మామూలే. ఇందులో ప్రత్యేకంగా వాడు ఇతరులను ఇక్కట్లు పెట్టడం ఏముందని నా అభిప్రాయం. ఆ ఉద్దేశంతోనే...‘‘వృథా చేయకపోవడం మంచిదేగా. ఇందులో ఇబ్బందేముంది? ఏం చేస్తున్నాడు వాడు’’ అడిగాను నేను.

‘‘వృథా చేయకూడదని మాకు కూడా తెలుసు కదా నాయనా. పొద్దున్నే టిఫిన్‌ చేసే టైమ్‌లో ఉప్మాలో మిరపకాయలను వదిలేయకుండా తినాలంటూ వాళ్ల నాన్న చేతా, నా చేతా వాటిని తినిపిస్తున్నాడు. పిండిన నిమ్మకాయలనే మళ్లీ మళ్లీ పిండిస్తున్నాడు. అంతెందుకు... నిమ్మకాయల్లో ఉన్న గింజలను వృథా చేయకూడదంటూ... వాటిని ఏరి ప్రత్యేకంగా పెరట్లో నాటిస్తున్నాడు. అదేదో వాడు చేయవచ్చు కదా... కాదంట. ఆపిల్స్‌ అంటే తొక్కతో తినవచ్చు. కానీ అరటిపండ్లకు కూడా అదే న్యాయమంటే ఎలా?’’ అంటూ తన బాధ వెళ్లగక్కుకుంది ఆవిడ.‘‘నేను చూస్తా పదండి’’ అంటూ ఆమెను సమాధాన పరచి పంపించా.

సరిగ్గా మధ్యానం భోజనాలప్పుడు వచ్చాడు రాంబాబు గాడు.‘‘రారా నువ్వు కూడా తిందువుగానీ’’ అంటూ పిలిచా. ఆ పిలుపే నా పాలిట శాపమవుతుందని ఆ టైమ్‌లో తెలియదు.సరిగ్గా ఆవకాయ ముక్క పెట్టించుకుని, దాన్ని తినే టైమ్‌లో హితోక్తులు మొదలు పెట్టాడు.
‘‘ఒరేయ్‌... టెంక ముక్కను ఉయ్యకూడదు. దాన్ని విపరీతంగా నములు. అలా నములుతూ ఉండగా కమ్మటి ఊట వస్తుంది. అలా ఊరే దాన్ని మింగు’’ అంటూ ఆదేశాలు ఇస్తున్నాడు.‘‘అలాగేలేరా... నాకు తెలియదా’’ అంటూ నములుతున్న నోటితోనే అన్నాను.‘‘కాదురా... ఇంకాసేపు నములు’’ అంటూ ఉమ్మనివ్వడం లేదు వాడు.‘‘ఒరేయ్‌... టెంక ముక్క అంతా టేస్ట్‌లెస్‌గా అయిపోయింది. ఇక పిప్పి తప్ప ఏమీ లేదురా. ఇంక ఉయ్యనివ్వు’’ అంటూ దీనంగా అర్థించినా వినలేదు వాడు.నోరు నొప్పి పెట్టి నొప్పి పెట్టి... ఇక తప్పక... డైనింగ్‌ టేబుల్‌ దగ్గర్నుంచి పారిపోయి బయటకు వెళ్లి ఉమ్మేయ్యాల్సి వచ్చింది. నా వరకు నాకే అంత ఇబ్బందిగా ఉంటేl... పొద్దస్తమానం ఇంట్లో వీడితోనే వేగాల్సి వచ్చే వాడి అమ్మానాన్నా ఎంత వేదన పడుతున్నారో అనిపించింది.

ఇదే మాటే వాళ్ల నాన్న దగ్గర ఎత్తితే ఆయన ఇంకా ఎన్నో బాధలు చెప్పుకున్నాడు.నేను ఎక్స్‌పెక్ట్‌ చేసింది రైటే. కూరలోని కరివేపాకుల్నీ తినమంటూ ఒకటే పోరట. ‘అరే... వాటి నుంచి వచ్చే సారం ఆల్రెడీ కూరలోకి ఊరుతుంది. ఆ ఆకుల్ని తినలేమం’టూ బదులిస్తేl... ‘అలా కుదరదు. కరివేప ఆకుల్ని నమిలి తింటే క్యాన్సర్‌కూడా తగ్గుతుందం’టూ బలవంతంగా తినిపిస్తున్నాడట. అంతేకాదు... వాడి పిచ్చి ఎంతవరకూ వచ్చిందంటే లవంగం మొగ్గలనూ వదలకుండా బలవంతంగా నమిలేలా చేస్తున్నాట్ట. అలా చేయడం వల్ల కూరలోని రుచిపోయి నాలుక భగ్గుమంటోందన్నా వినడం లేదట. వీడి బాధ పడలేక... ఆ లవంగాలూ, దాల్చినచెక్క లాంటి వాటిని నమలకుండా బలవంతంగా మింగేయాల్సి వస్తోందట. ఇది చెప్పుకొని ఎంతో బాధపడ్డాడా పెద్దాయన.‘‘నేను వాడికి చెబుతాలెండి’’ అంటూ అప్పటికి వచ్చేశాను.

సరిగ్గా మర్నాడు పొద్దున్నే వాడి దగ్గరకు బయల్దేరా.‘‘ఒరేయ్‌... కాసేపు ఆగు. స్నానం చేసి వస్తా’’ అంటూ టవల్‌ తీసుకొని బయల్దేరాడు.
‘‘ఒరేయ్‌ రాంబాబూ! నువ్వు నాకొక  మాట ఇవ్వాల్రా’’ అన్నాను వాడితో.‘‘ఏమిట్రా’’ అడిగాడు.‘‘అయితే... ఒక్క బొట్టు కూడా కింద పడకుండా... అంతా ఒంటి మీదే పడేలా స్నానం చేయ్‌’’ అన్నా.‘‘అదెలా సాధ్యం?’’ అడిగాడు వాడు.‘‘అంతే... అలాగే చేయ్‌’’ అన్నాను మొండిగా నేను.‘‘కుదరదు’’కరాఖండిగా అన్నాడు వాడు.‘‘పారబోయడానికీ... పారేయడానికీ... పారించడం అన్న విషయాలు తెలుసుకుంటే వృథా విషయంలో వేస్ట్‌ ఆఫ్‌ టైమ్‌కూ రెస్ట్‌కూ తేడా అవగతమవుతుంది’’ అంటూ వచ్చేశా.వాడికి అర్థమైందనే అనుకుంటా.
– యాసీన్‌

మరిన్ని వార్తలు