'మంచి'నీళ్లతో.. మీ ఆరోగ్యం మీ చేతుల్లో!

20 Jul, 2013 22:36 IST|Sakshi
'మంచి'నీళ్లతో.. మీ ఆరోగ్యం మీ చేతుల్లో!

అమ్మలు, అమ్మమ్మలు నీళ్లకోసం ఇబ్బంది పడ్డారేమోగానీ, నీళ్లతో ఇబ్బంది పడలేదు. బావులు, కాలువల్లోంచి నడుంలు వంగిపోయేలా మోసుకొచ్చినా, వాటిని మనసారా నమ్మారు; కడుపారా తాగారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఏ నీళ్లలో ఏముందో! ఏం తాగితో ఏం వస్తుందో! దానికి పరిష్కారం అందంగా ముస్తాబై వచ్చింది. మినరల్ వాటర్ అని పేరు మార్చుకుంది. ఈ నీళ్లు నిజంగా మినరల్ వాటరేనా? మినరల్ వాటర్‌కూ, ప్యాకేజ్డ్ వాటర్‌కూ తేడా ఏమిటి? హంస పాలనూ నీటినీ నిజంగా వేరు చేస్తుందో లేదోగానీ కనీసం ఆ తేడా ఏమిటో తెలుసుకుంటే మనం అనుమానం లేకుండా తాగొచ్చు. ఆరోగ్యం నీటిపాలు కాకుండా జాగ్రత్త పడొచ్చు.

 ‘రోజూ పది గ్లాసుల మంచి నీరు తాగండి; ఆరోగ్యంగా ఉంటారు.’
డాక్టర్లు ఈ మాటను తరచూ చెబుతుంటారు.
మంచి మాటే. కానీ ఏ నీరు తాగాలి? కుళాయి నీరు తాగితే? పైప్ లైన్లు పగిలి డ్రైనేజీ నీళ్లు కలుస్తాయేమో! కాచి, వడబోస్తే? పోషకాలు పోతాయంటున్నారు.
ఫ్యూరిఫైడ్ మిషన్ పెడితే? వాటిలో ప్యూరిటీ ఎంతో!
ఈ మీమాంసలో ఉన్నప్పుడే ‘ఈ గందరగోళం అంతా ఎందుకు? మినరల్ వాటర్ కొనుక్కోండి’ అని ఎవరైనా మీకు సలహా ఇచ్చారా! లేదంటే మార్కెట్లో వాటర్ బాటిళ్ల ప్రవాహానికి మీరే ముచ్చటపడిపోయి శ్రేష్టమైన నీరుగా ఎంచుకొని ఇంటికి తెచ్చుకుంటున్నారా?

నీరే కన్నీరైతే...

నీటి శుద్ధత, మినరల్స్ గురించి మాట్లాడుకునే ముందు మన శరీరంలో నీరు ఎంత మాత్రం ఉంటుందో తెలుసుకుందాం. మన దేహంలో సుమారు అరవై శాతానికి పైగా ఉండే నీటిలో శరీరానికి ఎంతో అవసరమయ్యే పోషక పదార్థాలు ఉంటాయి. 3.7 లీటర్ల నీరు రక్తనాళాల నుండి గుండెకు సరఫరా అవుతూ రక్తకణాలను ఒక క్రమపద్ధతిలో శుభ్రం చేస్తూ ఉంటుంది. సగటున ఒక వ్యక్తి కనీసం 2 లీటర్ల నీటిని రోజూ తీసుకుంటాడు. అందులో కూరగాయలు, పండ్లు మొదలైన పదార్థాల ద్వారా లభించే సహజమైన నీరు కూడా ఉండవచ్చు. ప్రతి రోజూ శరీరం లోపల, అవయవాల మధ్య 10 లీటర్ల నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. మనిషి జీవించడానికి ఇంత ప్రాముఖ్యత కలిగిన నీరు కలుషితమైతే?

నదులు, చెరువులు, కాలువలు, కుంటలు, బావులు, బోరుబావులు... ఇలా రకరకాల మార్గాల్లో లభించే నీరు మనకు జీవనాధారం. అయితే ఈ నీటిలో కంటికి కనపడని బ్యాక్టీరియా, ప్రాణాంతక రసాయనాలు, క్లోరిన్ హెచ్చుతగ్గులు ఇలా ఎన్నో లోపాలు ఉంటున్నాయి. వర్షాకాలంలో ఈ సమస్య కాస్త అధికంగానే ఉంటుంది. నీటిని శుద్ధి చేయకుండా అలాగే తాగడం వల్ల డయేరియా, డీ-హైడ్రేషన్, కలరా వంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. కొన్ని చోట్ల మరణాలూ సంభవిస్తుంటాయి. పిల్లలు ముఖ్యంగా గర్భస్థ శిశువులకు తల్లులు సేవించే నీటి ద్వారా బాక్టీరియా చేరుతోంది. ప్రకృతి ప్రసాదించిన నీరు మనిషి కారణంగాస్వచ్ఛత కోల్పోయి మనిషినే ఎన్నో భయాలకు లోనుచేస్తోంది. ఈ భయాలను సొమ్ము చేసుకోవడానికి వ్యాపారస్థులు వేసిన ఎత్తుగడే ‘మినరల్ వాటర్’!

నీళ్లు... తేడాలు...

 సాధారణంగా మార్కెట్‌లో లభించే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌నే చాలామంది ‘మినరల్ వాటర్’ గా వ్యవహరిస్తున్నారు. కానీ మినరల్ వాటర్ ప్రత్యేకమైనది. నగరంలో కొన్ని బ్రాండెడ్ కంపెనీలు మాత్రమే మినరల్ వాటర్‌ను తయారుచేస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలూ ఈ వరసలో ఉన్నాయి. సాధారణంగా నీటిలో ఉండే వ్యర్థాలను తొలగించి, దేహానికి ఆవశ్యక మూలకాలైన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ తదితరాలు కలిపి మినరల్ వాటర్‌ని తయారుచేస్తారు. ఈ నీటిని ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ (బిఐఎస్) ప్రమాణాలకు తగ్గట్టు లెసైన్స్ ఉన్న కంపెనీలు అందిస్తున్నాయి. సంపన్నవర్గాన్ని ఆకట్టుకున్న ఈ మినరల్ వాటర్ లీటర్‌కు రూ.70 పైనే ఉంటుంది. ఆక్వా వంటి అంతర్జాతీయ కంపెనీ ఐతే 200 ఎం.ఎల్ వాటర్ బాటిల్‌కి రూ.25 చెబుతోంది.

ఎగువ, మధ్యతరగతి ప్రజలు సైతం రివర్స్ ఆస్మోసిస్, యూవీ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఫిల్టర్లను ఇళ్లలోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఫిల్టర్లు రూ.900 నుంచి రూ. 40,000 పై బడిన రకాలు మార్కెట్లో లభ్యం అవుతున్నాయి. సూక్ష్మక్రిములు, వైరస్ ఉండని నీరు ఒంటికి మేలు చేస్తుందని అంతా నమ్ముతున్నారు కాబట్టి మార్కెట్లో దొరుకుతున్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మంచిదని నమ్మకంతో తీసుకుంటున్నారు. అయితే ఈ నీరు కేవలం శుద్ధి చేసినది మాత్రమే! దీనికి మినరల్స్‌ను చేర్చితేనే అది మినరల్ వాటర్.

అయితే...

రాష్ట్రంలో మల్టీనేషనల్ వాటర్ కంపెనీలతో పాటు చిన్నాచితకా 20 వేల పైచిలుకు నీటి కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఏటా 500 కోట్ల వ్యాపారం జరుపుతున్నట్టు ఒక అంచనా! వీటిలో 100 లోపు కంపెనీలు మాత్రమే నీటి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నాయి. చాలా వరకు బోరు నీటినే వడబోసి, బాటిళ్లలోపోసి, సీల్ చేసి అమ్ముతున్నారు. దీంట్లో పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువ. లోకల్ కంపెనీలు మినరల్ వాటర్ పేరుతో అమ్ముతున్న ‘ఫిల్టర్’ నీటిలో ప్రమాణాలు ఉండకపోగా, ఘన పదార్థాల శాతాన్ని (టీడీఎస్-టోటల్ డిసాల్వ్‌డ్ సాలిడ్స్) అతి స్వల్ప మోతాదుకు తగ్గిస్తుండటం అసలుకే ముప్పు తెస్తోంది. దీర్ఘకాలం ఈ నీటిని తాగితే మూత్రపిండాలు, హృద్రోగ, హైపర్‌టెన్షన్ సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ప్రమాణాలు గంగలో...

వాస్తవానికి సంబంధిత వ్యాపారి తన పూర్తి వివరాలను తెలుపుతూ ముందుగా ‘బిఐఎస్’ కార్యాలయంలో అప్లికేషన్ ఇవ్వాలి. బీఐఎస్ ఆ కంపెనీని సందర్శించి, అక్కడి సౌకర్యాలు, ల్యాబొరేటరీ, నీటి శాంపుల్స్... ఇలా దశలవారీగా అన్నీ పరిశీలించి, ఆ నీరు నాణ్యమైనదైతేనే లెసైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లెసైన్స్ కూడా ఏడాది వరకు మాత్రమే. వ్యాపారాన్ని కొనసాగించాలనుకునేవారు తిరిగి లెసైన్స్‌ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.

(బిఐఎస్ ప్రమాణాలను పాటించే లెసైన్స్ పొందిన నీటి కంపెనీల వివరాలు తెలియాలంటే www.bis.org.in లాగిన్ అవ్వచ్చు.)
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సరఫరాకు 20, 25 లీటర్ల పరిమాణంలో ఉండే పాలికార్బన్ బాటిళ్లను వినియోగించాలి. వీటి ధర ఒక్కోటి 300 రూపాయలు. కానీ మార్కెట్లో 130 కే లభించే పెట్ బాటిల్స్ వినియోగించి జనం ఉసురు తీస్తున్నారు. ఈ బాటిల్స్‌ను గరిష్ఠంగా 40 సార్లు మాత్రమే వినియోగించాలి. కానీ వందలసార్లు ఉపయోగిస్తున్నారు. ఈ సీసాల్లో నింపిన నీటిలో వృద్ధి చెందే బ్యాక్టీరియా జీర్ణకోశ వ్యాధులను కలిగిస్తుంది.

కొన్ని నీటి శుద్ధిప్లాంట్లు భూగర్భజలాలను ఎక్కువ మోతాదులో ఫిల్టర్ చేస్తున్నాయి. దీని వల్ల నీటిలో ఉండే మినరల్స్ పూర్తిగా బయటకు వెళ్లిపోతున్నాయి. కొన్ని కంపెనీలు రుచి కోసం కొన్ని రసాయనాలను కలుపుతున్నాయి. శుద్ధిచేసిన ప్యాకేజ్డ్ నీళ్లను కనీసం 48 గంటల తర్వాత తాగేందుకు వినియోగించాలి. కానీ సరుకును వెంటనే మార్కెట్లోకి వదులుతున్నారు. ఒక కంపెనీ అమ్మకాలు రోజుకు 500 బబుల్స్ (20 లీటర్ల బాటిళ్లు) అయితే ఆ కంపెనీ వద్ద కనీసం 3000 బబుల్స్ స్టాక్ సిద్ధంగా ఉండాలి. తిరిగి వినియోగించే ప్రతిసారీ బబుల్స్‌ను క్లోరిన్‌తో శుద్ధి చేయాలి. కాని 90 శాతం ప్లాంట్లలో ఆ యంత్రాలే లేవు.

అలాగే యూజ్డ్ వాటర్ బాటిల్ ఇప్పుడు వ్యాపార వస్తువు. చల్లని నీటితో పాటు అనారోగ్యాన్ని కూడా మన గొంతులోకి జారవిడుస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దారికి ఇరువైపులా పడి ఉండే బాటిళ్లను సేకరించి రీ యూజ్ చేసే దందాదారులూ ఉన్నారు. ఈ చెత్తబాటిళ్లను మళ్లీ మంచినీళ్లతో నింపేసి, క్లాస్‌నూ మాస్‌నూ ఆకట్టుకుంటున్న చిన్నతరహా వ్యాపారదారులకు ‘మినరల్ వాటర్’ అనే ట్యాగ్‌లైన్ గొప్ప వ్యాపార వస్తువైపోయింది. అందుకే యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్‌ను ఉపయోగించిన తర్వాత, చేత్తో నులిమి పడేయాలి. ఈ నోట్ వాటర్‌బాటిల్ లేబుల్‌పైన ముద్రించి ఉంటుంది.

జల పరీక్ష

బీఐఎస్ మార్గదర్శకాల ప్రకారం ఫిల్టర్ ప్లాంట్లలో శుద్ధిచేసిన లీటరు నీటిలో క్యాల్షియం మోతాదు 75 మిల్లీ గ్రాములుండాలి, మెగ్నీషియం 30 మి.గ్రా ఉండాలి. ఫ్లోరైడ్ 1 మి.గ్రా.మించరాదు. ఐరన్ 0.3 మి.గ్రా ఉండాలి. పలు నమూనాల్లో నీటిలో అసలు ఉండకూడని టోటల్ సస్పెండెడ్ సాలిడ్స్ 4 మిల్లీ గ్రాములు, క్యాల్షియం కార్బోనేట్ 4 మిల్లీ గ్రాములు, బై కార్పోనేట్‌లు 31 మి.గ్రా., సోడియం 8 మి.గ్రా. మేర ఉన్నాయని తేలింది.

నీటిలో పోషకాలు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి ప్రాంతాల వారీగా ఉన్న ల్యాబ్ టెస్టింగ్ వారిని సంప్రదించాలి. పొటెన్షియల్ హైడ్రోజన్, నైట్రేట్, ఐరన్, ఆల్కాలినిటీ, హార్డ్‌నెస్, టర్బిడిటీ, ఫ్లోరిన్, ఫ్లోరైడ్, హెచ్2ఎస్.. ఇవన్నీ నీటిలో ఉండాలి. ఇవి తక్కువగా ఉండకూడదు, ఎక్కువగా ఉండకూడదు. ఉదాహరణకు ఫ్లోరైడ్ దంతాలకు అవసరం. అయితే ఇది తక్కువున్నా, ఎక్కువున్నా దంతాలకు సమస్యలే! అలాగే ఎముకల దృఢత్వానికి కాల్షియం అవసరం అవుతుంది. నీటి స్వచ్ఛతను పరీక్షించే టూల్ బాక్స్‌లు మార్కెట్లోనూ, జాయింట్ యాక్షన్ ఫర్ వాటర్ సొసైటీ లాంటి స్వచ్ఛంద సంస్థల వద్దా లభిస్తున్నాయి. పరీక్షించిన నీటిలో నాణ్యతా లోపాలు ఉంటే ప్రభుత్వ పరిధిలోని జలమండలిని సంప్రదించి నీటి స్వచ్ఛతను గురించి ప్రశ్నించవచ్చు.
సరైన మోతాదులో టీడీఎస్...

కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఉపయోగకరమైన ఘన పదార్థాలను మనం తాగే నీటి ద్వారా గ్రహిస్తుంటాం. అయితే పట్టణీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో భూగర్భజలాలు కలుషితమైనప్పుడు సీసం, పాదరసం, ఫ్లోరిన్ తదితర హానికారక మూలకాలు నీటిలో కరిగిపోతాయి. వీటిని తొలగించి మానవ శరీరానికి అవసరమైన మూలకాల(టీడీఎస్)ను సరైన మోతాదులో ఉండేలా చూస్తూ భూగర్భజలాలను శుద్ధి చేయాలి. తాగునీటిలో టీడీఎస్ మోతాదు లీటరు నీటికి 100-150 మిల్లీ గ్రాముల మధ్యన ఉండాలి. అతి తక్కువ టీడీఎస్ ఉన్న నీరు కార్బన్‌డైయాక్సైడ్‌ను సులభంగా గ్రహిస్తుంది. దీంతో ఆ నీరు ఆమ్లంగా(యాసిడ్)గా మారే అవకాశాలు ఎక్కువ. ఆమ్లత్వం ఉన్న నీటిని తాగకూడదు. తక్కువ టీడీఎస్ ఉన్న నీరు శరీర కణాల్లోకి త్వరగా చొచ్చుకుపోతుంది. తద్వారా కిడ్నీలపై ఒత్తిడి పెరిగి మూత్రం మోతాదు బాగా పెరిగిపోతుంది. మూత్రవిసర్జన 20 శాతం అధికమయ్యే అవకాశం ఉంది. హైపర్‌టెన్షన్, గుండెసంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. టీడీఎస్ 25-50 మధ్య ఉండే నీటిని టేస్ట్ లెస్(రుచి లేని)గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణించింది. టీడీఎస్ అతి తక్కువ మోతాదులో ఉండే నీరు మెదడు కణాల పనితీరు, నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎముకల్లో రక్తం తయారీ వ్యవస్థపైనా దుష్ర్పభావం చూపుతుంది. కండరాలు పటుత్వం కోల్పోతాయి. కాల్షియం లేకపోవడంతో ఎముకలు పెళుసు బారతాయి. వెన్నుపూసలు అరిగిపోతాయి.

ప్రాచీన పరిష్కారాలు

మినరల్ వాటర్ పేరుతో జరిగే ప్యాకేజ్డ్ దందా నుంచి కాపాడుకోవడానికి కొన్ని పాతకాలపు పద్ధతుల్లో మన నీటిని మనమే శుద్ధి చేసుకోవచ్చు. ఇందులో.. కాటన్ వస్త్రాన్ని ఎనిమిది మడతలు వేసి నీటిని వడగట్టడం కూడా ఒక సులువైన మార్గం. మరిగించి, చల్లార్చి తాగడం (40 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 2 నిమిషాలు మరిగించాలి), నీటిలో క్లోరిన్ బిళ్లలు వేయడం, ఖాళీ బిందెలో నీళ్లు పోసి, సూర్యరశ్మిలో పెట్టడం, ప్యూరిఫైడ్ మిషన్లు ఏర్పాటు చేసుకోవడం.... ఇవన్నీ నీటిని శుద్ది చేసి తాగే ప్రక్రియలు.
స్వచ్ఛమైన నీటిని సేవించడం వల్ల అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య తగ్గుతుంది. ఆరోగ్యం కోసం వెచ్చించే డబ్బు వినియోగం తగ్గుతుంది. స్వచ్ఛమైన నీటి కోసం ప్రభుత్వం, ప్రజలు శ్రద్ధ వహిస్తే ఎన్నో జీవితాలు మెరుగవుతాయి. డబ్బు మంచినీళ్లలా ఖర్చయిపోతుంది అని కాదు ప్రాణాధారణమైన నీటిని డబ్బుకన్నా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు అందరి మీదా ఉంది.

-నిర్మలారెడ్డి

సూర్య-చంద్ర కిరణాలు తప్పనిసరి

 శుభ్రమైన నీటిని తాగేందుకు ఆయుర్వేదం కొన్ని పరిష్కారాలను సూచించింది. తులసి లేదా మారేడు లేదా కొద్దిగా వేప ఆకులను కలిపి, తాగేటప్పుడు వడకట్టుకొని తాగొచ్చు.

అలాగే నీరు మరుగుతున్నప్పుడు కొంచెం శొంఠి, వట్టివేళ్లు వేయాలి. నీరు చల్లారిన తర్వాత వడకట్టి తాగాలి. ఈ నీరు రుచిగా, శుభ్రంగా ఉంటుంది. ఈ పద్ధతిని కేరళలో పాటిస్తుంటారు.

ప్రాచీన కాలంలో గిన్నెడు నీటిని మరిగించి బంగారు లేదా వెండి లేదా రాగి తీగను అలా వేసి, ఇలా తీసేసేవారు. ఆ లోహాల్లోని సుగుణాల వల్ల నీరు స్వచ్ఛంగా మారుతుంది.

రాత్రిపూట రాగి చెంబులో నీళ్లు ఉంచి, మరుసటి రోజు ఉదయం తాగడం మన పూర్వీకులకు ఉన్న అలవాటు. రాగి లోహంలో ఉండే గుణాల వల్ల నీరు శుద్ధి అవుతుంది. నీటిని ఎక్కడైతే నిల్వ ఉంచుకుంటామో (బిందెలు, బక్కెట్లు, సంపులు మొదలైనవి) ఆ నీటి మీద పగలు సూర్యకిరణాలు, రాత్రిపూట చంద్రకిరణాలు పడాలి. ఆ కిరణాలలోని శక్తి వల్ల క్రిములు నశిస్తాయి.

శుద్ధి చేసిన నీటిని తాగాలి

 నీటి శుభ్రత లోపం వల్ల 250 రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నీటిని శుద్ధి చేసి తాగడం వల్ల అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు. రివర్స్ ఆస్మోసిస్ విధానం ద్వారా నీటి శుద్ధి ప్లాంట్లలో ఫిల్టర్ చేసి, అనంతరం ఫ్లోరిఫైడ్ టెక్నాలజీ ద్వారా మానవ శరీరానికి అవసరమైన పోషకాలు కలుపుతుంటారు. ఈ విషయం గుర్తించకుండా నీటిని అత్యధికంగా ఫిల్టర్ చేస్తే, నీరు పోషకాలను కోల్పోతుంది. ఈ నీటిని తీసుకోవడం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు, పెద్దల్లో ఆరోగ్యసమస్యలు కనిపించే అవకాశాలు ఉన్నాయి.

ఆవశ్యకమూలకాలు అవసరం

 నీటిలో ఫ్లోరిన్ పరిమాణం ఎక్కువ ఉంటే ఫ్లోరోసిస్ సమస్య ఉత్పన్నమవుతుంది. దీని వల్ల దంతాలపై పసుపు రంగులో మచ్చలు, ఎముకల సమస్యలు వస్తాయి. జింక్, క్రోమియం, క్యాల్షియం, సల్ఫేట్, మెగ్నీషియం, పొటాషియం తో పాటు శరీరానికి ఆవశ్యక మూలకాలైన ఐరన్, అయోడిన్, కాపర్... వంటి పోషకాలు కలిగిన నీరు తాగితే రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. నీటిలో హానికారక ట్యాక్సిన్లు ఉంటే చర్మసమస్యలు వస్తాయి. ప్రజలు నీటి శుద్ధి పట్ల అవగాహన పెంచుకుంటే, ఆరోగ్యసమస్యలు దరిచేరవు.
 

మరిన్ని వార్తలు