పద్యానవనం: జీవించడమే మన అతి పెద్ద పని!

6 Jul, 2014 01:20 IST|Sakshi
పద్యానవనం: జీవించడమే మన అతి పెద్ద పని!

చిన్న చీమలు నోట మన్నును గొని తెచ్చి
 కట్టిన అందాల పుట్ట చూడు!
 మిలమిల మెరసెడు జిలుగు దారాలతో
 అల్లిన సాలీని ఇల్లు చూడు!
 గరిక పోచలు తెచ్చి తరు శాఖకు తగిల్చి
 గిజిగాడు కట్టిన గృహము చూడు!
 తేనెటీగలు రూపుదిద్ది వృక్షాగ్రాన
 పెట్టిన తేనియ పట్టు చూడు!
 చీమ వంటి మూగ జీవులె తమ నిత్య
 జీవనమున కళలు సృష్టిచేయ
 మహిత బుద్ధిశాలి- మానవుడేరీతి
 కళలు లేక బ్రతుకు గడుప గలడు!!
 
 ‘‘శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని...’’ సెలవిచ్చారు మహాకవి శ్రీశ్రీ. శ్రమే అన్నిటికీ మూలం. మేధస్సు పెరిగిన క్రమంలో మనిషి తన వంతు శ్రమను యంత్రాలపైకి మళ్లిస్తున్నాడే తప్ప ఏదో రూపంలో శ్రమ లేకుండా ఏదీ జరగదు. శ్రమను తగ్గించుకొని సుఖంగా, సంతోషంగా జీవించడం కోసమే మనిషి చేసే ఈ సకల జీవన వ్యాపార క్రియలు, శాస్త్ర-సాంకేతిక పరిశోధనలు, ప్రణాళికలు. ఇట్లాంటివి ఏమి చేసినా, ఎంత పురోగతి సాధించినా అంతిమ లక్ష్యం ఒక్కటే... మనిషి ఆనందంగా ఉండటం!
 
 జీవన ప్రమాణాల్లోనూ, కళాత్మక జీవనంలోనూ ప్రగతి ఉంటేనే ఇది సాధ్యమౌతుంది. చాలా మంది పొరపడతారు కానీ, సుఖం వేరు సంతోషం వేరు. సుఖం భౌతికమైనదైతే, సంతోషం మానసికమైంది. సంతోషంగా ఉన్నవారంతా సుఖంగా ఉండకపోవచ్చు. అలాగే, సౌఖ్యం అనుభవిస్తున్న వారంతా సంతోషంగా ఉన్నారనే గ్యారెంటీ కూడా లేదు. రెండు వేర్వేరని తెలిసే పెద్దలు దీవించేటప్పుడు ‘సుఖసంతోషాలతో వర్ధిల్ల’మంటారు. సుఖం లేకపోయినా సరే సంతోషంగా ఉంటే చాలంటారు సిద్ధులు. సుఖం, మనం సమకూర్చుకునే వనరులు, సంపద, వస్తు వినియోగం, జీవనశైలి తదితరాల్ని బట్టి ఉంటుంది. సంతోషం లేదా ఆనందం మాత్రం కచ్చితంగా మన ఆలోచనలు, సద్యోచన, మంచితనం, తృప్తి చెందడాన్ని బట్టే ఉంటుందేమో అనిపిస్తుంది.
 
  అలా ఉండటానికి జీవితంలో కొంత క్రమత, పద్ధతి, మనసుకు ఆహ్లాదం కలిగించే విషయాసక్తి, అందుకనుగుణమైన సరళ జీవనశైలి... ఇట్లాంటివి అవసరం. ఆ మధ్య ఎవరో ‘జీవితంలో మనిషి చేసే అతి పెద్ద పని ఏంటి?’ అని అడిగిన ప్రశ్నకు యాదృచ్ఛికంగా ‘జీవించడమే!’ అని వచ్చిన సమాధానం బాగా నచ్చింది. నిజమే కదా! జీవించడమే అతి పెద్ద పని. అందులో భాగంగానే మిగతా అన్నీ! ఆ జీవించడం కూడా అటు సంక్లిష్టంగానో, ఇటు మరీ సాదాసీదాగానో కాకుండా కాస్త కళాత్మకంగా జీవించాలని స్థితప్రజ్ఞులైన వారు చెబుతుంటారు. అదంత తేలిక పనయితే, ఇన్ని వందల, వేల, లక్షల సంవత్సరాల నుంచి మనకీ ఆధ్యాత్మిక  వ్యాపకాలు, చింతన, సాహిత్యం, భావజాలం, సమాచార వ్యాప్తి అవసరమేముంది!
 
 అంతో ఇంతో జీవితం పట్ల అవగాహన ఉన్న వాళ్లు కూడా సరళమైన జీవితాన్ని సంక్లిష్టం చేసుకుంటారు. కళాత్మకంగా జీవించడం ఎలాగో ఒక ఆధునిక గురూజీ బాగా చెప్పాడు. జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితినైనా అనివార్యంగా తట్టుకొని జీవించడం ‘part of living'. అది అనివార్యమని తెలిసినపుడు, అదేదో ఆనందంగా ఎదుర్కొని జీవించడమే ‘(p)art of living'. అలా చేయడం వల్ల పోయేదేమీ లేదు ఒక్క ‘p' (పెయిన్-బాధ) తప్ప!
 
 అందుకని, మనమంతా కూడా బాధల బాదరబందీ లేకుండా, ఆ జీవించడమేదో కళాత్మకంగా జీవించాలి. ఎవరిస్థాయిలో వారు, ఎంతోకొంత కళాత్మకత లేకుండా మనిషి జీవించలేడంటున్నారు బుద్ధిజీవులు వర్గానికి చెందిన కవి డాక్టర్ ఉండేల మాలకొండారెడ్డీ పద్యంలో! ఆయన జీవితమే ఇందుకొక ఉదాహరణ. సాధారణ కుటుంబం నుంచి వచ్చి, శ్రమనే నమ్ముకొని, వైద్య-సాంకేతిక విద్యావ్యాప్తిలో అత్యున్నత శిఖరాలధిరోహించారు. చీమ, తేనెటీగ, సాలీడు, పిచ్చుక వంటి అల్పజీవులు కూడా అసాధారణ కళా నైపుణ్యాన్ని రోజువారీ జీవితానికి అనుసంధానం చేశాయి. తినడం, తొంగోడం మాత్రమే కాదు, మడిసన్నాక కాసింత కళాపోసనుండాలని ‘ముత్యాలముగ్గు’పోసి మరీ చెప్పారు ముళ్లపూడి. జీవితం బుద్బుదప్రాయం, కళ శాశ్వతం. సినీ గీత రచయిత వీటూరి చెప్పినట్టు ఏ తరహాలో, ఏ తీరులో, ఏ రూపంలో ఉన్నా అన్ని కళల పరమార్థమొక్కటే! అదే ఆనందం! సముద్రమంత భావనని సముద్రాల జూనియర్ నాలుగైదు పదాల్లో ఇమిడ్చినట్టుగా, ‘అందమె ఆనందం, ఆనందమే జీవిత మకరందం’!
 - దిలీప్‌రెడ్డి

మరిన్ని వార్తలు