టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

14 Jul, 2019 10:36 IST|Sakshi

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
పాత ధోరణుల నుంచి బయటపడతారు. జీవనయానాన్ని స్వేచ్ఛ దిశగా మళ్లిస్తారు. అంతః ప్రక్షాళన ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో అర్థంకాని గందరగోళం కొంత ఇబ్బంది పెడుతుంది. అయినా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు కొంత మెరుగుపడతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు సాధించడానికి సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. సన్నిహితంగా మరింత సమయం గడపాలంటే ప్రేమికుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్య జాగ్రత్తలు అవసరమవుతాయి.
లక్కీ కలర్‌: నేరేడు రంగు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
విడిపోయిన బంధాల గురించి అతిగా ఆలోచించకండి. వాటినలా వెళ్లనివ్వండి. జీవితంలో మార్పులను ఆస్వాదించండి. మంచి చెడుల కలయికగా ఉండే పరిణామాలను స్థితప్రజ్ఞతో స్వీకరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువవుతుంది. ఇంటా బయటా తీరిక దొరకని పరిస్థితులు ఉంటాయి. నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి మీ బృందాన్ని ప్రోత్సహించి ముందుకు నడపాల్సి ఉంటుంది. పని ఒత్తిడి, ప్రేమానుబంధాలకు మధ్య సమతుల్యతను సాధించాల్సి ఉంటుంది. ప్రేమికుల అనుబంధానికి పెద్దల ఆమోదం లభిస్తుంది.
లక్కీ కలర్‌: తుప్పు రంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
అనుకున్న పనులు అనుకున్న రీతిలోనే ముందుకు సాగుతాయి. త్వరలోనే ఘన విజయాలు సాధించే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు ఉంటాయి. అనవసరమైన పనులపై అతిగా తాపత్రయ పడుతున్న విషయాన్ని గ్రహిస్తారు. పనితీరును ప్రణాళికాబద్ధంగా మార్చుకుంటారు. స్వల్ప కాలిక పెట్టుబడులు లాభాలనిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విదేశీ అవకాశాలు కలసి వస్తాయి. పాత మిత్రుల్లో ఒకరు కలుసుకుంటారు. ప్రేమ ప్రతిపాదనల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
అన్ని రంగాల్లోనూ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. సాధించదలచుకున్న లక్ష్యం నుంచి దృష్టి చెదరనివ్వకుండా ఉంటే అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతాయుతమైన పదవులకు చేరుకుంటారు. కఠోర శ్రమకు తగిన ఆర్థిక ఫలితాలనే కాకుండా, ప్రత్యేక గుర్తింపును కూడా సాధిస్తారు. ఆత్మబంధువు ఒకరిని కలుసుకుంటారు. ఎదుగుదలకు దోహదపడే ఉన్నత విద్యాభ్యాసాన్ని, పరిశోధనలను కొనసాగిస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. ఒంటరిగా ఉంటున్నవారికి పెళ్లిళ్లయ్యే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఉద్విగ్నభరితమైన కాలం కొనసాగుతోంది. సాహసోపేతమైన నిర్ణయాలతో దూకుడు చూపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అసాధారణమైన పురోగతిని సాధిస్తారు. నాయకత్వ పటిమను నిరూపించుకుంటారు. నమ్మకంగా చిత్తశుద్ధితో మీతో కలసి పనిచేసిన బృందానికి తగిన న్యాయం జరిగేలా చూస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఎదురైన అవరోధాలను అధిగమించి, సానుకూల ఫలితాలను సాధిస్తారు. ప్రత్యర్థుల దుష్ప్రచారం కొంత మనస్తాపం కలిగించినా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతారు. కోరుకున్న వ్యక్తితో బంధం ముడిపడుతుంది.
లక్కీ కలర్‌: ఎరుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
వృత్తి ఉద్యోగాల్లో ఉంటున్న వారు చేసే స్వయం ఉపాధి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్తగా చేపట్టే వ్యాపారం మీ భావి అభివృద్ధికి బాటలు వేస్తుంది. అధ్యయనానికి, పరిశోధనకు మరింత సమయం కేటాయిస్తారు. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. రాజకీయ రంగంలోని వారు ప్రజల్లోకి వెళ్లి ప్రజలనాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సుస్థిరత కోసం సాగించే ప్రయత్నాలు సఫలమవుతాయి. అద్భుతమైన ఒక వ్యక్తితో తొలి చూపులోనే ప్రేమలో పడతారు. పని నుంచి కొంత విరామం తీసుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: నారింజ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
పాత ఇంటిని పడగొట్టి కొత్త నిర్మాణం చేపడతారు. దీనివల్ల పనిభారం మరింతగా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పోటీని ఎదుర్కొంటారు. ఇదివరకు కొందరు మీ పట్ల చేసిన పొరపాట్లను క్షమిస్తారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతలు ఒత్తిడిని పెంచే అవకాశాలు ఉన్నాయి. అకాల భోజనం కారణంగా ఆరోగ్యం దెబ్బతినే సూచనలు ఉన్నాయి. కళాకారులకు అభిమానుల ఆదరణ పెరుగుతుంది. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలను సంయమనంతో పరిష్కరించుకోవాల్సి వస్తుంది.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు.
లక్కీ కలర్‌: పసుపు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు.
లక్కీ కలర్‌: వెండి రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి.
లక్కీ కలర్‌: లేతాకుపచ్చ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది.
లక్కీ కలర్‌: తెలుపు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
తలపెట్టిన పనులను సజావుగా పూర్తి చేయాలనుకున్న మీ అంచనాలు తలకిందులవుతాయి. అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. పెట్టుబడుల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు.
లక్కీ కలర్‌: లేత గోధుమరంగు

- ఇన్సియా, టారో అనలిస్ట్‌

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు