వివేకం: మీ శరీర తయారీదారు ఎవరు?

10 Aug, 2013 21:28 IST|Sakshi
వివేకం: మీ శరీర తయారీదారు ఎవరు?

అంటువ్యాధులు వేరు; అవి బయటి నుండి జరిగే దాడి. వాటికి కొన్ని రకాల మందులు అవసరమౌతాయి. కాని దీర్ఘకాలిక అనారోగ్యం అంటే, మన లోపల మనమే సృష్టించుకునే కొన్ని లోపాల వల్ల మాత్రమే ఎక్కువగా వచ్చేవి. డెబ్భై శాతం పైగా దీర్ఘవ్యాధులను మనమే సృష్టించుకుంటున్నాం.
 శరీరంలోని ప్రతి కణానికీ బతికి ఉండాలనే ఒక సహజమైన తపన ఉంటుంది. ఇలా ఉన్నప్పటికీ, మన శరీరానికి వ్యతిరేకంగా అవి ఎందుకు పనిచేస్తాయి?
 శరీరం సంగతి చూద్దాం. ప్రస్తుతం ఉన్న ఇంత ఆకారంలో పుట్టలేదు మనం. తల్లి గర్భంలో కేవలం రెండు కణాలుగా మీరు మొదలయ్యారు. ఒక శిశువుగా బయటికి వచ్చారు. ఇప్పుడేమో ఇంత పెరిగారు. ఇదంతా ఎలా జరిగింది? ఈ శరీరాన్ని సృష్టిస్తున్న మౌలిక శక్తి ఏదో ఈ పనిచేసింది. అదే సృష్టికి ఆధారం. దానిని మీరు సృష్టికర్త అంటున్నారు. మీ జీవితపు అనుక్షణమూ, ఆ సృష్టి మీ శరీరం లోపలి నుంచే పనిచేస్తోంది. ఈ శరీరాన్ని తయారుచేసేవాడు లోపలే ఉన్నాడు.
 
 మీరు ఏదైనా ఒక మరమ్మతు చేయించాలనుకోండి. మీరు తయారుచేసినవాడి దగ్గరకు వెళ్దామనుకుంటారా? లేకపోతే దగ్గరలో అందుబాటులో ఉండే మెకానిక్ దగ్గరకా? మీకు తయారీదారు చిరునామా తెలియకపోతే, అప్పుడు దగ్గరలోని మెకానిక్ దగ్గరకు వెళ్తారు. కానీ మీకు తయారీదారు తెలిసినవాడైతే, అతని వద్దకు వెళ్లే చనువు ఉంటే, కచ్చితంగా తయారీదారు దగ్గరకే వెళ్తారు. అవునా?
 
 మీ లోపల మీరు సృష్టించుకునే వాటన్నింటికీ, దగ్గరలో అందుబాటులో ఉండే డాక్టర్ దగ్గరకు పరిగెత్తితే ప్రయోజనం లేదు. ఆధునిక వైద్యశాస్త్రం దీర్ఘ రోగాలను మేనేజ్ చేసుకోవడానికి మాత్రమే మీకు సహాయం చేస్తుంది.  మిమ్మల్ని దీర్ఘరోగాల బారి నుండి ఎప్పటికీ బయటకు పడవేయలేదు. ఎందుకంటే దీర్ఘరోగాలు బయట నుండి రాలేదు కాబట్టి.
 
 అవి బయట నుండి వచ్చి ఉంటే, వాళ్లు వాటిని మీ నుంచి తీసివేసేస్తారు. కానీ అవి లోపల నుండే వస్తున్నప్పుడు, మీరే వాటిని సృష్టిస్తున్నప్పుడు, మిమ్మల్ని వాటి నుండి వారు ఎలా వదిలించగలరు?
 ఆరోగ్యం కేవలం భౌతికమైన అంశం కాదు. మనసులో జరిగేది ఏదో, సహజంగా అదే శరీరంలో కూడా కలుగుతుంది. తిరిగి శరీరంలో జరిగేది ఏదో, అదే మనసులో కలుగుతుంది. అందుచేత, ఇక్కడ మనం ఎలా జీవిస్తున్నాము, మన వైఖరి, మన భావోద్వేగాలు, మన మానసిక స్థితి, మనం జరిపించే కార్యకలాపాల స్థాయి, మన ఆలోచనలు... ఇవన్నీ మన ఆరోగ్యంతో తప్పనిసరిగా ముడిపడి ఉండే భాగాలు.
 
 మీ శరీరం తయారీదారు దగ్గరకు వెళితే వీటన్నిటికీ చికిత్స ఉంటుంది. ఆరోగ్యం అంతర్గతంగా కలగాలంటే, లోపల కొంత ఇంజనీరింగ్ చేయాలి మనం. శరీరం, బుద్ధి, భావాలు, ప్రాణశక్తి - అన్నీ చక్కటి సమతుల్యతలో ఉండే వాతావరణాన్ని, సృష్టించుకోవాలి
 
 కొన్ని సరళమైన ప్రక్రియలతో శరీరాన్నీ, బుద్ధినీ సంపూర్ణ ఆరోగ్యంతో నిర్మించుకోవచ్చు. నేను చెప్పే ‘ఇన్నర్ ఇంజనీరింగ్’ అంటే, సరిగ్గా అదే. మీ తయారీదారుని వద్దకు రహదారి నిర్మించటం. ఇక అప్పుడు ఆరోగ్యంగా ఉండటం మీ పనికాదు, ఆరోగ్యాన్ని ఇవ్వడం అతని వంతు కార్యక్రమం అవుతుంది.
 
 సమస్య - పరిష్కారం
 ప్రస్తుత అధిక జనాభా పరిస్థితుల్లో, నేను ఒక బిడ్డతోనే సరిపెట్టుకుందామనుకుంటున్నాను. ఇంట్లో తల్లిదండ్రులు మరొకరినైనా కనమని బలవంతపెడుతున్నారు. మీ సలహా ఏమిటి?
 - ఎం.వెంకటేశ్, చిత్తూరు
 
 సద్గురు: భారతదేశ ప్రస్తుత జనాభా ఒక బిలియన్ కంటే ఎక్కువ. ఇంతమందికి సరిపోయేంత భూమి, నీరు, పర్వతాలు, కనీసం ఆకాశం కూడా లేదు. 60% కంటే ఎక్కువ గ్రామీణ జనాభాకు, శరీర నిర్మాణం సరిగా లేదు. వారి శరీరం, మెదడు పూర్తి స్థాయికి ఎదగడం లేదు. కారణం, గర్భస్త శిశు దశ నుంచి వారికి తగిన పోషణ అందడం లేదు. 35% మంది పిల్లలు బరువు తక్కువతో పుడుతున్నారు. ఈ కారణాన వారు ఎప్పటికీ సరిగా ఎదగలేరు. ఏ పిల్లలకైతే, పిండ దశలో పోషకాహార సమస్యలుంటాయో, ఎవరైతే సరైన బరువుతో పుట్టరో, వారికి మీరు ఏమి చేసినా, వారి జీవితంలో వారి శరీరము, మెదడు పరిపూర్ణంగా ఎదగదు. అంటే, మనం ఒక పరిపుష్టి లేని సమాజాన్ని తయారుచేస్తున్నాం. ఇది అభివృద్ధి కాదు. నా దృష్టిలో పిల్లలను కనడం కన్నా సరైన పోషణ లేని కొందరి పిల్లలనైనా ఆదుకోవడం ఉత్తమం. మీ పెద్దలకు ఈ విషయాలు మీరు విడమర్చి చెబితే వారు ఒప్పుకోకపోరు.

- జగ్గీ వాసుదేవ్

మరిన్ని వార్తలు