చనిపోయినవారి తల దగ్గర దీపమెందుకు?

13 Jul, 2014 00:27 IST|Sakshi
చనిపోయినవారి తల దగ్గర దీపమెందుకు?

నివృత్తం

ప్రాణాలతో ఉన్న వ్యక్తికి చీకటిలో దారి చూపించి ముందుకు నడిపిస్తుంది దీపం. అలాగే జీవాన్ని కోల్పోయిన తరువాత ఆత్మకు కూడా సరైన దారి చూపమని కోరుతూ ఇలా తల దగ్గర దీపం పెడతారు. మరణించిన వ్యక్తి ఆత్మ బ్రహ్మకపాలం ద్వారా బయటకు వస్తే, ఆ వ్యకి ్తకి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. బయటకు వచ్చిన ఆత్మ పైలోకాలకు చేరడానికి రెండు మార్గాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఉత్తర మార్గం, రెండోది దక్షిణ మార్గం. ఉత్తర మార్గం వెలుగుతోను, దక్షిణ మార్గం చీకటితోను నిండి ఉంటుందట. ఉత్తమ గతులు కలగాలంటే వెలుగు మార్గలోనే ప్రయాణించాలి. కాబట్టి బ్రహ్మకపాలం నుంచి వచ్చిన ఆత్మకు వెలుగు మార్గం చూపించే ఉద్దేశంతోనే ఆ స్థానంలో దీపాన్ని ఉంచుతారు.
 
పనిగల మేస్త్రి పందిరేస్తే... కుక్కతోక తగిలి కూలిపోయిందట!
ఓ ఆసామి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. ఊళ్లో బోలెడంతమంది మేస్త్రీ లున్నా అద్భుతంగా కట్టేవాడు కావాలంటూ వెతకసాగాడు. అంతలో ఒక తాపీమేస్త్రి తారసపడి, తాను ఎంతమంది పెద్ద పెద్ద వాళ్లకి ఇళ్లు కట్టిపెట్టాడో చెప్పుకొచ్చాడు. దాంతో అతడికే పని అప్పగించాడు ఆసామి. అతడు కళ్లుమూసి తెరిచేలోగా ఇల్లు కట్టేసి, పెద్ద మొత్తంలో డబ్బు పుచ్చుకుని పోయాడు. అయితే ఉన్నట్టుండి గాలివాన రావడంతో ఆ ఇల్లు కూలిపోయింది. చుట్టూ ఉన్న ఇళ్లన్నీ బాగున్నా తన ఇల్లు కూలిపోవడం చూసి ఆసామి ఘొల్లుమన్నాడు. అతడిని చూసిన వాళ్లు... ‘మనోళ్లు బోలెడంతమంది ఉంటే గొప్పలకు పోయి ఎవడినో పట్టుకొచ్చాడు, ఇప్పుడు బాగా బుద్ధొచ్చి ఉంటుంది’ అంటూ పరిహాసం చేశారు. అప్పుడు పుట్టుకొచ్చింది ఈ సామెత.

మరిన్ని వార్తలు