దిష్టి ఎందుకు తీస్తారు?

7 Sep, 2014 01:19 IST|Sakshi
దిష్టి ఎందుకు తీస్తారు?

చిన్నపిల్లలకు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు ‘ఎవరి కళ్లు పడ్డాయో ఏమో’ అంటూ గబగబా దిష్టి తీసేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో పెద్దలకు కూడా దిష్టి తీయడం జరుగుతూ ఉంటుంది. నిజానికి అలాంటిదేమీ ఉండదు. దిష్టి అనేది దృష్టికి వికృతి. ఒక వ్యక్తి మరో వ్యక్తిని సూటిగా చూసినప్పుడు... వారి నుంచి విద్యుత్ తరంగాలు వచ్చి శరీరాన్ని తాకుతాయనీ, ఒకవేళ ఆ తరంగాలు వారి శరీరానికి హాని కలిగించేవి కనుక అయితే తల తిరగడం, కడుపులో తిప్పి వాంతులవడం లాంటివి జరుగుతాయనీ ఓ నమ్మకం. దాంతో దిష్టి తగిలింది అంటుంటారు. అందుకే దిష్టి తీసిన నీళ్లను అందరూ తిరిగేచోట వేయరు. ఎవరైనా తొక్కితే మళ్లీ వారికి అనారోగ్యం కలుగుతుందని భయం.  
 బొంకరా బొంకరా పోలిగా అంటే... టంగుటూరి  మిరియాలు తాటికాయంత అన్నాట్ట...!
 పూర్వం ఒక ఊరిలో పోలయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు వట్టి అమాయకుడు. ఓ రోజు ఒక స్నేహితుడు పోలయ్య దగ్గరికొచ్చి అతడినో సాయమడిగాడు. ‘మా ఇంట్లో మిరియాలు ఉండటం చూసి పక్కింటాయన అతని మిరియాల పంటని నేను దొంగిలించానని అంటున్నాడు, నువ్వొచ్చి నేనా మిరియాలను టంగుటూరు నుంచి తెచ్చుకున్నానని రాజుగారి దగ్గర సాక్ష్యం చెప్పాలి’ అన్నాడు. పోలయ్య సరేనంటూ వెళ్లాడు. రాజుగారు వరుసగా ప్రశ్నలు అడిగేసరికి పోలయ్య కంగారు పడిపోయాడు. ‘నేను చెప్పేది నిజమే. ఆ మిరియాలు నా స్నేహితుడివే. వాటినతడు టంగుటూరు నుంచి తెచ్చాడు. కావాలంటే చూసుకోండి, టంగుటూరి మిరియాలు తాటికాయంత ఉంటాయి, అలాంటివింకెక్కడా ఉండవు’ అన్నాడు. దాంతో రాజుగారు నిజం కనిపెట్టేసి దొంగతనం చేసినందుకు ఆ స్నేహితునికీ, దొంగ సాక్ష్యం చెప్పినందుకు పోలయ్యకీ శిక్షలు వేశాడు! ఈ సామెత అలా వచ్చిందే.

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు